Saturday, 13 July 2013

ప్రాణ్


హిందీ సినిమా నటుడు ప్రాణ్ చనిపోయాడు. ప్రాణ్ మనదేశంలో అత్యంత ప్రముఖుడైన దుష్టుడు. తొంభై సంవత్సరాలు దాటి జీవించాడు. బహుశా హిందీ సినిమా ప్రేక్షకులు ఆయన్ని (ఆయన పాత్రల్ని) తిట్టిన తిట్లన్నీ దీవెనలుగా మారి ఇంతటి దీర్ఘాయుష్షు ప్రసాదించాయేమో!

వందేళ్ళక్రితం ప్రజలకి సినిమా అంటే ఏంటో సరీగ్గా తెలీదు. సినిమా అందుబాటులోకి వచ్చిన మొదట్లో చాలారోజులపాటు అంతకుముందు ప్రదర్శించిన నాటకాల్నే సినిమాలుగా మార్చుకున్నారు. కొంతకాలానికి సాంఘిక కథలు సృస్టించడం మొదలెట్టారు.

అయితే ఈ 'సాంఘిక' కథలక్కూడా రామాయణ మహాభారత కథలే మూలం, స్పూర్తి అని నా అభిప్రాయం. మంచి లక్షణాలన్నంటినీ పేర్చి నాయకుడిగానూ, చెడ్డలక్షణాలన్నీ కుప్పపోసి ప్రతినాయకుడిగానూ కథలు రాసుకుని సినిమాలు తీశారు. అనగా విలన్ పాత్రలకి ప్యాంటు, షర్టు తోడిగినా.. వాడికన్నీ రాక్షస లక్షణాలే. అందుకే విలనెప్పుడూ దుర్మార్గుడు, నీచుడు, స్త్రీలోలుడు.

అంచేత ఆ రోజుల్లో దాదాపు అన్నిభాషల్లో ఇట్లాంటి విలన్ పాత్రలుండేవి (అనుకుంటున్నాను). 1950 మరియు 60 లలో తెలుగులో రాజనాల, తమిళంలో నంబియార్, హిందీలో ప్రాణ్ లు దుష్టపాత్రలు పోషించారు. అర్ధశతాబ్దం తరవాత.. ఇప్పుడు మనకా పాత్రలు cartoon characters లా అనిపిస్తాయి కానీ.. ఆ రోజుల్లో అవి కథకి అత్యంత అవసరమైన పాత్రలు.

మన తెలుగు ప్రేక్షకులది బీభత్సమైన టేస్ట్. అంచేత మన అభిరుచికి తగ్గట్లుగా దర్శకులు విలన్ మొహంపై కిందనుండి లైటు వేసి నీడల్ని సృష్టించి భయపెట్టడం.. కనుబొమలు మందంగా, వంకరగా మేకప్ చెయ్యడం వంటి రకరకాల ట్రిక్కులు  ప్రయోగించి.. సాధ్యమైనంత విలన్ మొహాన్ని క్రూరంగా చూపెట్టేవాళ్ళు. తమిళులది మనకన్నా మరీ బీభత్సమైన టేస్ట్.. ఆ విషయం మీకు నంబియార్ని చూస్తే స్పష్టంగా అర్ధమైపోతుంది.

పాపం హిందీలో ప్రాణ్ కి ఇట్లాంటి ఫెసిలిటీలు లేవు. ఆయన పాత్రరీత్యా (ఎక్కువగా) ఫుల్ సూట్లో కనబడేవాడు. మనిషి బాగుంటాడు. అంచేత హిందీ సినిమా విలన్ పాత్రలో క్రూరత్వ ప్రదర్శన కోసం ప్రాణ్ తనదైన కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాడు. కళ్ళల్లో తోడేలు వంటి మోసపు చూపు, పెదవులపై వంకరగా నవ్వీనవ్వనట్లు ఒక విషపు నవ్వు చూపిస్తూ మనని భయపెట్టాడు. తద్వారా తనంటే ప్రేక్షకులు అసహ్యించుకునేట్లు చేసుకున్నాడు.

ప్రాణ్ విలన్ పాత్రల కోసం సిగరెట్లని కూడా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఈ సిగరెట్ల విలనిజం (ముఖ్యంగా) దిలీప్ కుమార్, షమ్మీకపూర్ సినిమాల్లో గమనించవచ్చు. స్టైలిష్ గా లైటర్తో సిగరెట్ వెలిగించుకోవటం.. తన దుర్మార్గపు ప్లాన్ల గూర్చి తీవ్రంగా ఆలోచిస్తున్న భావం ప్రదర్శిస్తూ.. గుప్పుగుప్పున దట్టమైన సిగరెట్ పొగ వదుల్తూ (నిజానికి ఇవన్నీ చిన్నచిన్న ట్రిక్స్) గొప్ప విలనిజాన్ని పండించాడు ప్రాణ్.

ప్రాణ్ నిజజీవితంలో స్మోకరో కాదో తెలీదు కానీ.. తన పాత్రల కోసం మాత్రం దిండ్ల కొద్దీ సిగరెట్లు తాగుంటాడు (ఆ రకంగా చూసుకుంటే.. ఇన్ని సిగరెట్లు తాగి కూడా అన్నేళ్ళు బతకడం విశేషమే). ఆరోజుల్లో ప్రాణ్ కనిపిస్తే తన్నాలన్నంత కోపం, కసితో హిందీ సినిమా ప్రేక్షకులు ఉండేవారని చదివాను. ఇంతకన్నా ఒక నటుడికి గొప్ప compliment ఉంటుందనుకోను!

చివరి తోక :

ప్రాణ్ గూర్చి నా ఆలోచనలు రాద్దామని ఉదయం నుండి తీవ్రంగా ప్రయత్నించి.. ఇప్పటికి హడావుడిగా నాలుగు ముక్కలు రాయగలిగాను. అమ్మయ్య! ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది.

(photo courtesy : Google)