Monday 21 May 2012

పేరులో ఏముంది?!

"నీకు నా ఇష్టదైవం పేరు పెట్టుకున్నాను, అందుకైనా ఒక్కసారి ఆ దేవుడికి దణ్ణం పెట్టుకోరాదా!" ఇది అమ్మ ఆర్గ్యుమెంట్.

"నువ్విట్లా కొత్త రూల్స్ పెట్టకు. నాకీ పేరు పెట్టమని నేనడిగానా? నాకు చెప్పకుండా నాపేరు పెట్టటమే కాక, ఆ పేరుకు తగ్గట్లు ప్రవర్తించమని డిమేండ్ చెయ్యడం అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన కూడా!" ఇది నా కౌంటర్ ఆర్గ్యుమెంట్.

అసలు పేరుకీ, ప్రవర్తనకీ సంబంధం ఉంటుందా? ఉండాలా?

నా చిన్నప్పుడు మా పక్కవీధిలో నెయ్యి అమ్మేవాళ్ళు. 'ఇచ్చట స్వచ్చమైన వెన్న కాచిన నెయ్యి అమ్మబడును.' అని పెద్ద బోర్డుండేది. ఆ నెయ్యి మాత్రం ఎలుక చచ్చిన పాడు కంపు కొడుతుండేది.

'కేర్' ఆస్పత్రి అంటారు. అక్కడ పేషంట్లని కేర్‌లెస్సుగానూ, బిల్లుల్ని కేర్‌ఫుల్లుగానూ చూస్తారని అభిజ్ఞువర్గాల భోగట్టా. ఈ మధ్య కొన్ని ఆస్పత్రులకి 'హెల్ప్' అని పేరు పెడుతున్నారు. వాళ్ళ బిల్లుల్ని చూసి జనాలు ఘొల్లుమంటున్నారు, ఇంక 'హెల్ప్' ఎక్కడ!

పాతతరం కమ్యూనిస్టులు పిల్లలకి లెనిన్ బాబు, స్టాలిన్ బాబు అని పెట్టుకునేవాళ్ళు. వారి పిల్లల బుల్లిఅడుగుల్లో భవిష్యత్ విప్లవకారుని 'లాంగ్ మార్చ్' చూసుకుని మురిసిపొయ్యేవారు. తదనంతరం ఆ బుల్లి విప్లవకారులు 'గ్రేట్ లీప్ ఫార్వర్డ్' చేసి - వడ్డీ వ్యాపారస్తులుగానూ, లిక్కర్ సిండికేట్లుగానూ 'ఎదిగి' తలిదండ్రులకి గొప్ప పేరు తెచ్చిపెట్టారు 'గోరా' తండ్రి కొడుక్కి రామచంద్రరావు అని రాముడి పేరు పెట్టుకున్నాడు. మరి గోపరాజు రామచంద్రరావు ఏం చేశాడు? 'గోరా'గా మారిపోయి ఆ దేవుడే లేడన్నాడు!

గురజాడ అప్పారావు మాత్రం తన నాటకానికి సాంప్రదాయక పద్ధతుల్నే నమ్ముకున్నాడు. 'కన్యాశుల్కం'లో పాత్రల పేర్లు వారి బుద్ధిననుసరించి ఉంటాయి. లుబ్దావధాని, అగ్నిహోత్రావధాని, కరటకశాస్త్రి, సౌజన్యారావు.. ఇది ఈ నాటకానికి నెగెటివ్ పాయింటని పలువురు విజ్ఞులు వాకృచ్చారు.

అమ్మకి 'కన్యాశుల్కం' సినిమా మాత్రమే తెలుసు. ఆవిడకి మధురవాణిగా సావిత్రి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. అంతే! అయితే కన్యాశుల్కం ఒక గొప్ప నాటకమని.. గురజాడ పాత్రలు బుద్ధిగా తమ పేర్లననుసరించే ప్రవర్తించాయని తెలీదు. తెలిసినట్లయితే ఆవిడ ఈ పాయింటుని తన డిఫెన్సుకి వాడుకునేది. ఆమెకి తెలీదని నాకు తెలుసు కాబట్టే.. పేర్లకీ, ప్రవర్తనకీ సంబంధం లేదని, ఉండదనీ బల్ల గుద్ది వాదిస్తున్నాను.

ఇంట్లో ఏదో వ్రతం. అమ్మ కొత్త ఎత్తు వేసింది.

"కనీసం ఇవ్వాళయినా ఒక్కసారి దణ్ణం పెట్టుకో.. నాకోసం!" అంటూ సెంటిమెంటుతో కొట్టింది.

చచ్చితిని. ఇరుక్కుపొయ్యానా? ఒక్కక్షణం ఆలోచించాను.

"అమ్మా! నాకయితే ఇటువంటివి నమ్మకం లేదు. నీకోసం తప్పకుండా పెడతాను. కానీ నమ్మకం లేకుండా దణ్ణం పెట్టుకోవడం మహాపచారం. అసలే నీకీ మధ్య బిపి ఎక్కువైంది, ఆ తర్వాత నీ ఇష్టం." హెచ్చరిస్తున్నట్లుగా అన్నాను.

నా మంత్రం పని చేసింది. "సరెసరే! వద్దులే." అంది కంగారుగా.

అమ్మకి కనిపించకుండా మొహం పక్కకి తిప్పుకుని.. నవ్వుకున్నాను!!