Wednesday 6 November 2013

నేను రచయితనవడం ఎలా?


అన్నా! రచయితనవడం నా జీవితాశయం. నా ఆశయం కోసం గత కొన్నాళ్ళుగా పడరాని పాట్లు పడుతున్నా. కానీ రచయితని మాత్రం కాలేకపోతున్నా. కొంచెం సలహా చెప్పన్నా.

- గురజాడ అంతటి వాణ్నవ్వాలని నెత్తిన తలపాగా పెట్టుకు తిరిగాను. 'కన్యాశుల్కం' తలదన్నే నాటకం రాద్దామనుకున్నాను. తలకి గాలాడక బుర్ర హీటెక్కి జుట్టూడిపోయింది గానీ ఒక్క ఐడియా రాలేదు.

- చాసో కథని పట్టుకుందామని అదేపనిగా చుట్టలు కాల్చాను. నోరు చేదెక్కింది తప్పించి ఒక్క కథా పుట్టలేదు.

- శ్రీరంగం నారాయణ బాబుని మరిపిద్దామని జులపాల జుట్టు పెంచాను. చమురు ఖర్చు పెరిగిందే కానీ పన్జరగలేదు.

- రావూరి భరద్వాజ కన్నా పెద్దగెడ్డం పెంచేసి జ్ఞానపీఠాన్ని కొడదామనుకున్నా. మూతి దురద తప్పించి.. జ్ఞానపీఠం కాదుగదా.. కనీసం ముక్కాలి పీట కూడా కొట్టలేకపోయ్యా.

- కారా మాస్టార్లా కారా కిళ్ళీ దట్టించి 'యజ్ఞం'కి బాబులాంటి కథ రాద్దామనుకున్నా. నోరంతా పొక్కి కథాయజ్ఞ యత్నం కాస్తా భగ్నమైపోయింది.

- శ్రీశ్రీ కన్నా గొప్పకవిత్వం కోసం ఫుల్లుగా మందు కొట్టాను. 'మహాప్రస్థానం' సంగతేమో గానీ మహామైకం ఆవహించింది.

- రావిశాస్త్రి వచనం కోసం సిగరెట్టు పీల్చాను. దగ్గొచ్చి కళ్లె పడింది గానీ.. కథ పళ్ళేదు. డాక్టరు బిల్లు చెల్లించి 'సొమ్ములు పోనాయండి' అనుకోవాల్సివచ్చింది.

- శివారెడ్డిలా శాలువా కప్పుకుని 'మోహనా! ఓ మోహనా!!' అంటూ కవిత్వాన్ని ఆహ్వానించాను. ఉక్కపోత తప్పించి కవిత్వం రాలేదు. దేవుడా! ఓ దేవుడా!! అని ఏడ్చుకున్నాను.

- గద్దర్ పాట కోసం నల్ల గొంగళీ భుజం మీద వేసుకుని చిందులు వేశాను. గొంగళీ వల్ల దురద, గంతుల వల్ల కాళ్ళు నొప్పులు మిగిలాయి.. తప్పించి పాట పెగల్లేదు.

తమ్ముడూ! నువ్వు అన్నీ చేశావు గానీ అసలుది మర్చిపోయ్యావు. మంచి రచయితవవ్వాలంటే ముందు జీవితాన్ని చదవాలోయీ! నీకు శుభం కలుగు గాక.

- అవునా అన్నా? ఎంతైనా నువ్వు చాలా తెలివైనోడివి. అందుకే ఇంతమందున్నా నిన్నే సలహా అడిగా. ఇంతకీ ఆ 'జీవితం' పుస్తకం ఎక్కడ దొరుకుతుందన్నా? వెంకట్రామా అండ్ కో లోనా? విశాలాంధ్ర బుక్ హౌజ్ లోనా?

(picture courtesy : Google)