Wednesday 19 June 2013

ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి



"నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా కొడుకుని మాత్రం పెళ్ళికి ఒప్పించాలి." నా ప్రాణస్నేహితుని విన్నపం. పాపం! మరీమరీ అడుగుతుంటే కాదనలేకపొయ్యాను. అంచేత ఇవ్వాళ ఆఫీసు నుండి డైరక్టుగా స్నేహితుడి కొంపకే తగలడ్డాను.

మావాడి పుత్రరత్నం laptop లోకి తీవ్రంగా చూస్తూ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వీణ్ని చిన్నప్పుడు ఎత్తుకుని తిరిగాను, అంతలోనే ఎంతవాడైపొయ్యాడు!

"ఏవాఁయ్! పెళ్లి ఎందుకొద్దంటున్నావో తెలుసుకోవచ్చా?" అంటూ పలకరించాను.

"పెళ్లి చేసుకోవటం వల్ల లాభమేంటి?" కుర్రాడు క్విజ్ మాస్టర్లాగా ప్రశ్నించాడు.

"భలేవాడివే! అన్నీ లాభాలే. ఎలాగూ laptop ముందే ఉన్నావుగా. ఓసారి యూట్యూబులో నేచెప్పిన పాట పెట్టు." హుషారుగా అన్నాను.

"ఏ పాట?"

"దేవత అనే సినిమాలో 'ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి' అని కొట్టు." అంటూ తొందరపెట్టాను.


"ఇదిగో కొడుతున్నా."

పాట మొదలైంది. కళ్ళు చిట్లించి, చెవులు రిక్కించి పాటని దీక్షగా చూశాడు. మొహంలో క్రమేపి కళ, ఆనందం!




"పాట బాగానే వుంది. కానీ ఈ పన్లన్నీ నాక్కాబోయే భార్య చేస్తుందా?" సందేహంగా అడిగాడు. 

"ఎందుకు చెయ్యదు! మా ఆవిడ ఈ రోజుకీ నాకివన్నీ చెయ్యట్లేదా? అసలావిడ ఈ పాటలో సావిత్రికిలాగ నా తలని రోజూ అదేపనిగా దువ్వడం వల్లనే నాకీ బట్టతలొచ్చింది తెలుసా?" అంటూ నా బట్టతల రహస్యం విప్పాను.

"నిజంగా!" కుర్రాడి మొహంలో మరింత వెలుగు.

"మరేంటనుకున్నావ్? రౌతు కొద్దీ గుర్రం, అంతా మన్లోనే ఉంది." రహస్యం చెబుతున్నట్లుగా అన్నాను.

"అయితే సరే, నేను పెళ్లి చేసుకుంటాను." సిగ్గుపడుతూ చెప్పాడు.

నా ప్రాణస్నేహితుడు గుమ్మడి స్టైల్లో నా రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

"నీ మేలు ఈ జన్మకి మర్చిపోలేను." డైలాక్కూడా గుమ్మడిదే!

టైమ్ చూసుకుని హడావుడిగా ఇంటికి బయల్దేరాను.

హాల్లో సోఫాకి నిండుగా కూర్చునుంది నా భార్యామణి. రిమోట్ ని పుర్రచేత్తో పట్టుకుని ఠపాఠపామంటూ చానెల్స్ మారుస్తుంది. నన్ను చూడంగాన్లే ఇంతెత్తున లేచింది.

"ఏవిటయ్యా ఇది? మనిషన్న తరవాత బుద్దీజ్ఞానం ఉండఖ్ఖర్లా? ఆఫీసు నుండి తిన్నగా ఇంటికి రాకుండా మధ్యలో నీ బోడి పెత్తనాలేంటి? ఇంట్లో పన్లన్నీ నీ బాబుగాడు చేస్తాడనుకున్నావా? ఇంత లేటుగా వస్తే అంట్లెప్పుడు తోముతావ్? వంటెప్పుడు చేస్తావ్?" అంటూ సూర్యకాంతంలా గాండ్రించింది.

"ఆఁ.. ఆఁ.. వచ్చె.. వచ్చె.. అయిపోయింది. ఎంతలో పని? చిటికెలో అవగొట్టనూ!" అంటూ వంటింట్లోకి పరిగెత్తాను.

(fb post on 6/6/2017)