Friday 28 December 2012

ఆనందభవన్ లో ఆ రోజు!


అది గుంటూరు పురము. ఆ పురంబునకు బ్రాడీపేట తలమానికము. అందుకలదొక భోజనగృహము. అచట భుజించుట ఆనందదాయకము. ఆ కారణముననే కాబోలు ఆ భోజనగృహ నామధేయము ఆనందభవనముగా భాసిల్లుచుండెను. నిస్సందేహముగా ఇది సార్ధక నామధేయము.

(ఏమిటయ్యా ఈ పిశాచాల భాష? ఆ రాసేదేదో మనుషులు మాట్లాడే భాషలో ఏడిచ్చావు!)

క్షమించాలి. అలా కోప్పడకండి. తెలుగు మహాసభలు జరుగుతున్నాయ్ గదా! కొద్దిగా పాండిత్యం ప్రదర్శిద్దామని ఉబలాటపడ్డాను. మీకిష్టం లేకపోతే రాయన్లేండి. తెలుగు భాషలోనే రాస్తాను.

ఇక చదవండి..


సమయం మధ్యాహ్నం మూడు గంటలు. వేదిక గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ పక్కన గల ఆనందభవన్. మాసిన నేల. అరిగిపోయిన బల్లలు. సొట్టల గ్లాసులు. నిశ్శబ్దాన్ని చేదించుకుంటూ రెండో ప్రపంచ యుద్ధ కాలపు నాటి ఫ్యాన్లు 'గరగర' మంటూ భారంగా తిరుగుతున్నాయి.

ఎదురుగా ఒక అద్దాల బీరువా. దాని వయసు సుమారు తొంభయ్యేళ్ళు. బీరువా పక్కగా పెద్ద రిఫ్రెజిరేటర్. అది ఫ్రిజ్ కనిబెట్టబడిన రోజుల్లో బ్రిటిషు వాడు స్టీమర్లో పంపించినదై ఉండవచ్చు. హాలుకి ఒక మూలగా పగిలిపోయిన వాష్ బేసిన్. పక్కనే స్టీలు బకెట్ లో నీళ్ళు.. స్టీలు గ్లాసు. గత ముప్పైయ్యేళ్ళుగా ఆ వాష్ బేసిన్లోకి నీళ్ళు రావు. రావడానికి అసలు నీళ్ళ గొట్టం ఉంటేగదా! బకెట్లోంచి గ్లాసుతో నీళ్ళు ముంచుకుని చేతులు కడుక్కోవాలి.


హోటల్ ప్రవేశద్వారం ఎడమ వైపు క్యాష్ కౌంటర్. పక్కనున్న గోడ మీద అనేక దేవతల పటాలు.. వాటికి పసుపు కుంకుమల తాలూకా మరకలు. క్యాష్ కౌంటర్ కుర్చీలో ఒక ఎర్రటి, బక్కపలచని వ్యక్తి కూర్చుని డబ్బులు లెక్కపెడుతూ.. పదులు, యాభైలు, వందలు నోట్లు కట్టలుగా కడుతున్నాడు. తెల్ల ప్యాంటు, చొక్కా. ఎత్తు అయిదడుగుల మూడంగుళాలు. ఆయనే ఆ హోటల్ యజమాని.

పేరు పురుషోత్తం. పేరుకు తగ్గట్టుగానే చాలా మంచివాడు. ఎప్పుడు నవ్వు మొహంతోనే ఉంటాడు. క్యాష్ కౌంటర్, వంటగదికి మధ్య బొంగరంలా తిరుగుతుంటాడు. అవసరమైతే క్షణంలో వంటవాడిగా మారిపోతాడు. ఒక్కోసారి కష్టమర్లు బిల్లు కట్టటానికి క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి పురుషోత్తం కోసం ఎదురు చూడవలసి ఉంటుంది.

ఎప్పటివలె ఆ రోజు కూడా ఆనందభవనం ప్రశాంత నిలయంగా.. బద్దకంగా, మత్తుగా జోగుతుంది. కష్టమర్లు తలోమూల కూర్చుని కాఫీలు, టిఫినీలు నిదానంగా ఆరగిస్తున్నారు. సప్లైర్లు గొడకి ఆనుకుని నించొని కునికిపాట్లు పడుతున్నారు.

ఇంతలో బయట నుండి  రణగొణధ్వనులు. ఏవో స్లోగన్లు. పురుషోత్తం కంగారు పడ్డాడు. గబగబ డబ్బులు సొరుగులో పెట్టేసి తాళం వేసుకుని.. ఎందుకయినా మంచిదని సొరుగుని రెండు మూడుసార్లు ఘాట్టిగా లాగి చెక్ చేసుకున్నాడు.

చూస్తుండగానే బిలబిల మంటూ ఆడవాళ్ళు.. సుమారు పది మంది.. లోపలకి దూసుకొచ్చారు. పురుషోత్తంని చుట్టుముట్టారు. కంగారు పడిపోయిన పురుషోత్తం.. ఆ గుంపులో ఒకళ్ళిద్దర్ని గుర్తు పట్టి.. 'అమ్మయ్య!' అనుకున్నాడు.

"నమస్తే అమ్మా! వణక్కం. ఎండన పడి వచ్చారు. కాఫీ తాగండి తల్లీ!" అంటూ మర్యాద చేశాడు.

నిజంగానే పాపం వాళ్ళ మొహాలు ఎండకి వాడిపొయి, కాలిన మినపట్టుల్లా ఉన్నాయి. అయితే.. ఆ వచ్చినవారు కోపంగా ఉన్నారు. ఆవేశంగానూ ఉన్నారు. వేడిగా కూడా ఉన్నారు.

పురుషోత్తం వంటశాలలోకి వినబడేలా గట్టిగా అరిచి చెప్పాడు.

"రంగరాజన్! మేడం గార్లకి పది కాఫీ!"

ఆ గుంపులో అందరిలోకి ముందు నించునున్న ఒక యువతి కోపంగా పురుషోత్తాన్ని తినేశాలా చూస్తూ..

"మేమేమీ నీ బోడి కాఫీ తాగిపోటానికి రాలేదు. అర్జంటుగా  ఈ హోటల్ మూసెయ్యమని చెప్పడానికొచ్చాం." అన్నది. ఆవిడ పొట్టిగా, బొద్దుగా ఉంది. పేరు రమాప్రభ.

పురుషోత్తం గతుక్కుమన్నాడు.

"అమ్మా! నా హోటల్ ఎందుకు.. "


అందర్లోకి వెనగ్గా నించొని.. చేతులు వెనక్కి కట్టుకుని ఆ హోటల్ని నిశితంగా పరిశీలిస్తుంది ఒక లావుపాటి వ్యక్తి. గోల్డ్ ఫ్రేం చత్వారపు కళ్ళజోడు. ఆమె ఆ టీమ్ కి లీడర్. పేరు సూర్యాకాంతం.

"ఏవిటయ్యా నీకు కారణాలు చెబితేగానీ ముయ్యవా? నా సంగతి నీకింకా తెలీదు." విసురుగా ఎడమ చేయి చూపుడు వేలుతో బెదిరించింది.

ఇంతలో గీతాంజలి ఉత్సాహంగా స్లొగన్లందుకుంది.

"విప్లవం.. వర్ధిల్లాలి. ఆనంద భవన్ డౌన్! డౌన్!!"

మిగిలినవారు గొంతు కలిపారు.

పురుషోత్తం భయపడిపోయ్యాడు. రెండు చేతులూ జోడించాడు.

"అమ్మా! మీ అందరికీ నా హోటల్ వల్ల ఇబ్బందైతే మూసేసుకుంటాను. కానీ విషయం ఏంటో నాకు అర్ధమయ్యేట్లు చెప్పండమ్మా!" అంటూ ప్రాధేయపడ్డాడు.

ఆ ఆడవారు పురుషోత్తం వినయానికి మిక్కిలి సంతోషించారు. మగాళ్ళంతా ఇంత వినయవిధేయలతో ఉంటే ఈ లోకం శాంతిసౌభాగ్యాలతో వెల్లివిరియదా? అడవిలో లేడిపిల్లని చూసి పులి జాలి పడ్డట్లు.. నక్సలైట్ నాయకుణ్ణి ఎన్ కౌంటర్ చేసే ముందు పోలీసు జాలి పడ్డట్లు.. వారంతా పురుషోత్తాన్ని చూసి జాలి పడ్డారు. ఒకళ్ళిద్దరికి పురుషోత్తాన్ని ఓదార్చాలనిపించింది గానీ.. సూర్యాకాంతానికి ఝడిసి ఊరుకున్నారు.

ఆ విప్లవనారీ లోకానికి స్పోక్స్ పర్సన్ గా వ్యవహరిస్తున్న చాయాదేవి అసలు విషయం చెప్పనారంభించింది.

"ఇదిగో అబ్బాయ్! ఇన్నాళ్ళూ మా బ్రాడీపేటలో ఆడవాళ్ళం గుట్టుగా కాపురం చేసుకుంటున్నాం. భార్యలుగా మాక్కొన్ని హక్కులుంటాయి.. నీకు తెలుసుగా?"

"అమ్మా! నాకు తెలీదు. మీరే చెప్పండి. వింటాను." పురుషోత్తం మళ్ళీ నమస్కరించాడు.

"అయ్యో నా మతి మండా! నిన్నడిగితే నువ్వేం చెబుతావు! ఎంత చెడ్డా నువ్వూ మగవెధవ్వేగా! సరే విను. నీ ఓటల్లో భోజనం అమృతంలా ఉంటుందిట. నీ కందపచ్చడి, బీట్రూట్ కూర, సాంబార్ని మా ఆయన రవణారెడ్డి కల్లో కూడా కలవరిస్తూ లొట్టలేస్తున్నాడు." అంటూ చాయాదేవి మూతి వంకర్లు తిప్పింది.

ఛాయాదేవి మాటకి పురుషోత్తం ఛాతీ గర్వంతో రెండంగుళాలు పొంగింది. సంతోషంతో సిగ్గు మొగ్గయి పొయ్యాడు. ఆనందంతో మెలికలు తిరిగిపొయ్యాడు.

ఇంతలో వెనకనుండి గిరిజ అందుకుంది.

"మా ఆయన రేలంగి మాత్రం తక్కువ తిన్నాడా? ఆఫీసు నుండి డైరక్టుగా నీ హోటలుకే వచ్చి సుష్టుగా భోంచేస్తున్నాడు. బొజ్జ ఇంకాస్త పెంచేశాడు. నేనేం చేశాను? సీతాదేవంతటి ఇల్లాల్ని. ఇంట్లో పన్లు చెయ్యమన్నాను. అంతేగా! భర్తన్నవాడు అంట్లు తోమడా? ఇల్లు చిమ్మడా? బట్టలుతకడా? ఏం! ఎవరింట్లో పని వాళ్ళు చేసుకుంటే తప్పేంటి?" ముక్కులెగరేసింది.

ఇంతలో రమాప్రభ మళ్ళీ అందుకుంది.

"మొగుడన్న తరవాత ఆ మాత్రం తిట్టుకోడానికి, తన్నుకోడానికి లేదా? నేనేమన్నా మా అక్క గీతాంజలిలా భర్తని బెల్టుతో తంతున్నానా? అసలు భర్తంటే అర్ధమేంటి? భార్య నుండి తిట్లు, తన్నులు భరించేవాడని! మేమేం చేసినా మా భర్తల్ని మంచి మార్గాన పెట్టుకోడానికేగా. అయినా నా మొగుడు రాజబాబుకి ఆ బుద్ధే ఉంటే నాకీ తిప్పలెందుకు?" అంటూ ముక్కు చీదుకుంటూ రమాప్రభ ఎమోషనల్ అయిపోయింది.

"ఒసే రమాప్రభా! మధ్యలో మా ఆయన పద్మనాభం సంగతి తీసుకురావద్దు. బెల్టుతో బాదుకుంటానో, బెత్తంతో కొట్టుకుంటానో నా ఇష్టం. నీకెందుకే?" సాగదీసింది గీతాంజలి.

గిరిజ విసుక్కుంటూ అన్నది.

"అబ్బా! ఆపండే మీ పాడు గోల. చూడు బాబు! ఈ ఆంధ్రదేశంలో 'భార్య' అన్న పదం వింటేనే భర్తలు గజగజా వణికిపోతారు.. ఒక్క ఈ గుంటూర్లో తప్ప! అందుకు కారణం నువ్వే! ఈ హోటల్ టిఫిన్లు, భోజనాలు చూసుకుని మా మొగుళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ తిండి సుఖమే లేకపోతే మా భర్తలు కుక్కల్లా మేం చెప్పినట్లు వింటారు."

పురుషోత్తం చేతులు జోడించి నమస్కారం పోజులోనే.. విగ్రహంలా నిలబడి వింటున్నాడు.

ఇప్పుడు చాయాదేవి అందుకుంది.

"ఏవయ్యా పెద్దమనిషి! ఇళ్ళల్లో పన్లెగ్గొట్టి మా మొగుళ్ళు నీ పంచన చేరితే.. వాళ్ళకి బుద్ధి చెప్పి, గడ్డి పెట్టాల్సిందిపోయి పీకల్దాకా భోజనం పెడతావా? నువ్వసలు మనిషివేనా? నీకు డబ్బులే ముఖ్యమా? నీకు అక్కాచెల్లెళ్ళు లేరు?" అంటూ పురుషోత్తం మీదమీదకి వెళ్ళింది.

"చాయాదేవత్తా! మా ఆయన రాజబాబు ఈ ఊరొచ్చి చెడిపొయ్యాడు. ఇంతకు ముందు నా తిట్లు, తన్నులు తట్టుకోలేపోతే..  కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలేవాడు. ఇప్పుడు సుబ్బరంగా ఈ హోటల్ కొచ్చి ముప్పూటలా మెక్కుతున్నాడు. బంగారం లాంటి మా ఆయన పద్మనాభం బావతో సావాసం చేసి చెడిపొయ్యాడు." రమాప్రభ మళ్ళీ గీతాంజలి వైపు కొరకొరగా చూసింది.

గీతాంజలి సర్రున కోపమొచ్చింది.

"అబ్బో! చెప్పొచ్చావు! మీ ఆయనో పెద్ద అమాయక చక్రవర్తమ్మా! నువ్వామధ్య పుట్టింటికెళ్తే నెలవారి సీజన్ టిక్కెట్లు కొనుక్కుని మరీ తిన్నాడు. మళ్ళీ చూడ్డానికి మాత్రం ఒంటూపిరివాళ్ళా ఉంటాడు. సూది బెజ్జం బానకడుపు. ఎవరి భాగోతం ఎవరికి తెలీదు." అంటూ రుసరుసలాడింది.

ఇంతలో సూర్యాకాంతం గట్టిగా అరిచింది.

"ఒసే! ఆపండే మీ మొహాలు మండా! వీడి ఓటేలు మూయించడానికొచ్చి మీ పరువులు బజార్న పడేసుకుంటారే? ఇదిగో అబ్బాయ్! నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు మా ఆయన ఎస్వీరంగారావు ఎంత పెద్ద ప్లీడరో తెలుసుగా? బల్ల గుద్ది వాదించాడంటే ఈ గుంటూరేం ఖర్మ.. ఢిల్లీ కూడా గడగడలాడిపోవాల్సిందే. నువ్వర్జంటుగా నీ దుకాణం మూసెయ్. ఇది మర్యాదస్తులు కాపురాలు చేసుకునే ఏరియా. ఇట్లా హోటళ్ళు పెట్టి కాపురాలు కూల్చావంటే ఏవనుకున్నావో? నీమీద మా ఆయనతో న్యూసెన్స్ కేసు కట్టించి.. ఉరిశిక్ష వేయిస్తా! జాగ్రత్త." హూంకరించింది సూర్యాకాంతం.

పురుషోత్తం భయంతో వణికిపోసాగాడు. చెమటలు పట్టేశాయి.

"అ.. అ.. అమ్మగారూ! మీరు ఉప్పూకారాలు ఎక్కువేస్తున్నారంట. గంట క్రితమే మీ ప్లీడరు గుమాస్తా వంగర వెంకటసుబ్బయ్య  రెండు ఫుల్ క్యారేజీలు కట్టించుకుని తీసుకెళ్ళాడు. సాంబార్ ఎగస్ట్రా!"

సూర్యాకాంతం బిత్తరపోయింది. తదుపరి ఆవేశంతో ఊగిపోయింది.

"అదా సంగతి. 'కాంతం! ఇవ్వాళ ఒంట్లో నలతగా ఉందే. లంఖణం పరమౌషధం అన్నారు. నాకు వంట చెయ్యకు.' అంటే పస్తున్నాడేమోననుకున్నాను. ఈ మధ్య కోర్టులోనే కాకుండా ఇంట్లో కూడా అబద్దాలు చెబుతున్నాడన్న మాట! చెప్తా! చెప్తా! ఎక్కడికి పోతాడు. సాయంకాలం కోర్టు నుండి వస్తాడుగా! ముందా వంగరకి బెండు వంకర తీస్తే ఈ పెద్దమనిషి దారికోస్తాడు." పళ్ళు పటపటలాడించింది సూర్యాకాంతం.

చాయాదేవి అందుకుంది.

"ఇదిగో అబ్బాయ్! నీ వాలకం చూస్తుంటే మా గుమ్మడి బావగారిలా మంచాళ్ళాగే ఉన్నావు. ఉన్నపళంగా వెళ్ళిపొమ్మంటే నువ్వు మాత్రం ఎక్కడికి పోతావులే! అంచేత నువ్వు హోటల్ ఎత్తెయ్యడానికి నెల్రోజులు గడువిస్తున్నా. ఈ లోపు నీ ఏర్పాట్లు చూసుకో. లేకపోతే నా సంగతి నీకు తెలీదు. మా అల్లుడు రాజనాలతో చెప్పి నీ హోటల్ నేలమట్టం చేయిస్తాను. పదండే పోదాం!" అంటూ వెనుతిరిగింది.

"చాయాదేవత్తా! వెళ్ళేప్పుడు చీతిరాల వాళ్ళ కొట్లో ఓ పది అప్పడాల కర్రలు కొనుక్కెళ్ళాలి. అట్నుండి వెళ్దాం." అంది గీతాంజలి.

"అయినా నీకిదేం పోయ్యేకాలమే గీతాంజలి? మేం మాత్రం కాపురం చెయ్యట్లేదు? ఎంత మొగుడయితే మాత్రం అన్నేసి అప్పడాల కర్రలు విరిగేలా కోడతావుటే? తగలరాని చోట తగిలి హరీ మంటే రేపు నీకు కొట్టుకోడానికి ఎవరు దొరుకుతారు? అయినా ఈ కరువు రోజుల్లో అన్ని కర్రలు ఎక్కడ కొనగలం? అట్లకాడతో వీపు మీద వాతలు పెట్టు. ఖర్చు లేని పని. సరిపోతుంది." అంది చాయాదేవి.

"ఉసే ఉసే! ఈ ప్లాన్లన్నీ ఇంట్లో మాట్లాడుకోవాలే. మొగుళ్ళని ఎంత తన్నుకున్నా.. వాళ్ళ పరువు ఇలా రోడ్డున పడెయ్య కూడదు. ఇదిగో అబ్బాయ్! నీకు మా ఛాయాదేవి ఇచ్చిన గడువు గుర్తుందిగా?" అంటూ గర్జిస్తూ బయటకి నడిచింది సూర్యాకాంతం.

వర్షం వెలిసినట్లైంది. పురుషోత్తానికి ఇంకా వణుకు తగ్గలేదు. తన హోటల్లో ఆహార పదార్ధాలు రుచిగా, శుచిగా ఉండాలనుకున్నాడు గానీ.. బ్రాడీపేట కుటుంబాల్లో ఇన్ని కలతలు రేపుతాయనుకోలేదు. వంటగదిలోకెళ్ళి ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్ గా కలుపుకుని.. తాగుతూ.. ఈ కష్టాన్ని ఎలా అధిగమించాలా? అని ఆలోచనలో పడ్డాడు.

చివరి తోక..

గుంటూరు, ఆనంద భవన్, పురుషోత్తం.. నిజం. మిగిలిందంతా కల్పితం!

అమ్మకి నాన్నతో తగాదా వచ్చినప్పుడల్లా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళేది. నేను నాన్నతో కలిసి అన్ని రోజులూ ఆనంద భవన్ లో హాయిగా భోంచేసేవాడిని. అమ్మ తిరిగొచ్చినప్పుడు నాకు చికాగ్గా ఉండేది.. ఆనంద భవన్ మిస్ అవుతున్నందుకు. మళ్ళీ అమ్మానాన్నల తగాదా కోసం ఆశగా ఎదురు చూస్తుండేవాణ్ణి.

ఈ రోజుకీ ఎందరో భర్తలకి ఆపద సమయంలో (భార్య కన్నా) మంచి భోజనం అందిస్తున్న మా గుంటూరు ఆనందభవన్ కి వందనం.. అభినందనం!

కృతజ్ఞతలు..

ఆనంద భవన్ ఫోటోలు : నా ఆత్మీయ మిత్రుడు D.S.R.మూర్తి, బ్రాడీపేట, గుంటూరు.