Friday, 7 June 2013

తెలుగు ఉన్మాదం

"ఉన్మాదం రోగుల కోసం మానసిక వైద్యుల అవగాహన సదస్సు."

ఒక తెలుగు పేపర్ జిల్లా ఎడిషన్లో ఈ వార్త చదవంగాన్లే కంగారుపడ్డాను. సైకియాట్రీ వైద్యంలో 'ఉన్మాదం' అనే జబ్బు ఉన్నట్లు నాకు తెలీదు. కొద్దిసేపటి తరవాత నాకర్ధమైందేమనగా - 'స్కిజోఫ్రీనియా'కి తెలుగు అనువాదం 'ఉన్మాదం' అని. మనసు దిగులుగా అయిపొయింది.

నాకెందుకో 'ఉన్మాదం' అంటే ఉగ్రవాదం టైపులో తిట్టులాగా అనిపించింది. తలపెట్టిందేమో స్కిజోఫ్రీనియా పట్ల అవగాహన, కార్యక్రమానికి వచ్చినవారిని ఉన్మాదులు అంటే.. పిలిచి మరీ అవమానించినట్లవుతుందేమో! ఉన్మాదం అనే అనువాద పదం తెలుగు నిఘంటువు ప్రకారం కరెక్టే ఆవ్వచ్చు, కానీ విండానికి యేమాత్రం బాలేదు.

మన భాషాభిమానులు రోగాల పేర్ల విషయంలో కొంత నిబద్ధత పాటించాల్సిన అవసరం ఉంది. స్కిజోఫ్రీనియా పదం జర్మన్ భాషకి చెందింది, ఇంగ్లీషువాడు దాన్ని స్కిజోఫ్రీనియాగానే ఉంచేశాడు గానీ తన భాషలోకి అనువదింప పూనుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా రొగాలకి ఒకటే పేరుంటే మంచిది, అందువల్ల ఎవరికీ నష్టం లేదు.

'అతిసారం' అంటే కలరా అన్నసంగతి నాకు మొన్నటిదాకా తెలీదు. హైపర్‌టెన్షన్‌ని ఇంగ్లీషులో బ్లడ్ ప్రెషర్ (BP) అంటారు. బిపి అంటే చదువుకోనివారిక్కూడా సులభంగా అర్ధమౌతుంది. కానీ తెలుగులో 'రక్తపోటు' అంటూ భయాందోళనకి గురిచేస్తారు. డయాబిటిస్ అంటే 'మధుమేహం', టైఫాయిడ్ అంటే విషజ్వరంట!

తెలుగు భాషాభిమానం అంటే విషయాన్ని సంక్లిష్టం చేసుకోవటం కాకూడదు. ప్రజల్లో ప్రాచుర్యం పొందిన పదాల్ని (అది ఏ భాషైనా పరవాలేదు) అలా వదిలేస్తేనే ఉత్తమం. ఇంటర్నెట్ అనే పదాన్ని అంతర్జాలం అంటూ ఏదో మాయాజాలం చెయ్యనేల! ఇలా అంటే మన ప్రొఫెషనల్ భాషాభిమానులు వొప్పుకోరు. వారికి కృతకమైన తెలుగు అనువాద పదాలంటేనే భలే ఇష్టం.

నాకు మొదట్నుండి మాతృభాషపై గొప్ప మమకారం లేదు, భాష అనేది కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే అని నా అభిప్రాయం. అందువల్లనేనేమో 'తెలుగు భాషని పసిబిడ్డలా సాకుదాం' అనే నినాదం వింటే నవ్వొస్తుంది! ఈ రోజుల్లో ఇళ్లల్లో మాతృమూర్తులకి దిక్కుండదు.. మాతృభాషకి మాత్రం అంతులేని పవిత్రత!

నేను ఆంధ్రప్రాంతంలో పుట్టాను కావున తెలుగు రాస్తున్నాను. కేరళలో పుట్టినట్లైతే మలయాళం రాసేవాణ్ని. నా భాష తెలుగు కావటం కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే, ఈ యాక్సిడెంట్లకి పవిత్రత అంటగట్టడం మూర్ఖత్వం. ఆ మాటకొస్తే కుక్కలక్కూడా కుక్కభాష వుంటుంది కదా!

మనం సాధ్యమైనంతవరకు ఈ ధూమశకట యంత్రాలకీ, అంతర్జాలలకీ దూరంగా జరిగితే మంచిది. భాష అనేది ఎవణ్నో ఉద్ధరించడానిక్కాదు. మన ఆలోచనల్ని చెప్పుకోడానికి, రాసుకోడానికి మాత్రమే. అంతకుమించి యే భాషక్కూడా ప్రయోజనం లేదు.

రేప్పొద్దున భాషలన్నీ అంతరించిపోయి సైగలు చేసుకుంటూ బ్రతికే రోజులొస్తే మనం కూడా ఇంచక్కా సైగలు చేసుకుంటూనే బ్రతికేద్దాం. నాకైతే అది కూడా హాయిగానే ఉంటుంది.

అంకితం -

తెలుగుభాషలో 'అనువాద పదాలు' అంటూ కంకర్రాళ్ళ భాషని మనపై రుద్దడానికి ప్రయత్నించే విజ్ఞులకి.

(fb post on 16 Dec 2017)