Wednesday, 20 June 2012

బిరియానీయేనా? కాదుకాదు.. పులిహోరే

"నాకు మనసులొ ఒక ఆలోచన, బయటకో మాట ఉండదు డాక్టర్. ఉన్నదున్నట్లుగా మాట్లాడటం అలవాటు. అందుకే నాభార్యతో నాకు ఘర్షణ." ఆయన university professor. బట్టతల. పిల్లిగడ్డం. తనేదో న్యూటన్ కొత్తసూత్రం కనుక్కున్నట్లు వాపోయాడు. 
               
నాకు నవ్వొచ్చింది. ఈయనగారికి నరాల weakness కాదు. tongue weakness ఉందన్నమాట! ఉన్నదున్నట్లు మాట్లాడటానికి ఈయనేమన్నా సత్యహరిశ్చంద్రుడా? అందునా భార్యతో! అందుకే నా పేషంటయ్యాడు. 

మనసులోని ఆలోచనలకి సంబంధం లేకుండా అవతలవారికి నచ్చే అభిప్రాయాలు వ్యక్తం చెయ్యటం అనే కళలో నాకు చిన్నప్పుడే ట్రైనింగ్ అయిపోయింది. అందుకు నేను ఎన్టీరామారావుకీ, అక్కినేని నాగేశ్వరరావుకీ ఎంతైనా రుణపడివున్నాను.  

నాకు చిన్నప్పుడు ఎన్టీరామారావంటే అంతులేని ఆరాధన. ఆయనకి అసాధ్యం అనేదే లేదు. చైనా యుద్ధానికి రామారావుని పంపితే ఒకేఒక్కరోజులో యుద్ధం గెలిచేవాడని నమ్మేవాడిని. నెహ్రూకి నాఅంత తెలివిలేదు కాబట్టి రామారావుని వాడుకోలేదు. రామారావు నా super man, spider man, batman. 

కానీ.. నాకన్నా తెలివైనవాళ్ళని నేను అనుకునేవారందరూ.. ఏయన్నార్ అభిమానులు. నాగేశ్వరరావుతో నాకు చాలా ఇబ్బందులుండేవి. ఆయన ప్రేమ ఎంతకీ తెగదు. అసలు విషయం వదిలి ఘంటసాల పాటలు పాడుకుంటూ.. ఆత్రేయ రాసిన భారీడైలాగులు చెబుతూ.. వీలైతే మందు తాగుతూ.. కాలక్షేపం చేస్తుంటాడు. ఆపై హీరోయిన్ల త్యాగాలు, అపార్ధాలతో తలబొప్పి కట్టేది. ఈయనగారి ప్రేమకి మలబద్దకం లక్షణాలు కూడా ఉండేవి.    
               
ఇదే ఎన్టీవోడయితేనా.. "ఏం బుల్లెమ్మా" అంటూ హీరోయిన్ని ఒక్కలాగుడు లాగేవాడు. ఎంతలావు హీరోయినయినా (దేవిక , కేఆర్ విజయ, సావిత్రి నిజంగానే లావుగా ఉండేవాళ్ళు).. పక్కటెముకలు ఫటఫటలాడగా.. ప్రేమ చేతనో, ప్రాణభయం చేతనో రామారావు కౌగిలిలో ఒదిగిపోయేవారు. 

అందుకనే రామారావుకి ప్రేమ అనేది ఎప్పుడూ సమస్యే కాలేదు. కాబట్టే కధని ముందుకు నెట్టడానికి మొదట్లో రాజనాల.. తరవాత రోజుల్లో సత్యనారాయణ.. నడుం బిగించేవాళ్ళు. చివర్లో రామారావు చెయ్యబోయే ఫైటింగుల కోసం ఉగ్గబట్టుకుని ఎదురు చూసేవాణ్ణి. కొండల్లో, కోనల్లో, ఎడారుల్లో.. క్షణక్షణానికి సెట్టింగులు మార్చుకుంటూ.. గంటలకొద్దీ ఫైట్లు చేసిన రామారావు నన్నెప్పుడూ నిరాశ పరచలేదు. అవన్నీ నాజీవితంలో ఈనాటికీ మరువలేని మధుర క్షణాలు.

ఇంత భయంకరంగా ఎన్టీఆర్ ని అభిమానిస్తూ కూడా.. బయటకి మాత్రం రామారావు అంటే ఇష్టం లేనట్లుగా నటించేవాడిని. ఎందుకు? ఎందుకంటే.. మేధావి అన్నవాడు నాగేశ్వరరావు జీళ్ళపాకం ప్రేమనే మెచ్చుకోవాలి. రామారావుని మనసులోనే ఆరాధించుకుంటూ.. బయటకి మాత్రం.. 'ఛీ ఛీ! అవేం సినిమాలు. నేలక్లాసోళ్ళు విజిల్స్ వేసుకోటానికి తీస్తారనుకుంటా.. ఒక కథా పాడా!' అంటూ రామారావు సినిమాలని విమర్శిస్తూ.. నన్ను నేను class audience category లోకి నెట్టుకునేవాడిని.   

మనసులో ఒక అభిప్రాయం ఉంచుకుని, బయటికి వేరొకటి మాట్లాడటం అనే కళని ఈవిధంగా చిన్నప్పుడే వంటపట్టించుకున్నా. తద్వారా తెలివైనోళ్ళ మధ్య తెలివితేటలు ఒలకపోస్తూ మాట్లాడే విద్య అబ్బింది. నేను బయటకి బిరియానీలా కనిపిస్తాను. కానీ నామనసు మాత్రం పులిహోర. నేను pizza లా కనిపించే పెసరట్టుని. లేకపోతే మన సత్యహరిశ్చంద్ర ప్రొఫెసరుగారిలా పేషంటునయిపోయేవాడినేమో!   

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.