Friday, 1 June 2012

case sheet ఆలోచనలు


ఈ మధ్య నా పోస్టుల పట్ల కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. నేను గోడమీది పిల్లిలా, కర్ర విరక్కుండా పాము చావకుండా అందరితో మంచిగా ఉండాలన్నట్లుగా రాస్తున్నానని. 'నిజమా!' ఆని ఆశ్చర్యపోయాను. 'నిజమేనా?' అని ఆలోచించాను. 'నిజమే  కదా!' అని convince అయిపోయాను. మరైతే.. నేనెందుకిలా రాస్తున్నాను!?

నా రాతలు శరత్‌చంద్ర చటర్జీ కథల్లో మాత్రమే కనిపించే 'అందరూ మంచివారే!' తరహా కేరక్టర్లతో, ఆలోచనలతో రాసినట్లున్నాయా? అయితే - 'నేరం నాది కాదు, నా వృత్తిది' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. నీ defense రాజకీయ జీవుల వాదనలా అధ్వాన్నంగా ఉందని విసుక్కోకుండా నా గోడు వినమని విజ్ఞప్తి.

నేను వృత్తి రీత్యా కొన్ని దశాబ్దాలుగా నాలుగ్గోడల మధ్య ఉండిపోయాను. ఏ రాజకీయపార్టీతోనూ ఎప్పుడూ సంబంధాల్లేవు. నాది కేవలం పుస్తక పాండిత్యం. ఎన్నిపుస్తకాలు చదివినా జనాలతో కలిసి పని చేయడం అనేది విలువైన అనుభవం. అది నాకులేదు. అంచేత mood of the common man నాకు తెలిసే అవకాశం లేదు. కావున నా బ్లాగుల్లో నేరాసే విశ్లేషణలు పూర్తిగా నా బుర్రలో పైత్యమే! నాకున్న పరిమితుల గూర్చి నాకు పూర్తి అవగాహన ఉంది.

మరెందుకు రాయడం? చేతిలో laptop ఉంది, దానికో wifi connection ఉంది, బుర్రలో కావలసినంత అజ్ఞానం ఉంది. రాయడానికి ఇంతకన్నా సరంజామా ఏంకావాలి? నేనేమీ టీవీల్లో కనబడే మేధావిని కాదు. వారు ప్రజలందరి తరఫున ఆలోచిస్తూ, మన అందమైన భవిష్యత్తు కోసం విలువైన సలహాలు ఇవ్వగలరు. నాకంతటి శక్తి లేదు. నేను నా తరఫున, నా ఆలోచనలని మాత్రమే రాయగలను, రాస్తున్నాను. నా అవగాహన పూర్తిగా తప్పయ్యే అవకాశం కూడా వుంది. ఆపాటి జ్ఞానం, స్పృహ నాకున్నాయని మనవి చేస్తున్నాను.

మొన్నో డాక్టర్ మిత్రుడితో పిచ్చాపాటి మాట్లాడుతుండగా - ఆయన నవ్వుతూ "మనం చేసే రాజకీయ విశ్లేషణ medical case sheet లా ఉంటుంది. గమనించారా?" అన్నాడు. అప్పుడు వెలిగింది నాకు లైట్ - నేను ఇలా ఎందుకు రాస్తున్నానో!

ఇప్పుడు మీకు కొన్ని వైద్యశాస్త్ర విషయాలు. మీకు విసుగ్గలక్కుండా సాధ్యమైనంత సింపుల్ గా చెప్ప్డడానికి ప్రయత్నిస్తాను. వైద్యవిద్య శిక్షణలో case sheet రాయడం అనేది చాలా ముఖ్యమైనది. రోగలక్షణాలు (symptoms) తెలుసుకున్న తరవాత diagnostic formulation రాయాలి. అటుతరవాత differential diagnosis (DD) రాయాలి. ఆ DD కి అనుకూల, ప్రతికూల పాయింట్లు రాయాలి. prognosis (ప్రస్తుతం ఉన్న condition మున్ముందు ఎలా వుండబోతుంది) రాయాలి. చివరాఖరికి treatment గూర్చి చర్చించాలి. 

వైద్యవిద్య శిక్షణలో ఈ case sheet రాసే process ని చాలా repeated గా చేయిస్తారు. ఇది ఒక scientific approach. అందుకే అంతలా ప్రాక్టీస్ చేయిస్తారు. ఇక సైకియాట్రీలో శిక్షణ మరీ భీకరం. కేస్ షీట్లు పేషంట్ల బయోగ్రఫీల్లా ఉంటాయి, అలాగే రాయాలి కూడా. ఇక్కడదాకా బాగానే ఉంది. అయితే - క్రమంగా వైద్యేతర విషయాల్లో కూడా case sheet kind of thinking వచ్చేస్తుంది. ఈ రోగాల లాజిక్‌తో రాజకీయాల్ని విశ్లేషించొచ్చా? 

విషయం అర్ధం అవడం కోసం జ్వరాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం (వాస్తవంగా ఈ జ్వరంతో నాకు సంబంధం లేదు. కానీ.. సైకియాట్రీ సబ్జక్ట్ సంగతుల్ని simplify చేసి వివరించేంత సమర్ధత నాకులేదు). ఒక వ్యక్తి నాల్రోజుల్నుండి జ్వరంతో డాక్టర్ దగ్గరకి వెళ్తాడు. జ్వరంతో పాటు దగ్గు, ఆయాసం, కళ్ళె కూడా ఉన్నాయా? అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కావొచ్చు. chest x ray తీయించి నిర్ధారించాలి.

చలి, వణుకు కూడా ఉండి.. జ్వరం తగ్గుతూ వస్తూ ఉందా? మలేరియా కావచ్చు. రక్తపరీక్ష చేయించాలి. platelet count పడిపోయిండా? డెంగీ కావచ్చు. Widal positive వచ్చిందా? టైఫాయిడ్ కావచ్చు. ఏదీకాకపోతే సాధారణ viral infection అనుకోవచ్చు. మొదట్లో కనిపించే symptoms, clinical condition బట్టి working diagnosis ఉంటుంది. మధ్యలో diagnosis మారిపోవచ్చు. final diagnosis ఇంకోటవ్వచ్చు! ఇవన్నీఅత్యంత టూకీగా వైద్యవిద్యకి సంబంధించిన సంగతులు. 

ఇప్పుడు మళ్ళీ నా సొంత గోడు. ఈ రకమైన శిక్షణ వల్ల నేనేది ఆలోచించినా case sheet రాస్తున్నట్లుగానే ఆలోచిస్తాను. అందువల్లనే కామోలు - నా ఆలోచనలు 'ఫలానా రాజకీయపార్టీది ఫలానా లక్ష్యం. ఫలానా నాయకులు ఇలా చెబుతున్నారు. ఈ మాటలు ప్రజలు నమ్మితే ఇలా ఉండొచ్చు, నమ్మకపోతే అలా ఉండొచ్చు.' అనే వాతావరణ శాఖ bulletin ధోరణిలో వుంటాయి. కావున అవి bland గా ఉండొచ్చు!

కానీ - దానికి నేనేం చెయ్యగలను? లేని మేధావిత్వాన్ని తెచ్చుకోలేను గదా? తోచింది రాస్తున్నాను. నాకు రాజకీయ పార్టీలు, నాయకులు - మలేరియా, టైఫాయిడ్‌లతో సమానం. ఎవరు గెలిచినా, ఓడినా నాకు కొంపలు మునిగేదేమీ లేదు. నా జీవితం సాఫీగానే గడిచిపోతుంది. ఒక సాధారణ జ్వరమే ఊసరవల్లిలా అనేక రంగులు మార్చగా లేనిది.. కొన్ని కోట్ల ప్రజానీకానికి సంబంధించిన రాజకీయాంశాలు ఎన్నిరకాలుగా మారిపోవచ్చు!?

కాబట్టి - వీడికి 'పని లేక.. ' AC గదిలో కూర్చుని (ఈ పాయింట్ ముఖ్యమైనది. చల్లదనంలోనే ప్రశాంతంగా ఆలోచించగలం అని నమ్ముతున్నాను) ఏదో రాసుకుంటున్నాళ్ళే పాపం! అనే సానుభూతితో మీరు చదవగలిగితే సంతోషం.

'మాకేం అవసరం? వంట రానివాడు వంట చేసి - ఏదో నేర్చుకుంటున్నాను. తినెయ్యండి ప్లీజ్! అంటే తిని నోరు పాడు చేసుకోవాలా? అవగాహన లేకుండా నువ్వు రాసే చెత్త మేమెందుకు చదవాలి?' అని మీరంటే నే చేసేదేమీ లేదు.. తూర్పు తిరిగి దణ్ణం పెట్టడం మినహా!

(pictures courtesy : Google)