Monday, 24 February 2014

కాలక్షేపం వార్తలు


"ఆ రెండు దెయ్యాల దుర్మార్గమే"

ఈ వార్త ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' ఐదో పేజిలో వచ్చింది. తెలుగు వార్తా పత్రికల స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది. ఇంకా జారటానికి అక్కడ మిగిలిందేమీ లేదు. ఒక వార్తని అర్ధవంతంగా రిపోర్ట్ చెయ్యటం వీరికి చేతకాదు. అందుకే వార్తలో సాధ్యమైనంతవరకూ తిట్లూ, బూతులు వెతుక్కుని.. వాటినే ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. 

నెల్లూరు జిల్లాకి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే ఓ చిన్నపాటి తెలుగు దేశం నాయకుడు సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ లపై ఫైర్ అవుతూ చేసిన 'దెయ్యం' కామెంట్ ఇది. ఆ నాయకుడికి తన రాష్ట్రం విడిపోయినందుకు కోపం, బాధ ఉండి ఉండొచ్చు, లేదా తన నియోజక వర్గ ప్రజల దగ్గర మార్కులు కొట్టెయ్యడానికి ఈ భాష వాడి ఉండొచ్చు. కానీ ఆ వార్తని రిపోర్ట్ చెయ్యడానికి పత్రిక వాడిన శీర్షిక అభ్యంతరకరంగా ఉంది.  

తెలుగు దేశం నాయకుడు చేసిన విమర్శ రాజకీయమైనది. వాస్తవానికి ఈ వార్తని రాసేప్పుడు పత్రికలు దేవుళ్ళు, దెయ్యాల భాష (ఆ నాయకుడు అలా మాట్లాడినప్పటికీ) వాడకూడదు. అది పత్రికల బాధ్యత. ఎందుకంటే ఆయన దెయ్యాలుగా రిఫర్ చేసిన వ్యక్తులు స్త్రీలు, ఈ దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే రెండు పెద్ద రాజకీయ పార్టీల్లో ముఖ్యమైన స్థానంలో ఉన్నవారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వారివారి పార్టీలు తీసుకున్న రాజకీయ నిర్ణయం. అప్పుడు వారిపై విమర్శలు కూడా రాజకీయంగానే ఉండాలి, పత్రికలు అటువంటి విమర్శలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ, వ్యక్తిగత దూషణలకి కాదు. 

ఆ తెలుగు దేశం నాయకుడు చాలా విషయాలు చెబుతూ, మధ్యలో ఒక మాటగా ఈ దెయ్యాల భాష వాడి ఉంటాడు. కానీ పత్రిక వారికి దెయ్యాల ప్రస్తావన ఆకర్షణీయంగా ఉందనిపించింది. అందుకే అన్నీ వదిలేసి 'దెయ్యాలు' అంటూ హైలైట్ చేశారు. ఇట్లాంటి తిట్ల భాష వాడితేనే పత్రికల్లో ప్రచారం లభిస్తుందని ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు నమ్ముతున్నారు. అందుకు ప్రధాన కారణం రాష్ట్రస్థాయి నాయకులు. 

చంద్రబాబు నాయుడంతటి నాయకుడే తన రాజకీయ ప్రత్యర్ధుల్ని 'మొద్దబ్బాయ్, దొంగబ్బాయ్' అంటూ సంబోధించడం ఒక విషాదం. ఇదెక్కడి రాజకీయ భాష! జుగుప్సాకరమైన ఇట్లాంటి భాషని పెద్దస్థాయి నాయకులు మాట్లాడటం వల్లనే చిన్నస్థాయి నాయకులు ఇంకా రెచ్చిపోతున్నారు. ఇది రాజకీయాలకే నష్టం. 

ఇక ఆంధ్రజ్యోతి ఓనర్ గారు తమ పత్రిక విలువలకి కట్టుబడి నిస్వార్ధంగా నిలబడుతుందని (వారికి ప్రతి ఆదివారం ఇదో తంతు) గర్వంగా చెప్పుకున్నారు. మంచిది, ఆయన అభిప్రాయం ఆయనిష్టం. ఆ పత్రికకి తెలుగు దేశం పార్టీలో అంతా నిస్వార్ధమైన మంచే కనిపిస్తుంది, జగన్మోహనుడి పార్టీలో అంతా స్వార్ధపూరిత చెడ్డే కనిపిస్తుంది. తన పత్రికకి - తెలంగాణా జిల్లాల ఎడిషన్లలో సమైక్య దుర్మార్గం కనిపిస్తుంది, సీమాంధ్ర ఎడిషన్లలో విభజన దుష్టత్వం కనిపిస్తుంది. రెండు కళ్ళ సిద్ధాంతం మనకి బాగానే పరిచయం. కాబట్టి - ఆ పత్రిక ఓనరు గారి ద్వంద్వవిధానం వారి నిజాయితీగానే మనం భావించాల్సి ఉంటుంది. 

ప్రజలు తెలివైనవారని నా నమ్మకం. అందుకే వాళ్ళు మీడియా వండే మసాలా వార్తల్ని పట్టించుకోవటం మానేశారు. కొందరు మరీ పనిలేని వాళ్ళు టీ స్టాల్లో టీ తాగుతూ కాలక్షేపంగా ఏదో మాట్లాడుకుంటారు. అంచేత వీటిని కాలక్షేపం వార్తలుగా అనుకోవచ్చు. అంతకుమించి ఈ వార్తలకి ప్రాధాన్యం లేదు. 'మరి ఏ మాత్రం ప్రయోజనం లేని ఈ వార్తల్ని ఎందుకంతగా చదువుతారు? చూస్తారు?' సినిమాలో చివరికి గెలిచేది హీరోనే అని తెలిసినా, ఆ ఫైటింగుల్ని కూడా ప్రేక్షకులు ఆసక్తిగానే చూస్తారు. వారికదో సరదా. ఈ వార్తల గతీ అంతే!

(photo courtesy : Google)