Monday 10 February 2014

నరేంద్ర మోడీ.. నమోన్నమః


"నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధాని కావాలన్నదే నా కోరిక."

"ఓ! నువ్వు నరేంద్ర మోడీ అభిమానివా?"

"నరేంద్ర మోడీ ప్రధాని కావాలని అన్నాను గానీ, నేనతని అభిమానినని అన్లేదు. నాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టం లేదు.. పైగా వ్యతిరేకిస్తాను కూడా."

"మహానుభావా! నా బుర్ర చాలా చిన్నది, కొంచెం అర్ధం అయ్యేట్లు చెప్పవా?"

"ష్.. ఇది పరమ రహస్యం. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా గొప్ప స్కెచ్ వేశాను."

"కొంపదీసి బీజేపీ వాళ్ళ మీటింగుల్లో బాంబులూ గట్రా పెడతావా ఏమిటి?"

"అది కాదులే. ముందు నువ్వు నాకో మాటివ్వు. నా ఓటు బీజీపీకే, నువ్వు కూడా బీజేపీకే ఓటెయ్యి."

"ఎందుకు?"

"ఎందుకేమిటీ? మనందరం ఓట్లేస్తే గానీ బీజేపీకి రెండొందల సీట్లు రావు."

"వస్తే?"

"అప్పుడు బీజేపి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది."

"అయితే?"

"ఆ మాత్రం తెలీదా? అప్పుడు బీజేపి చచ్చినట్లు జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు తీసుకుని గవర్నమెంట్ ఏర్పరుస్తుంది. నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడు. అదీ నా స్కెచ్. ...................... "

"చెప్పడం ఆపేశావేం?"

"చెప్పడానికి ఇంకేం లేదు."

"అర్ధం కాలేదు."

"ఆ విధంగా మోడీకి జయలలిత, మమతా బెనర్జీ, మాయావతిల మద్దతు చాలా కీలకం అవుతుంది. ఈ ముగ్గుర్నీ శాంతింప చేస్తూ ప్రధానిగా కొనసాగడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. ఈ ఆడవాళ్ళ మధ్య నరేంద్ర మోడీని ఊహించుకో. భలే కామెడీగా ఉంటుంది కదూ."

"నేనలా అనుకోవడం లేదు. నరేంద్ర మోడీ అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు."

"గాడిద గుడ్డేం కాదు. నరేంద్ర మోడీ కమ్యూనిస్టుల్తోటీ, కాంగ్రెస్తోటీ యుద్ధం చేసి గెలవగలడు గానీ.. ఈ ముగ్గురు ఆడవాళ్ళని గెలవలేడు, అది అసాధ్యం."

"నీ ఆలోచన శాడిస్టిక్ గా ఉంది."

"నాకు మాత్రం ఆ ముగ్గురు ఆడవాళ్ళ మధ్యన నలిగిపోతున్న నరేంద్ర మోడీ ఊహే ఆనందాన్నిస్తుంది. వీళ్ళ టార్చర్ తట్టుకోలేక మోడీ పని 'నమోన్నమః' అయిపోతుంది. అర్జంటుగా ప్రధాని పదవిని అద్వానీకి 'త్యాగం' చేసేసి, మళ్ళీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతాడు."

"ఆరి దుర్మార్గుడా! ఎంత దూరం ఆలోచించావు!"

"నేనెప్పుడూ అంతే. విశ్వనాథన్ ఆనంద్ టైపు, చాలా స్టెప్పులు ముందే ఆలోచిస్తాను!"

అంకితం :

MACALLAN కి ప్రేమతో..

(photo courtesy : Google)