Monday, 1 July 2013

'దేవదాసు' వేదన - తెలుగువారి రోదన


నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా విడుదలై అరవయ్యేళ్ళయింది. తెలుగు పత్రికల్లో ఒకటే కథనాలు. నాకవి చదువుతుంటే నవ్వొస్తుంది. తెలుగు సినీజర్నలిజం సన్మాన పత్రాల స్థాయిలో పరమనాసిగా ఉంటుంది. ఈ సినిమాలో నాగేశ్వర్రావు చుక్కమందు కూడా తాగకుండా నటించాట్ట (నాకైతే ఆయన ఫుల్లుగా తాగి నటించినా అభ్యంతరం లేదు)!

అసలీ అరవైయ్యేళ్ల గోలేంటి? బహుశా షష్టిపూర్తి సన్మానమేమో! ఏదైతేనేం.. తెలుగు సినీప్రేమికులు దేవదాసుని గుర్తు తెచ్చుకుని తన్మయత్వం చెందుతున్న ఈ సందర్భాన దేవదాసు గూర్చి నేనూ నా ఆలోచనలు రాస్తున్నాను. అయితే నాగేశ్వరరావు సినిమా షూటింగులో గడ్డపెరుగు తిని నటించాడా? గొడ్డుకారం తిని నటించాడా? లాంటి చవకబారు వివరాలకి నేను పోదల్చుకోలేదు.

అరవైయ్యేళ్ల క్రితం (1953) ఈ దేవదాసు సినిమా ఎందుకంత అఖంఢ విజయం సాధించింది? ఇప్పుడు నేన్రాయబోయే అంశాలు మొత్తం ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ రాస్తాను. దేవదాసు సినిమాకి ఆధారం బెంగాలీ పాపులర్ రచయిత శరత్ చంద్ర చటర్జీ రాసిన దేవదాసు అనే నవల.

నేను చిన్నప్పుడు శరత్ బాబు సాహిత్యం (దేశీ ప్రచురణలు) చదివాను. అప్పుడే దేవదాసు నవల కూడా చదివాను. వివరాలు సరీగ్గా గుర్తులేదు కానీ.. సినిమాలో ఉన్నంత నాటకీయత నవలలో ఉండదని గుర్తు. ఇప్పుడా చెత్త మళ్ళీ చదివే ఓపిక లేదు. అయితే నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా చాలాసార్లు చూశాను.

నవల చదవాలంటే కష్టంగానీ.. సినిమా చూడ్డం చాలా సుఖం. హాల్లో కూర్చుంటే మన ప్రమేయం లేకుండానే వెనక కన్నాల్లోంచి తెరమీద సినిమా పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు నా పోస్ట్ అక్కినేని నాగేశ్వర్రావు నటించిన దేవదాసు సినిమా కథకి మాత్రమే పరిమితం.

దేవదాసు సినిమాకి ముందు ఆరేళ్ళ క్రితం బ్రిటీష్ వాడి నుండి మనకి రాజకీయంగా అధికార మార్పిడి జరిగింది. సమాజంలో మాత్రం ఎటువంటి మార్పూ లేదు. ఆనాడు మన సమాజంలో కులం, మతం, డబ్బు చుట్టూ చాలా ఖచ్చితమైన గోడలు, లక్ష్మణరేఖలు ఉన్నాయి. సమాజ స్థితిగతులకి చాలా స్పష్టమైన నిర్వచనం ఇవ్వబడి ఉంది.

ప్రేక్షకుడు అన్నవాడు ఎక్కడో ఆకాశంలోంచి ఊడిపడడు. వాడు సమాజానికి ప్రతిబింబం. అంచేత  సాధారణ ప్రేక్షకుడు సమాజ చట్రం నుండి బయటపడి ఆలోచించగలిగే స్థితి, స్థాయిలో ఉండడు. ఆనాడు నిరక్షరాస్యత కూడా చాలానే ఉంది. (అయితే అక్షరాస్యతకి, ప్రోగ్రెసివ్ థింకింగ్ కి సంబంధం ఉంటుందనే భ్రమ నాకు లేదు).

ఈ సినిమా విజయానికి ముఖ్యకారణం.. కథ మొదటి నుండి చివరిదాకా సాంఘిక కట్టుబాట్లని గౌరవిస్తూ (ప్రమోట్) చేస్తూ ఉంటుంది. జమీందారు కొడుకైన దేవదాసు పక్కింటి పేదపిల్లతో స్నేహం కడతాడు. దేవదాసు పెద్దకులంవాడు, డబ్బున్నవాడు. కావున నేచురల్ గా పార్వతి దేవదాసుకి surrender అవ్వాలి. అయి తీరాలి (కాకుంటే ప్రేక్షకులు ఒప్పుకోరు).

జమీందార్ల పిల్లలు చదువుకోటానికి పట్నం పోవటం అనేది బ్రిటిష్ ఇండియాలో చాలా కామన్. కావున శరత్ కూడా కథ అలాగే రాసుకున్నాడు. దేవదాసు కూడా పట్నం పొయ్యి ఏవో చదువులు వెలగబెడతాడు. జట్కాబండి తోలుకుంటూ (పాట పాడుకుంటూ) ఊళ్లోకి వచ్చి పార్వతికి ఏదో నగ ప్రెజెంట్ చేసి తన ఖరీదైన తన ప్రేమని ప్రదర్శించుకుంటాడు (ఎంతైనా జమీందారు బిడ్డ కదా).

ఇలా కొంతకాలం శరత్ బాబు నాయికానాయకుల మధ్య స్వచ్చమైన ప్రేమని పూవులు పూయనిస్తాడు. కాయలు కాయనిస్తాడు. భవిష్యత్తులో వారి ప్రేమ అమరం కావాలంటే ఆ మాత్రం సన్నివేశాలు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. వీళ్ళ ప్రేమ పెళ్ళిగా మారాలంటే పెద్దల అనుమతి కావాలని, అది అసాధ్యమని శరత్ కి కథ మొదట్లోనే తెలుసు. అయినా ఎక్కడా ఆ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడతాడు.

(కథని ముందుకు నెట్టడం కోసం) ఒక దుర్ముహోర్తాన దేవదాసు తన తండ్రి దగ్గర పెళ్లి ప్రసక్తి తెస్తాడు. ముసలి జమీందారు తమ వంశం పరువు, మర్యాద గూర్చి ఒక లెక్చర్ ఇస్తాడు. పాపం! ఆ ముసలాయన మాత్రం కొడుకు ప్రేమని ఎలా ఒప్పుకుంటాడు? ఛస్తే ఒప్పుకోకూడదు. మధ్యతరగతివారు దేవదాసు తండ్రి సమస్యని ఎంతో సానుభూతితో అర్ధం చేసుకుంటారు.

మనది పవిత్ర భారత దేశం. ఈ పుణ్యభూమిలో తండ్రి మాటకి కట్టుబడి ఒక యుగపురుషుడు అడవుల బాట పట్టాడు. ఇట్టి భూమిలో దేవదాసు తండ్రిమాట చచ్చినట్లు వినాల్సిందే. వినకపోతే జనాలకి నచ్చదు. అంచేత ప్రేక్షకుల కోరిక మన్నించి దేవదాసు పార్వతిని వదులుకుని పట్నం పోతాడు.

పట్నంలో భగవాన్ అనే ఒక సకలకళావల్లభుడు దేవదాసుకి ముఖ్యస్నేహితుడు. అతని ప్రోద్బలంతో దేవదాసు తాగుడు మొదలెడతాడు. (తాగుడు చెడ్డ అలవాటు. దేవదాసు వంటి సచ్చీలునికి స్వతహాగా ఇటువంటి దుర్బుద్ధి పుట్టరాదు). భగవాన్ అనేవాడు హీరోకి తాగుడు అలవాటు చెయ్యడానికి, వేశ్య దగ్గరకి తీసుకెళ్లడానికి రచయితచే సృష్టించబడ్డ ఓ అల్పజీవి.

దేవదాసు మీద ప్రేమని చంపుకోలేని పార్వతి అర్ధరాత్రి దేవదాసు ఇంటికొచ్చి తనని ఎక్కడికైనా తీసుకెళ్ళిపొమ్మంటుంది. దేవదాసు భయకంపితుడై పోతాడు (అవును. సమాజం, సంప్రదాయం దేవదాసు ఉఛ్వాసనిశ్వాసలు). పార్వతి ప్రపోజల్ని నిర్ద్వందంగా తిరస్కరిస్తాడు. ధర్మబద్దుడైన దేవదాసు ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతాడు.

దేవదాసు తిరస్కృతికి గురైన పార్వతి తన తండ్రి వయసున్న జమిందార్ని వివాహం చేసుకుంటుంది (ఆ రోజుల్లో పార్వతి వంటి చిన్నపిల్లల్ని పెళ్లి చేసుకోటానికి డబ్బున్న ముసిలి వెధవలు గుంటనక్కల్లా కాచుక్కూర్చుని ఉండేవాళ్ళనుకుంటా). పార్వతి ఆ ముసలి జమీందారు పిల్లల్ని సన్మార్గంలో పెడుతుంది. పార్వతి ఎంతటి మహాఇల్లాలు! పవిత్ర భారతీయ ధర్మాన్ని పాటించిన మహాపతివ్రతా శిరోమణి. పార్వతి ఇప్పుడు మనకి ఇంకా నచ్చుతుంది.

ఈ తాగుబోతు దేవదాసుని చంద్రముఖి అనే వేశ్య కూడా ఇష్టపడుతుంది. ఆవిడ వేశ్య అయినప్పటికీ ఉన్నత హృదయురాలు. అందువల్లనే ఆ వేశ్యామణి దేవదాసు పరిచయం వల్ల తన వృత్తి, బ్రతుకు హీనమైందని తెలుసుకుంటుంది. (ఆనాటికీ, ఈనాటికీ జనులు తమ శారీరక అవసరాల కోసం వేశ్యల వద్దకు వెళ్ళెదరు. కానీ ఆ వృత్తి మాత్రం ఎప్పటికీ హీనమైందే). ఈ పాయింట్ కూడా ప్రేక్షకకులకి బాగా పడుతుంది.

ఇప్పుడు శరత్ పాఠకుల్ని ఏడిపించటానికి కావలసిన దినుసులన్నీ సమకూర్చుకున్నాడు. రంగం సిద్ధం చేశాడు. ఈ దేవదాసు కథలో అందరూ ఉత్తములే. ఉన్నత హృదయులే. సమాజ చట్రంలో ఇరుక్కుపోయిన విధివంచితులు. లలాటలిఖితాన్ని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? (శరత్ కథలన్నీ ఇట్లాంటి జీళ్ళపాకాలే). క్లినికల్ సైకాలజిస్టులు దేవదాసుని sadomasochist అంటారు.

మానసిక వైద్యంలో త్రాగుడు అలవాటుని alcohol dependence syndrome అంటారు. మానసిక వైద్యులు మద్యపానం అనేదాన్ని ఒక రోగంగా చూస్తారు. దేవదాసు మొదట్లో పార్వతిని మర్చిపోవటానికి (తన పిరికితనం వల్ల జరిగిన నష్టం మర్చిపోటానికి) త్రాగడం మొదలెట్టినా.. తర్వాత్తర్వాత ఆ అలవాటుకి బానిసైపొయ్యాడు. (దేవదాసు త్రాగుడు మొత్తం పార్వతి ఖాతాలో వేసేస్తాడు శరత్).

తాగుబోతు భగ్నప్రేమికులకి protagonist ఈ దేవదాసు. తాగుడు అలవాటుని దేవదాసు కథ romanticise చెయ్యటం వల్ల తెలుగు సమాజానికి నష్టం జరిగింది. అందుకే ప్రతి వెధవ ప్రేమ కోసం వెంపర్లాడటం (సాధారణంగా ఈ ప్రేమికుల జాతి చదువులో drop outs అయ్యుంటారు), ఆ ప్రేమ విఫలమైందని తాగుడు పంచన చేరడం చూస్తుంటాం ('ప్రేమించిన' అమ్మాయి మీద యాసిడ్ దాడి చేసేకన్నా alcohol  తాగితాగి, లివర్ చెడిపొయ్యి చావడం మంచిదే).

ప్రేక్షకుల్ని బాగా ఏడిపించటానికి కథలో శరత్ ఒక తెలివైన ఎత్తుగడ వేస్తాడు. చచ్చేముందు ఒక్కసారైనా తనకి సేవ చేసుకునే అదృష్టం కల్పించమని పార్వతి దేవదాసుని వేడుకొంటుంది (ఎందుకో తెలీదు). దేవదాసు చావటానికి ముందు భీకరమైన వర్షంలో దుర్గాపురం ప్రయాణం చేసి, చివరాకరికి ఓ చెట్టుకింద దిక్కులేని చావు చస్తాడు.

అరవయ్యేళ్ళనాడు నాటి కులాలు, కట్టుబాట్లను గౌరవించుటచేతనూ.. ప్రతిపాత్రా పాత్రోచితంగా పరమపవిత్రంగా ప్రవర్తించుటచేతనూ.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలని బలంగా తాకింది. ఆ రోజుల్లో కొద్దోగొప్పో చదువుకున్న తెలుగువారికి బెంగాలీ బాబుల్లాగా సున్నితంగా, ఉన్నతంగా ఆలోచించటం గొప్ప ఫ్యాషన్.

ఎగువ మధ్యతరగతి సెక్షన్ ప్రతినిధిగా వారి ఆలోచనలకి తగ్గట్టుగా శరత్ బాబు ఒక పవిత్రమైన, హృద్యమైన, విషాదకరమైన కథ వండాడు. ఈ బెంగాలి వంటకాన్ని గొప్ప తెలుగు వంటకంగా మార్చిన ఘనత వేదాంతం రాఘవయ్య, సముద్రాల రాఘవాచార్య, డియల్, సుబ్బురామన్, ఘంటసాలలకి దక్కుతుంది. ఈ ప్రతిభావంతులు నాగేశ్వరరావు, సావిత్రిలని దేవదాసు, పార్వతిలుగా ఆవిష్కరించి బోల్డంత సోమ్మునీ, కీర్తినీ మూటగట్టుకున్నారు.

ఈ కథ మనకి గొప్ప నీతిని చెబుతుంది. ఈ సమాజంలో మనం ఏమీ మార్చలేం. మనకి కావలసిందేదీ పొందలేం. సమాజ కట్టుబాట్లని మనం ఎలా కాదనగలం? మనం చేయగలిగిందల్లా.. మన చేతకానితనానికి ఏడ్చుకుంటూ బ్రతకటమే! అందుకే ఈ సినిమా అంత విజయం సాధించిందని నా అభిప్రాయం. అసలు ఈ సినిమాలో జనాలకి బాగా నచ్చిన పాయింట్.. పార్వతి, దేవదాసు పెళ్లి చేసుకోకపోవటం!

చివరి మాట :

మిత్రులారా! దేవదాసు సినిమాని ఇంత నిర్దయగా విశ్లేషించిన వ్యాసం మీరు ఎప్పుడూ చదివి ఉండరు (నేనూ చదవలేదు). ఆ సినిమాని చాలాసార్లు చూసి ఎంజాయ్ చేశాను (ఏడిచాను). ఇంత క్రిటికల్ రాయటం నాకూ ఇష్టం లేదు. ఆ సినిమా ఎందుకంతగా విజయం సాధించిందని ఆలోచించినప్పుడు నా మదిలో మెదిలిన ఆలోచనల్ని uncensored గా రాసేశాను. దేవదాసు సినీప్రేమికులు నన్ను మన్నించగలరు.

(photo courtesy : Google)