Saturday, 20 July 2013

సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?


మిత్రులారా! ఈరోజు మీకో రహస్యం చెప్పాలి. నాగూర్చి నేను గొప్పలు చెప్పుకోకూడదు గానీ.. నేను చిన్నప్పట్నించే గొప్పఆలోచనాపరుణ్ని. మానవ సమాజం, సమాజ మనుగడ, వినోదం, విజ్ఞానం, భవిష్యత్తు కార్యాచరణ వంటి ఎన్నో ముఖ్యమైన విషయాలపై తలమున్కలుగా ఆలోచిస్తుండేవాణ్ని. స్కూల్లో కూర్చుని నేచేసిన నా ఆలోచనలు మచ్చుకు కొన్ని రాస్తున్నాను. చదివి ఆనందించండి.

'సినిమా'.. ఎంత గొప్ప పదం! వినుటకు కడు ఇంపుగా, సొంపుగా యున్నది! అసలీ సినిమా అనునది మానవునికి దేవుడు ప్రసాదించిన ఒక వరం. ఒక గొప్ప అదృష్టం. సినిమాలు చూడ్డం అన్నది నాగరికతకి చిహ్నం. సినిమా అనేది ఒక జాతికి జీవగర్ర (జీలకర్ర కాదు). సినీవీక్షణం ఒక పవిత్ర కార్యం, జీవన పరమావధి. సినిమాలు చూడనివాడి జీవితం వృధా.

అసలీ పురప్రజలు రోడ్ల మీద తిరుగుతూ టైమెందుకిలా వేస్ట్ చేసుకుంటున్నారు? ఊరంతా సినిమా హాళ్ళు కట్టించేస్తే హాయిగా అందరూ సినిమాలు చూసేస్తూ సినిమా హాళ్ళల్లోనే జీవించేవారు గదా! నాన్న జేబునిండా డబ్బులున్నా కూడా రోజుకో సినిమా చూడ్డేంటి? నేను మాత్రం పెద్దైంతరవాత బోల్డంత డబ్బు సంపాదించి రోజంతా సినిమాలు చూస్తూ బతికేస్తాను.

మిత్రులారా! నా ఆలోచనలు ఇంకా రాయాలంటారా? విజ్ఞులు. ఈపాటికి మీకు అర్ధమైపొయ్యుంటుంది. చిన్నట్నించి నేనెంతటి అచంచల ఆలోచనాపరుణ్నో!

ఇప్పుడు కొంచెంసేపు నా సినిమా ముచ్చట్లు. నా చిన్నతనంలో మాకు సినిమా చూడటం అనేది ఏకైక వినోద సాధనం. అందునా మా మధ్యతరగతి జీవితాల్లో సినిమా అనేది ఒక లక్జరీ కూడా. రిక్షాకి, సినిమా టిక్కెట్లకి, అవుట్ బెల్లులో (intermission) తాగే గోళీ సోడా ఖర్చుతో సహా బజెట్ ముందుగానే నిర్ణయించబడేది (సినిమా తియ్యడానికే కాదు, చూడ్డానిక్కూడా బజెట్ కావాలి).

నేను తెలివైనవాణ్నని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. సినిమాలో ఏమీ కొనుక్కోనని (ఇంటి దగ్గర) అమ్మని నమ్మబలికిన నేను.. సినిమా మొదలవ్వంగాన్లే చక్రాలు కొనిపెట్టమని బ్రతిమాలేవాణ్ని, ఏడిచేవాణ్ని (ఏడుపుని ఎఫెక్టివ్ గా వాడుకోవటం ఒక ఆర్ట్). అమ్మ దగ్గర రిజర్వులో బ్లాక్ మనీ (నాన్నకి తెలీకుండా ఇంటిఖర్చుల్లో మిగిల్చుకున్న చిల్లర) ఉంటుందని నాకు తెలుసు.

ఒకవైపు సినిమా తెరపై నడుస్తుండగానే క్యాంటీన్ కుర్రాళ్ళు చక్రాలబుట్టతో హాలంతా తిరుగుతుండేవాళ్ళు (ఎక్కువగా పిల్లలున్నచోటనే తచ్చాడుతుండేవాళ్లు). పదిపైసలకి ఐదు చక్రాలొచ్చేవి. మొత్తానికి చక్రాలు సాధించి, చొక్కా జేబులో (నా లూజు చొక్కా గూర్చి "నాన్న పొదుపు - నా చిన్నికష్టాలు"  అంటూ ఓ పోస్టు రాశాను) వేసుకుని.. అటు తరవాత బుల్లిబుల్లి తుంపులుగా చేసుకుని.. కొద్దికొద్దిగా చప్పరిస్తూ, నముల్తూ (చక్రాలు హడావుడిగా తినరాదు. తొందరగా అయిపోవును) సినిమా చూసేవాణ్ని.

అసలు ఇంట్లోవాళ్ళు సినిమా ప్రోగ్రాం పెట్టుకోంగాన్లే ఒకరకమైన ఉద్వేగం, ఆనందం. సినిమా తెర తీస్తున్నప్పట్నించే చాలా fascinating గా ఉండేది. ఆ తెర అటూఇటూ పట్టుకు లాగేది మనుషులా? లేక కరంటు మిషనా? అన్నవిషయం గూర్చి చాలా తీవ్రంగా ఆలోచించేవాణ్ని (ఈ విషయంపై స్నేహితులతో మేధోచర్చలు కూడా జరిపేవాణ్ని).

సినిమాకి ముందు న్యూస్ రీళ్ళు వేసేవాళ్ళు. కరువు, వరదలు అంటూ ఏవో వార్తలు చూపించేవాళ్ళు (వీటిని మేం ట్రైల్ పార్టీ అనేవాళ్ళం). అసలు సినిమాకి ముందు కొసరులాగా వచ్చే ఈ రీళ్ళు కూడా నాకు భలే ఇష్టం (ఎంతైనా ఫ్రీ కదా).

ఆ రోజుల్లో నా జీవితంలో మధురానుభవం సినిమా చూడ్డం. అందులో ఇంకా మధురాతి మధురానుభవం రామారావు, రాజనాల కత్తియుద్ధ సన్నివేశాల్ని కనులారా వీక్షించడం. వాళ్ళిద్దరూ లోకేషన్లు మార్చుకుంటూ, (చేతులు పడిపొయ్యేలా) గంటలసేపు యుద్ధం చేసుకునేవాళ్ళు. వాళ్ళెంతసేపు యుద్ధం చేసుకున్నా.. ఇంకొంచెంసేపు చేసుకుంటే బాగుండుననిపించేది.

ఈరోజున నేనా సినిమాలు చూస్తే ఎలా ఉంటుంది? నాకా రోజుల్లో అమితానందాన్నిచ్చిన ఆ సినిమాల్ని చూడ్డానికి మొన్నామధ్య ప్రయత్నించాను. కొద్దిసేపు కూడా చూళ్లేకపొయ్యాను. కారణమేమై యుండును? నేను విజ్ఞానవంతుడనయ్యానా? వివేకవంతుడనయ్యానా? మేధావినైపొయ్యానా? బాకుల్లాంటి ఈ ప్రశ్నలకి (ఒకే ప్రశ్నని ఎఫెక్టు కోసం మూడురకాలుగా రాశాన్లేండి) సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను.

చిన్నప్పుడు నాకు సినిమాలు 'తీస్తారని' తెలీదు. తెరమీద కనిపిస్తున్నదే నిజమనుకునేవాణ్ని. రామారావు సావిత్రిలు నిజంగానే భార్యాభర్తలు. సూర్యకాంతం నిజంగానే గయ్యాళి. రాజనాల నిజంగానే చెడ్డవాడు. వాళ్ళమధ్య జరుగుతున్న సంఘటనలన్నీ వాస్తవం. ఇంకో ఆలోచనకి తావు లేదు.

నేను హైస్కూల్లో చదివేప్పుడు నాపక్కన శాస్త్రి కూర్చునేవాడు. వాడు సినిమా విషయాలు చాలా చెప్పేవాడు.

"ఎన్టీరామారావు, సావిత్రి నిజంగానే మొగుడూపెళ్ళాలు. అందుకే రామారావు సావిత్రిని అంత గట్టిగా వాటేసుకుంటాడు. అదే నాగేస్సర్రావుని చూడు.. సావిత్రిని ముట్టుకోవాలంటే బయ్యం. దూరందూరంగా ఉంటాడు. సావిత్రిని ముట్టుకుంటే.. నాగేస్సర్రావు తన పెళ్ళాన్ని ముట్టుకున్నాడని రామారావుకి కోపం వస్తుంది. అప్పుడింక నాగేస్సర్రావు పని ఔట్."

"నిజంగా?"

"నిఝం. తల్లితోడు. మా అన్నయ్య చెప్పాడు." మా శాస్త్రిగాడికి ప్రతిదానికీ ఒట్లెయ్యడం అలవాటు.

నా వెనక బెంచిలో వీరయ్య ఉండేవాడు. వాడి భాష మొరటు. తెలుగు సినీతెర వెనుక రహస్యాలు చూసినట్లే చెప్పేవాడు.

"ఎన్టీవోణ్ని చంపెయ్యడానికి నాగ్గాడు అట్టకత్తి కాంతారావుతో కలిసి ప్లానేశాడు. ఈ సంగతి ముందే కనిపెట్టిన ఎన్టీవోడు కత్తి తీసుకోని గుర్రం మీద స్రీడుగా వస్తంటే బయపడి నాగ్గాడు పారిపోయ్యాడు. కాంతారావు ఎన్టీవొడి కాళ్ళ మీద పడ్డాడు."

నా ముందు బెంచిలో సూరి కూర్చునేవాడు. వాడిక్కూడా గొప్ప సినిమా నాలెడ్జ్ ఉండేది.

"ఉరేయ్! నీకీసంగతి తెలుసా? రామారావు కిష్టుడి వేషం వేసేముందు పూజ చేస్తాడు. అప్పుడు కిష్టుడు రామారావులోకొచ్చేస్తాడు. ఇంకాతరవాత రామారావు చేసేదేముండదు. అంతా ఆ కిష్టుడే చేసేస్తాడు."

సినిమా నటులకీ, పాత్రలకీ తేడా మాకు తెలీదు. మేం చూసే సినిమాలు మద్రాసులో తీస్తారని, సినిమాలో మేం చూస్తున్న ప్రతి సన్నివేశాల్ని క్షుణ్ణంగా ప్లాన్ చేస్తారని మాకు తెలీదు. రామారావు, రాజనాల విఠలాచార్య చెప్పింది శ్రద్ధగా విని.. కత్తియుద్ధం చేసినట్లు నటించి.. ఎవరిళ్ళకి వాళ్ళెల్తారనీ, వాళ్లక్కూడా భార్యాపిల్లలుంటారనేది మా ఊహకందని విషయం.

ఇవన్నీ తెలీదు కనుకనే రాజనాల (పనీపాట లేకుండా) పొద్దస్తమానం హీరోయిన్లని కిడ్నాప్ చేసే పన్లో ఉంటాడని నమ్మేవాళ్ళం. ఈ విలన్ల కుట్రల్ని భగ్నం చేస్తూ హీరోలు ఎంతటి కష్టాలు పడుతున్నారో కదా అని బోల్డు బాధ పడుతుండేవాళ్ళం. విలన్ల పన్నాగాలు హీరోలు ఎక్కడ తెలుసుకోలేరోనని ఆందోళన చెందేవాళ్ళం. కత్తియుద్ధంలో రాజనాల రామారావుని ఎక్కడ లోయలోకి తోసేస్తాడోనని భయపడేవాళ్ళం. రామారావు రాజనాలని ఓడించంగాన్లే ఆనందంతో చప్పట్లు కొట్టేవాళ్ళం.

కాలచక్రం గిర్రున (ఎందుకో అనాదిగా ఈ కాలచక్రం 'గిర్రు'మనే తిరుగుతుంటుంది) తిరిగింది. నేను పెద్దవాడనైనాను. సినిమా చూసి చాలా యేళ్ళయింది. ఇప్పుడు నాకు సినిమా ఎట్లా తీస్తారో తెలుసు. అంచేత అందులో మజా పోయింది. సినీఅభిమానులు ఫొటోగ్రఫీ బాలేదనీ, సంగీతం బాగుందని ఏంటేంటో మాట్లాడుతుంటారు. నాకెందుకే ఇట్లాంటి సంభాషణ రుచించదు.

పాండవవనవాసంలో రామారావు ఆవేశంగా ఊగిపోతూ తొడగొట్టి పాడిన 'ధారుణి రాజ్యసంపద.. ' రామారావు పాళ్లేదనీ, వెనుకనుండి ఘంటసాల పాడాడనీ నాకు తెలీదు. నాకా పద్యం ఎందుకంత ఇష్టమో "ధారుణి రాజ్యసంపద.. ! (బీడీలబాబు కథ)" అనే  టపాలో రాశాను. ఇప్పటితరం పిల్లలు మా అంత అమాయకులుగా ఉన్నారో లేదో తెలీదు (సినిమా ఎంజాయ్ చెయ్యడానికి కొంత అమాయకత్వం అవసరం).

నేను అప్పుడప్పుడు నా అభిమాన నటులంటూ వెనకటి తరం నటుల గూర్చి రాస్తుంటాను. వాళ్ళు గొప్పనటులని మెచ్చుకుంటూ ఉంటాను. నా రామారావు అభిమానంతో "బిరియానీయేనా? కాదు.. కాదు.. పులిహోరే.. !" అంటూ ఒక టపా కూడా రాశాను. ఎన్టీరామారావుకి సాధ్యం కానిదేది లేదని బలంగా నమ్మినవాణ్ని. ఎన్టీఆర్ నా మనసులో ఒక భాగం. అమ్మానాన్నల్లగా ఈ బంధం కూడా ఒక emotional bonding.

ఎన్టీరామారావు సినిమాలు చూసినప్పటి నా మానసికస్థితి వేరు. అప్పుడు నాకు రామారావు ఇచ్చిన మజా.. ఈరోజుల్లో పిల్లలకి మహేశ్ బాబు వంటి పాపులర్ హీరోలు ఇస్తున్నారని నా నమ్మకం. వయసురీత్యా ఒక సినిమా చూసి ఆనందించే స్థితి నేను ఎప్పుడో దాటిపొయ్యాను (ఈ స్థితి నాకేమీ సంతోషకరంగా లేదు).

సినిమా నటుల తరం మారినట్లే ప్రేక్షకులతరం కూడా మారుతుంది. ఏ తరంవారికి ఆతరం సినిమాలు నచ్చుతాయి. ఒకవయసు దాకా మన జీవితాల్లో సినిమా అనేది చాలా ముఖ్యమైనది. అటుతరవాత జీవితంలో సినిమా ప్రాముఖ్యత తగ్గడం మొదలై.. కొంతకాలానికి సినిమా అనే పదమే కనుమరుగైపొతుంది.

అందుకే వయసుడిగినవారు సినిమా ప్రసక్తి వచ్చినప్పుడల్లా తమ చిన్నప్పటి హీరోల్నే ప్రస్తావిస్తుంటారు. అసలు విషయం.. వాళ్ళు సినిమాలు చూడ్డం ఎప్పుడో మానేశారు. ఒకరకంగా ఇదో fixation. ఏసీ హోటళ్ళలకి అలవాటు పడ్డ ఈతరం కుర్రాళ్ళకి మా ఆనందభవన్ నచ్చదు. అట్లాగే మా సినిమాలూ నచ్చావు. మేం కూడా vice versa.

అమ్మాయ్య! ఇప్పుడు నాకు 'సినిమాలు చిన్నప్పుడే ఎందుకు బాగుంటయ్?' అన్న ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మీక్కూడా వచ్చేసుంటుంది (కష్టపడి ఇక్కడదాకా రాసుకుంటూ వచ్చాను. కాబట్టి మీ తరఫున కూడా నేనే చెప్పేస్తున్నా).

ముగింపు -

గత కొంతకాలంగా నా పిల్లలకి ఏదైనా పాతసినిమా చూపిద్దామని (కనీసం గుండమ్మకథ) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాను. నావల్ల కావట్లేదు. వారిని బలవంతం చేస్తుంటే.. 'సావిత్రేంటి ఇంతలావుగా ఉంది? రామారావెందుకలా నిక్కరేసుకున్నాడు?' లాంటి చెత్తప్రశ్నలతో నాపై ఎదురుదాడి చేస్తున్నారు. వళ్ళు మండిపోతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చన్నీళ్ళ స్నానం చెయ్యడం మించి నే చెయ్యగలిగిందేమీ లేదు.

(ఏవిటో! 'సినిమాలు చిన్నప్పుడే బాగుంటయ్' అనే నా థియరీ కరెక్టనే సంతోషం ఒకవైపు.. నా హీరో ఎన్టీరామారావుని నా పిల్లలకే చూపించలేకపోతున్నాననే దుఃఖం మరోవైపు.. ఎలా రియాక్టవ్వాలో తేల్చుకోలేకున్నాను.)

(photos courtesy : Google)