Monday, 28 May 2012

'అపరిచితుడు' అప్పారావు


"జగన్ అరెస్ట్ అన్యాయం, అక్రమం. నేను దీన్ని తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను. నిన్నట్నుండి మా వంటింట్లో పొయ్యిమీద గండుపిల్లి గురకలు పెట్టి నిద్రోతుంది. రెండునెల్ల పసిగుడ్డుతో సహా ఎవరూ పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టలేదు. నా భార్య జగన్  జైల్నుండి విడుదలయ్యే దాకా కాపురం చెయ్యనంటూ పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికెళ్ళిపోయింది. మా నాన్న 'జగన్బాబూ!' అంటూ గుండెనొప్పితో మెలికలు తిరిగిపోయాడు. ఆస్పత్రిలో చేర్పించాం. ఆయన అటూఇటుగా ఉన్నాడు. మా అమ్మ 'జగన్! జగన్!' అంటూ పిచ్చిపట్టి ఏడుస్తూ ఎటో వెళ్ళిపోయింది. అన్నా! జగనన్నా! నువ్వు పోరాటం సాగించన్నా! నీ వెనక మేమున్నామన్నా! నువ్వు దేవుడవన్నా! జై జగన్!" అంటూ భోరున విలపిస్తూ కూలిపోయాడు అప్పారావు.

"కట్!" చెప్పాడు 'సాక్షి' చానెల్ విలేఖరి

కెమేరామెన్ కెమేరాని సర్దుకుంటున్నాడు.

"ఏం బాబు! ఎమోషన్ బాగా కేరీ అయ్యిందా? కావలంటే ఇంకో టేక్ తీద్దాం." అన్నాడు అప్పారావు.

"అవసరం లేదు. ఇప్పటికే ఎక్కువ చెప్పారు." అన్నాడు 'సాక్షి' విలేఖరి.

అటు తరవాత అప్పారావు భార్య వారికి జీడిపప్పు ఉప్మా, నేతి పెసరట్లు వడ్డించింది.

వాళ్ళ పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మీ ఎడిటర్ తో మాట్లాడండి. ఇప్పుడు చెప్పిన దానికి కొద్దిగా శృతి పెంచమన్నా పెంచుతాను, తగ్గించమన్నా తగ్గిస్తాను. మీ చానెల్ కి నా అభిప్రాయాన్ని చెప్పడానికి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తా!" ఫ్రీ ఆఫర్ ఇచ్చాడు అప్పారావు.

అప్పారావు భార్య ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

"మీకు ఏ టాపిక్ మీద బైట్ కావలన్నా నన్ను సంప్రదించండి. రూపాయి పతనాన్ని ఆపలేక దువ్వూరి సుబ్బారావు చేతులెత్తేశాడు. ఆయనతో నాకు లైవ్ షో ఏర్పాటు చెయ్యండి. నా సలహాలకి సుబ్బారావు స్పృహ తప్పిపోవాలి." గర్వంగా అన్నాడు అప్పారావు.

వారికి వేటపాలెం జీడిపప్పు ప్యాకెట్లు చేతిలో పెట్టాడు.

"ఇవి ఉంచండి. గుర్తుంచుకోండి, అప్పడం నుండి అమెరికా దాకా అన్ని సబ్జక్టుల్నీ కరకరలాడించి మింగేశాను. 'పనామాలో పందిమాంసం రేటెందుకు డౌనయ్యింది? ఇరాక్ లో ఉబ్బసానికి చేపమందు పని చేస్తుందా?' వంటి ఎకనామిక్ అండ్ సైంటిఫిక్ కార్యక్రమాల్లో కూడా నా అభిప్రాయం తీసుకోండి." ప్రాధేయపడ్డాడు అప్పారావు.

అప్పారావు ఆతిధ్యాన్ని స్వీకరించి 'బ్రేవ్!' మంటూ సెలవు తీసుకున్నారు 'సాక్షి' వారు.

అలసటగా కళ్ళు మూసుకుని సోఫాలో కూలబడ్డాడు అప్పారావు. తన 'అభిప్రాయం' సాక్షి చానెల్ వాళ్ళకి చెప్పడానికి 'మూడ్' (కన్నీళ్ళు) కోసం వంటింట్లో నాలుగు ఉల్లిపాయలు తరిగాడు. అంచేత కళ్ళు మండుతున్నాయి. నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.


"అప్పు! అప్పు! లేలే! నీ కోసం ఇంకో చానెల్ వాళ్ళొచ్చారు." అంటూ భార్య అరవడంతో ఉలిక్కిపడుతూ లేచాడు.

"నమస్తే! మేం ABN ఆంధ్రజ్యోతి చానెల్ నుండి వచ్చాం. జగన్ అరెస్టు గూర్చి మీ అభిప్రాయం చెబుతారా?" అంటూ ఆ చానెల్ వాళ్ళు వచ్చీ రావడంతోనే మొదలెట్టారు.

అప్పారావు వంటింట్లోకి పరిగెత్తాడు. నిమ్మకాయని కత్తితో రెండు బద్దలుగా కొశాడు. ఒక్కోకంట్లో ఒకబద్ద పిండుకున్నాడు. కళ్ళు ఎర్ర్గగా, చింతనిప్పుల్ల్లా మారిపొయ్యాయి. హాల్లోకొచ్చి కెమెరా ముందు నిలబడ్డాడు.

"కెమెరా స్టార్ట్!"

"జగన్! జగన్! జగన్! అసలెవరీ జగన్? అఫ్టరాల్ ఒక ముఖ్యమంత్రి కొడుకు. విక్రమార్కుడా? కాదు, అక్రమార్కుడు. అవినీతికి కేరాఫ్ అడ్రెస్. ఈ దేశం ఏమైపోతుంది? జగన్ని సమర్ధించేవాళ్ళలారా! ఖబడ్దార్! ఒక విషయం గుర్తుంచుకోండి!" అంటూ కెమెరాలోకి కౄరంగా చూశాడు.

"జగన్ని సమర్ధిస్తే మీరు సద్దామ్ హుస్సేన్, ఒసమా బిన్ లాడెన్ని సమర్ధించినట్లే! జగన్ అవినీతి వల్లే ఎండలు మండిపోతున్నయ్, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నయ్, సినిమాలు ఫ్లాపయిపోతున్నాయి." అంటూ గర్జించాడు అప్పారావు.

ఆంధ్రజ్యోతి వారిక్కూడా టిఫిన్లూ, కాఫీలు ఎరేంజ్ చేయబడ్డయ్.

తింటున్నవారి పక్కన కూర్చున్నాడు అప్పారావు.

"మొన్నామధ్య మీరు మా ఎదురింటి మంగతాయారుకి, పక్కింటి కృష్ణారావుకీ గల అక్రమ సమ్మందమ్మీద ఎనిమిది గంటల చర్చా కార్యక్రమం నడిపారు. ఎంత బ్రతిమాలినా నాకు మాట్లాడ్డానికి ఛాన్సివ్వలేదు. దయచేసి విలువైన నా అభిప్రాయం కూడా తీసుకోండి. నాకు బయాలజీ నుండి బూర్లెపాకం దాకా అన్ని  సబ్జక్టుల మీద మంచి గ్రిప్పుంది."

ఆంధ్రజ్యోతివాళ్ళు వెళ్ళేప్పుడు నూజివీడు రసాలు, ఆవకాయ జాడీలతో నిష్క్రమించారు.

అప్పారావు భార్యకి అనుమానం వచ్చింది.

"అప్పు! నువ్విట్లా చానెల్ చానెల్ కీ 'అపరిచితుడు'లో హీరోలాగా రంగులు మార్చేస్తున్నావ్. జనాలకి తెలిస్తే ప్రమాదమేమో?"

అప్పారావు నవ్వాడు.

"పిచ్చిమొహమా! అలా చెబితేనే వాళ్ళు చూపిస్తారు. అయినా - ఎవడికి నచ్చిన చానెల్ వాడు చూస్తాడు. ఒకవేళ అన్ని చానెళ్ళు చూసే పని లేని సన్నాసి ఎవడైనా ఉంటే అది వాడి ఖర్మ. సర్లే! నువ్వు వంట పని చూడు. ఈ దెబ్బకి మన పేరు ఆంధ్రదేశంలో మోగిపోవాలి." అన్నాడు అప్పారావు! 

(picture courtesy : Google)