Saturday, 1 June 2013

గాడీజ్ గ్రేట్


అతగాడు యువకుడు. ఉత్సాహవంతుడు. మొదటిసారిగా ప్రజాప్రతినిధి (ప్ర.ప్ర.) గా ఎన్నికయ్యాడు. రాష్ట్రాన్ని సింగపూర్ లా మార్చెయ్యాలనేది తన పార్టీ అగ్రనాయకుల కల, చిరకాల వాంఛ. తదనుగుణంగా ప్ర.ప్ర. కూడా తన నియోజకవర్గాన్ని సింగపూర్ గా మార్చెయ్యాలని నడుం కట్టాడు.

అయితే ప్ర.ప్ర.కి ఓ తలనొప్పొచ్చిపడింది. తన నియోజకవర్గంలో ఎక్కువమంది కొంపాగోడూ లేని దరిద్రులు. వారిలో ఎక్కువమంది రోడ్ల పక్కనే నివసిస్తున్నారే. వారిని వదిలించుకోవటం ఎలాగో అర్ధం కావట్లేదు. వారి వోట్లతోనే తను ప్ర.ప్ర. అయ్యాడు మరి.

వీళ్ళకి తోడు కొందరు ముష్టివాళ్ళు. కనీసం ఆ ముష్టివాళ్ళనైనా తరిమేద్దామని ప్రయత్నించాడు. అప్పోజిషన్ వాళ్ళు 'ఇదన్యాయం. ఈ దేశానికి ముష్టివాళ్ళే ముద్దుబిడ్డలు.' అంటూ గొంతు చించుకున్నారు. వారి విమర్శలకి జంకిన ప్ర.ప్ర. ఏం చెయ్యాలో తోచక తల పట్టుకున్నాడు. ఏ దిక్కూ లేనివాడికి దేవుడే దిక్కు.

"భగవాన్! ఏమిటి నాకీ దుస్థితి? ఏదోక దారి చూపవయ్యా." అని దేవుణ్ని వేడుకున్నాడు.

దేవుడు కరుణించాడు. ఆ యేడాది ఒకటే వర్షాలు. ఎన్నడూ లేనిది వరదలొచ్చాయి. కాలవలు, రోడ్లూ ఏకమై ఉప్పొంగిపొయ్యాయి. మర్నాటికల్లా గతుకుల రోడ్లు, అతుకుల గుడిశలు కొట్టుకుపొయ్యాయి. ఆ తరవాత ఒకటే దోమలు, ఈగలు, బురద, కుళ్ళు, దుర్గంధం.

తద్వారా విషజ్వరాలు, విరోచనాలు. ఆ దెబ్బకి మూడోవంతు 'దరిద్రపుగొట్టు జనాభా' చచ్చింది. ప్ర.ప్ర. చచ్చినవారికి యాభైవేలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిరాహార దీక్ష చేసి మరీ సాధించాడు (ధర్మప్రభువు).

తన నియోజక వర్గ అభివృద్దే ఊపిరిగా బ్రతుకుతున్న ప్ర.ప్ర. కొట్టుకు పోయిన గతుకుల రోడ్ల స్థానంలో వెడల్పాటి కొత్త రోడ్లు శాంక్షన్ చేయించుకున్నాడు (పది పర్సెంట్ కమిషన్ బేసిస్ మీద). వరదలోస్తే వచ్చాయి గానీ.. ఇప్పుడీ వెడల్పాటి విశాలమైన రోడ్లు ఎంత ముద్దొస్తున్నాయో! ఒక పావలా సింగపూర్ వచ్చేసినట్లే.

కొత్త రోడ్డు వేసేదాకా ఓపిగ్గా నక్కిన దరిద్రులు.. రాత్రికిరాత్రే రోడ్ల మార్జిన్లని మళ్ళీ ఆక్రమించారు. ఆ విధంగా సమస్య తీవ్రత తగ్గింది గానీ.. అసలు సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఈసారి ప్ర.ప్ర. సమస్య పరిష్కారం కోసం తీవ్రస్థాయిలో పూజలు, పునస్కారాలు చేయించాడు. భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాడు (పుణ్యాత్ముడు).

ఆ యేడాది ఎప్పుడూ లేనంతగా విపరీతమైన చలి. ఊరంతటినీ డీప్ ఫ్రీజ్ లో పెట్టి డోర్ మూసినట్లుగా గజగజా వణికిపోయింది. బిక్షగాళ్ళు ఆ చలికి ఎముకలు కోరుక్కుపోయ్యి చచ్చారు. పూరిపాకల పూర్ పీపుల్ వెన్నులోంచి చలి కమ్మి నీలుక్కుపోయ్యి చచ్చారు. ప్ర.ప్ర. మళ్ళీ దీక్ష చేసి చచ్చినవారికి ప్రభుత్వం నుండి ఈమారు లక్ష రూపాయిలు ఇప్పించాడు (ధర్మప్రభువు).

ఆ విధంగా చలికాలం వెళ్లేసరికి రోడ్డు మార్జిన్లు ఖాళీ అయ్యాయి. ఆ మార్జిన్లని మరింతగా విస్తరింపజేసి అభివృద్ధి చెయ్యడానికి నిధులు శాంక్షన్ చేయించుకున్నాడు (ఈసారి ఇరవై పర్సెంట్ కమిషన్). లాన్లు వేయించాడు. లారీల్లో తెప్పించిన పూల మొక్కల్ని దగ్గరుండి మరీ నాటించాడు (మంచి టేస్టున్న మనిషి).

పచ్చని పచ్చికలో రంగురంగుల పూల మొక్కలు సుతారంగా, వయ్యారంగా కబుర్లాడుకున్నాయి. అవన్నీ నర్సరీ నుండి వచ్చాయి కావున ఇంగ్లీషు మీడియం విద్యార్ధుల్లా ఠీవీగా, గర్వంగా కూడా ఉన్నాయి. ప్రకృతి ఎంత అందముగా యుండును!

ప్రతి దేశంలోనూ మొండిప్రాణాలుంటయ్. వాళ్ళు ప్రకృతిని, దేవుణ్ణి కూడా జయిస్తారు. కానీ తమ దరిద్రాన్ని మాత్రం జయించలేరు. అంచేత అక్కడక్కడా ఇంకా కొందరు మొండి ముదనష్టపు వెధవలు దిష్టిపిడతల్లా మిగిలే (బ్రతికే) ఉన్నారు. వాళ్ళు ఆ ముద్దులొలికే మొక్కల మధ్యనే స్నానపానాదులు, ఆశుద్ధ విసర్జన కార్యక్రమాలు నిర్లజ్జగా కానిస్తున్నారు. వాళ్ళసలు మనుషులేనా! ప్ర.ప్ర.కి గుండె బరువెక్కింది.

నా నియోజక వర్గానికి ఈ దరిద్రుల దరిద్రం వదలదా? తన సింగపూరు కల ఇక నెరవేరదా? నా ఆశ అడియాశయేనా? ప్ర.ప్ర.కి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఈసారి పట్టుదలగా గొప్పయాగం చేయించాడు. అదేమన్నా సామాన్యమైన యాగమా! అలనాడు పిల్లల కోసం దశరధ మహారాజు కూడా ఇంత భీకర యజ్ఞం చేసి ఉండడు. దేశంలో ఉన్న వేదపండితులు ప్ర.ప్ర.ని మెచ్చుకున్నారు. దీవించారు.

తన భక్తుని పూజలకి భగవంతుడు మిక్కిలి సంతసించాడు. అతగాడి కష్టాలకి కారణమైన దౌర్భాగ్య దరిద్రుల పట్ల కన్నెర్ర చేశాడు. ఫలితంగా ఆ యేడాది ఎండాకాలం నిప్పుల కొలిమిలా భగభగా మండిపోయింది. సూర్యుడి భీకర ప్రతాపానికి సశేషంగా ఉంటున్న దరిద్రులంతా మలమలా మాడి చచ్చి నిశ్శేషం అయిపోయ్యారు. ఒక్కడూ మిగలని కారణాన ప్ర.ప్ర.కి నష్టపరిహార దీక్ష కూడా అవసరం లేకుండా పోయింది.

ఇప్పడు ప్ర.ప్ర. కల నెరవేరింది. ఒక్కసారి అటుగా వెళ్లి చూడండి. విశాలమైన రోడ్లు. సుందర నందనవనంలాంటి పార్కులు. కళ్ళు చెదిరే షాపింగ్ మాల్స్. స్విమ్మింగ్ పూల్స్. టెన్నిస్ కోర్టులు. హెల్త్ స్పాలు. క్లబ్బులు. పబ్బులు. సింగపూర్ని కాదు.. లాస్ వేగాస్ నే దించేశాడు ప్ర.ప్ర.

ఈ అభివృద్ధికి కళ్ళు చెదరగా, కళ్ళు చెమర్చగా.. ఇదే మోడల్ని రాష్ట్ర ప్ర.ప్ర.లందరూ అనుసరించాలని పార్టీ అగ్రనాయకత్వం పిలుపునిచ్చింది. ప్ర.ప్ర. మిక్కిలి సంతసించెను. తన జన్మ ధన్యమైనది. ఇదంతా ఆ భగవానుడు తనకి ప్రసాదించిన వరం. గాడీజ్ గ్రేట్!

(కథ అయిపొయింది.)

epilogue 

ఇదేం కథ! ప్ర.ప్ర. ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. పైగా నియోజక వర్గాన్ని మొక్కవోని దీక్షతో అభివృద్ధి చేశాడు. ఆ దరిద్రులపై ప్రకృతి వికృతంగా పగబట్టింది. అంతే! అసలు నిజానికి మనం ప్ర.ప్ర.ని అభినందించాలి.

అన్నట్లు ఇందాక ఒక ముఖ్యమైన సంగతి చెప్పడం మరచితిని.

ఏమది?

ఆ మాల్స్, మల్టిప్లెక్సులు, క్లబ్బులు, పబ్బులు మన ప్ర.ప్ర. సొంత ఆస్తి. తన నియోజక వర్గం గుడిసెల్తో, గుంటలతో దరిద్రంగా ఉండే రోజుల్లో చవగ్గా ఆ స్థలాలు కొనేశాడు. అమ్మనివారిని బెదిరించి మరీ కొన్నాడు. వీలైన చోట కబ్జా చేశాడు.

ఆక్రమణల అలగా వెధవలు 'ప్రకృతి ధర్మం'గా చచ్చుచుండగా.. భూముల విలువ పెరగుచుండగా.. ప్ర.ప్ర. తన స్థలం ఒక్కోదాన్ని ఒక్కొరకంగా డెవలప్మెంట్ కి ఇవ్వసాగెను. అందుకే అంత తొందరగా తన సింగపూర్ కలని సాకారం చేసుకోగలిగెను.

(ఇప్పుడు నిజంగానే కథ అయిపోయింది.)

(photo courtesy : Google)