Monday, 8 July 2013

ద గ్రేట్ బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్

ముందుమాట :

ఈ పోస్టులో నా చిన్ననాటి స్నేహితుల జ్ఞాపకాలు రాస్తున్నాను. ఇది పూర్తిగా నా సొంతగోల. ఓ స్నేహితుడి కోసం నేన్రాసుకున్న తీపిజ్ఞాపకం. ఇది నా రాత కాబట్టి.. నాకంటూ ఓ బ్లాగుంది కాబట్టి.. పబ్లిష్ చేస్తున్నాను. మీకు విసుగనిపించవచ్చు. అయినా చదివేస్తాం అంటే.. మీ ఇష్టం!


టీవీలో ఏదో అమితాబ్ బచ్చన్ పాత సినిమా వస్తుంది. ఓ రెండు నిమిషాలపాటు కన్నార్పకుండా అమితాబ్ ని అలానే చూస్తుండిపొయ్యాను. గతమెంత ఘనము! రోజులెంత తొందరగా మారిపోయ్యాయి!

నేనొకప్పుడు ఇదే అమితాబ్ ని చూస్తూ మైమరచి పొయ్యేవాణ్ని. అమితాబ్ రేఖతో రొమేన్స్ చేస్తుంటే పులకరించిపొయ్యేవాణ్ని. అతని ఫైటింగులు చూస్తూ పరవశించిపోయేవాణ్ని. ఇప్పుడు అదే అమితాబ్ ని చూస్తుంటే పులకరింత, పలవరింత కాదు గదా.. కనీసం చక్కలిగింత పెట్టినట్లుగా కూడా లేదు! కారణమేమి?

వందోసారి రాస్తున్నాను.. ఈ భూమండలమునందు అత్యంత సుందర ప్రదేశం మా గుంటూరు (ఎవరికైనా అభ్యంతరం ఉంటే గుంటూరు సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు.). అందుకలదు మా బ్రాడీపేట గ్యాంగ్. మా బ్రాడీపేట సందుల్లో, గొందుల్లో విపరీతంగా క్రికెట్ ఆడేవాళ్ళం. మా సందు బౌలర్లలో డెనిస్ లిల్లీ, మైఖేల్ హోల్దింగుల్నీ.. గల్లీ బ్యాట్స్ మెన్లలో విశ్వనాథ్, సోబర్సుల్నీ చూసుకుని ముచ్చటనొందేవాళ్ళం.

మాకు విపరీతంగా సినిమాలు చూసే గొప్పఅలవాటు కూడా ఉంది. అప్పటికి మా సినీవీక్షక ప్రస్తానం విఠలాచార్య కత్తియుద్దాలతో మొదలై.. రామారావు ఫైటింగుల మీదుగా పయనించి.. అమితాబ్ బచ్చన్ హిందీ సినిమాల వద్దకి చేరుకుంది.

గుంటూర్లో అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా రంగమహాల్లోకి, తక్కువగా విజయలక్ష్మిలోకి వచ్చేవి. ఏ సినిమా ఏ హాల్లోకి వచ్చినా ఒక్కోసినిమా ఒకటికి రెండుసార్లు చూసేవాళ్ళం. మాకదో దీక్ష, నోము, యజ్ఞం, వ్రతం. అమితాబ్ సినిమాలకి మొదట్రోజు జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. స్త్రీల టికెట్ కౌంటర్ వద్ద క్యూ పోట్టిదిగానూ, పురుషుల కౌంటర్ వద్ద క్యూ పొడవుగానూ ఉండేది.

మా రావాయ్ గాడు ("గల్తీ బాత్ మత్ కరో భాయ్!" ఫేం) ఆడవాళ్ళ టికెట్ కౌంటర్ల వద్ద చేతులోని రూపాయిల నోట్లు చూపుతూ, ఊపుతూ.. అత్యంత దీనంగా, జాలిగా 'అక్కా టికెట్! అమ్మా టికెట్!' అంటూ టికెట్లు తీసివ్వమని యాచించేవాడు. వీడి దొంగమొహాన్ని చూసి ఎవరో ఒక మహాతల్లికి గుండె కరిగేది. తత్ఫలితంగా మా చేతిలో టికెట్లు పడేవి.

అమితాబ్ సినిమాల్లో కిశోర్ కుమార్ పాటలుండేవి. అవి మిక్కిలి మధురంగా మనసును మైమరపించేవి. అమితానందంతో అమితాబ్ సినిమాని చూసిన మమ్మల్ని.. సినిమా తరవాత కిశోర్ గానమాధుర్యం ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ట్యూన్లలో హచ్ కుక్కలా వెంటాడేవి. సింగిల్ మాల్ట్ విస్కీలా మత్తెక్కించేవి.

ఇక్కడిదాకా పెద్ద విశేషం కాదు. ఇట్లాంటి అనుభూతులు దాదాపు అన్ని స్నేహబృందాలకి అనుభవమే. అయితే మాకు ఇక్కణ్నించే చాలా పని మొదలయ్యేది. మా బ్రాడీపేట గ్యాంగ్ లో అతి ముఖ్యుడు సూర్యం. హిందీ సినిమాల ప్రేమికుడు.

'పొద్దస్తమానం హిందీ సినిమాలేనా?' అని గింజుకునే నన్ను.. నా జుట్టు (ఆ రోజుల్లో నా తలకి ఫుల్లుగా జట్టుండేది) పట్టుకుని మరీ లాక్కెళ్ళేవాడు. సినిమా చూసిన సూర్యాన్ని కిశోర్ కుమార్ అవహించేవాడు.. పూనేవాడు. వెంటనే తీవ్రాతితీవ్రంగా కిశోర్ కుమార్ పాటల్ని అందుకునేవాడు.


బ్రాడీపేట రెండోలైన్ తొమ్మిదో అడ్డరోడ్డులో ఓంకార్స్ టైప్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. దాని ఎదురుగా మా సూర్యం ఇల్లు. అది మా బ్రాడీపేట గ్యాంగ్ హెడ్ క్వార్టర్స్. అక్కడ మేం ఒక ఆర్కెస్ట్రా కూడా డెవలప్ చేశాం. ఆర్కెస్ట్రా లీడ్ సింగర్ సూర్యం.

ఒకడు తుప్పుపట్టిన బుల్ బుల్ ప్లే చేస్తాడు. ఇంకోడు దుమ్ము పట్టిన మౌతార్గాన్. ఇట్లా ఎవరికీ దొరికిన వాయిద్యంతో వాడు రెడీ అయిపోయ్యేవాడు. ఇక్కడ మాది ఇండియన్ ఒలింపిక్స్ స్పూర్తి (ఏం వాయించాం, ఎంత బాగా వాయించాం అన్నది ప్రధానం కాదు.. అసలు ఆర్కెస్ట్రాలో ఉన్నామా లేదా అన్నదే పాయింట్).

ఇప్పుడు కొంచెంసేపు నా గిటార్ గోల. నేనో గిటార్ కొనుగోలు చేసి శిక్షణ నిమిత్తం ఆర్.అగ్రహారంలో ఒక గిటార్ టీచర్ దగ్గర చేరితిని. ఆయన ఎంతసేపటికీ ఏదో నోట్స్ ఇచ్చి (అది నిలువు అడ్డగీతలతో ఉండేది) ప్రాక్టీస్ చెయ్యమనేవాడు. నాకు వేళ్ళు మంట తప్ప ఏదీ పలికి చచ్చేదికాదు.

మొత్తానికి కిందామీదా పడి 'Come September' ప్లే చెయ్యడం నేర్చుకున్నాను. దాన్నే కొంచెం మార్చి 'The Good, the Bad and the Ugly' (అంటూ) ప్లే చేసేవాణ్ణి. కావున మా గ్రూప్ లో నేనే లీడ్ గిటారిస్టునని అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!

ఒక్క ఇంస్ట్రుమెంట్ కూడా తెలీని మా రావాయ్ గాడు అత్యుత్సాహంగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కునే వాడు. ఇంట్లో అటక మీద నుండి పెద్ద బొచ్చె దించి.. దాన్ని బోర్లేసి పుల్లల్తో వీరబాదుడు బాదేవాడు. వాడు మా డ్రమ్మర్! పాట పాడటం రానివాళ్ళు, తమ బొంగురు గొంతులతో లీడ్ సింగర్ కి గొంతు సాయం చేసేవాళ్ళు. వాళ్ళని కోరస్ సింగర్స్ అందురు.

ఆ రోజుల్లో ఇళ్ళల్లో టేప్ రికార్డర్ ఉండటం కాదు.. చూసినవాళ్ళూ తక్కువే (ముప్పైయ్యైదేళ్ళ క్రితం ఇళ్ళల్లో రేడియో ఉండటమే గొప్ప)! మా సూర్యం ఇంట్లో నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ ఉండేది. అదిచూసి కొందరు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టేవాళ్ళు. (అసలు ఆ టేప్ రికార్డర్ ఉండటం మూలానే మేం ఆర్కెస్ట్రా సిద్ధం చేశాం).

                            (ఐదేళ్ళ క్రితం తీసిన  పై ఫోటో ఒకప్పటి మా హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు లేదు. నేలమట్టం అయిపోయింది.) 

మెయిన్ హాల్ పక్కనున్న ఒక చిన్న రూం మా రికార్డింగ్ స్టూడియో. గాయకుడు, వాయిద్యగాళ్ళు ఇరుక్కుని చాపల మీద కూర్చునేవాళ్ళం. ఇంతమంది ఇన్నిరకాలుగా ఆర్కెస్ట్రాలో ఇరుక్కున్నా ఇంకొందరు మిగిలిపోయ్యేవాళ్ళు. వాళ్ళు self employment scheme quota లో సంగీత దర్శకుల అవతారం ఎత్తేవాళ్ళు.

అనగా.. లక్ష్మీకాంత్ ప్యారేలాల్, శంకర్ జైకిషన్ స్టయిల్లో చేతులు పైకెత్తి.. పైకికిందకీ ఊపూతూ ట్రూప్ మొత్తం తమ చేతిసన్నల్లో ఉండేట్లు చేసుకునేవారు. ఎవరెవరు ఏ బిట్ ఎలా వాయించాలి అన్నది 'డిస్కస్' చేసుకుని.. ఇంకొద్దిసేపు ముఖ్యగాయకుడైన సూర్యంతో మరింత లోతుగా 'డిస్కస్' చేసి.. 'రెడీ! వన్.. టూ.. త్రీ.. ' అనే countdown తో ఆర్కెస్ట్రా ఫుల్ స్వింగ్ తో మొదలయ్యేది.

ఆర్కెస్ట్రా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ గాయకుడి వాయిస్ ని డామినేట్ చెయ్యరాదు అనే గొప్ప సాంకేతిక విశేషం మాకు అప్పుడే తెలుసు. అంచేత సూర్యాన్ని మైక్రోఫోన్ కి దగ్గరగా కూర్చోబెట్టి పాడించేవాళ్ళం. ఆ సత్తుబొచ్చెల డ్రమ్మర్ గాణ్ణి దూరంగా ఉంచేవాళ్ళం. తప్పదు మరి.. ఒక quality output కోసం ఆ మాత్రం ప్లాన్లెయ్యాలి.

ఈ విధంగా కిశోర్ పాటల్ని రికార్డ్ చేసుకునేవాళ్ళం. పిమ్మట మైసూర్ కేఫ్ లో శంకరనారాయణ పర్యవేక్షణలో ఇడ్లీ సాంబార్ గ్రోలి, కాఫీ సేవించి, క్రేన్ వక్కపలుకుల రుచితో సేద తీరేవాళ్ళం. ఆ తరవాత మేం రికార్డ్ చేసుకున్న పాటల్ని పదేపదే replay చేసుకుంటూ వినేవాళ్ళం. నాకా పాటలు వీనులు విందుగా ఉండేవి. కాకి పిల్ల కాకికి ముద్దు అని అనుకోకండి. ఒట్టేసి చెబుతున్నా. అదొక మధురమైన గానం. అద్భుతమైన ఆర్కెస్ట్రా!

'వాళ్ళు రికార్డ్ చేసిన పాట వింటుంటే పిశాచాలు పాళీభాషలో చేస్తున్న మృత్యుఘోషలా ఉంటుంది. కంకరరోడ్డు మీద చేస్తున్న సైనిక కవాతు వలె ఉంటుంది. ఆ ఆర్కెస్ట్రా విమానం కూలిపోతున్నట్లుగా భీకర శబ్దాలతోనూ, తోకతెగిన ఊరకుక్క రోదనలా పరమ దరిద్రంగానూ ఉంటుంది.' అని మా శత్రువర్గ దుష్టాధములు ప్రచారం చేసేవాళ్ళు.

ఉత్తమ కళాకారులకి ఆత్మవిశ్వాసమే తరగని పెన్నిధి. విమర్శలకి కుంగిపోరాదు. పొగడ్తలకి పొంగిపోరాదు. ఇవన్నీ కళాకారులమైన మాకు బాగా తెలుసు. అంచేత కువిమర్శలకి తొణకక, బెణకక మా బ్రాడీపేట మ్యూజిక్ బ్యాండ్ అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయి అనేక ఆణిముత్యాల్ని రికార్డ్ చేసింది.

అనాదిగా కళలకి, పరీక్షలకి చుక్కెదురు. అంచేత ఓ పరీక్షల సమయాన మా బ్యాండ్ చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయిపోయి కనుమరుగైపోయింది. ఆ విధంగా తెలుగు కళాప్రపంచం తీరని నష్టానికి గురయ్యింది! 

చివరి మాట :

ఈ పోస్ట్ నా ప్రాణస్నేహితుడు సూర్యం కోసం రాశాను.

'సూర్యం! దిస్ ఈజ్ ఫర్ యూ.'

(గంటి సూర్యప్రకాష్. స్నేహితులకి ప్రేమగా 'సూర్యం'. గత ముప్పైయ్యేళ్ళుగా న్యూజెర్సీ పట్టణంలో మత్తు వైద్య నిపుణుడిగా స్థిరపడ్డాడు. ఈరోజుకీ తన పాటలతో అమెరికావాసుల్ని అలరిస్తున్నాడు.)

చివరి మాటకి చివరి మాట :

ముందుమాట పట్టించుకోకుండా ఇక్కడదాకా చదువుకుంటూ వచ్చారా!? అయినచో మీరు ఉత్తములు. మీకు ఆయురారోగ్యాలు, ధనకనక అష్టైశ్వర్యాలు సంప్రాప్తించుగాక!

శ్రీశ్రీశ్రీ రమణానంద మహర్షి. 

(photos courtesy : Google)