Saturday, 16 March 2013

ఉపన్యాసం.. ఒక హింసధ్వని!"ఉరేయ్! మన దేశానికి అనవసరంగా సొతంత్రం వచ్చింది. రాకపోతేనే బాగుండేది. ఈ సుత్తి భరించలేకపోతున్నా!" పక్కనున్న రావాయ్ గాడితో విసుగ్గా అన్నాను.

"ష్! హెడ్మాస్టర్ జగన్నాథరావుగారు మననే చూస్తున్నారు." పెదాలు కదపకుండా సమాధానం చెప్పాడు రావాయ్ గాడు ఆలియాస్ రాము.

నిజంగానే మా హెడ్మాస్టర్ గారు పిల్లలందర్నీ సునిశితంగా గమనిస్తున్నారు. అసలే ఆ రోజు ఇండిపెండెన్స్ డే. దొరికితే ఇంతే సంగతులు. అబ్బబ్బా! ఈ హెడ్మాస్టర్ గారితో చస్తున్నాం. దేశానికైతే ఇండిపెండెన్స్ వచ్చింది గానీ.. మాకు మాత్రం హెడ్మాస్టర్ గారి బలవంతపు దేశభక్తి పాఠాల నుండి విముక్తి రాలేదు.

ఆ వచ్చినాయన స్వాతంత్ర్య సమర యోధుడుట. నెత్తి మీద గాంధీ టోపీ. బక్కగా, పొట్టిగా ఆర్కేలక్ష్మణ్ కార్టూన్లా ఉన్నాడు. ఆయన దేశం కోసం ఎంతో త్యాగం చేశాట్ట. బ్రిటీష్ వాడి గుండెల్లో నిద్ర పోయాట్ట. గంటన్నరగా స్వాతంత్ర్యోద్యమం గూర్చి ఆవేశంతో ఊగిపోతూ చెబుతున్నాడు. గాంధీ, నెహ్రూ పేర్లు తప్ప ఒక్క ముక్క అర్ధం అయ్యి చావట్లేదు. మొత్తానికి ఉపన్యాసం అయిపోయింది. చప్పట్లతో ఓపెన్ ఆడిటోరియం మార్మోగింది. ఆ రోజుల్లో పెద్దగా చప్పట్లు కొట్టి ఉపన్యాసం ముగియడం పట్ల మా సంతోషాన్ని (నిరసనని) వ్యక్తం చేసేవాళ్ళం.


మా మాజేటి గురవయ్య హైస్కూల్లో 'ఇండిపెండెన్స్ డే', 'రిపబ్లిక్ డే'లు మాకు ఇష్టమైన దినాలు. జెండా కర్ర దగ్గర కట్టి ఉంచిన తాడు లాగంగాన్లే.. జెండా తెరుచుకుంటూ.. అందులోంచి పూలు రాలడం.. పి. సి.సర్కార్ మేజిక్కులా అనిపించేది. ఒక్కోసారి తాడు ఎంత లాగినా జెండా తెరుచుకునేది కాదు. అది ఇంకా సరదాగా ఉండేది.

నా ఇష్టానికి ఇంకో కారణం.. మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే నాడు ఐదు బ్రిటానియా బిస్కట్లు, రిపబ్లిక్ డే నాడు ఒక రవ్వలడ్డు ఇస్తారు. ప్రోగ్రాం అయిపోయి తరవాత మెయిన్ గేటు సగం తెరిచి ఉంచేవారు. బయటకి వెళ్ళేప్పుడు మా బుల్లి చేతుల్లో బిస్కెట్లో, లడ్డో పెట్టేవాళ్ళు. ఆ పెట్టేవాళ్ళు కూడా విద్యార్ధులే.అంచేత ఫ్రెండ్షిప్పు కొద్దీ ఎవడికైనా ఎక్కువ ఇచ్చేస్తారేమోనని కొండా ఆంజనేయులు మాస్టారు వంటి చండశాసన ఉపాధ్యాయుల్ని డిస్ట్రిబ్యూషన్ దగ్గర పర్యవేక్షకులుగా ఉంచేవారు.

సరే! కాలచక్రం గిర్రున తిరిగి.. నేను పెద్దవాడనైనాను. ఆ విధంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ల సందర్భంగా ప్రముఖులు వాకృచ్చే గంటల కొద్దీ ఉపన్యాసాలు తప్పించుకుని.. జీవితాన్ని మిక్కిలి సంతోషంగా గడపసాగాను. అయితే విధి బలీయమైనది. దాని చేతిలో మనమందరమూ పాపులమే.. క్షమించాలి.. పావులమే!

అందుకే ఒకానొక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక స్కూల్లో ఉపన్యసించవలసిన అగత్యం ఏర్పడింది. అగత్యం అని ఎందుకుంటున్నానంటే.. తప్పించుకోడానికి అనేక ఎత్తులు వేశాను. ఉపన్యాసాలు వినడమే ఒక శిక్ష. ఇంక చెప్పడం కూడానా! కానీ కుదర్లేదు. ఆ స్కూల్ వారికి సైకియాట్రిస్ట్ మాత్రమే కావాల్ట (నా ఖర్మ). నాకు అతి ముఖ్యమైన స్నేహితుల నుండి ఒత్తిడి, మొహమాటం.

జెండా ఎగరేసేందుకు ముఖ్య అతిధిగా ఒక పెద్ద ప్రొఫెసర్ గారట. ఆయన మాట్లాడిన తరవాత నేను మాట్లాడాలిట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడం లాంటి చిత్రవిచిత్ర అంశాల గూర్చి నేను ఆంగ్లంలో ఉపన్యసించాలి. అదీ నాకిచ్చిన టాస్క్. ఇట్లాంటి నీతిబోధనలపై నాకంత గౌరవం లేనప్పటికీ ఒప్పుకోక తప్పలేదు.

ఉదయం ఎనిమిదిన్నర కల్లా స్కూలుకి చేరుకున్నాను. ప్రొఫెసర్ గారు జెండా ఎగరేసి వందన సమర్పణ గావించారు. అక్కడ పిల్లల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. చిన్నపిల్లలు. ముద్దొస్తున్నారు.మరీ ఇంత పసిపిల్లలు విద్యార్ధులుగా ఉంటారని నేనూహించ లేదు. కొందరు పిల్లలైతే తప్పటడుగులు వేస్తున్నారు. (ఆ పసిపిల్లలు ఎల్కేజీ వారని స్కూల్ హెడ్ చెప్పాడు.)

పిల్లల్ని తరగతుల వారీగా నేలపై కూర్చోబెట్టారు. ముందు చిన్న తరగతులు. చివర్లో పదో తరగతి. నేనెప్పుడూ ఏ స్కూల్లోనూ స్టేజ్ మీద కుర్చీలో కూర్చోలేదు. అంచేత ఆ అనుభవం నాక్కూడా కొత్తగానే ఉంది. అంతమంది పిల్లలు బారులు తీరి కూర్చోవడం చూడ్డానికి ముచ్చటగా కూడా ఉంది.

ఆ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం గమనిస్తే.. వారికి ఇంగ్లీష్ సరీగ్గా రాదని తెలిసిపోయింది. అసలే నాది డ్రై టాపిక్. కాబట్టి వారికర్ధమయ్యే భాషలోనే ఏడిస్తే మంచిది. అంచేత నా ప్లాన్ మార్చుకున్నాను. నే చెప్పదలుచుకున్న అంశాన్ని మనసులోనే తెలుగులోకి తర్జుమా చేసుకున్నాను. అయినా వీరికి అర్ధమయ్యేట్లు చెప్పడం కష్టమే! అసలు నాకిచ్చిన ఉపన్యాస అంశమే ఇక్కడ ఇర్రిలవెంట్ టాపిక్. ఇప్పుడెలా? ఇరుక్కుపోయ్యానే!

ప్రొఫెసర్ గారు ఇండిపెండెన్స్ డే గూర్చి ఆంగ్లంలో ఉపన్యాసం మొదలెట్టాడు. ఆయనకి ఆంగ్లభాషపై మంచి పట్టు ఉన్నట్లుంది. వింటుంటే హిందూ పేపర్ ఎడిటోరియల్ చదువుతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపటికి ఆయన చెప్పేది నాకు అర్ధం అవ్వట్లేదు! అర్ధం కానప్పుడు వినడం దండగ. అంచేత వినడమే మానేశాను.

స్టేజి మీద ఉన్నాను కాబట్టి దిక్కులు చూస్తుంటే బాగోదు. అందువల్ల ఎదురుగానున్న పిల్లల్ని గమనించసాగాను. వారి మొహంలో కొట్టొచ్చినట్లు విసుగు కనిపిస్తుంది. హఠాత్తుగా నా గురవయ్య హైస్కూల్ రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఆ పిల్లల్లో నాకు నేనూ, నా స్నేహితులూ కనిపించసాగారు. ముఖ్యంగా ఆ చివరి వరసలో ఒకడు కోపంగా గుడ్లు మిటకరిస్తున్నాడు. వాడిలో నన్ను నేను దర్శించుకున్నాను!

పక్కనే కూర్చునున్న స్కూల్ హెడ్ ని వాకబు చేశాను. 'వీరికి ప్రోగ్రాం అయిన తరవాత స్నాక్స్ ఇస్తున్నారా?'. ఆయన అట్లాంటి ప్రోగ్రామేమీ లేదన్నాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది. గిల్టీగా కూడా అనిపించింది. ఇవ్వాళ దేశానికి పండగ అని చెబుతున్నాం. కనీసం ఒక బిస్కట్ అయినా ఇస్తే పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు గదా (అందుకు సాక్ష్యం నేనే)!

ప్రొఫెసర్ గారి ఆవేశపూరిత, ఉద్వేగపూరిత, స్పూర్తిదాయక ఆంగ్లోపన్యాసం పూర్తయింది. పెద్దగా చప్పట్లు. ప్రొఫెసర్ గారి మొహంలో గర్వం. పిల్లలు అంత గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టారు!? ఈ చప్పట్లు మా నిరశన చప్పట్ల వంటివా? ఏమో! కొన్ని ఆనవాయితీల్ని ఎవరూ చెప్పకుండానే ఫాలో అయిపోతుంటాం.

ఇక నా వంతొచ్చింది. స్కూల్ హెడ్ మైకులో నా గూర్చి గొప్పగా చెప్పి పిల్లలకి పరిచయం చేశాడు (నిజానికి నేనంత సమర్దుడనని అప్పటిదాకా నాకూ తెలీదు). మైక్ ముందుకోచ్చాను. గొంతు సరిచేసుకున్నాను. పిల్లల మొహాల్లో చికాకు. 'నాటకంలో రెండో కృష్ణుళ్ళా మళ్ళీ ఇంకోడు' అని వారు అనుకుంటున్నారా!?

ఒక్క క్షణం ఆలోచించాను. నా చిన్నతనంలో నేను ఉపన్యాసాల బాదితుడను. ఇప్పుడు వీరిని నేను అదే ఉపన్యాసంతో ఎందుకు పీడించాలి? పీడితుడు పీడకుడు కారాదు. స్కూల్ యాజమాన్యాన్ని సంతృప్తి పరచడానికి పిల్లల్ని హింసించలేను. వెంటనే నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను ఏం చెప్పకూడదో కూడా అర్ధమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ మాట్లాడరాదు. మరేం చెప్పాలి?

"పిల్లలూ! బాల్యం చాలా విలువైనది. రోజూ కనీసం గంటసేపు ఆడుకోండి. స్నేహితులతో చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రోజూ మూడు పూటలా మంచి ఆహారం కడుపు నిండా తీసుకొండి. పాలు తాగండి. గుడ్డు తినండి. పప్పు ఎక్కువగా తినండి." అంటూ తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. ప్రొఫెసర్ గారు నన్ను విచిత్రంగా చూశారు.

నేను మాట్లాడటం కొనసాగించాను.

"జీవితంలో చదువు చాలా ముఖ్యం. కానీ చదువే జీవితం కాదు. సబ్జక్ట్ అర్ధం చేసుకుంటూ చదవండి. డౌట్స్ ఉంటే మీ టీచర్స్ తో చర్చించండి. మార్కుల కోసం పడీపడీ చదవద్దు. మార్కులనేవి అసలు ముఖ్యం కాదు. చదవడం చికాకనిపిస్తే పుస్తకం అవతల పడేసి హాయిగా ఫ్రెండ్స్ తో ఆడుకోండి. నేనదే చేశాను. బీ హేపీ! ఎంజాయ్ యువర్ సెల్ఫ్!" అంటూ ముగించాను. స్కూల్ హెడ్ ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నాడు.

మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి చప్పట్లు మరింతగా ఎక్కువసేపు వినిపించాయి. బహుశా నేను నా టాపిక్ మాట్లాడకపోవడం వారికి నచ్చినట్లుంది!

అంకితం..

ఎందఱో మహానుభావులు. అందరికీ వందనములు. స్కూల్స్, కాలేజీలకి ఉపన్యాసకులుగా వెళ్లి.. సుభాషితాలు, హితబోధలు గావిస్తూ విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే ఉపన్యాస దుర్జనులకి.. క్షమించాలి.. దురంధరులకి..

కృతజ్ఞత..

'హింసధ్వని' మిత్రులు వల్లూరి శివప్రసాద్ గారి రచన. బంగారు నందితో పాటు ఎన్నో ఎవార్డులు పొందిన 'హింసధ్వని' నాటిక.. ఈ టపా శీర్షికకి ప్రేరణ. 


(photos courtesy : Google)