Monday 14 May 2012

గల్తీ బాత్ మత్ కరో భాయ్!

"ఛీఛీ! అసలు తెలుగొక భాషేనా? కాదు. మరి భాషంటే ఎలా ఉండాలి? ఉర్దూలా ఉండాలి. ఉర్దూ భాషలో మావిడి కాయంత తియ్యదనముంది, నిమ్మకాయంత పులుపుంది, ఇడ్లీసాంబారంత కమ్మదనముంది. గొప్పభాషకి నిర్వచనం ఉర్దూ! ఆ భాష రానివాడిది జనాభా లెక్కకి తప్పించి ఇంకెందుకూ పనికిరాని జన్మ."

అప్పటికి మావాడు మమ్మల్ని రెండొందల నలభయ్యోసారి విసుక్కున్నాడు. మాకు ఉర్దూ రాదు, తెలుగు మాత్రమే వచ్చు. అంచేత - మేం కూడా అప్పటికి సిగ్గుతో రెండొందల నలభయ్యోసారి తల దించుకున్నాం. 

"ఎవడ్రా రేడియోలో తెలుగు పాటలు పెట్టింది? పల్లెటూరి బైతుల్లారా! వివిధ భారతికి మార్చండి. మనోరంజన్ ప్రోగ్రాం పెట్టండి. ఎంతసేపటికీ ఆ గరగరలాడే ఘంటసాల పాటలేనా? ఇకనుండి రఫీ, కిశోర్ పాటలే వినండి - లైఫ్‌లో పైకొస్తారు." గద్దించాడు మావాడు.

"వివిధ భారతి రేడియో స్టేషన్ సరీగ్గా రాదు, తుఫానులో కుక్క ఏడుపులా తెరలు తెరలుగా వస్తుంది." మా వినయపూర్వక సంజాయిషీ.

"అయినా సరే! వివిధ భారతి పెట్టాల్సిందే. తెలుగంటే నాకు చిరాకు. రాత్రి బినాకా గీత్ మాలా వస్తుంది, అమీన్ సయాని హిందీని ఫాలో అవ్వండి, మీ బావిలో కప్ప జన్మ ధన్యమౌతుంది." ఆర్డర్ పాస్ చెయ్యబడింది.

'ఎందుకు? ఎందుకు మా బ్రతుకులిలా బుగ్గి పాలయ్యాయి? వేసని సెలవలు మా జీవితాల్ని ఎంతగా దగా చేశాయి! మేమీ తెలుగు నేలపై జన్మించనేల! మావాడు హైదరాబాద్ పోనేల!'

ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం -

అవి మాకు జూనియర్ ఇంటర్ సెలవలు. క్రికెట్ ఆడుకోడం, సరదా కబుర్లు, చిన్నచిన్న తగాదాలు, షికార్లు, సినిమాలు.. ఇదే మా స్నేహబ్రందం జీవితం. అయితే - మాలో ముఖ్యుడొకడు ఆ సెలవల నెలరోజులు మాయమైపొయ్యి, సీనియర్ ఇంటర్ క్లాసులు మొదలయ్యేప్పటికి ప్రత్యక్షమయ్యాడు.

ఇప్పుడు మా వాడి రూపు ఎన్టీఆర్్‌కి మారువేషం వేసినట్లుగా, పూర్తిగా మారిపోయింది. పొడుగు జుట్టు, బొచ్చె క్రాఫింగు, చేతికి కడియం, మందపాటి గోనెగుడ్డతో బెల్ బాటం ప్యాంటు. ఆ గోనెగుడ్డ ప్యాంటుని నెలకోసారి కూడా ఉతక్కూడదుట! అది మా గుంటూరు చెమటకి తడిసి, నాని.. పాడుకంపు కొడుతుండేది. ఆ కంపే ఫ్యాషన్ట! ఆ గోనెగుడ్డని 'జీన్స్' అంటార్ట! 

మావాడు సెలవల్ని హైదరాబాదులో ఉంటున్న వాడి మేనమామ ఇంట్లో గడిపాడు. హైదరాబాదు ముచ్చట్లు డైలీ సీరియాల్లా రోజూ చెప్పేవాడు, మేం నోరు తెరుచుకుని వినేవాళ్ళం. మాకు మావాడి అనుభవాలు సింద్‌బాద్ అద్భుత యాత్రలా అనిపించింది. హైదారాబాదులో తెలుగు ఎవడికీ అర్ధం కాదుట. ఎక్కడ చూసినా గడ్డం సాయిబులు, షెర్వాణీలు, రూమీ టోపీలుట. కొండరాళ్ళు కొండల్లో కాదు, ఇళ్ళల్లోనే ఉంటాయిట!

ఈమధ్య మావాడు ఆలోచించడం కూడా ఉర్దూలోనే చేస్తున్నాట్ట! ఈ ఉర్దూ పాండిత్యం మావాడి స్థాయిని మేమందరం అసూయతో కుళ్ళుకునేంత ఎత్తుకి పెంచేసింది. ఈ విధంగా మావాడు తన ఉర్దూతో మాపై ఆధిపత్యం చెలాయించసాగాడు. మేం గుడ్ల నీరు కుక్కుకుంటూ మా బానిస జీవితాన్ని భారంగా ఈడుస్తున్నాం, అదీ కథ!

మా ఊరికి ప్రతి సంవత్సరం ఎక్జిబిషన్ వస్తుంది. పిట్టలు కొట్టే తుపాకీతో బుడగల్ని పేల్చటం, మడ్డినూనెలో వేయించిన బజ్జీలు, అప్పడాలు తిన్డం, తుప్పు పట్టిన జైంట్ వీల్లో తిరగడం.. మాగొప్పగా వుంటుంది! మా గుంటూరు సూర్యుడికి అతి తక్కువ దూరంలో వుంది, ఎండల వేడికి తారురోడ్లు కరిగిపోతుంటాయి. సాయంకాలాలు ఈ ఎగ్జిబిషన్ మాకు హాయినిచ్చేది.

గుంటూర్లో ఇంకేమి హాయి ఉన్నది? నాజ్ అప్సర ఉంది. ఎవరా అప్సర!? అబ్బే, అప్సర అంటే మనిషి కాదు, ఒక ఏసీ సినిమా హాలు! నా జీవితంలో మొదటి ఏసీ చల్లదనం అనుభవం అక్కడే. చల్లగా, సెంటు వాసనతో హాయిగా వుంటుంది. కానీ ఏం లాభం? అక్కడన్నీ హిందీ సినిమాలే, మాకు తెలుగు తప్ప ఏ భాషైనా పాళీభాషతో సమానం!

ఒకసారి 'పాకీజా' వెళ్ళాం. సినిమా మొదలవ్వంగాన్లే మాలో సగంమంది ఆ చల్లదనానికి నిద్రపొయ్యారు. నేను పట్టుదలగా నిద్ర ఆపుకుని మరీ సినిమా చివర్దాకా చూశాను. మీనాకుమారి డాన్సులు చేస్తుంంటుంది, డాన్సుల మధ్య ఏడుస్తుంంటుంది. అంతే అర్ధమైంది! ఏవీఁ అర్ధం కాకపోయినా, సినిమా గొప్పకళాఖండమని మాత్రం అర్ధమైంది. 

ఎప్పట్లాగే ఆ యేడాది కూడా మిత్రులందరం ఎక్జిబిషన్‌కి వెళ్ళాం. ఇప్పుడంటే సెల్ ఫోన్లతో ఎడాపెడా ఫోటోలు తీసేస్తున్నారు గానీ, ఆ రోజుల్లో ఫోటో అంటే చాలా అపురూపం. ఫొటోలో చక్కగా 'పడాలని' తపన పడుతూ బాగా 'దిగేవాళ్ళం'! అంచేత ఎక్జిబిషన్లలో ఫోటో స్టూడియో స్టాల్స్ చాలా పాపులర్. అక్కడ రూపాయికో ఫోటో తీస్తారు. నల్లటివాళ్ళని కూడా గోడక్కొట్టిన సున్నంలా తియ్యడం వారి స్పెషాలిటీ, బహుశా ట్రేడ్ సీక్రెట్ కూడానేమో!

ఆ రోజు మేం ఫొటోలు 'దిగిన' స్టూడియో స్టాల్ నార్తిండియావాళ్ళది. వాళ్ళల్లో ఒకడు ఎర్రగా, పొడుగ్గా ఉన్నాడు. ఏదో ఆకుని గారపళ్ళతో మేక నమిలినట్లు పరపరా నముల్తున్నాడు. రూపాయి టికెట్లు కొనుక్కుని కృష్ణతో ఫైటింగ్ పోజు, ఎన్టీఆర్‌తో షేక్ హ్యాండ్ పోజు.. రకరకాలుగా ఫొటోలు దిగాం. ఆ ఆకులు నమిలేవాడు ఓ గంట తరవాతొచ్చి ఫొటోలు తీసుకొమ్మన్నాడు.

సరే! కొంతసేపు బజ్జీలు, అప్పడాలు నమిలాం. పన్లోపనిగా కనబడ్డ అమ్మాయిల్ని కూడా నమిలేసేట్టు చూశాం. ఆవిధంగా ఉదరపోషణా, కళాపోషణా చేసుకుని గంట తరవాత ఫోటో స్టూడియో స్టాల్‌కి వెళ్ళాం. స్టూడియో ముందు ఒక తెల్లగుడ్డ ఏటవాలుగా వేళ్ళాడుతుంది. ఆగుడ్డ మీద తడితడిగా ఫోటోలు వున్నాయి, ఓ మూలగా వెకిలి నవ్వుతో మా సుందర వదనాలు. ఫోటోలకి పక్కనే ఆకులు నముల్తూ గారపళ్ళ స్టూడియోవాడు. వీడింక అన్నం తినడా? రోజంతా మోపుల కొద్దీ ఆకుల్ని నమిలేసి బ్రతికేస్తుంటాడా! 

గారపళ్ళ మేకకి మా ఫోటోల తాలూకా కౌంటర్ ఫాయిల్స్ ఇచ్చాం, వాడు ఆ ఫాయిల్స్ వెనక్కి తిప్పి చూశాడు. ఉర్దూలో ఏదో చెప్తూ వెనక్కిచ్చేశాడు, ఒక్కముక్క అర్ధం కాలేదు. ఇంతకీ వాడు చెప్పేది ఏంటబ్బా! కొద్దిసేపటికి అర్ధమైందేమనగా - మేం వాడికి ఇంకా కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉందిట. టికెట్ల వెనక ఏదో మా అప్పు తాలూకా యేదో అంకె వేసి ఉంది, వాస్తవానికి మేం ఒక్కపైసా కూడా ఇవ్వనక్కర్లేదు. మాక్కోపం తన్నుకొచ్చింది, కానీ నోరు తెరిచే అవకాశం లేదు, భాషా సమస్య!

"మేం డబ్బులు మొత్తం ఇందాకే ఇచ్చేశాం, ఇప్పుడు మళ్ళీ ఎందుకివ్వాలి?" అంటూ మాలో ఒకడు ధైర్యం చేసి తెలుగులో ఘోషించాడు.

"తెలుగు నహీ ఆతా, ఉర్దూ మే బోల్" అన్నాడు స్టూడియోవాడు విసుగ్గా.

మాలో ఇంకోడు ఇంకో అడుగు ముందుకేశాడు. 

"భాయ్ సాబ్! హమ్ ఉర్దూ నహీ, డబ్బులు భీ నహీ!" అంటూ గొణిగాడు.

"ఉర్దూ మే బోల్!" అంటూ విదిలించాడు మేకాధముడు.

లాభం లేదు. ఇక్కడ తెలుగుభాష దారుణంగా ఓడిపోయింది. తెలుగు నేల మీద తెలుగుభాష పనికి రాకుండా పోయింది! హఠాత్తుగా గుర్తొచ్చింది, మా హైదరాబాదీ ఉర్దూ మాస్టర్ ఉన్నాడుగా! ఇప్పటిదాకా అనవసరంగా మేకగాడితో కష్టాలు పడ్డాం, అవమానాలూ పడ్డాం, ఎక్కడ్రా వాడు? మావాడు ఆ పక్కగా కొద్దిదూరంలో ఒక అమ్మాయి దృష్టిలో పడ్డానికి తన పొడుగు జుట్టు స్టైల్‌గా ఎగరేస్తూ, ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని పోజులు కొడుతున్నాడు.

'ఇంక చాల్లే! నీ జీవితమంతా ఇక్కడే గడిపినా, ఆ అమ్మాయి నీ దరిద్రప్మొహాన్ని చూసే చాన్స్ లేదు.' అంటూ వాణ్ణి ఫోటో స్టూడియోకి లాక్కొచ్చాం, సమస్య వివరించాం.

'ఇంక నీ ఇష్టం. ఈ మేకారావుని వాడి భాషలోనే దంచు, మన ఫొటోలు సంపాదించు.' అని ముందుకు నెట్టి గర్వంగా పక్కన నించున్నాం.

మా హైదరాబాద్ ఉర్దూగాడు నోరు తెరవలేదు, అలా చూస్తూ నించున్నాడు. మేగ్గాడు ఈసారి స్వరం పెంచాడు. వాడు మమ్మల్ని తిడుతున్నాడని అర్ధమైంది. 

"మాట్లాడు, మన ఫొటోలు లాక్కో!" అంటూ మావాణ్ని వెనకనించి గిల్లుతున్నాం.

ఎంత గిల్లినా మావాడు ఉలకడు, పలకడు. మా గిల్లుడు రక్కుడుగా మారి, బాధ భరింపరానిదిగా తయారైన కారణాన, ఎట్టకేలకు మావాడు నోరు తెరిచాడు - 

"గల్తీబాత్ మత్ కరో భాయ్!"

మేకగాడు ఈసారి రంకెలెయ్యడం మొదలెట్టాడు. మా హైదరాబాదుగాడు ఆ తిట్లన్నీ ఓపిగ్గా పడుతున్నాడు. ఎంతసేపటికీ అరిగిపోయిన రికార్డులా ఒకటే మాట - 

"గల్తీబాత్ మత్ కరో భాయ్!" 

కొంతసేపటికి - మావాడికి 'గల్తీ బాత్ మత్ కరో భాయ్!' మించి పరాయి భాషలో ఇంకోముక్క కూడా రాదని మాకు అర్ధమైపోయింది. 

ఓరి దరిద్రుడా! ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంతలా హింసించావ్? అయ్యో! మా ఫొటోలు వదిలేసుకోవలసిందేనా? భగవంతుడా! దారి చూపవయా!

భగవంతుడు దారి చూపాడు - రజాక్ రూపంలో! రజాక్ కుటుంబానికి మా ఇంటి దగ్గర బడ్డీ కొట్టుంది. ఆ కొట్టు మేం పుట్టకముందు నుండీ వుంది. దాన్ని సాయిబు కొట్టుగా అనేవాళ్ళు. సాయిబు కొట్టు రజాక్‌కి మా గోడు వెళ్ళబోసుకున్నాం. 

ఇంక చూడండి! నా సామిరంగా! రజాక్ అగ్నిహోత్రుడైపొయ్యాడు. ఉర్దూలో ఆ మేకాధముణ్ణి తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. స్టాల్ పీకిచ్చేస్తానని బెదిరించాడు. మాలో ఒకడు పెద్ద పోలీసాఫీసరు కొడుకని బెదిరించాడు.

సడన్‌గా మేక కాస్తా పిల్లిలా మారిపోయింది! 

"మాఫ్ కర్నా సాబ్!" అంటూ గుడ్డమీద ఫొటోల్ని అత్యంత వినయంగా ఇచ్చాడు.

"ఫొటోలన్నీ వచ్చాయో లేదో చూసుకోండి. తాగున్నాడు సాలాగాడు, పిల్లలు గదాని బెదిరించి డబ్బులు గుంజుదామనుకున్నాడు." అంటూ రజాక్ వెళ్ళిపొయ్యాడు.

మిత్రులారా! ఇంతటితో కథ అయిపోయింది, ఉర్దూ రాదని తేలిన మరుక్షణం మావాడి ప్రభ తగ్గిపోయింది. అప్పటిదాకా తెలుగు మాత్రమే తెలిసి ఉన్నందుకు సిగ్గుతో దించుకున్న మా మొహాలు 'తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది' అంటూ గర్వంగా తలెత్తుకున్నాయి. 

థాంక్యూ! థాంక్యూ మై డియర్ ఎక్జిబిషన్!

అటు తర్వాత మావాడు ఏం చెప్పినా - 'గల్తీ బాత్ మత్ కరో భాయ్!' అంటూ గద్దించాం, నోరు తెరిచే అవకాశం లేకుండా సీల్ చేసేశాం. ఆ విధంగా హైదరాబాదు ఉర్దూని శాశ్వతంగా నిర్మూలించేశాం, గుంటూరా మజాకా!

మా చదువులు అయిపొయ్యాయి. మావాడు బ్యాంకు ఉద్యోగస్తుడయ్యాడు. అప్పట్నించి నాకు భారత బ్యాంకింగ్ వ్యవస్థ కుప్ప కూలిపోతుందేమోనని భయం పట్టుకుంది. రెండో ఎక్కం కూడా సరీగ్గారాని మావాడు కంప్యూటర్ల సాయంతో ఉద్యోగం లాక్కొస్తున్నాడు.

మొన్నామధ్య కలిసినప్పుడు మావాణ్ని హెచ్చరించాను - "ఉద్యోగం జాగ్రత్తరోయ్!" 

మావాడు పెద్దగా నవ్వి అన్నాడు - "గల్తీబాత్ మత్ కరో భాయ్!"