Sunday, 31 March 2013

బీరువాల్లో పుస్తకాలు - బీభత్స అనుభవాలుఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సోనియా గాంధి వెనక ఎన్ని పుస్తకాలో!

'అక్కడున్న పెద్ద మనుషులకి కనీసం ఆ పుస్తకాల టైటిల్స్ అయినా తెలుసునా?'

'ఓయీ అజ్ఞాని! వాళ్ళంతా ఎవరనుకున్నావ్? ఈ దేశాన్ని నడిపిస్తున్న మహామేధావులు. వారికి ఆ పుస్తకాలన్నీ కొట్టిన పిండి, దంచిన కారం, వండిన కూర, పిండిన రసం.'

అలాగంటారా! అయితే మీరు నన్ను క్షమించాలి. ప్రతిమనిషి తన అనుభవాల నుండే జీవిత పాఠాలు నేర్చుకుంటాడు, ఆ దృక్కోణంతోనే జీవితాన్ని చూస్తుంటాడు. ఈ బీరువాలు, పుస్తకాలు పట్ల అనుమానాలు, అపార్ధాలు కలగడానికి చిన్నతనంలో నాక్కలిగిన కొన్ని బీభత్స అనుభవాలే కారణం.

కేస్ నంబర్ 1. ఎదురింటి ప్లీడరుగారు.
చిన్నప్పుడు మా ఇంటెదురు ఒక ప్లీడరుగారు ఉండేవారు. ఇంటినిండా బీరువాలే! బీరువాల్నిండా దున్నపోతుల్లాంటి పుస్తకాలే! ఆయనెప్పుడూ వాటిమొహం చూసిన పాపాన పోలేదు. పొద్దస్తమానం ఇంటి ముందున్న మామిడిచెట్టు కాయలు ఎవరు కోసేసుకుండా కుక్కకాపలా కాస్తుండేవాడు. ఆయనకి బెయిల్ పిటిషన్ వెయ్యడం కూడా రాదని నాన్న చెప్పేవాడు. మరాయనకి అన్ని పుస్తకాలెందుకబ్బా!

కావున బీరువాల్లో పుస్తకాలకీ, ఆ పుస్తక సొంతదార్లకీ సంబంధం వుండవలసిన అవసరం లేదనే అనుమానం నాలో మొదలైంది. సంబంధం లేకపోతే పోయింది.. అసలీ బీరువా పుస్తకరాయుళ్ళ శీలాన్నే శంకించాల్సిన సంఘటనలు అటుతరవాత నా జీవితంలో చోటు చేసుకున్నాయి.

కేస్ నంబర్ 2. మామా! ఇదా నీ అసలు రహస్యం!
నా మేనమామ ఒకాయన పెద్దఇల్లు కట్టించాడు. ఇంట్లో టేకు బీరువాలు, వాటి నిండా సాహిత్య పుస్తకాలు! షేక్స్పియర్, మిల్టన్, కీట్స్.. గురజాడ, శరత్ చంద్ర చటర్జీ.. అన్ని పుస్తకాలు నీటుగా, ముద్దొచ్చేలా సర్ది వుండేవి. ఏ యాంగిల్లో చూసినా నాకాయన ఓ గొప్ప మేధావిలా అనిపించేవాడు. పొద్దస్తమానం ఆ పుస్తకాల్ని సర్దుకుంటూ కాలక్షేపం చేసేవాడు.

అయితే.. ఆయన అత్తతో ఒక విషయంలో తీవ్రంగా గొడవ పడుతుండేవాడు. మా మేనమామ మామ.. అనగా మా అత్త తండ్రి.. ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేక బాకీ పడ్డాట్ట. ఆ బాకీకి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డి వసూలు చేసాడు మా మామ మహానుభావుడు. ఆ బాకీ వసూలు నిమిత్తం మా అత్తని అప్పడంలా వణికించేవాడు, ఇంట్లో దుర్భర వాతావరణాన్ని సృష్టించేవాడు.

ఆంగ్లాంధ్ర సాహిత్యాలని నమిలి మింగేసిన నా మేనమామ ఇంత ఘోరానికి తలపడుతున్నాడేమి? ఎక్కడో ఏదో తేడాగా ఉంది. ఏమది? ఈ అనుమానం కలిగిన మీదట ఆయన సాహిత్య జ్ఞానంపై డిటెక్టివ్ యుగంధర్‌లా పరిశోధన చేశాను.

దరిమిలా దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. మా మేనమామ ఆ పుస్తకాలేవీ చదవలేదు! చదవని ఆ పుస్తకాల పట్ల ఆయనకీ మమకారం యెందుకు?! ఆయన పోయిన నాల్రోజులకే ఆ పుస్తకాలన్నీ కిలోల్లెక్కన అమ్మేసి మా అత్త తన కసి తీర్చుకుంది, అది వేరే విషయం.

కేస్ నంబర్ 3. పుస్తకం రూముకే భూషణం!
డిగ్రీ చదివేరోజుల్లో నాకో స్నేహితుడున్నాడు. అతగాడికి ఆంగ్ల భాషయన్న మిక్కిలి ఎలర్జీ. అంచేత వెర్బులు, నౌన్లు లేకుండా.. ఆంగ్లభాషని ఖండఖండములుగా ఖండించి మాట్లాడుతూ కసి తీర్చుకునేవాడు.

ఉన్నట్టుండి అతగాడి హాస్టల్ రూములో ఆంగ్ల పుస్తక దిండ్లు! విశాలాంధ్ర పుస్తకాల షాపునుండి టన్ను పుస్తకాలు కొనుక్కొచ్చాడు. పెత్రోవ్, తీస్తొనాస్కీ.. అంటూ అర్ధం కాని పేర్లతో రచయితలు, అన్నీ కలిపి వంద రూపాయలు కూడా అవలేదుట!

'వామ్మో! మనోడిలో ఇంత విషయం వుందా!' అని కంగారు పడ్డా.

నా కంగారు చూసి మావాడు చిద్విలాసంగా నవ్వాడు. కొద్దిసేపటికి అసలు రహస్యం చెప్పాడు.

'మనం తెలివైనవాళ్ళం. ఆ విషయం నీకూనాకూ తెలుసు. కానీ ఎదుటివాడికి ఎలా తెలుస్తుంది? మనగొప్ప మనమే చెప్పుకోలేం గదా! ఆ పని ఈ పుస్తకాలు చేస్తాయి.' అన్నాడు.

'నిజవే! కానీ ఇవి చదవాలంటే కష్టం కదా?' అన్నాను.

'ఓరి అమాయకుడా! ఇవి చదవడానికి కాదు, ఎదుటి వాణ్ని భయపెట్టడానికి. రూములో టేబుల్, టీపాయిల్లాగా ఈ పుస్తకాలూ ఫర్నిచర్లో భాగవే!' అన్నాడు.

దుర్మార్గుడు! పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. వీడు పుస్తకాన్నిరూముకే భూషణంగా మార్చాడు!

కేస్ నంబర్ 4. పుస్తకాలు చేసిన పెళ్లి!అతను నా జూనియర్. ఓ రోజు హడావుడిగా వచ్చాడు.

"గురూగారు! మీ ఇంగ్లీష్ నవల్స్ ఓ రెండ్రోజులు అప్పివ్వాలి."

"అన్నీ ఒక్కసారిగా ఎందుకు? ఒకటొకటిగా తీసుకెళ్ళి చదువుకో."


"భలేవారే! అవన్నీ చదవడానికి నాకు పనీపాటా లేదనుకున్నారా! నాకు అమెరికా సంబంధం వచ్చింది. పిల్ల US సిటిజన్. పెళ్లివారు రేపు మా ఇంటికి వస్తున్నారు. నా దగ్గర మన్లెవలుకి తగ్గట్లుగా మధుబాబు, మల్లాది నవల్స్ ఉన్నాయి. నిన్నవన్నీ కట్టగట్టి అటకమీద పడేశాను. ఇప్పుడు మీరిచ్చే ఇంగ్లీషు పుస్తకాల్ని అద్దాల బీరువాలో నీటుగా సర్దాలి, పెళ్లివాళ్ళ దగ్గర మార్కులు కొట్టెయ్యాలి." అన్నాడు.

"అన్నీ ఇంగ్లీషు పుస్తకాలైతే నమ్మరేమో! అంచేత పన్లో పని.. రావిశాస్త్రిని కూడా తీసుకెళ్ళు."

"రావిశాస్త్రా! ఎవరాయన?"

"ఆయన తెలుగు సాహిత్యవనంలో రావి వృక్షం వంటివాడు."

"వామ్మో! నాకు వృక్షాలు వద్దు, పుస్తకాలు చాలు. అయినా ఆ అమెరికావాళ్ళ ముందు నేను తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు కనిపించకూడదు, చీపుగా వుంటుంది." అన్నాడు.

నా ఇంగ్లీషు నవల్స్ అట్టపెట్టెలో తీసుకెళ్ళాడు, ప్లాన్ విజయవంతంగా అమలు చేశాడు. అదే అట్టపెట్టెలో జాగ్రత్తగా పుస్తకాలు తీసుకొచ్చి థాంక్సులు తెలిపి వెళ్ళాడు, ఒక్కపుస్తకం కూడా మిస్సవ్వలేదు! పుస్తకాలు చదివేవాడైతే పుస్తకాలు కొట్టేస్తాడు గానీ, చదవనివాడు నిజాయితీగా తిరిగిచ్చేస్తాడన్న సత్యం బోధపడింది. ఇప్పుడతను అమెరికాలో ఓ పెద్దడాక్టరు. ఆ విధంగా పుస్తకాల వల్ల పెళ్లిసంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చని నిరూపించిన మేధావి.

ఇన్ఫరెన్స్ :-
అటు తరవాత పుస్తక ప్రియుల్ని రెండురకాలుగా విభజించుకున్నాను. మొదటిరకం పుస్తకాలు కొంటారు లేదా సంపాదిస్తారు, కానీ చదవరు. వారికి పుస్తకాలు కేవలం అలంకార ప్రాయం, స్టేటస్ సింబల్.

రెండోరకంవాళ్ళు పుస్తకాలు చదువుతారు. కొని చదువుతారా, కొనకుండా చదువుతారా సెకండరీ.. మొత్తానికి చదువుతారు. కానీ చదివినట్లు కనపడరు. అక్కడసలు పుస్తక వాతావరణం కూడా ఉండదు, సీక్రెట్ ఏజంట్లలా గుంభనంగా ఉంటారు.

డిస్కషన్ (చర్చ) :-
ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ విషయంకి వద్దాం. పార్టీని గానీ, ప్రభుత్వాన్ని గానీ నడపడానికి ఆ పుస్తకాల అవసరం ఉందా? ఉండదని నా అభిప్రాయం.

'రాహుల్‌ని ప్రధాని పదవికి ఒప్పించుట ఎలా? కరుణ లేని కరుణానిధి కరుణా కటాక్షములు తిరిగి సంపాదించుట ఎలా? మూలాయం మూలములేమి? మమత మమతానురాగములను ఏ విధమున పొందవలయును? మాయావతిని మాయలో పడవేయుట ఎట్లు?'

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆ పుస్తకాల్లో వుండవు, ఆ సమాధానాల్లేని పుస్తకాలతో కాంగ్రెస్ పార్టీకి పన్లేదు. మరైతే అన్నేసి పుస్తకాలు పార్టీ మీటింగ్ హాల్లో ఎందుకు?!

మన మైండ్ అనేక విషయాలకి ట్యూన్ అయిపోయి వుంటుంది. రోజువారి పనులకి అనుగుణంగా అనేక ప్రతీకలు మెదడు రిజిస్టర్లో ముద్రించుకుని వుంటాయి. వాటిననుసరించి యాంత్రికంగా బ్రతికేస్తుంటాం, తేడావస్తే మెదడులో రిజిస్టర్ ఒప్పుకోదు.

ఉదాహరణకి కాఫీ హోటల్లో గుడిగంట ఉందనుకోండి, కాఫీపట్ల అనుమానం కలుగుతుంది. అదే విధంగా గుళ్ళో ప్రసాదంగా ఉప్మా పెసరట్టు పెడితే ఆ దేవుడి మహిమ పట్ల అనుమానాలొస్తాయి. అంటే మనకి తెలీకుండానే.. ఒక గదిలో సామాను సర్దినట్లుగా.. మెదడులో రొటీన్ సమాచారం స్టోర్ అయి వుంటుంది. అందుకే కొద్దిగా తేడావచ్చినా బుర్రలో తికమక!

కంక్లూజన్ (ముగింపు) :-
అంచేత - కాంగ్రెస్ పార్టీ మీటింగ్ హాల్లో బీరువాలు, వాటినిండా పుస్తకాలు వుండటం చాలా సబబు. వెనకాల ఆ బీరువాలు, పుస్తకాల వుండటం మూలానే వాళ్ళంతా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అవే లేకపోతే వాళ్ళు మేధోమధనం చేస్తున్నట్లుగా వుండదు, మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా వుంటుంది.

అప్పుడు దేశప్రజలకి కోపం వస్తుంది, పిమ్మట ప్రభుత్వాలు పడిపోతాయి. అలా జరక్కుండా వుండాలనే ఆ హాలునిండా బీరువాలు, పుస్తకాలు వుంచి.. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాక్షేమం గూర్చి సీరియస్‌గా 'ఆలోచిస్తున్న' వాతావరణం కల్పిస్తుంటాయి. చూశారా! బీరువాలకీ, బీరువాల్లో పుస్తకాలకీ వున్న పవర్!

చివరి తోక.. 

'అవునురే! పుస్తకాల బీరువాల గూర్చి ఇన్ని యెదవ ఆలోచనలు రాశావు గదా! ఇంతకీ నువ్వేజాతి?'


'హ్మ్.. ఇదంతా ఎలా రాశాననుకున్నావ్? ఒకప్పుడు నేను పుస్తకాలు చదివేవాణ్ని, ఇప్పుడు పుస్తకాలు కొని బీరువాల్లో 'దాచుకుంటున్నాను'. దొంగతనాల గూర్చి దొంగే చక్కగా రాయగలడు, ఆ మాత్రం తెలీదా!'

(posted in fb on 7 Jan 2018)