Tuesday, 11 June 2013

అద్వాని - ఆస్పత్రి


సమయం ఉదయం పది గంటలు. హిందు పేపర్లో అద్వానిపై రాసిన ఎడిటోరియల్ చదువుతున్నాను.

"రవణ మామా! కాఫీ." అంటూ హడావుడిగా లోపలకొచ్చాడు సుబ్బు.

చాలా రోజుల తరవాత వచ్చిన సుబ్బు రాక ఆనందం కలిగించింది.

"రా సుబ్బు! కూర్చో. పాపం! అద్వానికి ఎంత అవమానం జరిగిపోతుంది." దిగులుగా అన్నాను.

"ఇందులో నువ్వు బాధ పడేదేముంది? రాజకీయాలలో ఇది మామూలే. ఇక్కడ దయాదాక్షిణ్యాలు, మమతానురాగాలకి తావు లేదు మిత్రమా!" అన్నాడు సుబ్బు.

"సుబ్బు! అద్వాని భారత రాజకీయాల్ని దశాబ్దాలుగా ప్రభావితం చేసిన మహానాయకుడు." అన్నాను.

"కాదన్నదెవరు? ఆయన వాజపేయితో కలిసి ఒక గొప్ప ఆస్పత్రిని ఎంతో విజయవంతంగా నడిపిన మహానాయకుడు!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"ఏంటి! అద్వాని వాజపేయితో కలిసి ఆస్పత్రి నడిపాడా!" ఆశ్చర్యంగా అడిగాను.

"రవణ మావా! చాలా ఊళ్ళల్లో డాక్టర్లైన భార్యాభర్తలు ఆస్పత్రి నడుపుతుంటారు. ఇద్దర్లో ఒకరు పేషంట్ల పట్ల చాలా సౌమ్యంగా, స్నేహంగా ఉంటారు. ఇంకొకరు డబ్బు దగ్గర కఠినంగా, ఖచ్చితంగా ఉంటారు. 'డాక్టరయ్య దేవుడు! పేదోళ్ళంటే ఎంత కనికరం! డాక్టరమ్మకే ఎక్కళ్ళేని డబ్బాశ. నిలబెట్టి వసూలు చేస్తది.' అని పేషంట్లు అనుకుంటుంటారు."

ఇంతలో పొగలు గక్కుతూ వేడి కాఫీ వచ్చింది.

కాఫీ సిప్ చేస్తూ నిదానంగా చెప్పసాగాడు సుబ్బు.

"వాస్తవానికి ఫీజు వసూళ్లు డాక్టరయ్య కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. ఇదే వారి విజయ రహస్యం. ఇది చాలా సింపుల్ బిజినెస్ టెక్నిక్. ఆస్పత్రిలో డాక్టరయ్య మాత్రమే ఉంటే కనీస ఫీజులు కూడా వసూలు కాక ఆస్పత్రి మూత పడుతుంది. ఒక్క డాక్టరమ్మే ఉన్నా కూడా పేషంట్లు రాక మూత పడుతుంది."

"అవును సుబ్బు! మనూళ్ళో కూడా ఈ టెక్నిక్ నడుస్తుంది. నీ అబ్జర్వేషన్ కరెక్ట్." అన్నాను.

"ఒప్పుకుంటున్నావుగా? ఓకే! ఇప్పుడు మనం భారతీయ జనతా పార్టీ గూర్చి మాట్లాడుకుందాం. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం నడిచినప్పుడు వాజపేయి, అద్వానిలు డాక్టరయ్య, డాక్టరమ్మల పాత్రలు పోషించారు. హిందుత్వవాదులు అద్వానిలో తమ ప్రాతినిధ్యాన్ని చూసుకుని తృప్తినొందారు. చంద్రబాబు, నితీష్ లు వాజపేయిని చూపిస్తూ పని కానిచ్చుకున్నారు. వాస్తవానికి వాజపేయి, అద్వానిలు ఒకటే. వారిద్దరూ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి ఇట్లాంటి సర్దుబాటు చేసుకున్నారు."

"ఇంటరెస్టింగ్ సుబ్బు!" అన్నాను.

"ఒకరకంగా ఇప్పుడు ప్రజలకి మంచే జరిగింది." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"ఎలా?" ఆసక్తిగా అడిగాను.

"ఇప్పుడు పేషంట్లకి ఏ కన్ఫ్యూజనూ లేదు. డాక్టరయ్య మంచాన పడ్డాడు. కావున ఆస్పత్రికి పేషంట్లు తగ్గారు. అందువల్ల ఆస్పత్రికి పూర్వవైభవం తెప్పించే పనిని మోడీ అనే కొత్త డాక్టరుకి అప్పజెప్పారు. ఇది నచ్చని డాక్టరమ్మ అలిగి వెళ్ళిపోయింది. ఈ కొత్త డాక్టరు అనుభవం లేనివాడేమీ కాదు. వాళ్ళ ఊరైన గుజరాత్ లో రాష్ట్రప్రభుత్వం అనే ఓ చిన్నఆస్పత్రిని లాభసాటిగా నడుపుతున్నాడు."

"మరి మోడీ ఇంత పెద్ద ఆస్పత్రిని నడపగలడంటావా?"

"అది మనం వెండి తెరపై చూడాలి. ఇప్పుడే ఎలా చెబుతాం? అయితే తన చిన్న ఆస్పత్రిలో మోడీ చేస్తున్న వైద్యం గూర్చి ప్రజలకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. అంచేత ఇష్టమైతే మోడీ ఆస్పత్రిలోకి వెళ్తారు. లేకపోతే లేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం." అంటూ టైం చూసుకుంటూ లేచాడు.

"మరిప్పుడు అద్వాని పరిస్థితేంటి సుబ్బు?"

"అద్వానికి పెద్దగా ఆప్షన్స్ లేవు. పార్టీవాళ్లు ఆయనకో ఉచితాసనం ఇచ్చి ధృతరాష్ట్రుడిలా కూర్చోమంటున్నారు. ఆయన అలా కూర్చోనైనా కూర్చోవాలి. లేదా బయటకి వెళ్లిపోవాలి. నిర్ణయించుకోవలసింది అద్వాని. మనం కాదు. వస్తాను. నాకు టైమైంది." అంటూ హడావుడిగా వెళ్ళాడు సుబ్బు.

(photo courtesy : Google)