Wednesday, 26 June 2013

ఇచట ఆటోగ్రాఫులు ఇవ్వబడును"జీవితంలో ఆటోగ్రాఫులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి ఎదగాలి." ఈ గొప్ప డైలాగ్ చాల్రోజులుగా వింటూనే ఉన్నాను. ఇట్లాంటి సుభాషితాలు 'గంటకి ఇంత' అంటూ వసూలు చేసుకునే 'ప్రొఫెషనల్' వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు.

ఈ ఆటోగ్రాఫుల డైలాగ్ విన్నప్పుడల్లా ఇట్లాంటివే ఇంకొన్ని డైలాగులు గుర్తొచ్చి నవ్వుకుంటాను. అప్పు తీసుకునేవాడు ఆప్పిచ్చే స్థాయికి ఎదగాలి. ఇంజక్షన్ చేయించుకునేవాడు ఇంజెక్షన్ చేసే స్థాయికి ఎదగాలి. ఆత్మహత్య చేసుకునేవాడు హత్య చేసే స్థాయికి ఎదగాలి.

ఈ మధ్య గుంటూర్లో భగవద్గీతకి సంబంధించిన కార్యక్రమం ఒకటి జరిగింది. ముఖ్య అతిథి CBI మాజీ అధికారి లక్ష్మీనారాయణ (వీరికి ఆధ్యాత్మిక ధ్యాస యెక్కువ). ఆయన కూడా పిల్లలకి ఈ అరిగిపోయిన ఆటోగ్రాఫ్ డైలాగ్ వినిపించాడు, ఆశ్చర్యపొయ్యాను. అంత పెద్ద పోలీసాయన చెప్పాడంటే.. ఇదేదో యోచించవలసిన సంగతే!

ముందుగా.. ఆ CBI మాజీ అధికారి ఆటోగ్రాఫులు ఇచ్చే స్థాయికి ఎదిగాడని మనం అర్ధం చేసుకోవాలి. మంచిది. ఆయన్ని ఆటోగ్రాఫ్ అడిగేవాడున్నాడు. చేతిలో పెన్నుంది. పెన్నులో ఇంకుంది. సంతకాలు పెట్టే ఉత్సాహం ఆయనలో ఉంది. కాదన్డానికి మనమెవరం? నిజాయితీపరులైన అధికారుల్ని మనం తప్పకుండా గౌరవించుకోవాల్సిందే.

ఈ దేశంలో నిజాయితీపరులైన ఉద్యోగులు ఇంకా చాలామంది ఉన్నారు. రాబర్ట్ వద్రా అనే ఒక పెద్దమనిషి చేసిన భూకుంభకోణాన్ని బయటపెట్టిన అశోక్ కెమ్కా అనే IAS అధికారి ఇప్పుడెక్కడున్నాడో తెలీదు. ములాయం, మాయావతిల అవినీతిపై దర్యాప్తు చేసిన అధికారులు.. వారిపై టన్నుల కొద్దీ చార్జ్ షీట్లు తయారుచేసి.. శ్రీకోర్టువారికి దాఖలు చేసేందుకు అనుమతి కోసం నిరంతరంగా పడిగాపులు కాస్తున్నారు.

వారెవ్వరికీ దొరకని అవకాశం మన లక్ష్మీనారాయణకి దక్కింది. కారణాలు ఏవైనప్పటికీ (అందరికీ తెలిసినవే).. కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకి పూర్తి స్వేచ్చనిచ్చింది. ఇందుకు మనం కాంగ్రెస్ హైకమాండుని అభినందించవలసి ఉంది. ఇదేంటి? ఆటోగ్రాఫుల గూర్చి మొదలెట్టి ఒక పోలీసు అధికారి గూర్చి రాసేస్తున్నాను!

అసలు ముందుగా నాకీ ఆటోగ్రాఫుల గూర్చి రాసే అర్హత ఉన్నదా? అని నన్ను నేను ప్రశ్నించుకోవలసి ఉంది. సినిమా తియ్యడం చేతకానివాడు సినిమాని విమర్శించరాదు. విస్కీ మజా తెలీనివాడు విస్కీని వ్యతిరేకించరాదు. ఇట్లాంటి పాత చింతకాయ పచ్చడి వాదనలు ఎప్పట్నుండో ఉన్నాయి.

ఈ వాదనల ప్రకారం - నాకు ఆటోగ్రాఫుల గూర్చి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే నేనెప్పుడూ ఎవరిదగ్గరా ఆటోగ్రాఫ్ తీసుకోలేదు.. (ఆటోగ్రాఫ్ ఇవ్వమని నన్నెవరూ అడగని కారణాన) ఇచ్చిందీ లేదు. (నన్ను ఎవరూ ఆటోగ్రాఫ్ అడగనందున కుళ్లుకుంటూ ఈ టపా రాస్తున్నానని మీరనుకుంటే నాకభ్యంతరం లేదు).

సరే! అందరూ ఆటోగ్రాఫులు ఇచ్చే స్థాయికి ఎదిగినట్లైతే.. మరి వాటిని తీసుకునేదెవరు? ఫేస్బుక్కుల్లో అయితే స్నేహితులే చచ్చినట్లు (మొహమాటానికి) లైకులు పెడతారు. ఆటోగ్రాఫులకి ఆ సౌకర్యం ఉన్నట్లు లేదు. అసలు ఎవరైనా, ఎవరికైనా ఈ ఆటోగ్రాఫులు ఇవ్వడం ఎందుకు? తీసుకోవడం ఎందుకు?


మనిషి ఒక జంతువు. ('జంతువు' అంటున్నానని కోపం వలదు, మనం నిజంగా జంతువులమే). అడవిలో జంతువులు ఏం చేస్తాయి? ఆకలేస్తే కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని పొట్ట నింపుకుంటాయి. ఆపై నీడపట్టున కునుకు తీస్తాయి. ఆ తరవాత హాయిగా ఆడుకుంటాయి. ఒకేజాతి జంతువుల్లో IQ తేడాలు వుండవని నా అభిప్రాయం. అందుకే వాటన్నింటికీ సమానంగా కష్టపడితేగానీ పొట్ట గడవదు (ఈ 'సమానం' థియరీ ప్రకారం అడవి జంతువులన్నీ కమ్యూనిస్టులని చెప్పొచ్చు). 

కానీ మనిషి తెలివితేటల్లో తేడాలున్నాయి. కొందరు తెలివి తక్కువ వెధవలకి ఎంత కష్టపడ్డా పూట గడవదు. ఇంకొందరికి అసలు కష్టపడకుండానే పంచభక్ష్య పరమాన్నాలు రెడీగా ఉంటాయి. అంచేత ఈ కడుపు నిండినవారు ఏం చెయ్యాలో తోచక, తెగ ఇబ్బంది పడుతుంటారు. కావున వీరు తమ మానసికోల్లాసం కోసం ఏదొక వ్యాపకం పెట్టుకోవాలి.

'పొద్దస్తమానం తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకీ తేడా ఎటుంటాది?' అని ముళ్ళపూడి వెంకట్రవణ 'ముత్యాలముగ్గు'లో చెప్పాడు. అంచేత ఈ కడుపు నిండిన మనిషి 'హాబీ' అని ముద్దుగా పిలుచుకునే (పన్లేని) పన్లు కొన్ని కల్పించుకున్నాడు. ఈ హాబీల్లొ 'కలెక్షన్' అనేది ఒక ప్రముఖ వ్యాపకం. కాయిన్లు, స్టాంపులు, సీసాలు, సినిమా పాటల రికార్డులు, పురాతన వస్తువులు, ఆటోగ్రాఫులు.. ఇలా ఒక చాంతాడంత లిస్టుంది. దురదున్నవాడు బరబరా గోక్కుని వేణ్నీళ్ల స్నానం చేస్తే యెంత హాయిగా వుంటుందో ఈ కలెక్షన్ హాబీవాళ్లక్కూడా అట్లాంటి హాయిలుంటాయని నా అనుమానం. 

ఓయీ వైద్యాధమా! ఒక మహోన్నత వ్యక్తి ఆటోగ్రాఫుని సేకరించి జనులు స్పూర్తి నొందెదరోయీ! ఆటోగ్రాఫ్ ఇచ్చుట, తీసుకొనుట అనునది ఆనాదిగా ఆధునిక సంస్కృతికి చిహ్నం. ఒక అద్భుతవ్యక్తి ప్రతిభాపాటవాలు విద్యుత్తరంగాల వలె ఆటోగ్రాఫ్ ద్వారా ప్రసరింపబడి.. స్వీకరించినవాడి జన్మ ధన్యమగును. నీవంటి గుంటూరు కుగ్రామవాసికి దాని విలువ ఏమి తెలియును?

ఈ ఆటోగ్రాఫుల స్పూర్తితో విజయానికి వెయ్యి మెట్లు అవలీలగా ఎక్కెయ్యొచ్చు. స్వతంత్ర ఉద్యమంలో గాంధీగారి ఆటొగ్రాఫులు తీసుకున్న బ్రాందీబాబులనేకులు గాంధీవాదానికి మళ్ళారు. ఆమధ్య చిరంజీవి ఆటోగ్రాఫు తీసుకున్న యువకులనేకులు ప్రస్తుతం సామాజిక న్యాయంలో తలమున్కలైయున్నారు.

ఓ! అలాగా! అయామ్ వెరీ సారీ. నాకీ ఆటోగ్రాఫులకింత పవరుందని తెలీదు. విషయం తెలీక ఏదేదో వాగాను. ఇప్పుడర్థమైంది - నా బుర్ర గజిబిజి గందరగోళంగా యెందుకుంటుందో! ఒక గొప్పవ్యక్తి ఆటోగ్రాఫ్ సంపాదించి బుర్రని సాఫీ చేసుకోవాలి. 

మరి నే వెళ్లాలి, వుంటాను! 

(updated & posted in fb on 23/3/2018)