Sunday 16 February 2014

భరతమాత ముద్దుబిడ్డలు


ఇప్పుడు ఉద్యమాల సీజన్ నడుస్తుంది. ఉద్యమం అంటే తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఒక బాధిత ప్రజా సమూహం చేసే పోరాటం అని అర్ధం. అయితే ఇప్పుడు ఉద్యమం అనే పదానికి అర్ధం మారిపోయింది. తమకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ పోరాటం చేస్తున్నవారి హక్కుని కాదనడం కూడా ఉద్యమమే అంటున్నారు. అంగబలం, అర్ధబలానికి అధికారం కూడా తోడైతే శబ్దం ఎక్కువగానే ఉంటుంది.. లక్ష్మీ ఔటు మోత కూడా AK 47 పేల్చినట్లుగా వినిపిస్తుంది. 

ఉద్యమాలు ప్రజలు నడిపించడం పాత పధ్ధతి. ఇప్పుడంతా మారిపోయింది. ఉద్యమాలు కూడా ఔట్ సోర్స్ చేయబడ్డాయ్! అందుకే ఇప్పుడు ప్రైవేట్ టీవీ చానెళ్ళు ఉద్యమాల్ని నడిపిస్తున్నాయి. ఈ టీవీ చానెళ్ళ ప్రధాన లక్ష్యం తమ ప్రయోజనాలు, తమ వర్గం వారి ప్రయోజనాల్ని పరిరక్షించడమే. అందుకే ఈ చానెళ్ళు సమాజంలో ఉన్న కొన్నివర్గాలకి మాత్రమే గొంతునిస్తాయి, కొమ్ము కాస్తాయి, బాకాలూదుతాయి. తమవాడికి వీపు దురద పుడితే ప్రజలందరికీ దురద పుడుతుందన్నట్లు హడావుడి చేస్తాయి. 

ఒకప్పుడు బీహార్లో కులప్రాబల్యం ఎక్కువనీ, కులాలే రాజకీయ శక్తుల్ని నియంత్రిస్తాయని చెప్పుకునేవారు. ఇప్పుడు మనం బీహార్ వైపు చూడనక్కర్లేదు. మనని మనం చూసుకుంటే చాలు! పొరుగున ఉన్న తమిళనాడు, కేరళలలో పార్టీకొక పత్రిక ఉంది. వాళ్ళది చాలా సింపుల్ వ్యవహారం. 

మనవి కులరాజకీయాలు కాదు, రాజకీయాలే కులాల్ని అనుసరించి సాగుతున్నయ్. అందుకే పత్రికలు ఒకే వార్తని వారివారి కులదృష్టితో, ప్రాంతదృష్టితో రిపోర్ట్ చేస్తున్నాయ్. కాబట్టే ఒక రాజకీయ నాయకుడు బరి తెగించి ప్రవర్తిస్తే.. అతను 'మనవాడు' కాబట్టి భగత్ సింగ్ తో పోల్చుకుని ఆనందిస్తున్నాం. 

మంచిది, భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని ప్రస్తుతానికి ఆనందిద్దాం. ఈ రకంగా అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీలు కూడా జన్మించే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రేటున దేశానికి వన్నె తెచ్చిన ముద్దుబిడ్డలంతా మన మధ్యనే తిరుగాడుతుంటారు. అప్పుడా దృశ్యం కన్న భరతమాత ఉద్వేగంతో కార్చే ఆనందభాష్పాలు తుడవటానికి ఎవరి చేతిరుమాళ్ళూ సరిపోవు, పెద్దపెద్ద టర్కీటవల్సే కావాల్సి ఉంటుంది. కాబట్టి - అవేవో ఇప్పుడే రెడీగా ఉంచుకుందాం. 

(picture courtesy : Google)