Wednesday 13 November 2013

బిచ్చగాళ్ళ బ్రతుకు


మొన్నామధ్య 'సమైక్యాంధ్ర' అంటూ ఒక భీభత్సమైన ఉద్యమం జరిగింది. అందులో బిచ్చగాళ్ళ సంఘం కూడా పాల్గొనడం నాకు ఆనందం కలిగించింది. లాభనష్టాల్ని అణా పైసల్తో సహా లెక్కలేసుకుని ఉద్యమాలు చేస్తున్న వేతనశర్మలున్న ఈ ఉద్యమాల కాలంలో.. సమాజంలో అట్టడుగున ఉన్నకటిక పేదవారు ఒక రాజకీయ కారణం కోసం ఉద్యమించడం.. నిజంగా నిస్వార్ధమే. ఈ రాజకీయ చైతన్యం నాకొక అద్భుతంగా తోస్తుంది.

ఇంతలో అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక అశరీరవాణి గద్దింపు.

'ఓయీ తుచ్ఛ బ్లాగవా (అనగా బ్లాగు రాసే మానవుడు అని యర్ధము)! సిగ్గుతో తల దించుకోవలసిన సందర్భంలో సంతోషిస్తున్నావా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్ళైన తరవాత కూడా ఇంతమంది బిచ్చగాళ్ళు ఉండటమేమిటి? మళ్ళీ వారికొక సంఘం.. పైగా దానికొక ఉద్యమ కార్యాచరణ! నిఖార్సైన దేశభక్తుడిగా నువ్వు బిచ్చాగాళ్ళ రహిత సమాజాన్ని కోరుకోవాలి. అంతేగానీ ఆ పేదరికాన్నే శ్లాఘిస్తావా?'

నిజమే. పొరబాటే. బిచ్చగాడు అనంగాన్లే.. చిన్నప్పుడు నాకు తెలిసిన 'అమ్మా! మాదాకబళం తల్లీ' అంటూ వీధులెంట తిరిగే అడుక్కునే వాళ్ళు గుర్తొస్తారు. మనం తినంగా మిగిలిన అన్నం, కూరలు వారి జోలెలో వేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటి సాంప్రదాయక బిక్షాటన కనుమరుగైంది. ఇందుకు ప్రధాన కారణం రిఫ్రెజిరేటర్. ఈ విధంగా కంప్యూటర్లొచ్చి టైపు మిషన్లని దెబ్బ తీసినట్లు ఫ్రిజ్జులొచ్చి మాదాకబళాన్ని దెబ్బ కొట్టాయి. ఇది మిక్కిలి శోచనీయం. కొత్త మార్పుని అంగీకరించని బూజు పట్టిన నా వృద్ధ మనస్సు బాధతో మూలిగింది.

సరే! 'బిచ్చగాళ్ళ రహిత సమాజం' లాంటి పెద్దపెద్ద మాటలు జగన్ బాబు, చంద్రబాబుల వంటి గొప్పనాయకులకి వదిలేద్దాం. లేకపోతే వాళ్ళు ఫీలవుతారు. అసలు సమాజానికి అవసరమైన వృత్తులేమి? సరుకుల లిస్టులాగా ఒక పద్దు రాద్దాం. ఏ సమాజానికైనా వైద్యులు (నాకు స్వార్ధ చింతన మెండు), ఉపాధ్యాయులు వంటి వృత్తులు అవసరం. బంకులు (పెట్రోలు), బ్యాంకులు కూడా అవసరమే. ఇట్లా ఎవరి వృత్తులు వారు రాసేసుకుంటూ ఒక లిస్టు రాసుకుంటూ పొతే.. అందులో చివరగానైనా బిక్షాటన పేరు ఉంటుందా? ఉండదా?

బిచ్చగాళ్ళకి సమాజం అవసరం ఉందా? లేక సమాజానికి బిచ్చగాళ్ళ అవసరం ఉందా? అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఏ వృత్తులైనా ఆయా సమాజ అవసరాలకి తగ్గట్లుగానే ఏర్పడతాయి. చదువుకునే రోజుల్లో ఓవర్ బ్రిడ్జి పక్కన నేను ఎంతో ఇష్టంగా తిన్న ముంతకింద పప్పు అమ్మే ఆసామి డొంక రోడ్లో మూడిళ్లు కట్టించాడని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. అతన్ని అమెరికా పంపిస్తే రెక్కాడితేనే గాని డొక్కాడని ఓ చిన్న ఉద్యోగం చేసుకునే వాడేమో! అలాగే అమెరికా దేశంలో 'పాయిఖానా కాగితం' వ్యాపారం చేసేవాడు మనూళ్ళో నోటు బుక్కుల వ్యాపారం మాత్రమే చెయ్యగలడు. అనగా ఒక సమాజం అవసరాల నుండే వ్యాపారాలు, వృత్తులు పుట్టుకొస్తాయి. కస్టమర్లు లేకుండా వ్యభిచార వృత్తితో సహా ఏ వృత్తీ మనజాలదు. అదే విధంగా బిచ్చం వేసేవాడే లేకపోతే బిచ్చగాళ్ళు ఎలా ఉంటారు?

అసలు 'బిచ్చగాడు' అనగా ఎవరు? ఎదుటివాడిని అర్ధించి వాడి ఆస్తిలో కొంత భాగాన్ని (అది చిల్లరైనా ఆస్తి ఆస్తే) ఆయాచితంగా పొందడాన్ని 'బిచ్చం' అందురు. అంటే అడిగేవాడి దుస్థితికి కరిగిపోయి జాలితో తనదగ్గరున్నదాన్లో తృణమో, పణమో 'దానం' చెయ్యాలి. దానం ఒక పుణ్యకార్యం. నాకు తెలిసిన చాలామందిలో బిచ్చం వెయ్యడంలో దయాగుణం కన్నా దానగుణమే ఎక్కువ. ఇక్కడ దానం ఫ్రీగా చెయ్యబడదు.. అంతకి నాలుగింతలు పుణ్యం సంపాదించడం కోసమే చెయ్యబడుతుంది. అనగా ఇది ఓ రకంగా వస్తుమార్పిడి, ఇంకోరకంగా వ్యాపారం!

దానం ఒక గొప్ప గుణం, ఎంతో కీర్తి ప్రదాయకం కూడా. అందుకే దానం చేసి శిబి చక్రవర్తి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. కర్ణుడికైతే దానగుణం వ్యసన స్థాయికి చేరింది. అంచేత మిత్రమా! నువ్వు విదిల్చే రూపాయికి బిచ్చగాడు ఎంత లబ్ది పొందుతాడో తెలీదు కానీ.. నీకు మాత్రం స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. అక్కడ రంభా ఊర్వశి మేనకల సాంగత్యం లభిస్తుంది. దానం చెయ్యడమన్నది స్వర్గంలో ఒక సీటు మీద కర్చీఫ్ వేసి రిజర్వు చేసుకోవటం వంటిదని నీవు గ్రహింపుము.

బిచ్చగాళ్ళ వలన సమాజానికి ఇంకా ఎన్నో మేళ్ళు జరుగును. అభిమాన సంఘాల వారు తమ అభిమాన నటుడి పుట్టిన్రోజప్పుడూ, వాడి పెళ్ళాం నీళ్ళోసుకున్నప్పుడూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించెదరు. ఆ సమయమందు బిచ్చగాళ్ళ అవసరం ఎంతైనా ఉంది. మరప్పుడు బిచ్చగాళ్ళు లేని సమాజంలో మన నటుడిపై అభిమానం ఎట్లా చూపించుకోగలం? అస్సలు చూపించుకోలేం. అందువల్ల బిక్షగాళ్ళ వల్ల సమాజానికి లాభమే చేకూరుతుందని చెప్పుకోవచ్చు.

బిచ్చగాళ్ళ వల్ల మనకి మానసిక ప్రశాంతత కూడా లభించును. వాళ్ళే లేకపోతే మన్నెవరూ ఏమీ అర్ధించరు. మనం ఎవరికీ ఏమీ ఇవ్వలేం. అప్పుడు ఈ సమాజంలో మనం దరిద్రులమో, ధనవంతులమో మనక్కూడా తెలీదు. విసుగ్గా కూడా ఉంటుంది. అడవిలో జింకలు, కుందేళ్ళని పులులు, సింహాలు ఆకలేసినప్పుడు హాయిగా భోంచేస్తాయి. ఆకలిగా లేని సమయాల్లో కూడా.. తమని చూసి ప్రాణభయంతో భీతిల్లుతున్న అర్భక ప్రాణుల్ని చూస్తుంటే వాటికి ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అదే అడవిలో అన్నీ పులులు, సింహాలే అయితే వాటికీ విసుగ్గా ఉంటుంది.

బిచ్చం అంటే ఇంకోరకంగా కూడా చెప్పొచ్చు. తనదగ్గర లేనిదాన్ని, ఎదుటివాడి దగ్గర మాత్రమే ఉన్నదాన్ని అర్ధించడం కూడా బిచ్చం అనొచ్చు. ఐదేళ్ళకోసారి వచ్చే ఎలక్షన్లలో ఓటెయ్యమని రాజకీయ నాయకులు బిచ్చం అడగట్లేదా? నువ్వేదో దయగల మారాజులాగా బ్యాలెటు బాక్సులో ఓటు దానం చెయ్యట్లేదా? అటు తరవాత ఐదేళ్ళపాటు వాడే నీకు బిచ్చం విదల్చట్లేదా?

అసలు దేశాలే బిక్షాటన చేస్తున్నాయి గదా! తమ దేశంలోని పేదరికాన్ని షో కేస్ చేసి ప్రపంచ బ్యాంకు దగ్గర బిక్షాటన చెయ్యట్లేదూ? ఆ నిధులన్నీ ఏలినవారి కంపెనీల్లో పెట్టుబడిగా మారి వారి జేబుల్ని భారంగా మార్చట్లేదూ? మన బిక్షగాడు మాత్రం నిరంతరంగా బిక్షాటనకి బ్రాండ్ ఎంబాసిడర్ గా ఉండిపోవట్లేదా?

మన దైనందిన జీవితం బిక్షగాళ్ళతో ఇంతగా మమేకమైపోయి ఉన్నందువల్లనే బిక్షాటన ఒక వృత్తిగా వెలుగొందుతుంది. దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ విషయం 'మిస్సమ్మ'లో రేలంగి కూడా చెప్పాడు. అంచేత మనం ఒప్పుకొని తీరాలి. కావున మిత్రులారా.. శ్రీశ్రీ అన్నట్లు 'హీనంగా చూడకు దేన్నీ' అని వాక్రుస్తూ.. 'బిచ్చగాళ్ళ సంఘం వర్ధిల్లాలి' అని నినదిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.