Tuesday 5 June 2012

అధికారం - యుద్ధనీతి


"సుబ్బూ! నువ్వెన్నయినా చెప్పు. కాంగ్రెస్ మాత్రం దుర్మార్గమైన పార్టీ! రాజకీయంగా సీబీఐ ని వాడుకోవడం నీచం. ఇవ్వాళ జగన్ - మొన్నటిదాకా మూలాయం , మాయావతి , లాలూ.. ఈ లిస్ట్ ఇలా పెరుగుతూనే వుంటుందేమో?" అన్నాను.

కాఫీ సిప్ చేస్తున్న సుబ్బు ఆశ్చర్యంగా చూశాడు.

"ఇందులో దుర్మార్గం ఏముంది? ఇద్దరు వ్యక్తులు తన్నుకోవడం మొదలెట్టారు. ఒకడి చేతిలో కర్ర అనే ఆయుధం ఉంది. ఇంకోడి చేతిలో ఏ అయుధమూ లేదు. కర్ర చేతిలో ఉన్నవాడు, దాంతో వీలైనంత త్వరగా ఎదుటివాడి బుర్ర పగలగొట్టాలి. అలా చేతిలో ఉన్న ఆయుధం వాడుకోలేనివాడొట్టి పనికిమాలిన వాడి కింద లెక్క. అటువంటివాడిని యుద్ధభూమి నుండి తరిమివేయవలె! వాడికి యుద్ధం చేసే అర్హత లేదు." అన్నాడు సుబ్బు.

"ఏంటి సుబ్బూ? నేను రాజకీయాలు మాట్లాడుతుంటే.. నువ్వు కర్ర, యుద్ధం అంటూ ఏవో చెబుతున్నావ్!" విసుక్కున్నాను.  

"రవణ మావా! నే చెప్పేదీ రాజకీయాలే! నా ఉద్దేశ్యంలో కర్ర అంటే అధికారం! ఇప్పుడు రాష్ట్రంలో యుద్ధం మొదలయ్యింది. చతురంగ బలాలతో విజయమో, వీరస్వర్గమో తేల్చుకోడానికి అందరూ ఉపఎన్నికల క్షేత్రంలోకి దూకారు. కాంగ్రెస్ వాళ్ళు యుద్ధతంత్రంలో భాగంగానే జగన్ని లోపలేశారు." అన్నాడు సుబ్బు.

"అవుననుకో! కానీ - మరీ చౌకబారు ఎత్తుగడలు వేస్తున్నారు కదా?" అన్నాను.

"రాజకీయాల్లో చౌకబారు అన్న పదానికి అర్ధం లేదు. గెలవడమే యుద్ధానికి పరమావధి. రాజకీయ పరుగు పందెంలో రజత కాంస్య పతకాలుండవు. ఒకటే మెడల్, ఆ మెడల్ కి నీ ఇష్టమైన పేరు పెట్టుకో. గెలుపు అరంగుళంలో మిస్సయినా, ఆరడుగుల్లో మిస్సయినా ఐదేళ్ళపాటు కుక్కబ్రతుకు బతకాల్సుంటుంది." అన్నాడు సుబ్బు.

"కానీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని.. "

"రాజకీయాల్లో రాజ్యాధికారం అనేది అత్యున్నతమైనది, అత్యంత శక్తివంతమైనది కూడా! ఇందులో భాగస్వామ్యులైనవారికి అధికారంతో పాటు ధనకనకవస్తువాహానములు సంప్రాప్తించును. మధ్యతరగతి మేధావుల భాషలో జరిగేది ప్రజాపరిపాలన. సామాన్య ప్రజల కోణంలో చూస్తే జరుగుతుంది శాస్త్రబద్దంగా, రాజ్యాంగం సాక్షిగా ప్రజల్ని దోచుకోవటం అనే ప్రక్రియ." అన్నాడు సుబ్బు.

"మరీ అంత ఘోరమా!" ఆశ్చర్యపోయ్యాను. 

"రాజకీయాల్లో stakes చాలా ఎక్కువ, ఇక్కడంతా cut throat కాంపిటీషన్, winner takes it all, అందుకే రాజకీయాలు క్రూరమైనవి కూడా! అధికారంలో వున్నవారికి నీవల్ల రాజకీయంగా ఇబ్బందుందనుకుంటే నీ జాతకం మొత్తం తవ్వి తీస్తారు. పుట్టుక దగ్గర్నుండి నీ చరిత్ర మొత్తం పరిశోధించబడుతుంది, అందులో తొర్రలు కనుగొనబడతాయి. ఆ ఫైల్ దగ్గరుంచుకుంటారు, బెదిరిస్తారు. అప్పటికీ మాట వినకపోతివా? నీమీద కేసులు పెడతారు, అదేమంటే - చట్టం తన పని తను చేసుకుపోతుందంటారు." నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"అంటే జగన్ అమాయకుడంటావా?" అడిగాను.

"అస్సలు అనను. రాజకీయాల్లో అమాయకులకి స్థానం లేదు, ఇక్కడందరూ వాహినీ వారి పెద్దమనుషులే! అందరివీ రక్తచరిత్రలే. అందుకే సాధ్యమైనంతవరకూ బయటపడకుండా లోపాయికారిగా మేనేజ్ చేసుకుంటారు." అంటూ ఖాళీకప్పు టేబుల్ మీద పెట్టాడు సుబ్బు.

"అవుననుకో! కానీ పాపం జగన్!" నిట్టూర్చాను.

"పాపం జగనేమిటోయ్! అతను కడప ఎంపీ. వేల కోట్లకి అధిపతి, పెద్ద పారిశ్రామికవేత్త, ముఖ్యమంత్రి క్యాండిడేట్. అందుకేగా చిన్న బెయిల్  పిటిషన్ కి కూడా ప్లీడర్లని ఢిల్లీ నుండి ప్రత్యేకంగా పిలిపిస్తున్నాడు. అతను జరుగుతున్న పరిణామాల్ని ముందే అంచనా వేసుకునుంటాడు, అసలీ యుద్ధం ప్రారంభించింది జగనే కదా! లేకపోతే - హాయిగా బెంగుళూరులోనే వ్యాపారం చేసుకుంటూ ఆస్థుల్ని ఈపాటికి ఇంకో వందరెట్లు పెంచేసేవాడు, సోనియా గాంధీ చెప్పేది కూడా అలా పెంచుకుని హేపీగా ఉండమనే గదా!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.

"నిజమే సుబ్బూ!" అన్నాను. 

"ఈ సత్యం బోధపడింది కాబట్టే కావూరి, లగడపాటి అధికారం అనే చల్లని మర్రిచెట్టు నీడకింద హాయిగా విశ్రమిస్తున్నారు. సోనియాకి ఎదురు తిరిగినట్లయితే, తమక్కూడా జైల్లో జగన్ పక్క సెల్ రిజర్వ్ అయిపోతుందని వీరికి తెలుసు. అందుకే వీరిది ఎల్లప్పుడూ ఢిల్లీ రాగం." అంటూ లేచి టైం చూసుకున్నాడు.

"మరి లగడపాటి ఎందుకంత హడావుడి చేస్తుంటాడు?" కుతూహలంగా అడిగాను.

"సినిమాలో హీరోతో పాటు కమెడియన్ షో కూడా సమాంతరంగా నడుస్తుంటుంది, అలాగే - లగడపాటిది ఓ సైడ్ షో. కాంగ్రెస్ లో ఎప్పుడేది జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఉన్నట్లుండి పదవేదైయినా ఒళ్ళోకొచ్చి వాలుతుందేమోనని లగడపాటి ఆశ. అందుకే లైమ్ లైట్ లో ఉండటానికి తిప్పలు పడుతుంటాడు. బెస్టాఫ్ లక్ టు లగడపాటి." అన్నాడు సుబ్బు.

"కానీ - కాంగ్రెస్ తన అధికారాన్ని ఉపయోగించుకుంటూ రాజకీయంగా బెదిరించడం అన్యాయం కదా." మళ్ళీ మొదటి పాయింటుకొచ్చాను.

సుబ్బు అర్ధం కానట్లు చూశాడు.

"అందుకు కాంగ్రెస్ ని తప్పు పట్టడం దేనికి? ఇక్కడ స్వచ్చమైన రాజకీయాలు నడిపేందుకు ఎవరూ లేరు. ఇదే అధికారం జగన్ చేతిలో ఉండుంటే.. ఇంతకన్నా కర్కశంగా, క్రూరంగా, నిర్ధాక్షిణ్యంగా ప్రత్యర్ధుల్ని అణిచేసేందుకు వాడుకునేవాడు. అసలు కాంగ్రెస్ వాళ్ళు చాలా సమయం వృధా చేశారు, జగనయినట్లైతే ఆర్నెల్ల క్రితమే అందర్నీ అరెస్ట్ చేయించేవాడు. కొందరు జైల్లోనే చచ్చేవాళ్ళు, ఈ మాత్రం వాతావరణం కూడా వుండేది కాదు." అంటూ నిష్క్రమించాడు  సుబ్బు!

(picture courtesy : Google)