Friday, 5 July 2013

ఈజిప్ట్.. ఇంట్లో ఇబ్బందులు


సమయం రాత్రి పదిన్నర. నా డిన్నర్ టైం. టీవీలో ఏదోక ప్రోగ్రాం చూస్తూ, పిల్లలతో కబుర్లు చెబుతూ భోంచెయ్యటం నాకు చాలా ఇష్టం. ఇప్పుడొక ఇంగ్లీష్ చానెల్ వార్తలు చూస్తున్నాను. ఈజిప్టు జనాలు కైరో రోడ్ల మీద చీమలగుంపుల్లాగా మూగి ఉన్నారు.

నేను ఆ దృశ్యాన్ని చూసి ఉత్తేజితుణ్నయాను. సెల్ ఫోన్లో తీవ్రంగా మెసేజెస్ పంపిస్తున్న మా అమ్మాయికి (బలవంతంగా) ఆ జనసమూహానికి, ఆ కోలాహలానికి కారణాన్ని ఉత్సాహంగా వివరించాను. న్యూస్ చూసేప్పుడు నాకీ గూగుల్రావు డ్యూటి అలవాటు.. ఇష్టం కూడా.
               
ఇంతలో స్టడీరూంలోంచి మా అబ్బాయి బుడుగు వచ్చాడు. నా గుండెల్లో రాయి పడింది. వీడి ప్రశ్నలకి సమాధానం చెప్పటం కష్టం. సాధారణంగా మా బుడుగు సందేహాలు ఒకే విషయం చుట్టూ తిరుగుతుంటాయి.

"న్యూస్ రీడర్లకి న్యూస్ చదివేప్పుడు 'టూ' (రెండు వేళ్ళు) వస్తే ఏంచేస్తారు? ధోని బ్యాటింగ్ చేసేప్పుడు 'టూ' వస్తే ఏంచేస్తాడు?" ఇట్లా తన ప్రశ్నలన్నీ వన్/టూల మధ్య పరిభ్రమింపచేస్తుంటాడు.
                 
హాల్లోకొస్తూనే టీవీలో కైరో జనాల్ని చూస్తూ అడిగాడు.

"నాన్నా! ఇంతమంది రోడ్ల మీదున్నారు. వీళ్ళకి 'టూ' వస్తే ఎట్లా?"

ప్రశ్న ఊహించిందే. మా వాణ్ని ఉరిమి చూస్తూ అన్నాను.

"నాకు తెలీదు."

సందేహం లేదు. వీడు పూర్వజన్మలో ఏ పాయిఖానాల ఇనస్పెక్టరో అయ్యుంటాడు .
                 
సోఫాలో నాపక్కనే టీవీ చూస్తూ కూర్చున్నాడు బుడుగు.

"మనకెందుకు జనాలు ఇట్లా రోడ్ల మీదకి రారు నాన్నా? వస్తే ఎంత బాగుంటుంది!" హఠాత్తుగా అన్నాడు.

బుడుగుని చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను.

'కైకా! అన్నది నువ్వేనా? విన్నది నేనేనా?' అంటూ అలనాడు బాపు తీసిన సంపూర్ణ రామాయణంలో గుమ్మడి జమునతో అన్న డైలాగ్ మదిలో మెలిగింది.
               
బుడుక్కి ఇంత మంచి సందేహం కలగటం ఇదే మొదటిసారి. చిన్నపిల్లాడికి ఎంత పెద్ద ఆలోచన! నాకు సంతోషంగా అనిపించింది. బుడుగు ఎవరు? నా కొడుకు. హీ ఈజ్ మై సన్. కొడుక్కి తండ్రి ఆలోచనలు రాక ఎలా ఉంటయ్? ఇంత చిన్నవయసులో ఎంత గొప్ప ఆలోచనాపరుడయ్యాడు! సందేహము వలదు. ఇతగాడు భవష్యత్తులో భగత్ సింగవుతాడు. కాదుకాదు, అల్లూరి సీతారామరాజవుతాడు. బుడుగు మై సన్, ఆ గలే లగ్ జా!

(ఇప్పుడు బుడుక్కి కొంచెం పాలిటిక్స్ చెబుతాను.)
                           
"మనకీ త్వరలో కైరో రోజులు వస్తాయి బుడుగు. అవినీతిపరుల్ని తరిమికొడదాం. మతతత్వవాదులకి గుణపాఠం చెబుదాం. ఈ దేశంలో ప్రజలకి ప్రశ్నించే తత్వం పెరగాలి. ప్రభుత్వాలు ప్రజలకి జవాబుదారిగా ఉండక తప్పదు. దేనికైనా సమయం రావాలి. ఆ సమయం మనక్కూడా తప్పకుండా వస్తుంది." ఆయాసపడుతూ ఆర్. నారాయణమూర్తి స్టైల్లో అన్నాను.
                       
బుడుక్కి నా భాష అర్ధం అయినట్లు లేదు. నన్ను విచిత్రంగా చూశాడు. ఆ తరవాత ఏదో ఆలోచిస్తున్నట్లుగా కొద్దిసేపు టీవీ చూశాడు.

"నాన్నా! మనుషులు రోడ్ల మీద చీమల్లా ఉన్నారు. అక్కడ స్కూళ్ళు కూడా చాల్రోజులుగా మూసేసుంటారు. మనం కూడా అట్లా రోడ్ల మీదకొస్తే ఎంత బాగుండు! అప్పుడు మనకీ స్కూళ్ళు మూసేస్తారు. హాయిగా ఇంట్లో టీవీ చూసుకోవచ్చు. ఇంచక్కా గ్రౌండ్ కెళ్ళి క్రికెట్ ఆడుకోవచ్చు. రోజూ స్కూలుకెళ్ళాలంటే సుత్తి కొడుతుంది."
                         
హతవిధీ! ఇదా వీడి గోల! ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఇంకేదో కాలి మరొకడు ఏడిచాట్ట! అనవసరంగా.. ఒక్కక్షణం ముందు పులిబిడ్డకి తండ్రిగా గర్వపడ్డానే! ఈ వెధవ నా నెత్తిన చన్నీళ్ళు కుమ్మరించాడు. యూజ్లెస్ ఫెలో! పొద్దస్తమానం స్కూలెగ్గొట్టే ప్లాన్లే గదా!
                         
"రేపు హాయ్ లాండ్ కి వెళ్దాం నాన్నా. అక్కడ వాటర్ వరల్డ్ బాగుంటుంది." అడిగాడు బుడుగు.

గర్బిణీ స్త్రీ వలే వీడూ.. వీడి కోర్కెలూ. నాకు చిర్రెక్కింది.

"హాయ్ లాండ్ కా? నిన్నా? ఛస్తే తీసుకెళ్ళను. తీసుకెళ్ళనుగాక తీసుకెళ్ళను." గట్టిగా అరుస్తున్నట్లుగా అన్నాను .
                       
నా అనవసర కోపప్రదర్శనకి అందరూ సైలంట్ అయిపొయ్యారు. కొద్దిసేపు నిశ్శబ్దం. మూతి ముడుచుకుని బుడుగు పక్కరూంలోకి వెళ్ళాడు.

"మీరెందుకు తీసుకెళ్ళనని అంత గట్టిగా చెప్పారు? పిల్లలతో మాట్లాడే పద్ధతదేనా? తరవాతెప్పుడైనా తీసుకెళ్తానని సాఫ్ట్ గా చెప్పొచ్చుగా." నా భార్య సుభాషితాలు.

తన ఫోన్ మెసెజిలకి అడ్డం వచ్చినందుకు మా అమ్మాయి కూడా కసి తీర్చుకుంది.

"నాన్న ఎప్పుడూ ఇంతేనమ్మా. టీవీ వార్తలు చూడమని విసిగిస్తారు. అక్కడెక్కడో, వాళ్లెవళ్ళో రోడ్ల మీదకొస్తే ఇక్కడ మనకేంటి?"

నాభార్య 'అవునుగదా!' అన్నట్లుగా నావైపు చూసింది.
                       
ఛీ.. ఛీ.. వెధవ కొంప, వెధవ బ్రతుకు. ప్రశాంతంగా భోజనం కూడా చెయ్యనివ్వరుగదా!

(photo courtesy : Google)