Wednesday, 17 July 2013

బడిపిల్లలు ఉద్యమకారులేనా?


కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని కోస్తాంధ్రలో మళ్ళీ 'ఉద్యమ సెగలు' మొదలయ్యాయి. నిరసన తెలియజెయ్యడం, ఉద్యమాలు చెయ్యడం అనేవి ప్రజాస్వామిక హక్కులే. అయితే ఉద్యమాలు చెయ్యవలసింది ఎవరు? రాజకీయ పార్టీలు, లేదా తమకి నష్టం జరుగుతుందని భావించే వ్యక్తుల సమూహం, బడిపిల్లలు కాదు.

పోయిన సంవత్సరం 'సమైక్యాంధ్ర' పేరిట ఒక ఉద్యమం నడపబడింది. బడిపిల్లల్ని యూనిఫాముల్లో, బ్యానర్లు మోయిస్తూ గొర్రెల్ని తోలికెళ్ళినట్లు తీసుకెళ్ళి నిరసనల్లో భాగం చేశారు. 'మానవ హారం' అంటూ పిల్లల్ని ఎండలో గంటలకొద్ది నించోబెట్టారు. నాయకులు ఆవేశంతో ఊగిపోతూ (టీవీల కోసం) ప్రసంగాలు చేశారు. చివర్లో KCR దిష్టిబొమ్మని చెప్పుల్తో కొట్టి తగలబెట్టారు. ఈ తతంగం ఎప్పుడైపోతుందా అని పిల్లలు మండుటెండలో మాడిపోతూ, నీరసంగా ఎదురుచూశారు.

పిల్లల్తో ఈ విధంగా బలవంతపు 'నిరసన' తెలియజెయ్యడం  స్కూలు యాజమాన్యాలకున్న రాజకీయాలే కారణం. అనేక స్కూళ్ళ యాజమాన్యాలకి తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు (vested interest కూడా) ఉండటం చేత.. 'ఉద్యమం' కోసం పిల్లల్ని పోగుచేసి.. ఇలా రోడ్ల మీద ప్రదర్శన చేయించారు.

నా చిన్నతనంలో నేను కూడా ఇట్లాంటి హింసకి గురయ్యాను. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పాతికేళ్ళయ్యిందని మాచేత బ్యానర్లు మోయిస్తూ రోడ్లన్నీ తిప్పారు. 'అసలీ స్వాతంత్ర్యం ఎందుకొచ్చిందిరా బాబోయ్!' అని ఏడ్చుకుంటూ ఊరంతా తిరిగాం. మధ్యలో పారిపోవటానికి వీల్లేకుండా సింహంలా హెడ్మాస్టర్, పులుల్లా మేస్టర్లు మాకు కాపలా. పట్టుబడితే అంతే సంగతులు.

'జైఆంధ్ర' ఉద్యమంలో కూడా మాకు ఇవే కష్టాలు. 'ముల్కీ డౌన్ డౌన్' అంటూ వీధులన్నీ తిప్పారు. పోనీ 'ముల్కీ' అంటే ఏంటో చెబుతారా? అంటే అదీ లేదు. జైఆంధ్ర ఉద్యమంలో మాదో కూలి పని. వెట్టి చాకిరి. పిల్లల్ని ఎండల్లో తిప్పడం.. జనాలని చౌకగా పోగేసే ఒక దుర్మార్గ విధానం. ఇన్నేళ్ళైనా పిల్లల పరిస్థితి ఏమాత్రం మారకపోవటం ఆశ్చర్యకరం.

ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రతి అడ్డమైన ప్రభుత్వ అధికార కార్యక్రమాలకి (అనగా మంత్రులు, కలెక్టర్ పాల్గొను కార్యక్రమం) పిల్లలతో ర్యాలీ తీయిస్తారు. ప్రధాన వీధులన్నీ తిప్పుతారు. మొన్నామధ్య ఎయిడ్స్ ని అరికట్టండంటూ పిల్లల్తో ఒక భారీ ప్రదర్శన చేయించారు. మరి పిల్లలకి, ఎయిడ్స్ కీ సంబంధమేంటో తెలీదు.

మా ఊళ్ళో ఘనత వహించిన ఒక స్కూల్లో ఓనరయ్య, ఓనరమ్మలు తమ పుట్టిన్రోజులకి (పొగుడించుకుంటూ) పిల్లల్తో పాటలు పాడించుకుంటారు. వారు నడిచే దారిలో పూలు చల్లింప చేయించుకుంటారు. విద్యార్ధుల తలిదండ్రులు ఇలాంటి హీనమైన, సిగ్గుమాలిన, నీచసంస్కృతికి ఎందుకు సహకరిస్తున్నారో అర్ధం కాదు.

పిల్లలు చాలా సున్నితమైనవారు. అర్భకులు. వారిని ఎండల్లో రోడ్లంట తిప్పడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదు. అందువల్ల వారు dehydration కి గురయ్యే ప్రమాదముంది. దుమ్ము, ధూళి, చెత్తకి expose చెయ్యడం వల్ల ఈజీగా ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదముంది. మన పట్టణాల్లో ట్రాఫిక్ చాలా అడ్డదిడ్డంగా ఉంటుంది. ఈ ర్యాలీల్లో ఒక పద్ధతిగా లైన్లో వెళ్తున్న పిల్లల్ని.. సిటీ బస్, ఆటో డ్రైవర్లు హారన్లు కొడుతూ వారిని కంగారు పెట్టి పరుగులు తీయిస్తుంటారు. వారికదో పైశాచికానందం.

పిల్లల్ని తమ రాజకీయ కార్యక్రమాలకి వాడుకునే దుష్టసంప్రదాయాన్ని అందరూ వ్యతిరేకించాలి. మనదేశంలో పులులకీ, తోడేళ్ళకైనా రక్షణ అంటూ చట్టాలు చచ్చాయి. కానీ.. పిల్లల రక్షణ కోసం చట్టాలున్నట్లు తోచదు. ఇదొక విషాదం, కానీ వాస్తవం.

(photo courtesy : Google)