Thursday 20 February 2014

తిక్క కుదిరింది


తెలంగాణా బిల్లు పాసైపోయింది. 

ఇదేంటి! ఇంకా భూమి బ్రద్దలవ్వలేదు, ఆకాశం చిల్లు పడలేదు, కరెంట్ పోయి అంధకారం ఆవహించలేదు, నక్కలు ఊళ వేయలేదు, కనీసం పిల్లులైనా 'మ్యావ్' మనలేదు. 

నిన్న రాత్రంతా దోమలు కుడుతూనే ఉన్నయ్! ఇప్పుడు సూర్యుడు కూడా తూర్పునే ఉదయించాడు. పొద్దున్నే చలిచలిగా, మంచుమంచుగా ఉంది. 

రోజూ చేసే పనే - నేను నిద్ర లేచి స్నూపీని మొద్దునిద్ర లోంచి లేపాను. 'అప్పుడే తెల్లారిందా?' అన్నట్లు స్నూపీ బద్దకంగా ఒళ్ళు విరుచుకుంది. దాన్ని బలవంతంగా మేడ మీదకి తీసుకెళ్ళాను. 

కాలకృత్య నిమత్తం పిట్టగోడ వైపు తిరిగి వెనక కాలెత్తింది.

"స్నూపీ! తెలంగాణా బిల్లు పాసైంది." అన్నాను.

సమాధానంగా తోక ఊపుతూ 'భౌభౌ' మంది. నాకు కుక్క భాష రాదు కావున ఆ అరుపుకి అర్ధం తెలీలేదు.

స్టడీ రూంలో మా అబ్బాయి ఇంటర్ పరీక్షలకి చదువుకుంటున్నాడు.

"బుడుగు! తెలంగాణా ఇచ్చేశారు." అన్నాను.

మావాడు నావైపు చూస్తూ ఓ క్షణం ఆలోచించాడు.

"ఎక్జామ్స్ postpone అవుతాయా?" ఆసక్తిగా అడిగాడు.

"అవ్వవు." అన్నాను.

మొహం చిట్లించుకుని పుస్తకంలోకి తల దూర్చాడు.

మా అమ్మాయి కాలేజికి వెళ్లేందుకు హడావుడిగా రెడీ అవుతుంది.

"నాన్నా! ఇవ్వాళ స్టేట్ బంద్ లేదా?"

"బంద్ పిలుపైతే ఇచ్చారు."

"ఏవిటో! ఈమధ్య బందంటూ పిలుపులే ఇస్తున్నారు, ఏదీ బంద్ చెయ్యట్లేదు." అంటూ విసుక్కుంటూ కాలేజికి వెళ్ళిపోయింది.

నా భార్య సీరియస్ గా ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటుంది.

"తెలంగాణా ఇచ్చేశారు." అన్నాను. 

"అవును. లేటుగానైనా తెలంగాణా వాళ్లకి న్యాయం జరిగింది. నాకీ తెలంగాణా విషయం చదువుతున్నప్పుడల్లా, 'అద్దెకుంటున్న ఇంటికి నేను రిపైర్లు చేయించాను కాబట్టి ఇల్లు నాదే' అనే దబాయింపు వాదం గుర్తొస్తుంది." అన్నదావిడ.

"అయితే నీకు బాధగా లేదన్నమాట." అన్నాను.  

"నాకెందుకు బాధ! బాధ పడాల్సింది మీడియా వాళ్ళు. ఇన్నాళ్ళూ వాళ్ళు తెలంగాణా మోత మోగించారు. ఇంక వాళ్లకి చెప్పడానికి విషయం ఉండదు. జర్నలిస్టులు చాలామంది ఉపాధి కోల్పోతారు." అన్నది.

"మీడియా వాళ్ళకేనా? నా బ్లాగుక్కూడా దెబ్బే! ఇంక రాయడానికి నాక్కూడా పెద్దగా విషయాలుండవ్." దిగాలుగా అన్నాను.

"తిక్క కుదిరింది." కసిగా అంది నా భార్య!

(photo courtesy :Google)