Monday, 25 November 2013

పుట్టిన్రోజు పండగే! అందరికీనా?


"ఎల్లుండి మా అమ్మాయి పుట్టిన్రోజు ఫంక్షన్. ఫంక్షను హాలు ఫలానా. ఆ ఫంక్షన్ హాలు వాళ్లకి సొంతంగా డెకరేషన్ చేసేవాళ్ళు ఉన్నార్ట. వాళ్ళ చూపించిన పుష్పాలంకరణ డిజైన్లు మాకు నచ్చలేదు. మా బామ్మర్ది కూతురి ఓణీల ఫంక్షనప్పటి డెకరేషన్ మాక్కావాలి. మా డిజైన్ని హాలు వాళ్ళు ఒప్పుకోవటం లేదు. మీరు కొద్దిగా మాట సాయం చెయ్యాలి."

ఇంతటి తీవ్రమైన కష్టంలో ఉన్న అతగాడు నా స్నేహితుడికి స్నేహితుడు. ఏదో పురుగు మందుల వ్యాపారం చేస్తాట్ట. నల్లగా, భారీగా ఉన్నాడు. అయితే ఆయనకి నేన్చేయగలిగిన సహాయం ఏంటో నాకర్ధం కాలేదు. నాకైతే మాత్రం పుష్పాలంకరణలో ప్రావీణ్యం లేదు. నా స్నేహితుడి వైపు క్వశ్చన్ మార్కు మొహంతో చూశాను.

"ఆ ఫంక్షన్ హాలు ఓనర్ కూతుర్ని నువ్వు ట్రీట్ చేస్తున్నావు. ఆయనకి ఫోన్లో ఓ మాట చెప్పు. చాలు." అన్నాడు నా స్నేహితుడు.

ఇంతలో ఓ ధర్మసందేహం.

"అవునూ.. అలంకరణ ఎట్లా ఉంటే ఏంటి? అదంత ముఖ్యమైనదా?" పురుగు మందులాయాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాను.

ఆయన నాకేసి క్షణకాలం క్రూరంగా చూశాడు.

"స్పెషల్ డెకరేషన్ ఫోటోలు బెజవాడ వెళ్లి మరీ తీయించుకొచ్చాను. ఇప్పుడీ డెకరేషన్ కుదర్దేమోనని ఇంట్లో ఆడాళ్ళందరూ అన్నం మానేసి శోకాలు పెడుతూ ఏడుస్తున్నారు.. అసలే నా భార్య హార్ట్ పేషంటు. ఖర్చు ఎగస్ట్రా ఎంతైనా పరవాలేదు. పుష్పాలంకరణలో మాత్రం తేడా రాకూడదు." స్థిరంగా అన్నాడాయన.

ఇప్పుడు మరో ధర్మసందేహం.

"మరి నే జెబితే ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ వింటాడా?" నా స్నేహితుణ్ని అడిగాను.

"అన్నీ కనుక్కునే వచ్చాం. నువ్వొక మాట చెప్పు చాలు." అన్నాడు నా మిత్రుడు.

ఎంత ప్రయత్నించిన నా మొహంలోని చిరాకుని దాచుకోలేకపొయ్యాను. ఏమిటీ గోల? ఒక పుట్టిన్రోజు ఫంక్షను.. దానికో అలంకరణ.. మళ్ళీ ఓ స్పెషల్ డెకరేషన్ట! ఈ దిక్కుమాలిన దేశంలో ఒక్కోడిది ఒక్కో గోల. అయినా ఈ రోజుల్లో డాక్టర్ల మాట వినేవాడెవడు? వింటే గింటే పోలీసోళ్ల మాటో, టాక్సు డిపార్టుమెంటు వాళ్ళ మాటో వింటారు గాని! అయినా నాదేం పోయింది? ఒక మాట చెబుతాను.. అతగాడెవరో వింటే వింటాడు, లేపోతే లేదు.

ఫోన్నంబరు వాళ్ళ దగ్గరే తీసుకుని.. ఆ ఫంక్షన్ హాల్ పెద్దమనిషికి ఫోన్ చేసి నా ఎదురుగా కూర్చున్న పురుగు మందుల పుష్పవిలాపాన్ని వివరించాను. అవతల ఆయన అత్యంత మర్యాదగా 'ఓహో అలాగే' అన్నాడు. ఆశ్చర్యపొయ్యాను. పోన్లే! నా పరువు నిలిపాడు. ఊళ్ళో నాకింత పరపతి ఉందని నాకిప్పటిదాకా తెలీదు! నాకు థాంక్సులు చెబుతూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తుండిపొయ్యాను. ఇదంతా చేసింది నేనేనా! ఒకానొకప్పుడు నాకు నచ్చని విషయాల్ని  పురుగులా చూసేవాణ్ని. ఇప్పుడు నాకింత సహనం ఎక్కణ్ణుంచి వచ్చిందబ్బా! ఔరా! ఏమి ఈ వయసు మహిమ! మనుషుల్ని ఎంతగా నిర్వీర్యం చేసేస్తుంది!

అలా ఎందుకనుకోవాలి? ఇంకోలా అనుకుంటాను. నేనిప్పుడు పెద్దమనిషి నయినాను. అందుకే ఎదుటివారి దురదల్ని ఎంతో విశాల హృదయంతో అర్ధం చేసుకునే స్థాయికి ఎదిగాను. శభాష్ ఢింబకా! ఇలాగే అనుకుంటూ కంటిన్యూ అయిపో! నీకు తిరుగు లేదు.

మళ్ళీ ఆలోచనలో పడ్డాను. ఇక్కడే ఏదో తేడాగా ఉంది. కానీ అదేంటో సరీగ్గా అర్ధం కాకున్నది. ఆ పురుగు మందులాయనా, నేనూ ఒకే ఊరి వాళ్ళం, దాదాపు ఒకే వయసు వాళ్ళం. ఆయనకేమో ఇదో జీవన్మరణ సమస్య! నాకేమో ఒక భరింపరాని రోత. ఇద్దరి మనుషుల మధ్య మరీ ఇంత తేడానా! 'ఓ ప్రభువా! పాపపంకిలమైన ఈ లోకంలో నీ శిశువుల్ని మరీ ఇంత దారుణమైన తేడాతో పుట్టించితి వేల?'

నేనెప్పుడూ పుట్టిన్రోజు జరుపుకోలేదు. అందుక్కారణం నా సింప్లిసిటీ కాదు. అదేంటో తెలీక! నా చిన్నతనంలో పుట్టిన్రోజు అంటే కుంకుడు కాయలు కొట్టుకుని తలంటు పోసుకోవటం (షాంపూ అనేదొకటుందని పెద్దయ్యేదాకా నాకు తెలీదు), (ఉంటే గింటే) కొత్త బట్టలు తోడుక్కోవడం, దేవుడికి కొబ్బరికాయ కొట్టి (కొబ్బరికాయ ఇంట్లోనే కొట్టవలెను. గుళ్ళో కొట్టిన యెడల ఒక చిప్ప తగ్గును. తదుపరి ఇంట్లో కొబ్బరి పచ్చడి పరిమాణము కూడా తగ్గును), అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసేవాణ్ణి. అందుకు ప్రతిఫలంగా అమ్మ ఇచ్చిన పదిపైసల్తో సాయిబు కొట్లో నిమ్మతొనలు కొనుక్కుని చప్పరించేవాణ్ని. అదే నా పుట్టిన్రోజు పండగ!

అటుతరవాత హైస్కూల్ రోజులకి నా పుట్టిన్రోజు కానుక రూపాయి బిళ్ళగా ఎదిగింది. ఆ డబ్బుతో లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్లో సినిమా చూసేంతగా నా స్థాయి పెరిగింది. పుట్టిన్రోజు పండగలంటూ స్నేహితుల్ని ఇంటికి పిలవడం, కొవ్వొత్తులు ఆర్పి కేకు కత్తిరించడం సినిమాల్లో మాత్రమే చూశాను. నిజజీవితంలో ఎవరూ అలా జరుపుకోగా నేను చూళ్ళేదు. అంచేత పుట్టిన్రోజు నాకంత పట్టింపు లేకుండా పోయింది.

మెడిసిన్ చదివే రోజుల్లో జేబులో డబ్బులుండేవి. అయితే ఒంట్లో ఉడుకు రక్తం వేగంగా ప్రవహిస్తుండేది. భావాలు, అభిప్రాయాలు అల్లూరి సీతారామరాజు స్థాయిలో ఉండేవి. నాకు నచ్చని ఏ విషయాన్నైనా 'ఆత్మవంచన రూదర్ ఫర్డ్' టైపులో సూపర్ స్టార్ కృష్ణలా తీవ్రంగా వాదించేవాణ్ని. ఈ పుట్టిన్రోజు వేడుకలు, ఆర్భాటాల పట్ల ఏవగింపుగా ఉండేది. ఇవన్నీ డబ్బున్న వాళ్ళు తమ సంపదని సెలెబ్రేట్ చేసుకునే అసహ్యకర నిస్సిగ్గు ప్రదర్శనగా వాదించేవాణ్ని.

పిమ్మట సలసల మరిగే నా రక్తం హ్యూమన్ బాడీ టెంపరేచర్ స్థాయికి పడిపోయింది. క్రమేణా నాలో ఎవడి దురద వాడిదే అనే నిర్వేద తత్త్వం వచ్చేసింది. ఇవ్వాల్టి సంఘటనతో నా రక్తం టెంపరేచర్ ఫ్రిజ్ లో ఐస్ వాటర్ స్థాయికి దిగిపోయిందన్న సంగతి అవగతమైంది.

పెళ్ళైన కొత్తలో నా భార్య ఒక అర్ధరాత్రి సరీగ్గా పన్నెండు గంటల ఒక్క సెకండుకి నాకు పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెబితే మొహం చిట్లించాను, ఆవిడ బిత్తరపోయింది. తర్వాత్తర్వాత నా మనసెరింగిన అర్ధాంగియై నాకు విషెస్ చెప్పడం మానేసింది. ఇప్పుడు పిల్లలు వాళ్ళ స్నేహితుల్తో పుట్టిన్రోజు పార్టీలు చేసుకుంటున్నారు. ఆ తతంగానికి నాది ప్రొడ్యూసర్ పాత్ర మాత్రమే కావున ఏనాడూ ఇబ్బంది పళ్ళేదు.

తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు? అనడిగాడు మహాకవి శ్రీశ్రీ ('దేశచరిత్రలు' చదివాక నాలోని అనేక బూజు భ్రమలు తొలగిపోయ్యాయి). పుట్టిన్రోజు కేకులమ్మే బేకరీ కుర్రాళ్ళెవరైనా, ఏనాడైనా ఆ కేకుని కోసుకుని తమ పుట్టిన్రోజు జరుపుకున్నారా? ఐదు నక్షత్రాల ఆస్పత్రిలోని వార్డు బాయ్ తనకి కొడుక్కి జొరమొస్తే ఎక్కడ వైద్యం చేయిస్తాడు?

ఇప్పుడింకో సందేహం. నా నేపధ్యం దిగువ మధ్యతరగతి కుటుంబం. పుట్టిన్రోజులు జరుపుకోలేని స్థాయి. నా చిన్నతనంలో కూడా కొవ్వొత్తులు, కేకుల పుట్టిన్రోజులు జరపబడే ఉంటాయి. కాపోతే నాకు ఆ స్థాయివాళ్ళతో పరిచయం లేదు. హిమాలయాల్ని చూడని వాడికి బెజవాడ కనకదుర్గమ్మ కొండే కడు రమణీయం. అదే లోకమనుకుంటాడు. బహుశా నాదీ ఆ కేసేనేమో!

ఓయీ వెర్రి వైద్యాధమా! నిండుగా దుడ్డు గలవాడు ఏదైనా సెలెబ్రేట్ చేసుకుంటాడు. సరదా పుడితే తను ఉంచుకున్నదానికీ, పెంచుకుంటున్న బొచ్చుకుక్కక్కూడా పుట్టిన్రోజు ఫంక్షన్ చేస్తాడు. మధ్యలో నీ ఏడుపేంటి? ఓపికుంటే వెళ్లి 'హ్యాపీ బర్తడే' చెప్పేసి, ఫ్రీగా భోంచేసి రా! అంతేగానీ - అల్పమైన విషయాలక్కూడా రీజనింగులు, లాజిక్కులు వెతక్కు.. మరీ నీకెంత 'పని లేక' పొతే మాత్రం!

(అయ్యా! ఎవరన్నా తమరు? తెలుగు సినిమా పోలీసులా ఈ పోస్టు క్లైమేక్సులో వచ్చి ఫెడీల్మని మొహం మీద కొట్టినట్లు భలే తీర్పు చెప్పారే! ఈ నాలుగు ముక్కలు ఇంకొంచెం ముందొచ్చి చెప్పినట్లైతే నాకీ పోస్టు రాసే బాధ తప్పేదికదా!)

(picture courtesy : Google)