Friday 8 June 2012

అమ్మా! నువ్వు కూడానా!?


"కన్నా! నీ కోసం మన వి.హనుమంతరావు దగ్గరుండి మరీ చేయించాడు, హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో తెప్పించాను." అంటూ ఘుమఘుమలాడుతున్న హైదరాబాద్ బిరియానిని ప్రేమతో రాహుల్ గాంధీకి వడ్డించబోయింది సోనియా గాంధి.

మొహం చిట్లించాడు రాహులుడు.

"అమ్మా! బిరియాని నాకొద్దు, ఆ హైదరాబాదు పేరు వింటే చీమలు పాకినట్లు ఉంది. ఆంధ్రప్రదేశ్ నాయకులంటేనే నాకు ఎలెర్జీ!" అన్నాడు.

ఆశ్చర్యపోయింది సోనియా.

"అదేంటి కన్నా! తరతరాలుగా మన కుటుంబసేవలో తరించిపోతున్నారు ఆంధ్రానాయకులు. వాళ్ళు విశ్వాసానికి, వినయానికి మారుపేరు. ఏం? ఈ మధ్య నువ్వు కనపడినప్పుడల్లా పొర్లిగింతల దండాలు పెట్టటం తగ్గించారా? మరేం పర్లేదు. వయలార్ రవితో చెబుతాను. కావాలంటే రోజల్లా గుంజిళ్ళు తీయించుకో, గోడకుర్చి వేయించుకో." ఆనునయంగా అంది సోనియా.

"వాళ్ళు నన్ను ఉపఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారమ్మా!" కోపంగా అన్నాడు రాహుల్.

అర్ధమయ్యిందన్నట్లు తల పంకించింది సోనియా.

"నాకు తెలుసు, ఎండలు మండిపోతున్నాయి, నువ్వు తట్టుకోలేవు. అయినా నీవంటి గొప్ప దేశనాయకుణ్ణి ఉపఎన్నికల ప్రచారానికి పిలవటానికి వాళ్ళకసలు బుద్ధుందా? ఇదంతా ఆ గులాం నబి నిర్వాకం. నువ్వు సీరియస్ గా తీసుకోకు కన్నా!" అంది సోనియా.

"అమ్మా! నన్ను ప్రచారానికి రమ్మంటుంది మన పార్టీవాళ్ళు కాదు, జగన్ పార్టీవాళ్ళు. వాళ్ళకి తమ గెలుపు మీద డౌటుగా ఉందిట. నేవెళ్తే మన కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు కూడా రావన్నది వారి నమ్మకమట!" పళ్ళు పటపటా నూరాడు రాహుల్.

సోనియాకి కూడా కోపం వచ్చింది.

"ఎంత పొగరు. ఇప్పుడే అహ్మద్ పటేల్ కి పురమాయిస్తాను. చిదంబరంతో చెప్పి జగన్ మీద ఇంకో రెండొందల కేసులు వేయిద్దాం, బెయిల్ వచ్చేప్పటికి ముసలాడయిపోతాడు. తిక్క కుదుర్తుంది వెధవకి!" కసిగా అంది.

రాహుల్ ఒక్కక్షణం ఆలోచించాడు. అప్పటికప్పుడే ఒక స్థిరనిర్ణయానికొచ్చేశాడు.

"ఇంక ఊరుకుని లాభం లేదమ్మా! నేనిప్పుడే ఉపఎన్నికల ప్రచారం కోసం ఆంధ్రా వెళ్తున్నాను. జగన్ పార్టీవాళ్ళకి బుద్ధొచ్చేలా ప్రచారం నిర్వహిస్తాను." అన్నాడు.

సోనియా గాంధి కంగారుపడింది, ఆందోళన చెందింది, భయపడిపోయింది, తెల్లని మొహం నిండా చిరుచెమటలు!

"కన్నా! వద్దు, వద్దు. నువ్వంత కఠోరనిర్ణయాలు తీసుకోకు. ఇప్పటికే మన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఈ సమయంలో నువ్వెళ్ళావంటే మొదటికే మోసం.. " అని సోనియా అంటూండగా..

'దబ్బు'మన్న శబ్దం!

రాహుల్  గాంధీ డైనింగ్ టేబుల్ మీద నుండి కింద పడిపోయాడు. దొర్లుతూ, వెక్కివెక్కి ఏడుస్తూ అన్నాడు.

"అమ్మా! నువ్వు కూడానా!!"

(photo courtesy : Google)