Wednesday, 27 November 2013

వేతనశర్మలు ఉద్యమకారులేనా?


(నేనింతకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ఉద్యమం గూర్చి 'వేతనశర్మ' ఉద్యమం  అని ఒక పోస్ట్ రాశాను. ఇప్పుడు ఆ పోస్టుకి కొనసాగింపుగా రాస్తున్నాను.)

ప్రభుత్వోద్యోగులు 'సమైక్యాంధ్ర' అంటూ ఒక ఉద్యమాన్ని నడిపారు. నాకు పరిచయం ఉన్న చాలామంది ఆ ఉద్యమ నాయకుణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనీ మధ్య మళ్ళీ సమైక్య ఉద్యమం మొదలెడుతున్నానని గాండ్రించాడు. ప్రజలు ఆ ఉద్యోగ నాయకుడిలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగుల్ని గాంచారు, పరవశించారు. నేను మాత్రం ఆ నాయకుళ్ళో ఓ పులిని వీక్షించాను. అందుకే నాకాయన గాండ్రించినట్లనిపించింది.

హిట్లర్ కన్నా దుర్మార్గుడు, ఘంటసాల కన్నా గొప్పగాయకుడు, రావిశాస్త్రి కన్నా గొప్ప రచయిత ఈ ప్రపంచంలో లేడని నా ప్రగాఢ నమ్మకం. అనేక ప్రాపంచిక విషయాల్ని రావిశాస్త్రి కథల దృక్పధం నుండే నేను అర్ధం చేసుకుంటుంటాను. ఇందుకు నేను బోల్డెంత సంతోషంగానూ, గర్వంగానూ ఫీలవుతుంటాను కూడా.

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాల మీద రావిశాస్త్రి రచించిన 'వేతనశర్మ కథ' చదవడం వల్ల నాకు ఉద్యోగుల పట్లా, వారి ఉద్యమాల పట్ల గొప్ప అవగాహన కలిగింది. అందుకే నాకెంతో ఇష్టమైన ఆ కథకి పరిచయం కూడా రాసుకున్నాను. రావిశాస్త్రి పుణ్యమాని.. నాకు ప్రభుత్వ ఉద్యోగుల్ని చూస్తే పులులు గుర్తొస్తాయి. కొందరికి పులంటే భయం. ఇంకొందరికి పులిలో రాజసం, ఠీవి కనిపిస్తాయి. నాకు మాత్రం పులి ప్రమాదకరంగా కనిపిస్తుంది.

నాకు తెలిసిన చాలామందికి గవర్నమెంటు ఆఫీసుల్లో చేదు అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఉద్యోగులు సామాన్య మానవుణ్ని అమెరికావాడు ఇథియోపియా కరువు బాధితుణ్ణి చూసినట్లు అసహ్యించుకుంటారు. తప్పదు! వారి పని ఒత్తిడి అంత గొప్పగా ఉంటుంది! జీవితం మీద విరక్తి కలగాలంటే ఏదైనా పని మీద గవర్నమెంటు ఆఫీసుకి వెళ్తే చాలని అనేకమంది అభిప్రాయం. సామాన్య మానవులెవరైనా ఏ గవర్నమెంట్ డిపార్టమెంట్లోనైనా సరే.. సకాలంలో పని పూర్తి చేసుకుని, గౌరవప్రదంగా బయటపడ్డారంటే వారికి సన్మానం చెయ్యాల్సిందే.

ప్రభుత్వాలు ఉద్యోగస్తుల ద్వారా టాక్సులు వసూలు చేస్తాయి. ఆ మూలధనంతో ప్రజల అవసరాల కోసం ఎలా ఖర్చు చెయ్యాలో ప్లాన్లు వేస్తాయి. దీన్నే బడ్జెట్ అంటారు. అయితే మన బడ్జెట్లో సింహభాగం ఉద్యోగస్తుల జీతాలకే పోతుంది. మిగిలిన కొంత సొమ్ముని ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం కోసం మరియు పేదప్రజల సంక్షేమ పథకాల నిమిత్తం ఖర్చు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులదే ప్రధాన పాత్ర. అయితే వారు వారి పాత్రని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా?

ఉద్యోగస్తులు సంఘటితంగా పోరాడి తమ డిమాండ్లు సాధించుకుంటున్నారు. మంచిది. అది వారి హక్కు. కాదనడానికి మనమెవరం? అయితే వీళ్ళని మనం కొన్ని ప్రశ్నలు వెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళకి జీతాలు వచ్చేది మనం కట్టే పన్నుల్లోంచి కావున. మరి వీళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా విధుల్ని నిర్వర్తిస్తున్నారా? 

ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాల్లో పదిరూపాయిలు తేడా వస్తే మెరుపు సమ్మె చేస్తారు. ఒకరోజు సీనియార్టీ తేడా తేల్చుకుందుకు సుప్రీం కోర్టు తలుపు కూడా తడతారు. 'మా జోలికి వచ్చారా? ఖబడ్దార్. మేం ఎన్టీఆర్ ని మట్టి కరిపించాం. చంద్రబాబుకి బుద్ధి చెప్పాం. ఆలోచించుకొండి.' అంటూ ప్రభుత్వాలకి మాఫియా టైపు వార్నింగులిస్తారు.

ప్రభుత్వ డాక్టర్లు కూడా 'సమైక్యాంధ్ర' అంటూ రోజుకో స్కిట్ తో వెరైటీ ప్రదర్శనలు నిర్వహించారు. మంచి వినోదాన్ని పంచారు. ప్రభుత్వ డాక్టర్లూ! మీకున్న సామాజిక స్పృహకి వందనాలు. కానీ మీరు రోజుకి ఎన్ని గంటలు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు నెలకి ఎన్ని రోజులు వారి ఆస్పత్రికి వెళ్తున్నారు? మీ అందరికి ప్రైవేట్ నర్సింగ్ హోములు ఎందుకున్నాయి? లక్షల కొద్దీ జీతాలు తీసుకుంటూ పేదప్రజలకి సరైన వైద్యం అందించడంలో మీ పాత్ర సక్రమంగా నిర్వహిస్తున్నారా? 

అసలు ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఒక పేద దేశానికి అవసరమా? ఒకే కాయితం వివిధ సంతకాల కోసం అనేక సెక్షన్ల మధ్యన గిరిగీలు కొట్టించే ఈ ఉద్యోగుల వ్యవస్థ మన దేశ ఆర్ధిక ప్రగతికి అడ్డంకి కాదా? వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఉద్యోగం కలిపించి.. వారిని చచ్చేదాకా టాక్స్ పేయర్స్ మనీతో పోషించే ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ దేశానికి ఏ విధంగా మేలు చేస్తుంది?

ఈనాడు మన యువత అనేక రంగాల్లో దూసుకెళ్తుంది. మనకి ప్రతిభావంతుల కొదవ లేదు. కానీ వారి సేవల్ని ప్రభుత్వ స్థాయిలో వినియోగించుకోలేని దుస్థితిలో మనం ఉండటం దురదృష్టం. సరైన వ్యవస్థని సృష్టించుకుని, మన యువతని సరీగ్గా వాడుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చునని నా అభిప్రాయం. అటువంటి పరిస్థితి రావాలని, వస్తుందని ఆశిద్దాం.