Monday 17 June 2013

వార్తలు - పత్రికలు



ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక సైంటిఫిక్ పేపర్ స్క్రీన్ షాట్. ఇది 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ' అనే ఒక మెడికల్ జర్నల్లో ప్రచురితమైన ఒరిజినల్ ఆర్టికల్. ఈ స్టడీ చేసినవారి declaration of interest వివరాలు స్క్రీన్ షాట్ చివర్లో చదువుకోవచ్చు. ఈ వివరాలు ఇచ్చే ఆనవాయితీ సైంటిఫిక్ జర్నల్స్ కి ఉంది. ఇవ్వాలనే నియమం కూడా ఉంది.

అసలీ వివరాలు ఎందుకివ్వాలి? ఒక ఉదాహరణ రాస్తాను. నేను ఒక రోగంలో X అనే మందుని Y అనే ఇంకో మందుతో పోలుస్తూ పరిశోధన చేస్తాను. 'ఈ రోగంలో X అనే మందు Y అనే మందు కన్నా బాగా పనిచేసింది.' అనే ఫలితంతో నా పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తాను. అయితే నా పరిశోధనకి X అనే మందు తయారుచేసే కంపెనీవాడు ఆర్ధిక సహాయం చేశాడు. అంటే ఇక్కడ నాకు conflict of interest ఉంది. నా పరిశోధనా పత్రాన్ని చదివేవారికి ఈ సంగతి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అది శాస్త్రీయం. ఇలా చెప్పకుండా ప్రచురిస్తే అది మోసం చేసినట్లే అవుతుంది.

ఇప్పుడు మనం కొద్దిసేపు వార్తాపత్రికల వ్యాపారం గూర్చి మాట్లాడుకుందాం. వార్తాపత్రికల సంస్థలు వార్తలతో వ్యాపారం చేస్తాయి. వార్తాపత్రికల సంస్థలకి ఆదాయంలో అధికభాగం ప్రకటనల ద్వారా వస్తుంది. ఈ ప్రకటనల రేట్లు ఆయా పత్రికల సర్క్యులేషన్ అనుసరించి ఉంటాయి. కాబట్టి ప్రకటనలిచ్చే వ్యాపార సంస్థల ఇంటరెస్ట్ కి ఎటువంటి నష్టం ఉండదు. పత్రికా సంస్థలు వార్తలతో ముద్రితమైన పత్రికల్ని పాఠకునికి అమ్ముకుని మరికొంత ఆదాయం చేసుకుంటాయి. ఇది ఫక్తు వ్యాపారం. అంతిమంగా వార్తల కోసం పత్రికని కొని చదివే పాఠకుడే వినియోగదారుడు.

ఒక వస్తువు కొన్నప్పుడు వినియోగదారుడిగా మనక్కొన్ని హక్కులుంటాయి. ఉదాహరణగా బిస్కెట్ పేకెట్ సంగతే తీసుకుందాం. బిస్కెట్ పేకెట్ కవరుపై సంబంధిత వివరాలు ముద్రించి ఉంటాయి. అవి చదువుకున్నవాడు ఆ బిస్కెట్లు కొనుక్కోవచ్చు లేదా మానుకోవచ్చు. వినియోగదారుడిగా ఆ స్వేచ్చ మనకి ఉంటుంది. ఇక్కడ బిస్కెట్ల తయారీలో వాడిన పదార్ధాల సమాచారం వాటిని కొనబొయ్యేవాడికి తెలియజెయ్యడం అనేది ప్రాధమిక వ్యాపార సూత్రం. ఇప్పుడు ఇదే లాజిక్ ని మన వార్తాపత్రికలకి అన్వయించి చూద్దాం.

మనం మార్కెట్లో ఒక వార్తాపత్రిక వార్తలు తెలుసుకుందుకు కొనుక్కుంటాం. కొనేప్పుడు ఆ వార్తాపత్రిక కంటెంట్ గూర్చి మనకి అవగాహన ఉండదు. ఉదాహరణకి ఒక పత్రిక ఫలానా నాయకుడు అవినీతిపరుడు అని ఒక కథనం ప్రచురిస్తుంది. ఆ కథనం ఆ ఒక్క పత్రికలో మాత్రమే ఉంటుంది. అంటే ఆ కథనం విశ్వసనీయత లేని అసత్య, అర్ధసత్యాల కలయిక, మాటల గారడీ, మోసం. కానీ ఆ విషయం వినియోగదారుడైన పాఠకుడికి తెలీదు. అప్పుడు ఆ కథనాన్ని నిజమనుకునే ప్రమాదం ఉంది.

తనని తప్పుదోవ పట్టించే వార్తల నుండి పాఠకుణ్ని రక్షించాలంటే.. ఆ పత్రికపై పాఠకుడికి పూర్తి సమాచారం ఉండాలి. 'ఈ వార్తాపత్రికలో ఫలానా రాజకీయ నాయకుడు లేదా పార్టీకి అనుకూల అంశాలని మాత్రమే ప్రచురిస్తాం. ప్రతికూల అంశాలని ప్రచురించం. ఈ పత్రిక సొంతదారుడు ఫలానా రాజకీయపార్టీకి పూర్తి అనుకూలుడు. ఈ పత్రిక ఓనర్ ఫలానా రాజకీయపార్టీ తరఫున ఫలానా చట్టసభలో సభ్యుడు.' అంటూ నిజాల్ని వెల్లడిస్తూ తమ వార్తాపత్రిక యొక్క డిక్లేర్డ్ పాలసీని ముందు పేజీలో ప్రముఖంగా ప్రచురించాలి.

ఈ డిక్లరేషన్ లేనప్పుడు సహజంగానే వినియోగదారుడు నష్టపోతాడు. తెలుగు పత్రికలవాళ్ళు వార్తల విశ్లేషణ అంటూ చేటభారతాలు రాస్తుంటారు. మన పత్రికాధిపతులకి, ఎడిటర్లకి రాజకీయమైన లక్ష్యాలు ఉన్నాయి. కావున వారి విశ్లేషణలు.. వారిష్టం. కానీ తమ వివరాలు వెల్లడించకుండా తామేదో సత్యశోధన చేసి నిజాన్ని కనుగొన్నామనే ధోరణిలో విశ్లేషణ రాయడం ఖచ్చితంగా మోసం కిందకి వస్తుంది. ఎందుకంటే అవన్నీ తెలివిగా తమకి అనుకూలంగా రాసుకుంటున్న విశ్లేషణలు కాబట్టి.

కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యులు, అభిమానుల కోసం వార్తాపత్రికల్ని నడుపుతుంటాయి. సహజంగానే అవి తమ పార్టీ అభిప్రాయాల్ని మాత్రమే ప్రచురిస్తాయి. కావున ఆ పత్రికలు ఎవర్నీ చీటింగ్ చేస్తున్నట్లు కాదు. ఎందుకంటే ఆ ఆ పత్రికల నిస్పాక్షికత పట్ల ఎవరికీ ఏ భ్రమలు ఉండవు కావున.

ఇక జాతీయస్థాయి పత్రికలైతే వార్తల్ని కవర్ చేసే విధానంలో వారి వ్యాపార దృక్పధం, కార్పోరేట్ అనుకూలత స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది. వారు ఒక వార్తని తమకి అనుకూలంగా మలచుకునే తెలివితేటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించారు. వార్తని అవసరమైనదానికన్నా ఎక్కువతక్కువలు ఎలా చెయ్యాలో కూడా జాతీయస్థాయి వార్తాపత్రికలకి కొట్టిన పిండి.

ఎందుకనో మొదట్నుండి మన తెలుగువాడికి పత్రికల విశ్వసనీయత విషయంలో పెద్ద పట్టింపు లేదు. చల్లారిన ఇడ్లీ ఇచ్చినందుకో, పెసరట్టులో ఉప్మా తక్కువైనందుకో సర్వర్ మీద ఇంతెత్తున లేవడానికి మాత్రమే మన తెలుగువాడి పౌరుషం పరిమితం. వార్తాపత్రికలు తమ సొంత ఎజెండా ప్రచారం చేసుకుంటూ.. వారి ఎజండా చదవడానికి మనచేతనే మన సొమ్ము ఖర్చు పెట్టించడం అనే మోసాన్ని అంత ముఖ్యమైన విషయంగా భావించడు.

ఉపసంహారం :

ప్రస్తుతం రాజకీయ పార్టీల రాజకీయాల కన్నా వార్తాపత్రికల రాజకీయాలు ఎక్కువైపొయ్యాయి. ఈ ధోరణి మారాలనే ఆశ అయితే ఉంది. ఇది ఇప్పటికిప్పుడు మారదు అనే వాస్తవిక దృక్పధమూ ఉంది. తెలుగు భాష మాట్లాడేవాళ్ళలో అక్షరాస్యత తక్కువ. అక్షరాస్యుల్లో కూడా రాజకీయ అక్షరాస్యత మరీ తక్కువ. వీరి సంఖ్య పెరిగేదాకా పత్రికలు తమ ధోరణి మార్చుకునే అనివార్యత ఏర్పడదు. అప్పటిదాకా మనకీ పక్షపాత వార్తలే శరణ్యం.

(photos courtesy : Google)