Sunday, 3 June 2012

ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది

'ప్రేమ  పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది!' ఒక తీవ్రమైన భగ్నప్రేమికుడు తప్ప, ప్రేమని ఇంత దారుణంగా ఎవరూ తిట్టకపోవచ్చు. నేనీ పేరుతో ఒక కథ రాశాను. ఆ కథలో ముగ్గురు హీరోలు తమ ప్రేమ సఫలమైనందుకు, తమ  ప్రేమని తిట్టుకుంటారు. ప్రేమ విఫలమవడం సుఖాంతం, సఫలమవడం దారుణమైన విషాదం! భలే వెరైటీగా వుంది కదూ!

ముగ్గురు యువకులు ముగ్గురు యువతుల్ని ప్రేమిస్తారు. ఇంతటితో ఊరుకోకుండా తగుదునమ్మా అని పెళ్ళి చేసుకుంటారు. కొంతకాలానికి - ఈ పాడులోకంలో ప్రేమ అనేదే లేదనే వాస్తవాన్ని గ్రహించిన ఆ యువకులు , తమ దుస్థితికి తీరిగా దుఃఖిస్తూ ఇలా అనుకుంటారు - 'ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది'. అదే ఈ కథ పేరు. మగవాళ్ళు ఆడవారి అందచందాలకి ప్రాముఖ్యతనిస్తారు, ఆడవాళ్ళు మగవారిలోని బానిస మనస్తత్వానికి ప్రాధాన్యతనిస్తారనే 'గొప్ప'కాన్సెప్ట్‌లోంచి పుట్టిన ఒక సరదాకథ.

ముప్పైయ్యేళ్ళ క్రితం గుంటూరు మెడికల్ కాలేజ్ మేగజైన్ కోసం ఈ కథ రాశాను. అచ్చులో పడ్డ నా కథని నేను ఇంతవరకూ చదవలేదు. వున్నట్లుండి ఇప్పుడా కథపై అంత ప్రేమ ఏలనోయి? పాత ఫొటోల్లో మన మొహాలు చూసుకుని ముచ్చట పడతాం, ఇదీ అట్లాంటిదే. ఇప్పుడీ కథ గూర్చి నాలుగు కబుర్లు. 

అదొక దుర్దినం. లైబ్రరీ ఎదుటనున్న గార్డెన్లో సిమెంటు బల్లపై కూర్చుని యే సినిమాకి వెళ్ళాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎదురుగా కాలేజి మేగజైన్ ఎడిటర్.

"నా మేగజైన్లో ఆర్టికల్స్ సీరియస్‌గా వున్నయ్, వాటిని కొంత హ్యూమర్తో బేలన్స్ చెయ్యాలి. ఇలా ఖాళీగా కూర్చునే బదులు ఒక సరదా కథ రాయరాదా?" అడిగాడు.

ఒక్కక్షణం ఆలోచించాను.

"నేన్నీకంటికి కమెడియన్లా కనబడ్డం నీ దురదృష్టం. ప్రస్తుతం రావిశాస్త్రి సాహిత్యాన్ని చీల్చి చెండాడుతున్నా! నీక్కావాలంటే శ్రమజీవుల చెమట చుక్కలపై చక్కటి కథొకటి రాసిస్తాను, తీసుకో." అన్నాను.

"నాకు చెమట చుక్కలు వద్దు, సరదా కథొకటి చాలు!" అన్నాడు మా మేగజైన్‌గాడు.

'సరే! సినిమా ఎప్పుడూ వుండేదేగా, ఇవ్వాళో గొప్పకథ రాద్దాం' అనుకుంటూ లైబ్రరీలోకి వెళ్ళాను. కథావస్తువుగా దేన్ని తీసుకోవాలి? ఎంత ఆలోచించినా యే ఆలోచనా రావట్ళేదు. డాక్టర్, పేషంట్ల మధ్య బొచ్చెడన్ని జోక్స్ వున్నాయి. యేదోక జోక్ తీసుకుని కథ అల్లేస్తే యెలా వుంటుంది? భేషుగ్గా వుంటుంది, ప్రొసీడ్.

ఇంతలో పక్క టేబుల్ దగ్గర చదువుకుంటున్న నా క్లాస్‌మేట్ దగ్గరకి బాయ్‌ఫ్రెండ్ వచ్చాడు. ఆ అమ్మాయి చెవిలో అతనేదో చెప్పాడు. ఈ అమ్మాయి పుస్తకం మూసేసి నవ్వుకుంటూ అతన్తో బయటకి వెళ్ళింది. నాకు మండిపోయింది. ఈ అమ్మాయిలు ఎంత నిర్దయులు! నాలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బేచిలర్‌ని వదిలేసి యూజ్‌లెస్ ఫెలోస్‌ని ప్రేమిస్తుంటారు! 

పక్క టేబుల్ ప్రేమికురాలిపై నాక్కొంత పాతకక్షలు కూడా వున్నయ్. ఆ అమ్మాయి ఇంగ్లీషు స్పీడుగా మాట్లాడుతుంది. నేను ఇంగ్లీషు మాట్లాడాలంటే ముందు తెలుగులో ఆలోచించాలి, తదుపరి ఆ ఆలోచనని ఇంగ్లీషులోకి తర్జుమా చేసుకోవాలి, గ్రామర్ చెక్ చేసుకోవాలి. మనసులో ఇన్ని స్టెప్పులేసుకుని నాలుగు ముక్కలు మాట్లాడేలోపు ఆ అమ్మాయి నలభై ఇంగ్లీషు మాటల్తో ఎడాపెడా బాదిపడేసేది. ఈ విధంగా నేను అనేకమార్లు అవమానం పాలయ్యి, గుడ్ల నీరు కుక్కుకుంటూ, పక్కకి తప్పుకున్న సందర్భాలున్నయ్.

వాళ్ళమీదా వీళ్ళమీదా రాసేసేకన్నా ఈ అమ్మాయి మీద కథ రాసిపడేస్తే ఎలా వుంటుంది? ఎస్, నా కథకి వస్తువు దొరికేసింది. అసలీ ఐడియా ఇందాకే రావాల్సింది, ఇంకానయం ఇంకేదో అంశంపై రాశాను కాదు. కథకి ప్రయోజనం వుండాలంటారు విజ్ఞలు, ఇంతకుమించి ప్రయోజనం యేముంటుంది? ఈ ఇంగ్లీషు సుందరికి శిక్ష పడాల్సిందే! మూడ్ కోసం రాజనాల స్టైల్లో ఒక విషపునవ్వు నవ్వుకున్నాను, ఆపై చకచకా కథ రాసి పడేశాను. 

ఆ అమ్మాయిది భీభత్సమైన నెగటివ్ పాత్ర అని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆ స్వార్ధపరురాలు తియ్యని కబుర్లతో ఒక బకరాగాణ్ణి ప్రేమలోకి దించుతుంది, పెళ్ళి చేసుకుంటుంది. పాపం! ఆ అబ్బాయి జీవితం భయానకంగా, నికృష్టంగా, నిస్సారంగా మారిపోయింది. కథ పేరు 'ప్రేమ పిచ్చిది!'.

ఎడిటర్‌గాడు క్యాంటీన్లో యేవో కాయితాల బొత్తిలోకి తీక్షణంగా చూస్తున్నాడు, బహుశా ప్రింటుకి పంపాల్సిన మెటీరియల్ అయ్యుంటుంది. నా కథ చిత్తుప్రతిని వాడిచేతిలో పెట్టాను, నా గజిబిజి రాతని కష్టపడి కూడబలుక్కుంటూ చదివాడు.

"ఇది మన క్లాసమ్మాయి లవ్ స్టోరీ గదా? కథ చదివితే ఈజీగా తెలిసిపోతుంది. ఇలా రాయకూదదు, డిఫెమేటరీ అవుతుంది. ఒక పంజెయ్యి, అనుమానం రాకుండా ఇంకో జంటని కలుపు." అని ఉచిత సలహా ఇచ్చాడు.

"ఇదన్యాయం, నాచేత కూలిపని చేయిస్తున్నావు. అసలు నీ మేగజైన్ కనీసం నువ్వైనా చదువుతావా? యేదో ఆంధ్రప్రభ ఎడిటర్లా సజషన్లు!" అంటూ విసుక్కున్నాను.

ఆలోచించగా - మా ఎడిటర్‌గాడు చెప్పింది కరెక్టేనని తోస్తుంది. రచన ఎవర్నీ నొప్పించరాదు, తప్పు. రచయితకి స్వేచ్చ ఉండాలి కానీ దాన్నా రచయిత దుర్వినియోగపరచరాదు (అసలు సంగతి - ఆ ప్రేమజంటకి వాళ్ళమీద నేను కథ రాసిన విషయం తెలుస్తుందేమోనని భయం).

కేంటీన్లో నాయర్ చేత్తో మాంఛి కాఫీ తాగి, మళ్ళీ లైబ్రరీలోకి వచ్చి పడ్డాను. కథని రిపైర్ చేసి, రిఫైన్ చేసే పనిలో చేపట్టాను. ఇంకో రెండుజంటల్ని కలిపి మూడుజంటల కథ వండాను. ఇప్పుడు మగవాళ్ళు ముగ్గురయ్యారు. ఒకడికి అయోమయం ఆపాదించాను. ఇంకోడికి అమాయకత్వపు అజ్ఞానం పూశాను. మూడో కేరెక్టరుకి నా తెలివిని, మేధస్సుని దానంగా ఇచ్చేశాను! ఇప్పుడు మూడుజంటలయ్యారు, కాబట్టి 'ప్రేమ పిచ్చిది' అనే టైటిల్ని మార్చేసి - 'ప్రేమ పిచ్చిది.. గుడ్డిది.. కుంటిది'గా పొడిగించాల్సి వచ్చింది..

ఎడిటర్‌గాడు కథని పైపైన చదివాడు, కాయితాలు చంకలోనున్న ఫైల్లో పెట్టుకున్నాడు.

"చేతిరాత ఘోరంగా వుంది, ఫెయిర్ చేయించాలి." అంటూ వెళ్ళిపొయ్యాడు.

ఔరా మిత్రద్రోహి! ఈ ముక్క నాచేత కథ రాయించక ముందు చెప్పలేదే!

నా కథ కాలేజ్ మేగజైన్లో పబ్లిషయ్యింది, నేనైతే చదవలేదు. నా స్నేహితులు ఆ కథ చదివేప్పుడు ఏ రైలు ప్రమాదం వార్తనో, పాకిస్తాన్ యుద్ధవార్తనో చదువుతున్నట్లుగా మొహం పెట్టార్ట. ఎలా చదివినా - చదివిన వారెవ్వరూ పొరబాటున కూడా నవ్వలేదుట. అలా నా హాస్యకథ ఉదంతం విషాదాంతమైంది. అదీ - నా కథ!