Saturday 26 May 2012

జగన్ అవినీతి - కాంగ్రెస్ రాజనీతి


ఉదయాన్నే కాఫీ తాగుతూ 'ఆంధ్రజ్యోతి' తిరగేస్తున్నా. 'జగన్ అవినీతిపరుడు.' ఒప్పుకున్నాం! ఇంకేమన్నా వార్తలున్నాయా? ఎంత వెతికినా వేరే వార్తలు కనిపించట్లేదు. ఈ ముక్క రాయడానికి ఇన్ని పేజీలు  దేనికబ్బా!

ఇంతలో "రవణ మావా! కాఫీ." అంటూ వచ్చాడు సుబ్బు.

"కూర్చో సుబ్బు! జగన్ని లోపలేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యవాదులంతా హర్షించదగిన మంచి పరిణామం. ఒక అవినీతిపరుణ్ణి లోపలేస్తే గాని మిగిలినవారికి బుద్ధిరాదు." అన్నాను.

సుబ్బు ఒకక్షణం ఆలోచించాడు.

"నేనలా అనుకోవడం లేదు. జగన్ని అరస్టు చెయ్యడం కాంగ్రెస్ చేస్తున్న చివరి తప్పిదం అవుతుందేమో. రాజకీయంగా ఆలోచిస్తే జైలుకెళ్ళడం జగన్ కే మంచిదిగా అనిపిస్తుంది. అవినీతి రాజకీయాల గూర్చి మాట్లాడే ముందు మనం ఒక విషయం ఆలోచించాలి. ఈ దేశంలో ఎవరు అవినీతిపరులు కాదు? ములాయం, మాయావతి, లాలూ, కరుణానిధి.. వీళ్ళంతా ఎవరు? సీబీఐ కేసులనేవి రాష్ట్రస్థాయి రాజకీయ నాయకుల్ని దారికి తెచ్చుకోవడానికి కేంద్రం చేతిలో ఉండే ముకుతాళ్ళు. నువ్వు నీతిసూత్రాల్ని, న్యాయసూత్రాల్ని ఖచ్చితంగా అప్లై చేస్తే ఈ దేశంలోని రాజకీయ నాయకులందరూ జైల్లోనే ఉండాల్సి వుంటుంది." అన్నాడు సుబ్బు.

"సుబ్బూ! యువార్ టాకింగ్ నాన్సెన్స్! జగన్ని ఎలా సపోర్ట్ చేస్తావు?"అన్నాను.

"నేను ఎవ్వర్నీ సపోర్ట్ చెయ్యడం లేదు మిత్రమా! వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేస్తున్నాను. మనది రాజకీయంగా నిరక్షరాస్య దేశం. మధ్యతరగతి మేధావులు ఎమోషనల్ గా, సెంటిమెంటల్ గా ఆలోచిస్తుంటారు. తల్లిని చంపేశారని రాజీవ్ గాంధీకి బంగారు పళ్ళెంలో అధికారమిచ్చాం. రాజీవ్ గాంధీని చంపేశారని సోనియాకి పట్టం కట్టాం. ఇంత పెద్దదేశంలో రాజకీయాలు ప్రజల జీవన ప్రమాణాలని మెరుగుపర్చే పథకాలతో కాకుండా సెంటిమెంటుతో నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా లేదూ!" అన్నాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ చెప్పసాగాడు సుబ్బు.

"మన అనుభవంలో ఉన్న విషయాల్ని మాత్రమే మనం అర్ధం చేసుకోగలం, అనుభూతి చెందగలం. ఈ అనుభూతి లేనిదే ఫలానావాడు దుష్టుడు, దుర్మార్గుడు అని ఎంత చెప్పినా మనకి అర్ధంకాదు. ఇవన్నీ మన మైండ్ కి సంబంధించిన విషయాలు. ఉదాహరణకి - అమెరికావాడు అంతర్జాతీయంగా చేస్తున్న రౌడీయిజం మనకి పట్టదు. అదే ఒక వీధిరౌడీ అరాచకానికి మాత్రం కోపం తెచ్చుకుంటాం. విమానం కూలి నాలుగొందల మంది మరణించారన్నా పెద్ద బాధగా ఉండదు, అదే ఏ రైలేక్సిడెంట్లోనో ఇద్దరు చనిపోయినా చాలా బాధ పడతాం." అన్నాడు సుబ్బు.

"సుబ్బు! నువ్వు జగన్ అవినీతి గూర్చి మాట్లాడకుండా ఏదేదో చెబుతున్నావ్." గుర్తు చేశాను.

"నేను రిలవెంట్ గానే మాట్లాడుతున్నాను. అమెరికావాడి రాజకీయం లాగే, సమాజంలో సామాన్య జనాలకి అర్ధం కాని, ఐడెంటిఫై చేసుకోలేని అవినీతి ఉంటుంది. 2 జి స్పెక్ట్రమ్ అంటే ఏంటి? క్విడ్ ప్రోకో (quid pro quo) అంటే ఏదో తిట్టులా లేదు? గాలి జనార్ధనరెడ్డి చేసిన తప్పేంటి? ఏవో గనులు అక్రమంగా తవ్వాట్ట! మనకి మనూళ్ళో మునిసిపాలిటీవాడు అడ్డదిడ్డంగా తవ్వి పూడ్చకుండా వదిలేసిన గుంటలు మాత్రమే తెలుసు. అట్లాంటి మనం - ఎక్కడో కొండల్లో తవ్వే గనులు, గుంటలు ఎలా ఊహించుకోగలం? నువ్వూహించుకోగలవా?" అడిగాడు సుబ్బు.

"నావల్ల కాదు." అన్నాను.

"లక్షకోట్ల అవినీతి అంటారు. ఎవడన్నా కోటిరూపాయిలు ఎప్పుడన్నా లెక్కబెట్టాడా? కనీసం కంటితో చూశాడా? ఇవన్నీ మనం ఎమోషనల్ గా కనెక్ట్ కాని, కాలేని తెలివైన భారీనేరాలు. ఈ నేరాలు అర్ధం చేసుకోవాలంటే మనం సి.ఎ. చదివుండాలి." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు.

"సుబ్బూ! నేరాన్ని, నేరస్థుల్ని పట్టించుకోని సమాజం మనది అంటావ్. అంతేనా?" అడిగాను.

"నా పాయింట్ అది కాదు! మనం మన స్థాయికి తగ్గ నేరాల్ని మాత్రమే గుర్తించగలం. జేబుదొంగల్ని తన్ని పోలీసులకి అప్పజెబుతాం. అర్ధరాత్రి ఇళ్ళల్లో పడే దొంగల్ని కరెంటు స్థంబానికి కట్టేసి చావగొడతాం. ఆస్పత్రిలో పది, ఇరవై అడుక్కునే వార్డ్ బాయ్ ని అసహ్యించుకుంటాం. అందుకే శంకర్ తీసిన 'భారతీయుడు' అంత హిట్టయ్యింది, అన్నాహజారే అంత పాపులరయ్యాడు." అన్నాడు  సుబ్బు.

"అవును కదా!" ఆశ్చర్యపొయ్యాను.

సుబ్బు చెప్పడం కొనసాగించాడు.

"ఒక తప్పుడు జీవోతో, అదే ఆస్పత్ర్లి భూమిని కాజేసి వందకోట్లు లబ్ది పొందే ప్రభుత్వ పెద్దల్ని పెద్దగా పట్టించుకోం. సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేసి వేల కోట్ల అవినీతి చేస్తే, అసలా ప్రాసెస్సే అర్ధం కాక, కొద్దిసేపు బుర్ర గోక్కుని వదిలేస్తాం." అన్నాడు సుబ్బు.

"జగన్ అవినీతి సామాన్య ప్రజలు కనెక్ట్ అయ్యేది కాదంటావ్! అంతేగా? మరి జగన్ ఎన్నికల్లో గెలుస్తాడో, లేదో చెప్పలేదు." అడిగాను.

"కాంగ్రెస్ వాళ్ళు జగన్ ఎన్నికల్లో గెలిచే దాకా వదిలేట్టులేరు! నా లాజిక్ సింపుల్. దొంగని రెండు దెబ్బలేస్తే జనాలు తృప్తినొందుతారు, 'తిక్క కుదిరింది వెధవకి' అనుకుంటారు. అదే దొంగని చెట్టుకి కట్టేసి కొడితే 'అయ్యో పాపం!' అనుకుంటారు. కాంగ్రెస్ జగన్ని ఒకస్థాయిదాకా ఇబ్బంది పెడితే జనాలు పట్టించుకోరు. అవినీతికి శిక్ష పడిందనుకుంటారు. కానీ - దానికొక లక్ష్మణ రేఖ ఉంది, ఆ రేఖని కాంగ్రెస్సోళ్ళు దాటుతున్నారు. ఇది కాంగ్రెస్ కి సూసైడల్." అన్నాడు సుబ్బు.

"సోనియాగాంధీకి జగనంటే కోపం ఉండి ఉండొచ్చు." అన్నాను.

"రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకి తావులేదు. ఇందిరాగాంధీకి బేడీలు వేయించి కక్ష తీర్చుకున్న చరణ్ సింగ్ ఏమైపొయ్యాడు? నిండు కొలువులో జయలలిత చీరని లాగించిన కరుణానిధి తరవాత ఎలక్షన్లో మట్టి కరిచాడు. ముసలి కరుణానిధిని అర్ధరాత్రి ఎత్తి అవతల పడేయించిన జయలలితని ఆ తరవాత ఎలక్షన్లో ప్రజలే ఎత్తి అవతల పడేశారు!" అన్నాడు సుబ్బు.

"అదంతా సానుభూతి కోసం రాజకీయ నాయకులు చేసిన నటన సుబ్బూ!" నవ్వుతూ అన్నాను.

"అదేంటి మిత్రమా నటనని అంత తేలిగ్గా తీసిపడేశావ్? 'రక్తసంబంధం'లో రామారావు, సావిత్రి నిజమైన అన్నాచెల్లెళ్ళనుకుని ఆంధ్రదేశం యావత్తూ రోదించిందా? ఎన్టీరామారావు నిజమైన రాముడని ప్రజల నీరాజనం అందుకున్నాడా? గత వారం రోజులుగా అన్ని న్యూస్ చానెళ్ళు జగన్ని తప్పితే వేరేదీ చూపించట్లేదు. జనాలు కూడా ఏడుపుగొట్టు సీరియళ్ళు చూడ్డం మానేసి జగన్ అరెస్టు గూర్చి ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇది జగన్ కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తుంది. లక్ష్మణ రేఖని దాటుతున్న కాంగ్రెస్ నాయకత్వం జగన్ని అధికారం అనే గారెల బుట్టలోకి తంతుంది." అన్నాడు సుబ్బు.

"ఆ లక్ష్మణరేఖ ఎక్కడుందో నీకుమాత్రం ఎలా తెలుసు?" అడిగాను.

"నాకు తెలుసని నీకు చెప్పానా? నాకూ తెలీదు. కానీ అమ్మకి తెలుసు! ఆవిడ నిన్నట్నించి 'పాపం! తండ్రి లేని పిల్లాడు, ఆ అబ్బాయిని ఎందుకంతలా వేధిస్తున్నారు?' అనడం మొదలెట్టింది. ఇది కాంగ్రెస్ కి దుర్వార్త. మా పనమ్మాయి 'పాపం! వాళ్ళ నాన్న మా నాన్నకి ఫ్రీగా గుండాప్రీషన్ చేయించాడు. ఆ బాబుని జైల్లో యేయించినోడు పురుగులు పడి చస్తాడు.' అని పొద్దున్న అంట్లు తోముతూ అంది. ఇది జగన్ కి శుభవార్త. మన ప్రభుత్వాల్ని నిర్ణయించేది వీళ్ళే." అంటూ టైమ్ చూసుకున్నాడు సుబ్బు.

"రాజకీయ విషయాలు మాట్లాడేప్పుడు ఏ ఎన్.రామ్ నో, రామచంద్ర గుహానో కోట్ చెయ్యాలి. నువ్వు మీ అమ్మనీ, పనిమనిషినీ కోట్ చేస్తావేమిటి?" చికాగ్గా అన్నాను.

"ఆ పని నీలాంటి మేధావులు ఎలాగూ చేస్తున్నారుగా! ఇంక మళ్ళీ నేనెందుకు? ఈ దేశంలో మధ్యతరగతి మేధావులు వాస్తవాల్ని గుర్తించడం మానేసి చాలాకాలం అయ్యింది, అందుకే నేను వాళ్ళ ఆలోచనలు పట్టించుకోను. ఇంక నేవెళ్తా! దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ నిష్క్రమించాడు సుబ్బు.

గమనిక : ఈ పోస్ట్ రాసేప్పటికి జగన్ అరెస్టవ్వలేదు.

కృతజ్ఞత :  ఆత్మీయ మిత్రుడు గోపరాజు రవికి.. 

(photo courtesy : Google)