Wednesday 6 March 2013

'ఎ బ్యూటిఫుల్ మైండ్'.. మరీ అంత బ్యూటిఫుల్లేం కాదు!


ఈమధ్య 'ఎ బ్యూటిఫుల్ మైండ్' అనే ఇంగ్లీషు సినిమా చూశాను. ఇది అప్పుడెప్పుడో ఆదుర్తి సుబ్బారావు తీసిన మన తెలుగు 'మంచి మనసులు' సినిమాకి డబ్బింగ్ కాదు, అనేక ఆస్కార్ అవార్డులు పొందిన ఘనచరిత్ర కలిగిన ఒక హలీవుడ్ చిత్రరాజము. 

ఈ సినిమా చూడాలని కొంతకాలంగా అనుకుంటున్నాను, కారణం - ఈ సినిమా స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో బాధపడిన ఒక ప్రొఫెసర్ ఆత్మకథ ఆధారంగా తీసార్ట, కొద్దిగా ప్రొఫెషనల్ ఇంటరెస్ట్. ఆడవాళ్ళకి ఏడుపు సినిమాలంటే, పిల్లలకి ఫైటింగు సినిమాలంటే, ఫ్యాక్షనిస్టులకి ఫ్యాక్షనిస్టు సినిమాలంటే ఆసక్తి. నాకూ అంతే!

సరే! ఈ 'ఎ బ్యూటిఫుల్ మైండ్' సినిమా సీడీ సంపాదించాను. కష్టపడి సినిమా చూశాను (సినిమా చూడ్డం అంత వీజీ కాదు). ఈ సినిమా నేను ఒక సాధారణ ప్రేక్షకుడిలా వినోదం కోసం చూడలేదు. అనేకమంది స్కిజోఫ్రీనియా పేషంట్లని వైద్యం చేస్తున్న సైకియాట్రిస్టుగానే చూశాను. 

ఇప్పుడు స్కిజోఫ్రీనియా వ్యాధి గూర్చి  సంక్షిప్తంగా రెండు ముక్కలు. స్కిజోఫ్రీనియా రోగులకి చెవిలో మాటలు (వారికి మాత్రమే) వినబడుతుంటాయి. ఇలా వినబడడాన్ని 'ఆడిటరీ హేలూసినేషన్స్' అంటారు. రోగులు తీవ్రమైన అనుమానాలు, భయాలకి గురి అవుతుంటారు. ఇలా అనిపించడాన్ని 'డెల్యూజన్స్' అంటారు. వీరికి సరైన సమయంలో వైద్యం చేయించకపోతే రోగికి, కుటుంబానికి, సమాజానికి చాలా ప్రమాదం.

స్కిజోఫ్రీనియా వ్యాధితో (వైద్య సహాయం లేక) బాధ పడుతున్నవారిని మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. చిరిగిన బట్టలతో, పెరిగిన జుట్టుతో, తమలో తామే మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ.. కాయితాలు, చెత్త ఏరుకుంటూ.. మురుక్కాలవల్లో నీళ్ళు తాగుతూ.. కనబడుతుంటారు. ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి (వైద్యం చేయించకపోతే) అత్యంత తీవ్రమైనది.

'సినిమాలో స్కిజోఫ్రీనియాని ఎలా చూపించారు?'. ఈ సినిమాలో ఒక టెక్నిక్ వాడారు. సినిమా సగంలో మనం ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తాయి.. అప్పటిదాకా మనం చూస్తున్న కొన్ని ప్రధాన పాత్రలు, సంఘటనలు నిజం కాదు. అవి హీరో ఊహల్లోని పాత్రలు. అతని ఆలోచనలకి దృశ్యరూపం. (అతడు అనుమానాలు, భయాలతో కొన్ని ఊహాజనిత పాత్రలు సృష్టించుకుని.. వాటితో సంభాషిస్తుంటాడు.)

స్కిజోఫ్రీనియా వ్యాధిలో రోగికి చెవిలో మాటలు వినిపించడం (ఆడిటరీ హేలూసినేషన్స్) చాలా సాధారణం. ఆ మాట్లాడే మనుషులు కనబడటం (విజువల్ హేలూసినేషన్స్) అత్యంత అరుదు. అయితే సినిమాలో కొన్ని సంవత్సరాల తరబడి హీరోకి మూడు పాత్రలు కనబడుతూనే ఉంటాయి. ఆ పాత్రలు హీరోతో సంభాషిస్తూనే ఉంటాయి!

స్కిజోఫ్రీనియా వ్యాధి, అందునా తీవ్రమైన హేలూసినేషన్స్ (భ్రమల) తో బాధ పడుతూ command hallucinations ని అనుసరించి కొడుకు చచ్చిపోయేంత పరిస్థితి తెచ్చుకుని భార్యపై దాడి చేసిన పేషంట్, అటు తరవాత మందులు వేసుకోకుండా, ఆ రోగంతో సహజీవనం చేసెయ్యడం అత్యంత అరుదు. సినిమాలో చూపించినంత తీవ్రస్థాయిలో రోగ లక్షణాలు ఉన్నవారు, వైద్యం మానేస్తే వ్యాధి ముదిరిపోతుంది. వారికి క్రమేపీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, జీవితం పట్ల ఆసక్తి తగ్గి (ఒక్కోసారి) ఆత్మహత్యకి దారి తీయడం జరుగుతుంది. 

నా స్కిజోఫ్రీనియా పేషంట్లలో కొందరు, పట్టించుకునేవారు లేక అలాగే ఉండిపోయి (catatonic state), ఆహారం ఇచ్చేవారులేక ఆకలితో చనిపోయినవారు ఉన్నారు (starvation deaths). అయితే - కొందరు స్కిజోఫ్రీనిక్స్ తమకి మాత్రమే వినబడే మాటలకి (auditory hallucinations) అలవాటైపోతారు. కానీ ఆ మాటలు స్నేహపూర్వకంగా కబుర్లు చెబుతుంటాయి, ఒక్కోసారి రోగిని మెచ్చుకుంటుంటాయి!

సినిమాలో (హీరో ఊహాజనిత) డిటెక్టివ్ పాత్ర (Ed Harris) హీరోని చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. ఆ డిటెక్టివ్ హీరో చెవిలో అదే పనిగా మాట్లాడుతూ (running commentary hallucinations) ఇబ్బంది పెడుతుంటాడు. ఆ ఊహాజనిత పాత్రలు హీరోని నీడలా వెంటాడుతుంటాయి! (నాకు Guy de Maupassant దెయ్యం కథ గుర్తొచ్చింది)

స్కిజోఫ్రీనియా జబ్బుతో బాధపడి రికవర్ అయిన పేషంట్లు పెయింటింగులు వేశారు, కథలు రాశారు. వాటిల్లో కొన్ని 'స్కిజోఫ్రీనియా బులెటిన్' లో చూశాను. Auditory hallucinations తో సినిమా తీస్తే చూడ్డానికి నాటకంలా వుంటుందని మార్పుచేర్పులు చేశారా? దర్శకుడికి క్రియేటివ్ ఫ్రీడమ్ వుంటుంది, కానీ నాటకీయత కోసం ఒక జబ్బు core symptom నే మార్చేస్తే యెలా?

ఈ సినిమా గూర్చి ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నానంటే, నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఈ సినిమా గూర్చి చెబుతూ, ఇదొక సీరియస్ రోగం గూర్చి గొప్ప రీసెర్చ్ చేసి తీసిన మంచి సినిమాగా చెప్పారు.. అందుకని. వాస్తవానికి ఈ సినిమాలో ఎక్కువ సీన్లు డ్రామా కోసం మాత్రమే సృష్టించబడ్డాయి.

సరే! హాలీవుడ్ వాడిని ఏదైనా అనేముందు 'మన సంగతేంటి?' అని మీరు అనొచ్చు. మన తెలుగు సినిమా దర్శకుల గూర్చి రాసేంత సాహసం నేను చెయ్యలేను (బియ్యంలో మట్టి గడ్డలు ఏరడం ఈజీ, బియ్యం ఏరడం కష్టం). మనవాళ్ళు అనాదిగా మానసిక రోగుల్ని జోకర్లుగా, శాడిస్టులుగా చిత్రీకరించారు. కారణాలు అనేకం. వారికి మానసిక రోగుల పట్ల కనీస గౌరవం, అవగాహన లేకపోవడం.. కథ రాసుకునేప్పుడు కనీసస్థాయిలో రీసెర్చ్ చెయ్యకపోవడం ప్రధాన కారణాలు.

చివరి తోక :

సుబ్బు ఈ సినిమా చూస్తే ఏమంటాడు?

"మిత్రమా! ఇదేం సినిమా? ఇదసలు సినిమానేనా? ఇంతా చేసి హీరో చివరాకరికి మానసిక రోగిగానే మిగిలిపొయ్యాడు. ఈ సినిమా బాపురమణలు తీసినట్లైతే హీరో భార్యతో రామకోటి రాయించి, ఆ భద్రాద్రి రాముడి కృపతో భర్త రోగం నయమైనట్లు చూపించేవాళ్ళు. ఆ విధంగా బాపురమణలు రామాయణంపై తమ భక్తిని నలభై లక్షల రెండోసారి ప్రదర్శించుకునేవారు.

కె.విశ్వనాథ్ అయినట్లైతే నృత్యసంగీతాలతో హీరోగారి బుర్ర తిరిగిపొయ్యేట్లు చేసి, సారీ - నయం చేసి, మన కళల గొప్పదనాన్ని ఇరవై లక్షల నాలుగోసారి నిరూపించేవాడు. కనీసం దాసరి స్టైల్లో హీరో తలకి దెబ్బ తగిలి రోగం కుదిరినట్లు చూపించినా బాగుండేది. అసలీ సినిమానే రుచీపచీ లేని పెసరట్టులా ఉంటే, అందులో మళ్ళీ నీ బోడి ఎనాలిసిస్సొకటి!"