Monday 18 November 2013

సచిన్ టెండూల్కర్ - ఆవకాయ


"సుబ్బూ! సచిన్ టెండూల్కర్ కి భారతరత్న రావడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది, రిటైర్ అయినందుకు బాధగానూ ఉంది. దీన్నే కవుల భాషలో ఒక కంట కన్నీరు, ఇంకో కంట పన్నీరు అంటారనుకుంటా!" అన్నాను.

"ఈ యేడాది అమ్మ ఆవకాయ పట్టదుట. నా జీవితంలో ఆవకాయ లేని రోజు వస్తుందనుకోలేదు. నాకు మాత్రం రెండు కళ్ళల్లోనూ కన్నీళ్ళొస్తున్నాయి." కాఫీ సిప్ చేస్తూ భారంగా అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! నీతో ఇదే గోల. నేనిక్కడ ద గ్రేట్ టెండూల్కర్ గూర్చి చెబుతుంటే నువ్వు ఆవకాయ అంటూ ఏదో చెత్త మాట్లాడుతున్నావు." విసుక్కున్నాను.

"ఆవకాయ అనేది చెత్తా! నువ్వా ఆవకాయనే కుంభాలకి కుంభాలు లాగించావ్. ఇవ్వాళ ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నావ్. ఆవకాయ ద్రోహి. నీ కోసం నరకంలో సలసల కాగుతూ నూనె రెడీగా ఉందిలే." కసిగా అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! సుత్తి కొడుతున్నావ్."

"లేదు లేదు. నువ్వు ఆవకాయని అర్ధం చేసుకుంటేనే సచిన్ని కూడా ఈజీగా అర్ధం చేసుకుంటావు." అన్నాడు సుబ్బు.

"అదెలా?" కుతూహలంగా అడిగాను.

"ఆవకాయ. ఈ సబ్జక్టు మీద ఎంతైనా రాయొచ్చు. ఆవకాయని ఇష్టపడనివాడు డైరక్టుగా దున్నపోతుల లిస్టులోకి పోతాడని వేదాల్లో రాయబడి ఉంది. వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుని లాగిస్తే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంటుంది. నీకు ఐశ్వర్యారాయ్ కావాలా? ఆవకాయ జాడీ కావాలా? అని నన్నడిగితే నూటికి నూరుసార్లూ ఆవకాయ జాడీనే కావాలంటాను." అంటూ తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నాడు సుబ్బు.

"హలో సుబ్బూ! కొద్దిగా ఆ ఆవకాయ జాడీలోంచి బయట పడి విషయంలోకి రా నాయనా!" అన్నాను.

"సారీ! ఆవకాయ ప్రస్తావనొస్తే ఒళ్ళు తెలీదు నాకు. ఒక్కసారి అమ్మ పట్టే ఆవకాయ గుర్తు తెచ్చుకో. ఆవకాయ పట్టిన మొదట్లో పచ్చడి ఆవఘాటుతో అద్భుతంగా ఉంటుంది. ఆ తరవాత గుజ్జుకి మామిడి ముక్కల పులుపు పట్టి రుచి మారుతుంది. ఆ సమయంలో ఆవఘాటు, పులుపు, కారం త్రివేణి సంగమంలా కలిసిపోయుంటాయి. ఆవకాయ తినడానికి బెస్ట్ టైం ఇదే."

"అవును. ఒకసారి ఆవకాయ దెబ్బకి నీ పొట్ట సోరకాయలా ఉబ్బింది. డాక్టర్ వాడపల్లి వెంకటేశ్వర రావు గారు నీ కడుపు కక్కుర్తికి బాగా తిట్టి మందిచ్చారు. గుర్తుంది కదూ?" నవ్వుతూ అన్నాను.

"ఆవకాయని ఆవురావురుమంటూ లాగించడం మన పని, కడుపునోప్పికి మందివ్వడం డాక్టర్ల పని. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. సరే, ఆవకాయలోకి వద్దాం. కొన్నాళ్ళ తర్వాత ఆవకాయలో ఘాటు తగ్గుతుంది, పులుపు తగ్గుతుంది, ముక్కలు మెత్తబడతాయి. పచ్చడి కొద్దిగా ఉప్పగా కూడా మారుతుంది. ఇట్లాంటి పచ్చడి ఇంట్లో ఉన్నా లేనట్లే. అదొక వెలిసిపోయిన బొమ్మ. చూడ్డానికి ఆయుర్వేద లేహ్యము వలే ఉంటుంది. ఈ వయసు మళ్ళిన ఆవకాయ నాకస్సలు ఇష్టం ఉండదు." మొహం వికారంగా పెట్టాడు సుబ్బు.

"అందుకే ఆ సమయానికి మాగాయ రెడీగా ఉంటుంది. ఇంతకీ నీ ఆవకాయ భాష మర్మమేమి?"

"ఇప్పుడు టెండూల్కర్ని ఆవకాయతో పోలుద్దాం. కుర్రాడు కెరీర్ మొదట్లో అద్భుతమైన ఆటతో అద్దరగొట్టాడు. నాకతని ఆటలో ఘాటైన ఆవ ఘుమఘుమలు కనిపించాయి. ఆ తరవాత స్పీడు తగ్గినా స్టడీగా చక్కగా ఆడాడు. ఆటలో కొంచెం ఘాటు తగ్గి పులుపెక్కాడు. ఆ రోజుల్లో సచిన్ ఆట ఒక అద్భుతం." అంటూ ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"నే చెప్పేది అదే కదా?" 

"పూర్తిగా విను. ఆవకాయ కొన్నాళ్ళకి రుచి తగ్గినట్లే.. సచిన్ ఆటలో కూడా పవర్ తగ్గిపోయింది.. వెలిసిపోయింది. చాలా యేళ్ళ క్రితమే సచిన్ ఆట ఆయుర్వేద లేహ్యంలా అయిపొయిందని నా అభిప్రాయం." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! ఈమాట బయటెక్కడా అనకు. జనాలు నిన్ను సిక్సర్ కొడతారు."

"ఎందుకంటాను? నాకా మాత్రం జ్ఞానం లేదనుకున్నావా? మనవాళ్ళు సచిన్ని దేవుడి స్థానంలో కూర్చుండబెట్టారు. మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ. అక్షరాస్యులు ఉన్నా వారు కూడా దురభిమానంలో నిరక్షరాస్యుల్తో పోటీ పడుతుంటారు. ఈ దేశంలో నచ్చినవారికి వెర్రి అభిమానంతో గుడి కూడా కట్టిస్తారు. అందువల్ల ఇప్పుడు మిగిలింది సచిన్ కి గుడి కట్టి, కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడమే." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అవుననుకో. అట్లా చేస్తేగాని మనవాళ్ళకి తృప్తిగా ఉండదు. కానీ సచిన్ గొప్ప క్రికెటర్"

"కాదన్నదెవరు? కాకపొతే మన దేశంలో క్రికెట్ అనే ఆట ఒక వ్యాపారంగా మారి.. క్రమేణా ఒక కార్పోరేట్ స్థాయికి ఎదిగింది. అందువల్లనే సచిన్ అనేక బ్రాండ్లకి ఎండార్స్ చేసి గొప్ప సంపాదనపరుడిగా మారాడు. ఇక్కడ క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే అయినట్లైతే సచిన్ తన సమకాలికులతో ఎప్పుడో రిటైర్ అయ్యేవాడు. ఇందుకు కొన్ని రాజకీయ కారణాలు కూడా ఉన్నాయనుకో." అన్నాడు సుబ్బు.

"రాజకీయాలా!" ఆశ్చర్యపోయాను.

"అవును. భారత క్రికెట్ బోర్డ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది, అత్యంత అవినీతిపరమైనది కూడా. అందుకే రాజకీయ నాయకులు బోర్డులో భాగస్వామ్యులవడానికి తహతహలాడతారు. వారికి సచిన్ లాంటి ఐకానిక్ ఫిగర్ ఉండటం కుషనింగ్ లాగా ఉపయోగపడుతుంది." అన్నాడు సుబ్బు.

"అవును. BCCI ఒక దొంగల ముఠా."

"ఇక దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. అందుకే సచిన్ పాపులారిటీ క్యాష్ చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ సచిన్ కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది. 'భారతరత్న'ని కూడా హడావుడిగా ఇచ్చేసింది. ఎంతైనా ఎన్నికల సమయం కదా! సచిన్ యువరాజావారికి స్నేహితుడు అన్న సంగతి కూడా మర్చిపోరాదు." అన్నాడు సుబ్బు.

"ఛ.. మరీ అన్యాయంగా మాట్లాడుతున్నావు."

"నీకలా అనిపిస్తుందా? సర్లే - ఇప్పుడు మరొక ఆసక్తికరమైన అంశమేమనగా.. ఇప్పటివరకూ ఎన్నడూ వ్యాపార ప్రకటనల్లో విచ్చలవిడిగా సంపాదిస్తున్న సెలెబ్రిటీకి భారతరత్న ఇవ్వబడలేదు. ఇప్పుడీ భారతరత్న పిల్లల్ని పెప్సీ త్రాగమని చెప్పవచ్చునా? క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత లాంటి డబ్బు సంపాదించుకునే ఉద్యోగాలు చేసుకోవచ్చునా? వీటికి సమాధానం వెండితెరపై చూడాలి." అన్నాడు సుబ్బు.

"అదంతా ఇప్పుడు అప్రస్తుతం. అయినా సుబ్బూ! దేశమంతా టెండూల్కర్ని పొగడ్తలతో ముంచెత్తుతుంది. నువ్వు మాత్రం చాలా నెగెటివ్ గా మాట్లాడుతున్నావ్." విసుగ్గా అన్నాను.

"అలాగా? అయాం సారీ. అసలీ గోలకి కారణం నువ్వే. తెలుగువాడికి తల్లి లాంటి ఆవకాయని తక్కువ చేశావ్. నా దృష్టిలో ఆవకాయని కాదన్నవాడు దేశద్రోహి. అంచేత మిత్రమా! నేరం నాది కాదు, ఆవకాయది." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

(photo courtesy : Google)