Wednesday 3 July 2013

డాక్టర్ దిగ్విజయ్ సింగ్


నా భార్య నాలుగోనెల గర్భవతి. డాక్టర్ ఇప్పుడే ఆవిడకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేశాడు.


"అమ్మాయా? అబ్బాయా?"



డాక్టర్ నన్ను ఇబ్బందిగా చూశాడు.



"ఫీటస్ జెండర్ రివీల్ చెయ్యకూడదని మాకు రూల్స్ ఉన్నాయి." అన్నాడు.


"డాక్టర్ గారు! ఎన్నోయేళ్ళుగా సంతానం కోసం తపన పడుతున్నాం. నా భార్యకి 2004 లో ఆరోనెల్లో ఎబార్షన్ అయ్యింది. 2009 లో నాలుగోనెల్లోనే ఎబార్షన్ అయ్యింది. ఇప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీ నిలబడుతుందో, లేదో తెలీదు." అన్నాను.


"మీకు అబ్బాయి కావాలా? అమ్మాయి కావాలా?" నవ్వుతూ అన్నాడు డాక్టర్.



"నాకు ఎవరైనా ఒకటే. బేబీ సక్రమంగా పుడితే చాలు. ఇంతకీ అమ్మాయా? అబ్బాయా?"



డాక్టర్ చిన్నగా నవ్వాడు.



"అమ్మాయికి రోడ్ మేప్ సిద్ధం చేసుకోండి."



"అంటే?"



"గౌన్లు, ఫ్రాకులు రెడీ చేసుకోండి. పేరేం పెట్టాలో కూడా ఆలోచించుకొండి."



నాకర్ధమైంది. లోపలుంది అమ్మాయే! ఈ డాక్టర్ ఎంత మంచివాడు.!



ఈ హాస్పిటల్లో ఇంతకుముందు డాక్టర్ ఆజాద్ ఉండేవాడు. ఈ మాత్రం కూడా ఎప్పుడూ చెప్పిన పాపాన పోలేదు.



"అంటే అబ్బాయి కాదుగా ?" కన్ఫర్మ్ చేసుకుందామని అడిగాను.



డాక్టర్ మళ్ళీ నవ్వాడు.



"అబ్బాయిక్కూడా రోడ్ మేప్ సిద్ధం చేసుకోండి."



ఇప్పుడు ఆ నవ్వు నాకర్ధం కాలేదు. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది.



"అమ్మాయీ కాదు, అబ్బాయీ కాదు. మరి లోపలున్నదెవరు? అసలు ప్రెగ్నెన్సీ అయినా ఉందా? లేదా?" చికాగ్గా అన్నాను.



ఇప్పుడు మళ్ళీ నవ్వాడు డాక్టర్.



"వెల్. ఎవరైనా కావచ్చు. ఏదైనా కావచ్చు. అన్నింటికీ రోడ్ మేప్ తయారు చేసుకోండి."



అన్ని ప్రశ్నలకి ఒకే తరహా ప్లాస్టిక్ నవ్వు. ప్రతిదానికీ రోడ్ మేపంటాడు. అసలీ ఈ రోడ్ మేపుల గోలేంటబ్బా?



మనసులో ఏదో అనుమానం. ఇంతకీ ఈ డాక్టర్ పేరేంటి?



డాక్టర్ టేబుల్ మీదున్న ఆయన నేమ్ ప్లేట్ చూశాను.



డాక్టర్ దిగ్విజయ్ సింగ్!



(photo courtesy : Google)