Thursday 17 May 2012

సుబ్బు! ది గ్రేట్ సెఫాలజిస్ట్!!



ఉదయం  పది గంటలు. ఆంధ్రజ్యోతి  పేపర్  ఎడిట్  పేజ్  చదువుతున్నాను. మొత్తానికి  ఉప ఎన్నికల  వేడి  రాజుకుంది.

"రవణ మావా! కాఫీ!" అంటూ  హడావుడిగా  లోపలకొచ్చాడు  సుబ్బు.

"కూర్చో  సుబ్బు! ఏంటి  ఉప ఎన్నికల్లో  ఎవర్ని  గెలిపించబోతున్నావ్?" అడిగాను.

"ఉప ఎన్నికల  గూర్చి  ఇప్పటిదాకా  ఏమీ  ఆలోచించలేదు. ఫలితాన్ని  బట్టి  కిరణ్ కుమార్ రెడ్డి, సత్తిబాబుల  ఉద్యోగాలు  ఉండేదీ, ఊడేదీ  తేలిపోతుంది. చంద్రబాబు, జగన్ల  షేర్  వేల్యూ  పెరిగేదీ, తరిగేదీ  తెలుస్తుంది."

"నేను  ఎవరు  గెలుస్తారు  అనడిగాను. నీ  ఎనాలిసిస్  కాదు."

"అదేమంత  కష్టమైన  పనా? సంగడిగుంట, చుట్టుగుంట, కంకరగుంట... " నవ్వుతూ  అన్నాడు  సుబ్బు.

"ఇవన్నీ  మనూళ్ళో  పేటలు. నేనడిగింది.. "

సుబ్బూ  ఇంకా  నవ్వుతూనే "లక్ష్మీపురం, చంద్రమౌళి నగర్, రింగ్ రోడ్.. " అన్నాడు.

"సుబ్బూ! ఏంటి  నీ  అసందర్భ  ప్రేలాపన? ఒక  సీరియస్  ప్రశ్న  అడిగాను. నువ్వేమో సిటీ బస్  కండక్టర్లా  ఏవేవో  పేటల  పేర్లు  వాగుతున్నావ్ ! నీతో  ఇదే  తంటా!" విసుక్కున్నాను.

"ఉప ఎన్నికల్లో  ఎవరు  గెలుస్తారని  అడిగావుగా? వెళ్దాం  పద. ఆ  పేటల్లో  సర్వే  చేద్దాం. కొద్దిసేపట్లోనే  నీకు  ఎవరెవరు  ఎంత  మెజారిటీతో  గెలుస్తారో  చెప్పేస్తాను."

"వార్నీ! సర్వేనా. ఈ  పేటల్లో  తిరిగి  సర్వే  ఏమిటోయ్! అసలు  మనూళ్ళో  ఉప ఎన్నికలే  లేవు. సరే గానీ.. చివరకి  నువ్వు  కూడా  సర్వే  అంటూ  బయల్దేరావా  సుబ్బూ! లగడపాటి  డబ్బేమన్నా ఇచ్చాడా?"

"రవణ మావా! ఫలానా  నియోజక వర్గం  అని  నేను  చెప్పట్లేదు. ఎన్నికలు  ఉన్నా, లేకున్నా  ప్రజల  మూడ్  అనేది  ఒకటి  ఉంటుంది. కాబట్టే  ఎలెక్షన్లలో  కూడబలుక్కున్నట్లు  ఇచ్చాపురం  నుండి  తడ  దాకా  ఓటింగ్ లో  ఒక  పేటర్న్  ఉంటుంది. అందువల్ల.. నేనిప్పుడు  ఒక  కొత్త రకం  ఎలెక్షన్   సర్వేని   ప్రపోజ్  చేస్తున్నాను. కంట్రోల్  గ్రూప్స్, శాంపిల్  కలెక్షన్, మెథడాలజీ, స్టాటిస్టిక్స్.. అంతా  కొత్తగా  ఉంటుంది."

సుబ్బు  వైపు  ఆసక్తిగా  చూస్తూ  ఆంధ్రజ్యోతి  పేపర్ని  మడిచి పక్కన  పడేశాను.

ఆలోచిస్తూ  నిదానగా  చెప్పసాగాడు  సుబ్బు. "కంపేరిటివ్  గ్రూప్స్  రెండు. వంద  సంఖ్యకి  స్టాండర్డైజ్  చేద్దాం. మొదటి  గ్రూప్  అప్పర్  మిడిల్  క్లాస్. రెండో  గ్రూప్  లోయర్  మిడిల్  క్లాస్."

"ఇంటరెస్టింగ్  సుబ్బు! యూ  సౌండ్  లైక్  యోగేంద్ర  యాదవ్!"

"రింగ్  రోడ్  మనూళ్ళో  పోష్  ఏరియా. కాబట్టి  మన  స్టడీకి  ఫస్ట్  గ్రూప్  రింగ్  రోడ్  వాసులు. ఈ  స్టడీకి  ఇంక్లూజన్  క్రైటీరియా  రోజూ  న్యూస్  పేపర్  చదివేవాళ్ళు. ఇంగ్లీష్  పేపర్  చదివేవాళ్ళయితే  మరీ  మంచిది. వీరి  అభిప్రాయం  మనకి  చాలా  విలువైంది. ఎలెక్షన్లలో  ఎవరు  ఓడిపోతారో నిర్ణయించేది  వీరే! ఈ  స్టడీ  అర్ధం  కావడం  కోసం  కొన్ని  ఫిగర్స్  ఇస్తాను. రింగ్ రోడ్  శాంపిల్  ఒపీనియన్   రిజల్ట్  ఇలా  ఉందనుకుందాం. చంద్రబాబు  50, జగన్  30, కాంగ్రెస్  15, లోక్ సత్తా 5. మొత్తం  100. ఇప్పుడు  100/10 = 10. ఇదే  రేషియోలో  అన్ని  పార్టీలకి  ఓట్లు  పదో వంతుకి  పడిపోతయ్."

ఇంతలో  కాఫీ  వచ్చింది.

"సుబ్బూ! నీకు  లెక్కలు  రావని  నాకు  తెలుసు. కానీ  మరీ ఇంత  పూర్  అని  అనుకోలేదు."


"నా  లాజిక్  చాలా  సింపుల్! ఈ  శాంపిల్  గ్రూప్ కి  విషయం  తక్కువ. హడావుడి  ఎక్కువ. 'సామాజిక సృహ' తో  పేపర్లకి  ఉత్తరాలు  రాస్తుంటారు. టీవీల్లో  ఉపన్యాసాలు  చెప్తుంటారు. అవినీతిపై  పోరాటం  అంటూ  కొవ్వొత్తుల  ప్రదర్శనలు  చేస్తారు. కొవ్వొత్తుల  ఫ్యాక్టరీ  వాడికి  వ్యాపారం  పెరగడం  తప్ప  ఒరిగేదేముండదు. ఎయిడ్స్ కి  వ్యతిరేకంగా  పరిగెత్తుతారు. మనకి  ట్రాఫిక్  కష్టాలు. వాళ్ళకి  పిక్కల  నొప్పులు. వీళ్ళ  హడావుడి  బట్టి  ఫలానా  అభ్యర్ధి  గెలుస్తాడనే  భ్రమలు  పెట్టుకోకూడదు. ఇన్ ఫాక్ట్  ఆపొజిట్  ఈజ్  ఆల్వేస్  కరెక్ట్. అందుకే  రాజకీయ  పార్టీలు  కూడా  వీళ్ళని  పట్టించుకోవు."

"ఎందుకని?"

"ఈ  గ్రూపుకి  ఎలెక్షన్  కన్నా  క్రికెట్  మ్యాచ్ లకే  ప్రాముఖ్యత. అందుకనే  ప్రభుత్వాలు  కూడా  ఎలెక్షన్   రోజు  క్రికెట్  మ్యాచ్  ఉండేట్లు  ఏర్పాట్లు  చేస్తున్నాయ్. టీవీలో  లేటెస్ట్  సినిమా  ప్రసారం  చేయిస్తాయి. ఎండా కాలంలో ఎలక్షన్లు  ఒచ్చేట్లు  జాగ్రత్తలు  తీసుకుంటాయి. వీళ్ళు  ఇన్ని  అవరోధాలు  దాటుకుని  రోడ్డేక్కే  అవకాశం  లేదు. కాబట్టి  నూటికి  తొంభై మంది  ఓటే  వెయ్యరు. అందుకే  పదితో  డివైడ్  చేశాను."

"ఒకే! ఒప్పుకుంటున్నా!"

"మనమిప్పుడు  సెకండ్  గ్రూపుకి  వద్దాం. కంకరగుంట.. "

"ఆపు  సుబ్బూ! ఇందాక  ఆ  గుంటలన్నీ  చెప్పేశావ్. దిగువ  మధ్య తరగతి  ఏరియాలని  చెప్పు. చాలు." అన్నాను.

"ఓకే! ఇప్పుడు  మన  సెకండ్  గ్రూప్  స్టడీకి  exclusion  క్రైటీరియా  న్యూస్  పేపర్  చదివేవాళ్ళు. పొరబాటున  కూడా  న్యూస్ పేపర్  కేసి  చూడని వాడయితే  మరీ మంచిది. ఇది  చాలా  ముఖ్యమైన  గ్రూప్. ఏ  రాజకీయ  పార్టీ  గెలుస్తుందో  నిర్ణయించేది  వీరే్! ప్రజాస్వామ్యాన్ని  కాచి  వడబోసిన వారు  ఈ  గ్రూపులో  ఉంటారు. ఏ  పార్టీ  అధికారం లోకొచ్చినా  చేసి  చచ్చేదేమీ  లేదని  గ్రహించిన  మహానుభావులు  వీరు. అందుకే  హాయిగా  'దమ్ము', 'గబ్బర్ సింగ్'  సినిమాలు  ఒకటికి  రెండు సార్లు  చూసుకుంటూ.. ఎలెక్షన్   రోజున  ఐదొందలు, వెయ్యి  నోటు  తీసుకుని  ఓటేస్తారు."

ఇంతలో  ఏదో  ఫోన్. ఆన్సర్   చేసి  సుబ్బు  వంక  చూశాను. సుబ్బు  మళ్ళీ  చెప్పసాగాడు.

"ఇప్పుడు  మన  రెండో  గ్రూప్  ఒపీనియన్   రిజల్ట్  ప్రకటిస్తున్నాను. సాధారణంగా  ఈ  రెండు  గ్రూపుల  ఓటింగ్  ఆపొజిట్  డైరక్షన్లో  ఉంటాయి. ఇందాక  చంద్రబాబుకి  ఎక్కువొచ్చాయి. ఇప్పుడు  జగన్ కి  ఎక్కువ  రావాలి. కాబట్టి  జగన్   50. చంద్రబాబు  35. కాంగ్రెస్  14. లోక్ సత్తా 1. మొత్తం  100. ఇప్పుడు  100 x 2 = 200.


"చూడు  మైడియర్  ప్రన్నొయ్ రాయ్! ఈ  డివిజన్లూ, మల్టిప్లికేషన్లు.. "  ఏదో  చెప్పబోయాను.

నన్ను  మాట్లాడొద్దన్నట్లుగా  చేత్తో  సైగ  చేశాడు  సుబ్బు.

"ఇందాక  చెప్పాగా. వీళ్ళు  ఎండలో  ఎండుతూ.. క్యూలో  నించుని  మరీ  ఓట్లేస్తారు. కుర్రకారు  తమ  అభిమానాన్ని ఒకటికి  రెండు సార్లు (రెండు  ఓట్లతో) నిరూపించుకుంటారు. వీరికి  ఓటు  'విలువ'  తెలుసు. అందుకే  మన  శాంపిల్ని  రెండుతో  హెచ్చవేశాను. ఇప్పుడు  ఈ  రెండు గ్రూపుల్ని  కలిపెయ్యి. ఫైనల్  రిజల్ట్  ఇలా  ఉంటుంది."

   పార్టీ  పేరు                                                గ్రూప్ 1                గ్రూప్  2           మొత్తం.
తెలుగు దేశం ....................................   05  (50/10)     +    70   (35 x 2)   =   75        
YSR కాంగ్రెస్  పార్టీ ............................   03  (30/10)     +   100  (50 x 2)   =  103                    
కాంగ్రెస్ ............................................    1.5  (15/10)    +     28  (14 x 2)    =   29.5
లోక్ సత్తా ..........................................   0.5  (5/10)      +     02  (1 x 2)      =   2.5

"నువ్వు  జగన్ని  గెలిపించావేమిటి? చంద్రబాబు  వ్యతిరేకివా?"

"నాకెవరైనా  ఒకటే. ఏదో  ఉదాహరణ  కోసం  ఆ  ఫిగర్స్  చూపించాన్లే. నాకు  ఇల్లూ, ఆనంద భవన్  తప్ప  వేరే  ప్రపంచం  తెలీదు. ఆ మాటకొస్తే  నీకు  మాత్రం  ఏం  తెలుసు? పొద్దస్తమానం  ఈ  నాలుగ్గోడల  మధ్య  సెంట్రల్  జైలు  ఖైదీలాగా  గడిపేయడం  తప్ప! అందుకే  నిన్ను  బయటకి  రమ్మంటుంది. అప్పుడు  మనకి  కరెక్ట్  పొజిషన్ తెలుస్తుంది."

"ఏడిసినట్లుంది. ఇదొక  సర్వే! నువ్వొక  సెఫాలజిస్ట్ వి! ఒకడికి  ఒక  ఓటే  ఉంటుంది. అంతేగాని  ఒకసారి  పదో వంతు  వోటు, ఇంకోసారి  రెండు  ఓట్లు  ఎలా  సాధ్యం? అంతా  గందరగోళంగా  ఉంది. నీ  లెక్క  నాకు  నచ్చలేదు."


"నీ  ఖర్మ! చంద్రబాబుకి  జ్ఞానోదయం  అయ్యిందిగానీ.. నీకు  మాత్రం  అవ్వలేదు." అన్నాడు  సుబ్బు.

"ఏంటోయ్  నీ  గోల?"

"అవును రవణ మావ! రింగ్ రోడ్  వాడి  కారు  కోసం  చంద్రబాబు  రోడ్లు  వెడల్పు  చేశాడు. ఆ  ప్రాసెస్ లో  చుట్టుగుంట, సంగడి గుంట, కంకరగుంట  వాళ్ళ  అరటికాయ బళ్ళూ, పూల బుట్టలు, బడ్డీ కొట్లూ  కోల్పోయారు. వీళ్ళకి  కడుపు  మండింది. ఆ  సెగకి  చంద్రబాబు  మసాలా అట్టులా  మాడిపొయ్యాడు." అంటూ  ఖాళీ  కప్పు  టేబుల్  మీద  పెట్టాడు.

"మరి  రాజశేఖరరెడ్డి?"

"చంద్రబాబు  ఒక  మనిషి  ఒక  ఓటుతో  సమానం  అనుకున్నాడు. కాబట్టే  ఈ  సెఫాలజీ  కేలిక్యులేషన్  అర్ధం  చేసుకోలేకపోయాడు. రాజశేఖరరెడ్డికి  విషయం  బాగా  అర్ధమయ్యింది. అందుకే  ఫస్ట్  గ్రూప్ ని  వదిలేసి  సెకండ్  గ్రూప్  మీద  దృష్టి  పెట్టాడు. వాళ్ళకి  ఆరోగ్యశ్రీ  అన్నాడు. ఫీజ్  రీ ఇంబర్స్ మెంట్  అన్నాడు. జనాలు  కూడా  తెలివి  మీరి  పొయ్యారు. జంధ్యాల  తీసిన  'అహ! నా పెళ్ళంట!' సినిమా  చూశావుగా? అందులో  కోట  శ్రీనివాసరావు  అడుగుతుంటాడు  'నాకేంటి?' అని! ప్రజలు  కూడా  ఎవరికి వారే 'నాకేంటి?' అని  అడుగుతున్నారు. అందుకే  ప్రాజెక్టులే  లేకుండా  కాలవలు  తవ్వుతూ  డబ్బులు  దోచేస్తున్నారని  నెత్తీ, నోరూ  కొట్టుకుంటున్నా.. 'అయితే  ఏంటంట?' అంటూ  వంకరగా  నవ్వుతున్నారు."

"సుబ్బూ! రోజూ  ఉప్మా పెసరట్టు  తిని  గొప్ప  జ్ఞానివైపొయ్యావు." అన్నాను.

సుబ్బు  నవ్వాడు. " ప్రజలు  మాత్రం  అజ్ఞానులు  కారు. డబ్బు  విలువ  పెరిగిపోయింది. ఎవరి  ఎజెండా  వారికుంది. ఓటుకి  వెయ్యి రూపాయిలు  నిలబెట్టి  వసూలు  చేసుకుంటారు. అర్హత  లేపోయినా  తెల్లకార్డు  పుట్టించి  ఆరోగ్యశ్రీని  వాడుకుంటారు. పక్కనోడు  చస్తున్నా  పట్టించుకోవడం  మానేశారు. 'నువ్వు  ఎంతైనా  తిను. నాకెంతిస్తావ్ ?' అంటున్నారు. ఇది  గమనించిన  చంద్రబాబు  డబ్బులు  నెలనెలా  ఇళ్ళకి  పంపిస్తానని  వాగ్దానం  చేశాడు. తను  మారిన  మనిషినని  ఘోషించాడు. బట్  టూ  లేట్, టూ  లిటిల్! అందుకే  జనాలు  నమ్మలేదు. ఇంక  దానం  చెయ్యడానికి  రాజకీయ పార్టీలకి  సెక్రటేరియట్  తప్ప  ఏమీ  మిగల్లేదు."

"కానీ  రాజకీయాల్ని  ప్రక్షాళన  చెయ్యాలంటే.. "

"ప్రక్షాళన  చెయ్యాల్సిన  రాజకీయ  నాయకులు  ఓట్ల  భిక్షాటనలో  పడ్డారు. ఈ  దేశంలో కడుపు  నిండిన వాడే  మేధావి. బోలెడు  నీతులు  చెబుతాడు. వాటినే  నువ్వు  పరమ పవిత్రంగా  న్యూస్ పేపర్లలో  వార్తలుగా  చదువుతుంటావ్. తీవ్రంగా  ఆలోచిస్తూ  బుర్ర  పాడు  చేసుకుంటావ్. కానీ  ఈ  మేధావులకి  కూడా  హిడెన్   ఎజెండా  ఉంటుందని  గుర్తుంచుకో. నా  దృష్టిలో  డబ్బు  తీసుకుని  ఓటేసేవాడి  కన్నా ఈ  మేధావులే  ప్రమాదకారులు." అని  టైం  చూసుకుంటూ..

"నేవెళ్ళాలి. దారిలో  చాలా  పనులున్నయ్." అంటూ  నిష్క్రమించాడు  సుబ్బు! ది  గ్రేట్  సెఫాలిజిస్ట్!