Monday 10 February 2014

టెన్షన్.. టెన్షన్.. టెన్షన్!


"టెన్షన్.. టెన్షన్.. టెన్షన్! టెన్షన్తో చచ్చేట్లున్నాను."

"ఎందుకు?"

"సమైక్యాంధ్ర కోసం ఓ ఎంపీ సభలోనే ప్రాణత్యాగం చేస్తాట్ట."

"చేసుకొనీ. అది ఆయన ఇష్టం. మధ్యలో నీకెందుకు టెన్షన్?"

"అంతమంది మధ్యలో చావడం కష్టం గదా! కత్తితో పొడుచుకుంటాడా? ఉరేసుకుంటాడా?"

"అది ఆయన సమస్య. స్పీకర్తో చర్చించి ఏదోక మార్గం ఎంచుకుంటాళ్ళే."

"అంతేనంటావా? సమైక్యాంధ్ర కోసం ఇన్ని వేలమంది 5 కె రన్ అంటూ పరిగెత్తినా కేంద్రం దిగి రావట్లేదు. ఇది అన్యాయం."

"సమైక్యాంధ్ర ఒక రాజకీయ సమస్య.. అది పరిగెత్తితే తేలదు."

"అన్నింటికీ ఏదోలా సమాధానం చెప్పేసి తేల్చేస్తున్నావే! సరే, తెలంగాణా బిల్లు పాసవుతుందా? లేదా? అదైనా చెప్పి నా టెన్షన్ తగ్గించు."

"కాంగ్రెస్ ఫ్లోర్ మేనేజ్మెంట్ సరీగ్గా చెయ్యగలిగితే తెలంగాణా బిల్లు పాసవుతుంది, లేకపోతే లేదు."

"బిల్లు పాస్ అవుతుందా? లేదా?"

"ఆ సంగతి చూస్కోడానికి వెంకయ్య నాయుడు, దిగ్విజయ్ సింగులు ఉన్నార్లే. మొన్నెప్పుడో అమ్మకి జ్వరం అన్నావు, తగ్గిందా?"

"ఇంకా లేదు."

"డాక్టర్ ఏమన్నాడు?"

"డాక్టర్ దగ్గరకి ఇంకా తీసికెళ్ళలేదు."

"ఏవిటీ! ఇన్నిరోజులుగా జ్వరం ఉన్నా అంత పెద్దావిణ్ని ఇంకా డాక్టర్ దగ్గరకి తీసికెళ్ళలేదా!"

"అవును, కుదర్లేదు."

"నీకసలు బుద్ధుందా? పనికిమాలిన సంగతుల గూర్చి టెన్షన్ పడుతున్నావు, కన్నతల్లి జ్వరం నీకు పట్టదా?"

"నేను నీలా స్వార్ధపరుణ్ణి కాను. నాకు ఇంట్లోవాళ్ళ ఆరోగ్యం కన్నా రాష్ట్రప్రజల శ్రేయస్సే ఎక్కువ. అందుకే టెన్షన్ పడుతుంటాను."

(photo courtesy : Google)