Sunday 31 March 2013

బీరువాల్లో పుస్తకాలు - బీభత్స అనుభవాలు



ఈ ఫోటో చూడండి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సోనియా గాంధి వెనక ఎన్ని పుస్తకాలో!

'అక్కడున్న పెద్ద మనుషులకి కనీసం ఆ పుస్తకాల టైటిల్స్ అయినా తెలుసునా?'

'ఓయీ అజ్ఞాని! వాళ్ళంతా ఎవరనుకున్నావ్? ఈ దేశాన్ని నడిపిస్తున్న మహామేధావులు. వారికి ఆ పుస్తకాలన్నీ కొట్టిన పిండి, దంచిన కారం, వండిన కూర, పిండిన రసం.'

అలాగంటారా! అయితే మీరు నన్ను క్షమించాలి. ప్రతిమనిషి తన అనుభవాల నుండే జీవిత పాఠాలు నేర్చుకుంటాడు, ఆ దృక్కోణంతోనే జీవితాన్ని చూస్తుంటాడు. ఈ బీరువాలు, పుస్తకాలు పట్ల అనుమానాలు, అపార్ధాలు కలగడానికి చిన్నతనంలో నాక్కలిగిన కొన్ని బీభత్స అనుభవాలే కారణం.

కేస్ నంబర్ 1. ఎదురింటి ప్లీడరుగారు.




చిన్నప్పుడు మా ఇంటెదురు ఒక ప్లీడరుగారు ఉండేవారు. ఇంటినిండా బీరువాలే! బీరువాల్నిండా దున్నపోతుల్లాంటి పుస్తకాలే! ఆయనెప్పుడూ వాటిమొహం చూసిన పాపాన పోలేదు. పొద్దస్తమానం ఇంటి ముందున్న మామిడిచెట్టు కాయలు ఎవరు కోసేసుకుండా కుక్కకాపలా కాస్తుండేవాడు. ఆయనకి బెయిల్ పిటిషన్ వెయ్యడం కూడా రాదని నాన్న చెప్పేవాడు. మరాయనకి అన్ని పుస్తకాలెందుకబ్బా!

కావున బీరువాల్లో పుస్తకాలకీ, ఆ పుస్తక సొంతదార్లకీ సంబంధం వుండవలసిన అవసరం లేదనే అనుమానం నాలో మొదలైంది. సంబంధం లేకపోతే పోయింది.. అసలీ బీరువా పుస్తకరాయుళ్ళ శీలాన్నే శంకించాల్సిన సంఘటనలు అటుతరవాత నా జీవితంలో చోటు చేసుకున్నాయి.

కేస్ నంబర్ 2. మామా! ఇదా నీ అసలు రహస్యం!




నా మేనమామ ఒకాయన పెద్దఇల్లు కట్టించాడు. ఇంట్లో టేకు బీరువాలు, వాటి నిండా సాహిత్య పుస్తకాలు! షేక్స్పియర్, మిల్టన్, కీట్స్.. గురజాడ, శరత్ చంద్ర చటర్జీ.. అన్ని పుస్తకాలు నీటుగా, ముద్దొచ్చేలా సర్ది వుండేవి. ఏ యాంగిల్లో చూసినా నాకాయన ఓ గొప్ప మేధావిలా అనిపించేవాడు. పొద్దస్తమానం ఆ పుస్తకాల్ని సర్దుకుంటూ కాలక్షేపం చేసేవాడు.

అయితే.. ఆయన అత్తతో ఒక విషయంలో తీవ్రంగా గొడవ పడుతుండేవాడు. మా మేనమామ మామ.. అనగా మా అత్త తండ్రి.. ఇస్తానన్న కట్నం పూర్తిగా ఇవ్వలేక బాకీ పడ్డాట్ట. ఆ బాకీకి వడ్డీ, ఆ వడ్డీకి చక్రవడ్డి వసూలు చేసాడు మా మామ మహానుభావుడు. ఆ బాకీ వసూలు నిమిత్తం మా అత్తని అప్పడంలా వణికించేవాడు, ఇంట్లో దుర్భర వాతావరణాన్ని సృష్టించేవాడు.

ఆంగ్లాంధ్ర సాహిత్యాలని నమిలి మింగేసిన నా మేనమామ ఇంత ఘోరానికి తలపడుతున్నాడేమి? ఎక్కడో ఏదో తేడాగా ఉంది. ఏమది? ఈ అనుమానం కలిగిన మీదట ఆయన సాహిత్య జ్ఞానంపై డిటెక్టివ్ యుగంధర్‌లా పరిశోధన చేశాను.

దరిమిలా దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. మా మేనమామ ఆ పుస్తకాలేవీ చదవలేదు! చదవని ఆ పుస్తకాల పట్ల ఆయనకీ మమకారం యెందుకు?! ఆయన పోయిన నాల్రోజులకే ఆ పుస్తకాలన్నీ కిలోల్లెక్కన అమ్మేసి మా అత్త తన కసి తీర్చుకుంది, అది వేరే విషయం.

కేస్ నంబర్ 3. పుస్తకం రూముకే భూషణం!




డిగ్రీ చదివేరోజుల్లో నాకో స్నేహితుడున్నాడు. అతగాడికి ఆంగ్ల భాషయన్న మిక్కిలి ఎలర్జీ. అంచేత వెర్బులు, నౌన్లు లేకుండా.. ఆంగ్లభాషని ఖండఖండములుగా ఖండించి మాట్లాడుతూ కసి తీర్చుకునేవాడు.

ఉన్నట్టుండి అతగాడి హాస్టల్ రూములో ఆంగ్ల పుస్తక దిండ్లు! విశాలాంధ్ర పుస్తకాల షాపునుండి టన్ను పుస్తకాలు కొనుక్కొచ్చాడు. పెత్రోవ్, తీస్తొనాస్కీ.. అంటూ అర్ధం కాని పేర్లతో రచయితలు, అన్నీ కలిపి వంద రూపాయలు కూడా అవలేదుట!

'వామ్మో! మనోడిలో ఇంత విషయం వుందా!' అని కంగారు పడ్డా.

నా కంగారు చూసి మావాడు చిద్విలాసంగా నవ్వాడు. కొద్దిసేపటికి అసలు రహస్యం చెప్పాడు.

'మనం తెలివైనవాళ్ళం. ఆ విషయం నీకూనాకూ తెలుసు. కానీ ఎదుటివాడికి ఎలా తెలుస్తుంది? మనగొప్ప మనమే చెప్పుకోలేం గదా! ఆ పని ఈ పుస్తకాలు చేస్తాయి.' అన్నాడు.

'నిజవే! కానీ ఇవి చదవాలంటే కష్టం కదా?' అన్నాను.

'ఓరి అమాయకుడా! ఇవి చదవడానికి కాదు, ఎదుటి వాణ్ని భయపెట్టడానికి. రూములో టేబుల్, టీపాయిల్లాగా ఈ పుస్తకాలూ ఫర్నిచర్లో భాగవే!' అన్నాడు.

దుర్మార్గుడు! పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. వీడు పుస్తకాన్నిరూముకే భూషణంగా మార్చాడు!

కేస్ నంబర్ 4. పుస్తకాలు చేసిన పెళ్లి!



అతను నా జూనియర్. ఓ రోజు హడావుడిగా వచ్చాడు.

"గురూగారు! మీ ఇంగ్లీష్ నవల్స్ ఓ రెండ్రోజులు అప్పివ్వాలి."

"అన్నీ ఒక్కసారిగా ఎందుకు? ఒకటొకటిగా తీసుకెళ్ళి చదువుకో."


"భలేవారే! అవన్నీ చదవడానికి నాకు పనీపాటా లేదనుకున్నారా! నాకు అమెరికా సంబంధం వచ్చింది. పిల్ల US సిటిజన్. పెళ్లివారు రేపు మా ఇంటికి వస్తున్నారు. నా దగ్గర మన్లెవలుకి తగ్గట్లుగా మధుబాబు, మల్లాది నవల్స్ ఉన్నాయి. నిన్నవన్నీ కట్టగట్టి అటకమీద పడేశాను. ఇప్పుడు మీరిచ్చే ఇంగ్లీషు పుస్తకాల్ని అద్దాల బీరువాలో నీటుగా సర్దాలి, పెళ్లివాళ్ళ దగ్గర మార్కులు కొట్టెయ్యాలి." అన్నాడు.

"అన్నీ ఇంగ్లీషు పుస్తకాలైతే నమ్మరేమో! అంచేత పన్లో పని.. రావిశాస్త్రిని కూడా తీసుకెళ్ళు."

"రావిశాస్త్రా! ఎవరాయన?"

"ఆయన తెలుగు సాహిత్యవనంలో రావి వృక్షం వంటివాడు."

"వామ్మో! నాకు వృక్షాలు వద్దు, పుస్తకాలు చాలు. అయినా ఆ అమెరికావాళ్ళ ముందు నేను తెలుగు పుస్తకాలు చదువుతున్నట్లు కనిపించకూడదు, చీపుగా వుంటుంది." అన్నాడు.

నా ఇంగ్లీషు నవల్స్ అట్టపెట్టెలో తీసుకెళ్ళాడు, ప్లాన్ విజయవంతంగా అమలు చేశాడు. అదే అట్టపెట్టెలో జాగ్రత్తగా పుస్తకాలు తీసుకొచ్చి థాంక్సులు తెలిపి వెళ్ళాడు, ఒక్కపుస్తకం కూడా మిస్సవ్వలేదు! పుస్తకాలు చదివేవాడైతే పుస్తకాలు కొట్టేస్తాడు గానీ, చదవనివాడు నిజాయితీగా తిరిగిచ్చేస్తాడన్న సత్యం బోధపడింది. ఇప్పుడతను అమెరికాలో ఓ పెద్దడాక్టరు. ఆ విధంగా పుస్తకాల వల్ల పెళ్లిసంబంధాలు కూడా కుదుర్చుకోవచ్చని నిరూపించిన మేధావి.

ఇన్ఫరెన్స్ :-




అటు తరవాత పుస్తక ప్రియుల్ని రెండురకాలుగా విభజించుకున్నాను. మొదటిరకం పుస్తకాలు కొంటారు లేదా సంపాదిస్తారు, కానీ చదవరు. వారికి పుస్తకాలు కేవలం అలంకార ప్రాయం, స్టేటస్ సింబల్.

రెండోరకంవాళ్ళు పుస్తకాలు చదువుతారు. కొని చదువుతారా, కొనకుండా చదువుతారా సెకండరీ.. మొత్తానికి చదువుతారు. కానీ చదివినట్లు కనపడరు. అక్కడసలు పుస్తక వాతావరణం కూడా ఉండదు, సీక్రెట్ ఏజంట్లలా గుంభనంగా ఉంటారు.

డిస్కషన్ (చర్చ) :-




ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ విషయంకి వద్దాం. పార్టీని గానీ, ప్రభుత్వాన్ని గానీ నడపడానికి ఆ పుస్తకాల అవసరం ఉందా? ఉండదని నా అభిప్రాయం.

'రాహుల్‌ని ప్రధాని పదవికి ఒప్పించుట ఎలా? కరుణ లేని కరుణానిధి కరుణా కటాక్షములు తిరిగి సంపాదించుట ఎలా? మూలాయం మూలములేమి? మమత మమతానురాగములను ఏ విధమున పొందవలయును? మాయావతిని మాయలో పడవేయుట ఎట్లు?'

ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆ పుస్తకాల్లో వుండవు, ఆ సమాధానాల్లేని పుస్తకాలతో కాంగ్రెస్ పార్టీకి పన్లేదు. మరైతే అన్నేసి పుస్తకాలు పార్టీ మీటింగ్ హాల్లో ఎందుకు?!

మన మైండ్ అనేక విషయాలకి ట్యూన్ అయిపోయి వుంటుంది. రోజువారి పనులకి అనుగుణంగా అనేక ప్రతీకలు మెదడు రిజిస్టర్లో ముద్రించుకుని వుంటాయి. వాటిననుసరించి యాంత్రికంగా బ్రతికేస్తుంటాం, తేడావస్తే మెదడులో రిజిస్టర్ ఒప్పుకోదు.

ఉదాహరణకి కాఫీ హోటల్లో గుడిగంట ఉందనుకోండి, కాఫీపట్ల అనుమానం కలుగుతుంది. అదే విధంగా గుళ్ళో ప్రసాదంగా ఉప్మా పెసరట్టు పెడితే ఆ దేవుడి మహిమ పట్ల అనుమానాలొస్తాయి. అంటే మనకి తెలీకుండానే.. ఒక గదిలో సామాను సర్దినట్లుగా.. మెదడులో రొటీన్ సమాచారం స్టోర్ అయి వుంటుంది. అందుకే కొద్దిగా తేడావచ్చినా బుర్రలో తికమక!

కంక్లూజన్ (ముగింపు) :-




అంచేత - కాంగ్రెస్ పార్టీ మీటింగ్ హాల్లో బీరువాలు, వాటినిండా పుస్తకాలు వుండటం చాలా సబబు. వెనకాల ఆ బీరువాలు, పుస్తకాల వుండటం మూలానే వాళ్ళంతా తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా ఉంది. అవే లేకపోతే వాళ్ళు మేధోమధనం చేస్తున్నట్లుగా వుండదు, మసాలా దోశలు ఆర్డరిచ్చి.. తినడం కోసం ఆశగా, ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లుగా వుంటుంది.

అప్పుడు దేశప్రజలకి కోపం వస్తుంది, పిమ్మట ప్రభుత్వాలు పడిపోతాయి. అలా జరక్కుండా వుండాలనే ఆ హాలునిండా బీరువాలు, పుస్తకాలు వుంచి.. పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాక్షేమం గూర్చి సీరియస్‌గా 'ఆలోచిస్తున్న' వాతావరణం కల్పిస్తుంటాయి. చూశారా! బీరువాలకీ, బీరువాల్లో పుస్తకాలకీ వున్న పవర్!

చివరి తోక.. 

'అవునురే! పుస్తకాల బీరువాల గూర్చి ఇన్ని యెదవ ఆలోచనలు రాశావు గదా! ఇంతకీ నువ్వేజాతి?'


'హ్మ్.. ఇదంతా ఎలా రాశాననుకున్నావ్? ఒకప్పుడు నేను పుస్తకాలు చదివేవాణ్ని, ఇప్పుడు పుస్తకాలు కొని బీరువాల్లో 'దాచుకుంటున్నాను'. దొంగతనాల గూర్చి దొంగే చక్కగా రాయగలడు, ఆ మాత్రం తెలీదా!'

(posted in fb on 7 Jan 2018)

Monday 25 March 2013

హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!


"ఉతికి ఆరవేయుట!"

"చీల్చి చెండాడుట!"

"చావగొట్టి చెవులు మూయుట!"

ఇవన్నీ అర్ధం చేసుకోవాలంటే ఇవ్వాళ 'ఆంధ్రజ్యోతి' సాహిత్య వేదిక 'వివిధ'లో రంగనాయకమ్మ వ్యాసం "విప్లవాలు కుప్పకూలేది ఇందుకే!" చదవండి.

నా చిన్నప్పట్నించి రంగనాయకమ్మ సాహిత్య విమర్శ చదువుతున్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఆమెలో అదే స్పష్టత, సూటిదనం! సాధారణంగా వయసు పైబడుతున్నవారి వాదనలో వాడి, వేడి తగ్గుతుంది. కలంలో పదును బండబారుతుంది. అయితే రంగనాయకమ్మ వీటన్నింటికీ అతీతం!

తెలుగు సాహిత్య విమర్శనా రంగం మర్యాదస్తుల వేదిక. అందుకే విమర్శకులు 'ఎందుకొచ్చిన గోల!' అనుకుంటూ తప్పుకుంటారు. అందుకు ఒక కారణం వారికి ఆ రచయితతో ఉండే సాన్నిహిత్యం. అంచేత మొహమాటం. అలాగే తెలుగు సాహిత్యంలో విమర్శల్ని సహృదయంతో స్వీకరించే వాతావరణం కూడా లేదు. పైగా విమర్శకులపై రచయిత ఎదురుదాడి చేసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది (ఉదాహరణ.. డా.కేశవరెడ్డి 'మునెమ్మ').

'నామిని' రచనల్ని గోర్కీతో పోలుస్తూ ఎంతగానో మెచ్చుకోవడం.. అటు తరవాత అతని వ్యక్తిత్వం నచ్చక తీవ్రమైన విమర్శ చేయడం.. ఒక్క రంగనాయకమ్మకే చెల్లింది. సన్మానాల కోసం, పురస్కారాల కోసం వెంపర్లాడే రచయితలకి తెలుగు సాహిత్యం పుట్టినిల్లు. ప్రముఖ రచయితలు తమ భజన మండళ్ళని ప్రోత్సాహిస్తూ పీఠాధిపతులుగా చలామణి అవుతుంటారు. ఈ వాతావరణం కారణంగా నిష్కర్షగా, నిర్మొహమాటంగా రాసేవారి సంఖ్య రోజురోజుకీ చిక్కిపోతుంది.

రంగనాయకమ్మ 'విరసం'ని ఇంత తీవ్రంగా విమర్శించడం నాకు విశేషంగా అనిపించడానికి ఇంకో కారణం కూడా ఉంది. రంగనాయకమ్మ రాసుకున్నట్లుగానే.. ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చలసాని ప్రసాద్ ఎంతగానో సహాయం చేశాడు. ఇవ్వాళ రంగనాయకమ్మ తీవ్రంగా విమర్శించిన కొడవటిగంటి కుటుంబరావు వ్యాసాల ప్రచురణకి కారకుడు కూడా చలసాని ప్రసాదే! కానీ రంగనాయకమ్మకి దయాదాక్షిణ్యాలు ఉండవు!

సరే! కుటుంబరావు దయ్యాల వ్యాసాల పట్ల నా అభిప్రాయాల్ని "'విరసం' పై నాదీ రంగనాయకమ్మ మాటే!" అంటూ ఇంతకు ముందే రాసేశాను. ఇప్పుడు ఈ టాపిక్ మీద కొత్తగా నే రాసేదేమీ లేదు.. ఒక్క రంగనాయకమ్మని అభినందించడం తప్ప!

"హ్యాట్సాఫ్ టు రంగనాయకమ్మ!"

(photos courtesy : Google)

Wednesday 20 March 2013

"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."


"తెలుగు న్యూస్ పేపర్లు చదవకురా చెడేవు."

"ఇచట తెలుగు వార్తాపత్రికలు నిషేధించబడినవి."

"తెలుగు వార్తాపత్రికలు చదివినవాడు గాడిద."

"ఈ ప్రాంగణమున తెలుగు వార్తాపత్రికలు వీక్షించిన యెడల శిక్షింపబడెదరు."

"తెలుగు వార్తాపత్రికలు చదివినచో పరీక్షల్లో మీకు గుండు సున్నా ఇవ్వబడును."

అదొక హై స్కూల్. ఆ స్కూల్ గోడల నిండా ఇట్లాంటి వాక్యాలు పెద్దపెద్ద అక్షరాలతో నీతివాక్యాల్లా రాయబడి ఉన్నాయి.

ఒక పక్కగా హెడ్మాస్టర్ గారి ఆఫీస్. ఆ గదిలో ఇద్దరు కుర్రాళ్ళు గోడకుర్చీ వేసి ఉన్నారు. ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు గుంజిళ్ళు తీస్తున్నారు. వాళ్ళు చేసిన నేరం.. పొరబాటున ఆ రోజు తెలుగు వార్తాపత్రిక చూశారు!

హెడ్మాస్టర్ గారు ఏవో కాయితాలపై సంతకాలు చేసుకుంటూ అంటున్నారు.

"వెధవల్లారా! ఎంత చెప్పినా మీకు బుద్ధి రాదా? 'ఇంక జన్మలో తెలుగు పేపర్లు చదవం' అని రేపటికల్లా వందసార్లు రాసుకు రండి. అర్ధమైందా?"

ఏమిటీ అనర్ధం? ఎందుకీ అరాచకం? ఇక్కడింత జరుగుతున్నా 'అధికార తెలుగు భాషా సంఘం' ఏం చేస్తుంది? హతవిధీ! ఈ దురాగతాన్ని అరికట్టేవారే లేరా?

అసలేం జరిగిందంటే (ఫ్లాష్ బ్యాక్)..

కొన్నాళ్ళ క్రితం ఆ స్కూలుకి స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు వచ్చారు. పిల్లల హాజరు పట్టీ, ఉత్తీర్ణతా శాతాన్ని పరిశీలించిన పిమ్మట స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అందుకు కారకుడైన హెడ్మాస్టర్ గారిని ఎంతగానో అభినందించారు.

'ఈ స్కూల్ బహు ముచ్చటగా యున్నది. పిల్లల తెలివితేటలు ఇంకెంత గొప్పగా యుండునో?' అనుకున్న ఇనస్పెక్టర్ గారికి చివరి క్షణంలో పిల్లల జనరల్ నాలెడ్జ్ పరీక్షిద్దామనే గొప్ప ఆలోచన వచ్చింది. అందుకు అనుగుణంగా హెడ్మాస్టర్ గారు పిల్లల్ని సమావేశపరిచారు.

ఆ పిల్లల్లో ఒకడు చురుకుగా, ధైర్యంగా కనిపిస్తున్నాడు. ముందుగా వాణ్ని లేపారు ఇనస్పెక్టర్ గారు.
"నీ పేరేంటి బాబూ?"

"నిఖిల్ రెడ్డి."

"భారత దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని ఎవరు నడిపించారు?" ఉల్లాసంగా నవ్వుతూ ప్రశ్నించారు ఇనస్పెక్టర్ గారు.

"వై.యస్. రాజశేఖర రెడ్డి." తడుముకోకుండా చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారు ఆశ్చర్యపోయారు.

"రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడెవరు?"

"చంద్రబాబు నాయుడు." ఠకీమని చెప్పాడు నిఖిల్ రెడ్డి.

ఇనస్పెక్టర్ గారికి సమాధానం అర్ధం కాలేదు. బట్ట బుర్ర గోక్కున్నారు.

"నోబెల్ ప్రైజ్ సంపాదించిన ఒక భారతీయుని పేరు చెప్పు."

"వై.యస్. జగన్మోహన రెడ్డి." బుల్లెట్లా సమాధానం వచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టారుని చిరాగ్గా చూశారు. హెడ్మాస్టర్ సిగ్గుతో తల దించుకున్నారు.

ఇనస్పెక్టర్ గారు నిఖిల్ రెడ్డి కూర్చోమని చెప్పి ఇంకొకణ్ని లేపారు.

"నీ పేరేంటి?"

"నవీన్ చౌదరి."

"ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఎవరు?" మృదువుగా అడిగారు ఇనస్పెక్టర్ గారు.

"ఎన్టీరామారావు." గర్వంగా చెప్పాడా కుర్రాడు.

ఇనస్పెక్టర్ గారికి కళ్ళు తిరిగాయి.

"భారతదేశ ప్రధాన మంత్రిగా ఒకే ఒక్క తెలుగు వ్యక్తి పనిచేశారు. ఎవరాయన?"

"చంద్రబాబు నాయుడు." బల్ల గుద్దినట్లు చెప్పాడు నవీన్ చౌదరి.

ఇనస్పెక్టర్ గారికి గుండె పట్టేసినట్లైంది. నీరసంగా అడిగారు.

"జలియన్ వాలా బాగ్ దురంతానికి కారకుడెవరు?"

"వై.యస్.జగన్మోహన రెడ్డి." సమాధానం బాణం కన్నా వేగంగా దూసుకొచ్చింది.

ఇనస్పెక్టర్ గారు హెడ్మాస్టార్ని కొరకొరా చూశాడు. ఆయన చూపులకి హెడ్మాస్టర్ గారు విలవిలలాడిపొయ్యారు. ఒక్క ఉదుటున లేచి.. విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపొయ్యారు ఇనస్పెక్టర్ గారు. రెండు చేతులూ నెత్తిన బెట్టుకుని ఉసూరుమంటూ కుర్చీలో కూలబడ్డారు హెడ్మాస్టర్ గారు.

పది రోజుల్లో స్కూళ్ళ ఇనస్పెక్టర్ గారి కార్యాలయం నుండి తాఖీదు. మీ స్కూల్ విద్యార్ధుల నాలెడ్జ్ బిలో యావరేజ్ గా ఉన్నందున మీపై ఎందుకు చర్య తీసుకోరాదంటూ షో కాజ్ నోటీస్. హెడ్మాస్టర్ గారు లబోదిబోమన్నారు. ఆనక నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలని పిలిపించారు.

"మీ అమ్మ కడుపులు మాడ! మీరు చక్కగా చదివే స్టూడంట్లే కదర్రా! ఆ ఇనస్పెక్టర్ కి తలతిక్క సమాధానాలు చెప్పి నా కొంప కొల్లేరు చేసారేం?" అంటూ ఫేనంత ఎత్తు ఎగిరారు.

నిఖిల్ రెడ్డి, నవీన్ చౌదరిలు ముఖముఖాలు చూసుకున్నారు. తమ తప్పేమీ లేదనీ.. తాము తమ ఇంట్లో తెప్పించే తెలుగు వార్తాపత్రిక క్రమం తప్పకుండా చదువుతున్నామని.. అందులో రాసిన విధంగానే సమాధానాలు చెప్పామని బావురుమన్నారు.

"వార్తాపత్రికల్లో అలా రాశారా!? ఏం పేపర్లురా అవి?"

"......" అని ఒక పేపర్ పేరు చెప్పాడు నిఖిల్ రెడ్డి.

"....." అని ఇంకో పేపర్ పేరు చెప్పాడు నవీన్ చౌదరి.

హెడ్మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. పిమ్మట ప్యూన్ పుల్లారావుతో ఆ రెండు పేపర్లు తెప్పించారు. పావుగంట పాటు రెండు పేపర్లు తిరగేశారు.

'నిజమే! పాపం పసిపిల్లలు! వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఆ పేపరోళ్ళు రాసిందే నిజమని నమ్మారు. నమ్మిందే చెప్పారు.' అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డారు హెడ్మాస్టర్ గారు.

అటు తరవాత ఇనస్పెక్టర్ గారి షో కాజ్ నోటీస్ కి ఏదో సమాధానం చెప్పుకుని బయటపడ్డారు హెడ్మాస్టర్ గారు. ఆపై స్కూల్ విద్యార్ధులెవరూ తెలుగు వార్తాపత్రికలు చదవరాదనే నిబంధన పెట్టారు. ఆ నిబంధన కనుగుణంగా స్కూల్ గోడల నిండా కొత్త నీతివాక్యాలు రాయించారు. క్రమశిక్షణ తప్పిన పిల్లల్ని కఠినంగా శిక్షించసాగారు.

అయ్యా! అదండీ కథ!

(photos courtesy : Google)

Saturday 16 March 2013

ఉపన్యాసం.. ఒక హింసధ్వని!



"ఉరేయ్! మన దేశానికి అనవసరంగా సొతంత్రం వచ్చింది. రాకపోతేనే బాగుండేది. ఈ సుత్తి భరించలేకపోతున్నా!" పక్కనున్న రావాయ్ గాడితో విసుగ్గా అన్నాను.

"ష్! హెడ్మాస్టర్ జగన్నాథరావుగారు మననే చూస్తున్నారు." పెదాలు కదపకుండా సమాధానం చెప్పాడు రావాయ్ గాడు ఆలియాస్ రాము.

నిజంగానే మా హెడ్మాస్టర్ గారు పిల్లలందర్నీ సునిశితంగా గమనిస్తున్నారు. అసలే ఆ రోజు ఇండిపెండెన్స్ డే. దొరికితే ఇంతే సంగతులు. అబ్బబ్బా! ఈ హెడ్మాస్టర్ గారితో చస్తున్నాం. దేశానికైతే ఇండిపెండెన్స్ వచ్చింది గానీ.. మాకు మాత్రం హెడ్మాస్టర్ గారి బలవంతపు దేశభక్తి పాఠాల నుండి విముక్తి రాలేదు.

ఆ వచ్చినాయన స్వాతంత్ర్య సమర యోధుడుట. నెత్తి మీద గాంధీ టోపీ. బక్కగా, పొట్టిగా ఆర్కేలక్ష్మణ్ కార్టూన్లా ఉన్నాడు. ఆయన దేశం కోసం ఎంతో త్యాగం చేశాట్ట. బ్రిటీష్ వాడి గుండెల్లో నిద్ర పోయాట్ట. గంటన్నరగా స్వాతంత్ర్యోద్యమం గూర్చి ఆవేశంతో ఊగిపోతూ చెబుతున్నాడు. గాంధీ, నెహ్రూ పేర్లు తప్ప ఒక్క ముక్క అర్ధం అయ్యి చావట్లేదు. మొత్తానికి ఉపన్యాసం అయిపోయింది. చప్పట్లతో ఓపెన్ ఆడిటోరియం మార్మోగింది. ఆ రోజుల్లో పెద్దగా చప్పట్లు కొట్టి ఉపన్యాసం ముగియడం పట్ల మా సంతోషాన్ని (నిరసనని) వ్యక్తం చేసేవాళ్ళం.


మా మాజేటి గురవయ్య హైస్కూల్లో 'ఇండిపెండెన్స్ డే', 'రిపబ్లిక్ డే'లు మాకు ఇష్టమైన దినాలు. జెండా కర్ర దగ్గర కట్టి ఉంచిన తాడు లాగంగాన్లే.. జెండా తెరుచుకుంటూ.. అందులోంచి పూలు రాలడం.. పి. సి.సర్కార్ మేజిక్కులా అనిపించేది. ఒక్కోసారి తాడు ఎంత లాగినా జెండా తెరుచుకునేది కాదు. అది ఇంకా సరదాగా ఉండేది.

నా ఇష్టానికి ఇంకో కారణం.. మా స్కూల్లో ఇండిపెండెన్స్ డే నాడు ఐదు బ్రిటానియా బిస్కట్లు, రిపబ్లిక్ డే నాడు ఒక రవ్వలడ్డు ఇస్తారు. ప్రోగ్రాం అయిపోయి తరవాత మెయిన్ గేటు సగం తెరిచి ఉంచేవారు. బయటకి వెళ్ళేప్పుడు మా బుల్లి చేతుల్లో బిస్కెట్లో, లడ్డో పెట్టేవాళ్ళు. ఆ పెట్టేవాళ్ళు కూడా విద్యార్ధులే.అంచేత ఫ్రెండ్షిప్పు కొద్దీ ఎవడికైనా ఎక్కువ ఇచ్చేస్తారేమోనని కొండా ఆంజనేయులు మాస్టారు వంటి చండశాసన ఉపాధ్యాయుల్ని డిస్ట్రిబ్యూషన్ దగ్గర పర్యవేక్షకులుగా ఉంచేవారు.

సరే! కాలచక్రం గిర్రున తిరిగి.. నేను పెద్దవాడనైనాను. ఆ విధంగా ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే ల సందర్భంగా ప్రముఖులు వాకృచ్చే గంటల కొద్దీ ఉపన్యాసాలు తప్పించుకుని.. జీవితాన్ని మిక్కిలి సంతోషంగా గడపసాగాను. అయితే విధి బలీయమైనది. దాని చేతిలో మనమందరమూ పాపులమే.. క్షమించాలి.. పావులమే!

అందుకే ఒకానొక ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక స్కూల్లో ఉపన్యసించవలసిన అగత్యం ఏర్పడింది. అగత్యం అని ఎందుకుంటున్నానంటే.. తప్పించుకోడానికి అనేక ఎత్తులు వేశాను. ఉపన్యాసాలు వినడమే ఒక శిక్ష. ఇంక చెప్పడం కూడానా! కానీ కుదర్లేదు. ఆ స్కూల్ వారికి సైకియాట్రిస్ట్ మాత్రమే కావాల్ట (నా ఖర్మ). నాకు అతి ముఖ్యమైన స్నేహితుల నుండి ఒత్తిడి, మొహమాటం.

జెండా ఎగరేసేందుకు ముఖ్య అతిధిగా ఒక పెద్ద ప్రొఫెసర్ గారట. ఆయన మాట్లాడిన తరవాత నేను మాట్లాడాలిట. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచుకోవడం లాంటి చిత్రవిచిత్ర అంశాల గూర్చి నేను ఆంగ్లంలో ఉపన్యసించాలి. అదీ నాకిచ్చిన టాస్క్. ఇట్లాంటి నీతిబోధనలపై నాకంత గౌరవం లేనప్పటికీ ఒప్పుకోక తప్పలేదు.

ఉదయం ఎనిమిదిన్నర కల్లా స్కూలుకి చేరుకున్నాను. ప్రొఫెసర్ గారు జెండా ఎగరేసి వందన సమర్పణ గావించారు. అక్కడ పిల్లల్ని చూసి ఆశ్చర్యపొయ్యాను. చిన్నపిల్లలు. ముద్దొస్తున్నారు.మరీ ఇంత పసిపిల్లలు విద్యార్ధులుగా ఉంటారని నేనూహించ లేదు. కొందరు పిల్లలైతే తప్పటడుగులు వేస్తున్నారు. (ఆ పసిపిల్లలు ఎల్కేజీ వారని స్కూల్ హెడ్ చెప్పాడు.)

పిల్లల్ని తరగతుల వారీగా నేలపై కూర్చోబెట్టారు. ముందు చిన్న తరగతులు. చివర్లో పదో తరగతి. నేనెప్పుడూ ఏ స్కూల్లోనూ స్టేజ్ మీద కుర్చీలో కూర్చోలేదు. అంచేత ఆ అనుభవం నాక్కూడా కొత్తగానే ఉంది. అంతమంది పిల్లలు బారులు తీరి కూర్చోవడం చూడ్డానికి ముచ్చటగా కూడా ఉంది.

ఆ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవడం గమనిస్తే.. వారికి ఇంగ్లీష్ సరీగ్గా రాదని తెలిసిపోయింది. అసలే నాది డ్రై టాపిక్. కాబట్టి వారికర్ధమయ్యే భాషలోనే ఏడిస్తే మంచిది. అంచేత నా ప్లాన్ మార్చుకున్నాను. నే చెప్పదలుచుకున్న అంశాన్ని మనసులోనే తెలుగులోకి తర్జుమా చేసుకున్నాను. అయినా వీరికి అర్ధమయ్యేట్లు చెప్పడం కష్టమే! అసలు నాకిచ్చిన ఉపన్యాస అంశమే ఇక్కడ ఇర్రిలవెంట్ టాపిక్. ఇప్పుడెలా? ఇరుక్కుపోయ్యానే!

ప్రొఫెసర్ గారు ఇండిపెండెన్స్ డే గూర్చి ఆంగ్లంలో ఉపన్యాసం మొదలెట్టాడు. ఆయనకి ఆంగ్లభాషపై మంచి పట్టు ఉన్నట్లుంది. వింటుంటే హిందూ పేపర్ ఎడిటోరియల్ చదువుతున్నట్లుగా అనిపించింది. కొద్దిసేపటికి ఆయన చెప్పేది నాకు అర్ధం అవ్వట్లేదు! అర్ధం కానప్పుడు వినడం దండగ. అంచేత వినడమే మానేశాను.

స్టేజి మీద ఉన్నాను కాబట్టి దిక్కులు చూస్తుంటే బాగోదు. అందువల్ల ఎదురుగానున్న పిల్లల్ని గమనించసాగాను. వారి మొహంలో కొట్టొచ్చినట్లు విసుగు కనిపిస్తుంది. హఠాత్తుగా నా గురవయ్య హైస్కూల్ రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఆ పిల్లల్లో నాకు నేనూ, నా స్నేహితులూ కనిపించసాగారు. ముఖ్యంగా ఆ చివరి వరసలో ఒకడు కోపంగా గుడ్లు మిటకరిస్తున్నాడు. వాడిలో నన్ను నేను దర్శించుకున్నాను!

పక్కనే కూర్చునున్న స్కూల్ హెడ్ ని వాకబు చేశాను. 'వీరికి ప్రోగ్రాం అయిన తరవాత స్నాక్స్ ఇస్తున్నారా?'. ఆయన అట్లాంటి ప్రోగ్రామేమీ లేదన్నాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది. గిల్టీగా కూడా అనిపించింది. ఇవ్వాళ దేశానికి పండగ అని చెబుతున్నాం. కనీసం ఒక బిస్కట్ అయినా ఇస్తే పిల్లలు ఎంతగానో సంతోషిస్తారు గదా (అందుకు సాక్ష్యం నేనే)!

ప్రొఫెసర్ గారి ఆవేశపూరిత, ఉద్వేగపూరిత, స్పూర్తిదాయక ఆంగ్లోపన్యాసం పూర్తయింది. పెద్దగా చప్పట్లు. ప్రొఫెసర్ గారి మొహంలో గర్వం. పిల్లలు అంత గట్టిగా చప్పట్లు ఎందుకు కొట్టారు!? ఈ చప్పట్లు మా నిరశన చప్పట్ల వంటివా? ఏమో! కొన్ని ఆనవాయితీల్ని ఎవరూ చెప్పకుండానే ఫాలో అయిపోతుంటాం.

ఇక నా వంతొచ్చింది. స్కూల్ హెడ్ మైకులో నా గూర్చి గొప్పగా చెప్పి పిల్లలకి పరిచయం చేశాడు (నిజానికి నేనంత సమర్దుడనని అప్పటిదాకా నాకూ తెలీదు). మైక్ ముందుకోచ్చాను. గొంతు సరిచేసుకున్నాను. పిల్లల మొహాల్లో చికాకు. 'నాటకంలో రెండో కృష్ణుళ్ళా మళ్ళీ ఇంకోడు' అని వారు అనుకుంటున్నారా!?

ఒక్క క్షణం ఆలోచించాను. నా చిన్నతనంలో నేను ఉపన్యాసాల బాదితుడను. ఇప్పుడు వీరిని నేను అదే ఉపన్యాసంతో ఎందుకు పీడించాలి? పీడితుడు పీడకుడు కారాదు. స్కూల్ యాజమాన్యాన్ని సంతృప్తి పరచడానికి పిల్లల్ని హింసించలేను. వెంటనే నాకు జ్ఞానోదయం అయ్యింది. నేను ఏం చెప్పకూడదో కూడా అర్ధమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీ మాట్లాడరాదు. మరేం చెప్పాలి?

"పిల్లలూ! బాల్యం చాలా విలువైనది. రోజూ కనీసం గంటసేపు ఆడుకోండి. స్నేహితులతో చక్కగా కబుర్లు చెప్పుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం. రోజూ మూడు పూటలా మంచి ఆహారం కడుపు నిండా తీసుకొండి. పాలు తాగండి. గుడ్డు తినండి. పప్పు ఎక్కువగా తినండి." అంటూ తెలుగులో మాట్లాడటం మొదలెట్టాను. ప్రొఫెసర్ గారు నన్ను విచిత్రంగా చూశారు.

నేను మాట్లాడటం కొనసాగించాను.

"జీవితంలో చదువు చాలా ముఖ్యం. కానీ చదువే జీవితం కాదు. సబ్జక్ట్ అర్ధం చేసుకుంటూ చదవండి. డౌట్స్ ఉంటే మీ టీచర్స్ తో చర్చించండి. మార్కుల కోసం పడీపడీ చదవద్దు. మార్కులనేవి అసలు ముఖ్యం కాదు. చదవడం చికాకనిపిస్తే పుస్తకం అవతల పడేసి హాయిగా ఫ్రెండ్స్ తో ఆడుకోండి. నేనదే చేశాను. బీ హేపీ! ఎంజాయ్ యువర్ సెల్ఫ్!" అంటూ ముగించాను. స్కూల్ హెడ్ ఆశ్చర్యంగా నన్నే చూస్తున్నాడు.

మళ్ళీ చప్పట్లు. అయితే ఈసారి చప్పట్లు మరింతగా ఎక్కువసేపు వినిపించాయి. బహుశా నేను నా టాపిక్ మాట్లాడకపోవడం వారికి నచ్చినట్లుంది!

అంకితం..

ఎందఱో మహానుభావులు. అందరికీ వందనములు. స్కూల్స్, కాలేజీలకి ఉపన్యాసకులుగా వెళ్లి.. సుభాషితాలు, హితబోధలు గావిస్తూ విద్యార్ధుల జీవితాలతో ఆడుకునే ఉపన్యాస దుర్జనులకి.. క్షమించాలి.. దురంధరులకి..

కృతజ్ఞత..

'హింసధ్వని' మిత్రులు వల్లూరి శివప్రసాద్ గారి రచన. బంగారు నందితో పాటు ఎన్నో ఎవార్డులు పొందిన 'హింసధ్వని' నాటిక.. ఈ టపా శీర్షికకి ప్రేరణ. 


(photos courtesy : Google)

Monday 11 March 2013

నాన్నా! నన్ను క్షమించు

సమయం రాత్రి ఒంటిగంట, నిశ్శబ్దంగా వుంది. సైకియాట్రీ జర్నల్లో రివ్యూ ఆర్టికల్ చదువుతున్నాను, విసుగ్గా అనిపించింది. తల పైకెత్తి చూస్తే ఎదురుగా నాన్న ఫోటో, ఫోటోలోంచి నన్నే చూస్తూ నవ్వుతున్నట్లనిపించింది.. పుస్తకం మూసేశాను.

నాన్ననే చూస్తూ ఆలోచించసాగాను. నాన్న! నా జీవితంలో కొన్నేళ్ళపాటు ప్రతిరోజూ ప్రధానపాత్ర వహించిన నాన్న ఇవ్వాళ లేడు. 

నేనూ, నాన్న మంచి స్నేహితులం. సినిమాలు, సాహిత్యం, రాజకీయాలు, మానవ సంబంధాలు.. ఇలా అనేక విషయాలపై మా ఇద్దరి మధ్యా చర్చలు, వాదనలు. కొత్తవాళ్ళకి మా స్నేహం ఆశ్చర్యంగా అనిపించేది. యే విషయాన్నైనా ఓపిగ్గా చెప్పే నాన్న.. కాలక్రమేణా నన్ను విసుక్కోడం మొదలెట్టాడు. ఆ తరవాత కొన్నాళ్ళకి చెప్పింది ఒప్పుకోకపొతే తిట్టడం మొదలెట్టాడు. 'ఈ విషయం బయటెక్కడా అనకు, కుక్కని కొట్టినట్టు కొడతారు' అంటూ రుసరుసలాడే ఆయన తిట్లు గమ్మత్తుగా వుండేవి.   

నాన్న వాడే అతిపెద్ద బూతుమాట - 'బ్రోకర్ మాటలు!'. అవకాశవాదం, అబద్దం, చెత్తవాగుడు.. అన్నింటికీ పర్యాయపదంగా 'బ్రోకరు మాటలు' అని ఓ ఫ్రేజ్ కనిపెట్టాడాయన! నాన్నకి మతమన్నా, దేవుడన్నా చికాకు. పూజలు, పునస్కారాలు చేసే వాళ్ళని విసుక్కునేవాడు. ఆ లిస్టులో అమ్మకూడా వున్ది. ఆరకంగా నాన్నకి నేను కృతజ్ఞుడను 'దేవుడున్నాడా?' అనే సంశయం కూడా నాకెప్పుడూ కలక్కుండా చేశాడు.

ఆయన సిపీయం పార్టీ అభిమాని. ఆ పార్టీవాళ్ళతో సంబంధాలు ఉండేవి. పుచ్చలపల్లి సుందరయ్యకి భయంకరమైన అభిమాని. నంబూద్రిపాద్, ఎ.కె.గోపాలన్ కారణజన్ములనేవాడు!

పుట్టిందీ, పెరిగిందీ, ఉద్యోగం చేసిందీ ఒకేచోట కావడం వల్ల ఆయనకి వీధివీధికి 'యేరా!' స్నేహితులుండేవారు. రోడ్లమీదే స్నేహితుల్తో కబుర్లు, అవెప్పుడూ రాజకీయాల చుట్టూతానే. 

నాన్న నన్నేనాడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆయన వల్ల చిత్రమైన హింసకి గురైనాను. ఆయనకి పులుసులంటే ఇష్టం. కాకరకాయ, బెండకాయ, వంకాయ, సొరకాయ.. ఈ పులుసుల్దో ఎండ్లెస్ లిస్ట్. ఇలా రోజుకో పులుసుతో చావగొట్టేవాడు. పోనీ సినిమాలైనా మంచివి చూపిస్తాడా అంటే అదీ లేదు. రాజ్‌కపూర్, రాజ్‌కుమార్‌లంటూ యేవో హిందీ సినిమాలు చూపించేవాడు. ఒక్కముక్క అర్ధమౌ చచ్చేది కాదు. 

నాన్న, నా రిస్ట్ వాచ్ -

నాకు రిస్ట్ వాచ్ ఇష్టం. నాన్ననడిగితే నేను పదోక్లాసు ఫస్ట్‌క్లాస్‌లో పాసైతే కొనిస్తానన్నాడు, పాసయ్యాను - కొన్లేదు. మాటమార్చి ఇంటర్ ఫస్ట్‌క్లాస్‌లో పాసైతే కొనిస్తానన్నాడు, పాసయ్యాను - కొన్లేదు. మళ్ళీ మాటమార్చి మెడిసిన్ సీటొస్తే కొనిస్తానన్నాడు, సీటొచ్చింది. ఇంకాయనకి వాచ్ కొనక తప్పలేదు. ఊరంతా తిప్పితిప్పి బేరం చేసిచేసి 173 రూపాయలతో హెన్రీ శాండెజ్ వాచ్ కొనిచ్చాడు. 
                               
తరవాత రోజుల్లో నాన్న ఎన్టీఆర్‌ని అభిమానించాడు, కానీ బాహటంగా రామారావుని సమర్ధించేవాడు కాదు. ఇక్కడే నేనాయన వీక్ పాయింట్ పట్టేశా. ఆయన సిపియం వన్నె టిడిపి! ఆయన మీద 'పులుసు' ప్రతీకారం, హిందీ సినిమాల రివెంజ్ తీర్చుకోడానికి నాకో మంచి అవకాశం దొరికింది! 

భోంచేస్తున్నప్పుడు ఎన్టీర్‌ని విమర్శించేవాణ్ణి, ఆయన నామీద విపరీతంగా ఆవేశపడేవాడు.

"ఎన్టీఆర్ పాలిటిక్స్ నాకు నచ్చవు, అందుకే విమర్శిస్తున్నాను. నువ్వు ఎన్టీఆర్ అభిమానివా?" ఇదీ నా వాదన.

పాపం! ఆయన మింగలేక కక్కలేక సతమతమయ్యేవాడు. యేం మాట్లాడో తెలీక.. తన ఫేవరెట్ ఫ్రేజ్ వాడేవాడు - "బ్రోకరు మాటలు మాట్లాడకు."

అమ్మ విసుక్కునేది - "భోజనాల దగ్గర ఈ గోలేంటి? వాళ్ళెవరో యేదో చేస్తే మీరెందుకు పోట్లాడుకుంటారు?"

కుతకుతలాడిపోతున్న నాన్న కోపాన్ని అమ్మమీదకి మళ్ళించేవాడు - "అసలు దీనంతటికీ కారణం నువ్వే. వీడితో పాటు నాకు భోజనం పెట్టి నన్ను తిట్టిస్తావా? అసలు బ్రోకరువి నువ్వే." అంటూ అమ్మమీద ఎగిరేవాడు.

"నాన్నా! ఎన్టీఆర్‌ని విమర్శిస్తే నీకెందుకు కోపమొస్తుందో అర్ధం కావట్లేదు" అమాయకత్వం నటించేవాణ్ని.

"ఈ దేశాన్ని రెండు శనిగ్రహాలు పీడిస్తున్నయ్యి. ఒకటి ఇందిరాగాంధీ, రెండు నువ్వు." అంటూ నాన్న ఆవేశపడేవాడు.

తనకి నచ్చని వాదనల్ని బ్రోకర్ మాటలంటూ విసుక్కునే నాన్నని తన బ్రోకర్ మాటలతో బుట్టలో వేసుకున్నాడు నా స్నేహితుడు రమణమూర్తి. మా ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మానాన్న. మేడపైన రెండుగదుల్లో నేనూ, నా చదువుల డెన్. డెన్ కీపర్స్‌లో ముఖ్యుడు నా క్లాస్‌మేట్ రమణమూర్తి.. మెడిసిన్ బుక్స్ తక్కువగానూ, సినిమా మేగజైన్స్ ఎక్కువగానూ చదివేవాడు. శ్రీదేవి, రేఖ, దీప బొమ్మల్ని తదేకదీక్షగా చూస్తూ వేడిగా నిట్టూరుస్తుండేవాడు.

కొన్నాళ్ళకి నాన్న రమణమూర్తిని పైనుండి పిలిపించి మరీ సహభోజనం చెయ్యడం మొదలెట్టాడు. ఓ నాడు ఆయన వున్నట్లుండి "మీ ఫ్రెండ్స్ అందర్లోకి రమణమూర్తి ఉత్తముడు. అతని తలిదండ్రులు అదృష్టవంతులు." అని ఓ భారీ డైలాగ్ కొట్టాడు, ఆశ్చర్యపోయాను. వీళ్ళిద్దరి మధ్యా ఏదో జరుగుతుంది! ఏంటది? ఆ తరవాత వాళ్ళిద్దరూ భోంచేస్తున్నప్పుడు.. డిటెక్టివ్ యుగంధర్‌లా వారి సంభాషణ పై ఓ చెవేశాను.

రమణమూర్తి ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కంచంలో తిరపతి కొండంత అన్నం! అందులో పప్పు కలుపుతూ మాట్లాడుతూనే ఉన్నాడు. "ఎన్టీరామారావు ఇంటర్నేషనల్ ఫిగర్. అయన్ది అమెరికా ప్రెసిడెంట్ అవ్వాల్సినంత రేంజ్. కనీసం భారద్దేశానికి ప్రధాని అవ్వాలి, అవుతాడు కూడా. ఇందిరాగాంధీతో రామారాకి పోలికా! ఇందిరాగాంధీ రాఅరావు కాలిగోటికి సరిపోదు." చెబుతూనే ఉన్నాడు.

ఆరి దుర్మార్గుడా! నాకు తెలిసి రమణమూర్తికి రేఖ, రాఖీల మధ్య తేడా మాత్రమే తెలుసు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీల మధ్య తేడా మాత్రం ఖచ్చితంగా తెలీదు.

నాన్న ఆనందం పట్టలేకపోతున్నాడు. "మీ ఫ్రెండ్ గాడిదకి బుద్దొచ్చేట్లు నువ్వే చెయ్యాలయ్యా. ఏవేఁ! పాపం రమణమూర్తి కష్టపడి చదువుకుంటున్నాడు. ఇంకొంచెం వంకాయకూర వెయ్యి. నెయ్యి సరిపోదేమో.. "

రమణమూర్తి కుతంత్రానికి పడిపోయిన నాన్నని చూస్తే జాలేసింది. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లు.. బ్రోకర్ మాటలంటూ ఎంతోమందిని విసుక్కున్న నాన్న రమణమూర్తి బ్రోకర్ మాటలకి పడిపొయ్యాడు, పాపం!

ఆయన చివరి రోజుల్లో మంచాన పడ్డాడు. మనిషి ఎముకల గూడులా అయిపొయ్యి మంచానికి అతుక్కుపోయ్యాడు. మనం చెప్పేది అర్ధమయ్యేది కాదు. ఒకసారి ఆయన చెవిలో "నాన్నా! ఎన్టీఆర్ ప్రధానమంత్రి అయ్యాడు." అన్నాను. ఆయన కళ్ళల్లో క్షణకాలం వెలుగు! నాన్న చనిపోయినప్పుడు తన ఐడాల్స్ సుందరయ్య, ఎన్టీఆర్‌ల దగ్గరకి వెళ్ళిపొయ్యాడనిపించింది.

నాన్న నాకు గడియారంలో టైం చూడ్డం నేర్పాడు, సైకిల్ తొక్కడం నేర్పించాడు, ఆంధ్రపత్రిక చదవడం నేర్పించాడు, క్యారమ్స్ ఎలా ఆడాలో నేర్పించాడు, అమ్మకి తెలీకుండా ఆనందభవన్‌లో మసాలాఅట్టు తినడం నేర్పాడు. ఆయన మహానుభావుడు కాదు, ఒట్టి భావుడు మాత్రమే. చాలా సాదాసీదాగా జీవించిన ఏ ప్రత్యేకతా లేని సగటుజీవి.

నాన్న ఫోటోని చూస్తూ..

"నాన్నా! ఎన్టీఆర్, నంబూద్రిపాద్, సుందరయ్యలు అసలు లీడర్లే కాదు! ఇందిరాగాంధీ జిందాబాద్!" అన్నాను.

సమాధానం లేదు, నిశ్శబ్దం.. నాన్నకి కోపం రాలేదు! ఫోటోలోంచి నవ్వుతూ చూస్తూనే వున్నాడు! నాన్న నన్ను ఇక ఎప్పటికీ తిట్టడు, తిట్టలేడు!

"నాన్నా! ఐ మిస్ యు, ఐ మిస్ యువర్ తిట్లు."

నా కళ్ళల్లో తడి.. నాన్న ఫోటో బ్లర్ అయ్యింది!


క్షమాపణ -

నేను చాలా తప్పు చేశాను. నాన్నతో నా వాదనల సమయానికే ఆయనలో డిమెన్షియా లక్షణాలు మొదలయ్యాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గాయి. అందువల్ల ఓపిక లేక మొండిగా మారిపోయ్యాడు, కాబట్టే ఆయనకి విపరీతమైన కోపం. నాకా విషయం తెలీక ఆయన్ని ఇబ్బంది పెట్టాను.

"నాన్నా! నన్ను క్షమించు!"

(revised 20/6/17)

Wednesday 6 March 2013

'ఎ బ్యూటిఫుల్ మైండ్'.. మరీ అంత బ్యూటిఫుల్లేం కాదు!


ఈమధ్య 'ఎ బ్యూటిఫుల్ మైండ్' అనే ఇంగ్లీషు సినిమా చూశాను. ఇది అప్పుడెప్పుడో ఆదుర్తి సుబ్బారావు తీసిన మన తెలుగు 'మంచి మనసులు' సినిమాకి డబ్బింగ్ కాదు, అనేక ఆస్కార్ అవార్డులు పొందిన ఘనచరిత్ర కలిగిన ఒక హలీవుడ్ చిత్రరాజము. 

ఈ సినిమా చూడాలని కొంతకాలంగా అనుకుంటున్నాను, కారణం - ఈ సినిమా స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో బాధపడిన ఒక ప్రొఫెసర్ ఆత్మకథ ఆధారంగా తీసార్ట, కొద్దిగా ప్రొఫెషనల్ ఇంటరెస్ట్. ఆడవాళ్ళకి ఏడుపు సినిమాలంటే, పిల్లలకి ఫైటింగు సినిమాలంటే, ఫ్యాక్షనిస్టులకి ఫ్యాక్షనిస్టు సినిమాలంటే ఆసక్తి. నాకూ అంతే!

సరే! ఈ 'ఎ బ్యూటిఫుల్ మైండ్' సినిమా సీడీ సంపాదించాను. కష్టపడి సినిమా చూశాను (సినిమా చూడ్డం అంత వీజీ కాదు). ఈ సినిమా నేను ఒక సాధారణ ప్రేక్షకుడిలా వినోదం కోసం చూడలేదు. అనేకమంది స్కిజోఫ్రీనియా పేషంట్లని వైద్యం చేస్తున్న సైకియాట్రిస్టుగానే చూశాను. 

ఇప్పుడు స్కిజోఫ్రీనియా వ్యాధి గూర్చి  సంక్షిప్తంగా రెండు ముక్కలు. స్కిజోఫ్రీనియా రోగులకి చెవిలో మాటలు (వారికి మాత్రమే) వినబడుతుంటాయి. ఇలా వినబడడాన్ని 'ఆడిటరీ హేలూసినేషన్స్' అంటారు. రోగులు తీవ్రమైన అనుమానాలు, భయాలకి గురి అవుతుంటారు. ఇలా అనిపించడాన్ని 'డెల్యూజన్స్' అంటారు. వీరికి సరైన సమయంలో వైద్యం చేయించకపోతే రోగికి, కుటుంబానికి, సమాజానికి చాలా ప్రమాదం.

స్కిజోఫ్రీనియా వ్యాధితో (వైద్య సహాయం లేక) బాధ పడుతున్నవారిని మనం రోడ్ల మీద చూస్తూనే ఉంటాం. చిరిగిన బట్టలతో, పెరిగిన జుట్టుతో, తమలో తామే మాట్లాడుకుంటూ, తిట్టుకుంటూ.. కాయితాలు, చెత్త ఏరుకుంటూ.. మురుక్కాలవల్లో నీళ్ళు తాగుతూ.. కనబడుతుంటారు. ఈ స్కిజోఫ్రీనియా వ్యాధి (వైద్యం చేయించకపోతే) అత్యంత తీవ్రమైనది.

'సినిమాలో స్కిజోఫ్రీనియాని ఎలా చూపించారు?'. ఈ సినిమాలో ఒక టెక్నిక్ వాడారు. సినిమా సగంలో మనం ఆశ్చర్యపోయే నిజాలు తెలుస్తాయి.. అప్పటిదాకా మనం చూస్తున్న కొన్ని ప్రధాన పాత్రలు, సంఘటనలు నిజం కాదు. అవి హీరో ఊహల్లోని పాత్రలు. అతని ఆలోచనలకి దృశ్యరూపం. (అతడు అనుమానాలు, భయాలతో కొన్ని ఊహాజనిత పాత్రలు సృష్టించుకుని.. వాటితో సంభాషిస్తుంటాడు.)

స్కిజోఫ్రీనియా వ్యాధిలో రోగికి చెవిలో మాటలు వినిపించడం (ఆడిటరీ హేలూసినేషన్స్) చాలా సాధారణం. ఆ మాట్లాడే మనుషులు కనబడటం (విజువల్ హేలూసినేషన్స్) అత్యంత అరుదు. అయితే సినిమాలో కొన్ని సంవత్సరాల తరబడి హీరోకి మూడు పాత్రలు కనబడుతూనే ఉంటాయి. ఆ పాత్రలు హీరోతో సంభాషిస్తూనే ఉంటాయి!

స్కిజోఫ్రీనియా వ్యాధి, అందునా తీవ్రమైన హేలూసినేషన్స్ (భ్రమల) తో బాధ పడుతూ command hallucinations ని అనుసరించి కొడుకు చచ్చిపోయేంత పరిస్థితి తెచ్చుకుని భార్యపై దాడి చేసిన పేషంట్, అటు తరవాత మందులు వేసుకోకుండా, ఆ రోగంతో సహజీవనం చేసెయ్యడం అత్యంత అరుదు. సినిమాలో చూపించినంత తీవ్రస్థాయిలో రోగ లక్షణాలు ఉన్నవారు, వైద్యం మానేస్తే వ్యాధి ముదిరిపోతుంది. వారికి క్రమేపీ బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం, జీవితం పట్ల ఆసక్తి తగ్గి (ఒక్కోసారి) ఆత్మహత్యకి దారి తీయడం జరుగుతుంది. 

నా స్కిజోఫ్రీనియా పేషంట్లలో కొందరు, పట్టించుకునేవారు లేక అలాగే ఉండిపోయి (catatonic state), ఆహారం ఇచ్చేవారులేక ఆకలితో చనిపోయినవారు ఉన్నారు (starvation deaths). అయితే - కొందరు స్కిజోఫ్రీనిక్స్ తమకి మాత్రమే వినబడే మాటలకి (auditory hallucinations) అలవాటైపోతారు. కానీ ఆ మాటలు స్నేహపూర్వకంగా కబుర్లు చెబుతుంటాయి, ఒక్కోసారి రోగిని మెచ్చుకుంటుంటాయి!

సినిమాలో (హీరో ఊహాజనిత) డిటెక్టివ్ పాత్ర (Ed Harris) హీరోని చాలా డిస్టర్బ్ చేస్తుంటుంది. ఆ డిటెక్టివ్ హీరో చెవిలో అదే పనిగా మాట్లాడుతూ (running commentary hallucinations) ఇబ్బంది పెడుతుంటాడు. ఆ ఊహాజనిత పాత్రలు హీరోని నీడలా వెంటాడుతుంటాయి! (నాకు Guy de Maupassant దెయ్యం కథ గుర్తొచ్చింది)

స్కిజోఫ్రీనియా జబ్బుతో బాధపడి రికవర్ అయిన పేషంట్లు పెయింటింగులు వేశారు, కథలు రాశారు. వాటిల్లో కొన్ని 'స్కిజోఫ్రీనియా బులెటిన్' లో చూశాను. Auditory hallucinations తో సినిమా తీస్తే చూడ్డానికి నాటకంలా వుంటుందని మార్పుచేర్పులు చేశారా? దర్శకుడికి క్రియేటివ్ ఫ్రీడమ్ వుంటుంది, కానీ నాటకీయత కోసం ఒక జబ్బు core symptom నే మార్చేస్తే యెలా?

ఈ సినిమా గూర్చి ఇంత వివరంగా ఎందుకు రాస్తున్నానంటే, నాకు తెలిసిన ఒకళ్ళిద్దరు ఈ సినిమా గూర్చి చెబుతూ, ఇదొక సీరియస్ రోగం గూర్చి గొప్ప రీసెర్చ్ చేసి తీసిన మంచి సినిమాగా చెప్పారు.. అందుకని. వాస్తవానికి ఈ సినిమాలో ఎక్కువ సీన్లు డ్రామా కోసం మాత్రమే సృష్టించబడ్డాయి.

సరే! హాలీవుడ్ వాడిని ఏదైనా అనేముందు 'మన సంగతేంటి?' అని మీరు అనొచ్చు. మన తెలుగు సినిమా దర్శకుల గూర్చి రాసేంత సాహసం నేను చెయ్యలేను (బియ్యంలో మట్టి గడ్డలు ఏరడం ఈజీ, బియ్యం ఏరడం కష్టం). మనవాళ్ళు అనాదిగా మానసిక రోగుల్ని జోకర్లుగా, శాడిస్టులుగా చిత్రీకరించారు. కారణాలు అనేకం. వారికి మానసిక రోగుల పట్ల కనీస గౌరవం, అవగాహన లేకపోవడం.. కథ రాసుకునేప్పుడు కనీసస్థాయిలో రీసెర్చ్ చెయ్యకపోవడం ప్రధాన కారణాలు.

చివరి తోక :

సుబ్బు ఈ సినిమా చూస్తే ఏమంటాడు?

"మిత్రమా! ఇదేం సినిమా? ఇదసలు సినిమానేనా? ఇంతా చేసి హీరో చివరాకరికి మానసిక రోగిగానే మిగిలిపొయ్యాడు. ఈ సినిమా బాపురమణలు తీసినట్లైతే హీరో భార్యతో రామకోటి రాయించి, ఆ భద్రాద్రి రాముడి కృపతో భర్త రోగం నయమైనట్లు చూపించేవాళ్ళు. ఆ విధంగా బాపురమణలు రామాయణంపై తమ భక్తిని నలభై లక్షల రెండోసారి ప్రదర్శించుకునేవారు.

కె.విశ్వనాథ్ అయినట్లైతే నృత్యసంగీతాలతో హీరోగారి బుర్ర తిరిగిపొయ్యేట్లు చేసి, సారీ - నయం చేసి, మన కళల గొప్పదనాన్ని ఇరవై లక్షల నాలుగోసారి నిరూపించేవాడు. కనీసం దాసరి స్టైల్లో హీరో తలకి దెబ్బ తగిలి రోగం కుదిరినట్లు చూపించినా బాగుండేది. అసలీ సినిమానే రుచీపచీ లేని పెసరట్టులా ఉంటే, అందులో మళ్ళీ నీ బోడి ఎనాలిసిస్సొకటి!"

Friday 1 March 2013

టెర్రరిజం - కేండిలిజం


"మిత్రమా! కాఫీ!" అంటూ హడావుడిగా వచ్చాడు సుబ్బు.

"సుబ్బూ! టెర్రరిస్టులు దుష్టులు, దుర్మార్గులు.. పేట్రేగిపోతున్నారు. నా కడుపు మండిపోతుంది. ఇవ్వాళ సాయంకాలం సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన ఉంది. మనం వెళ్ళాలి." అన్నాను. 


"టెర్రరిస్టు దాడుల్ని కొవ్వొత్తులతో నిరసించడం ఎప్పుడూ ఉండేదేలే! దీన్నే 'కేండిలిజం' అందురు. నాకీ కొవ్వొత్తుల్తో నిరసనేంటో తెలీదు. కొవ్వొత్తి పట్టుకునే ఓపికా లేదు. ఈసారి 'కేండిలిజం'కి వస్తాన్లే!" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

"దుర్మార్గుడా! నీకోసం మళ్ళీమళ్ళీ టెర్రరిస్టు దాడులు జరగాలని కోరుకుంటున్నావా? నీకా అవకాశం లేదు. క్రికెట్ మ్యాచ్‌కి ఎంతటి భారీ భద్రత ఉందో తెలుసుగా?" అడిగాను.

"ఆ క్రికెట్ మ్యాచ్‌లో ఏమీ జరగదు, ఆ విషయం ప్రభుత్వానికీ తెలుసు. ఇది సామాన్య ప్రజల ఆగ్రహం నుండి రక్షించుకోడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తు. ఎంత బుర్ర తక్కువ దొంగైనా ఓ ఇంట్లో దొంగతనం చేస్తే.. కొన్నాళ్ళదాకా ఈ వీధి మొహం చూడడు. బాంబులు పెట్టేవాడు ఇంకా తెలివిగా ఉంటాడు కదా!" అన్నాడు సుబ్బు.

"అంటే నిఘా వద్దంటావా?" చికాగ్గా అన్నాను.

"కావాలి, చాలా కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ కావాలి. అయితే.. ప్రస్తుతం ఉన్న నిఘా ఒక స్పెషల్ డ్రైవ్ వంటిది. ఆ క్రికెట్ మ్యాచ్ రోజు స్టేడియం ఏరియా తప్పించి, మిగిలిన అన్ని ప్రాంతాలు చాలా వల్నరబుల్ గా ఉంటాయి!" అంటూ నవ్వాడు సుబ్బు.

ఇంతలో కాఫీ వచ్చింది. సిప్ చేస్తూ.. ఆలోచిస్తూ.. నిదానంగా చెప్పసాగాడు.

"స్కూల్ బస్ ప్రమాదం జరిగితే.. కొన్నాళ్ళపాటు స్కూల్ బస్సుల ఫిట్నెస్‌పై తీవ్ర నిఘా, ప్రైవేటు బస్సులపై ఇంకొంతకాలం నిఘా! జోకేంటంటే.. లంచం తీసుకుని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఉద్యోగులే ఈ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తారు! అసలు డ్రైవ్ సరీగ్గా లేనప్పుడే స్పెషల్ డ్రైవ్ లు అవసరం. లోగుట్టు ఏమనగా.. మన రాజకీయ వ్యవస్థ తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు.. తాము భద్రంగా ఉన్నామనే భ్రమలో ప్రజల్ని ఉంచేందుకు.. తమ యత్రాంగంతో ఇలా 'అతి' చేయిస్తుంటుంది!"

"మన పోలీసు బలగాల సంఖ్యాబల ప్రదర్శన ఉగ్రవాదుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తాయి." నవ్వుతూ అన్నాను.

"అలాగా! అందుకనేనా? మనవాళ్ళు రైళ్ళ సంఖ్య పెంచమని గోల చేస్తుంది?" సుబ్బు కూడా నవ్వాడు.

"సుబ్బు! నీ వాదన నీదే కదా. దీనికి సమాధానం చెప్పు. అమెరికాలో 9/11 తరవాత మళ్ళీ ఉగ్రవాద దాడులు జరగలేదు. అదెలా సాధ్యం?" బాగా అరిగిపోయిన ప్రశ్నని కొత్తగా సంధించాను.

"మన దేశాన్ని అమెరికాతో ఎలా పోలుస్తావ్? ఆ మాటకొస్తే ఏ దేశాన్నీ అమెరికాతో పోల్చలేవు. ఆ దేశమే ఒక ఆక్రమిత ప్రాంతం. బ్రతుకుతెరువు కోసం ఎందరో, ఎన్నో దేశాల నుండి వెళ్లి అక్కడ సెటిలయ్యారు. అందుకే ఆ ప్రభుత్వానికి పౌరులపై నిఘా పెట్టగల అవకాశం ఉంది, వనరులూ ఉన్నాయి." అన్నాడు సుబ్బు.

"ఆ మాత్రం మనం చెయ్యలేమా?" అడిగాను.

"చెయ్యలేకేం? భేషుగ్గా చెయ్యొచ్చు. అప్పుడు మన బజెట్‌లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధికి నిధులుండవు. ఉన్న సొమ్మంతా పోలీసు, రక్షణ శాఖలకి కేటాయించాలి. స్కూళ్ళు మూతబడతాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్ పాడుబడిపోతాయి. సాధారణ జ్వరాలు, దగ్గులక్కూడా చస్తుంటాం. పేదరికంలో మగ్గిపోతుంటాం. అప్పుడు ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లే." అన్నాడు సుబ్బు.

"అదెలా?" ఆశ్చర్యంగా అడిగాను.

"ఉగ్రవాదం అసలు లక్ష్యం ఒక దేశ ఆర్ధిక మూలాలు దెబ్బ తీసి.. ఆ దేశ ఆర్ధిక ప్రగతిని నిరోధించడమే. ఒక అసమర్ధ రాజకీయ నాయకత్వం మాత్రమే ప్రజల సొమ్ముని దేశరక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం సింహభాగం ఖర్చు పెడుతుంది." అన్నాడు సుబ్బు.

"మరప్పుడు అమెరికాక్కూడా ఇదే సమస్య రావాలి గదా?" కుతూహలంగా అడిగాను.

"రాదు, ఎందుకంటే అమెరికా తెలివిగా ఆయుధ వ్యాపారం చేస్తుంటుంది. ఈ ఆయుధాల వ్యాపారం సజావుగా సాగేందుకు దేశాల మధ్య యుద్ధం సృష్టించడం అమెరికన్ ప్రభుత్వం పాలసీ! వనరుల సమీకరణ కోసం చమురు యుద్ధాలూ చేస్తుంది!" అంటూ నవ్వాడు సుబ్బు.

"ఆయుధ వ్యాపారం కోసం కుతంత్రాలకు పాల్పడ్డం అన్యాయం!" అన్నాను. 

"అవును, అన్యాయమే!" అన్నాడు సుబ్బు. 

"మరప్పుడు టెర్రరిస్టు దాడుల్ని యెలాఆపాలి?" అడిగాను.

"టెర్రరిస్టు దాడుల్ని నిరోధించేందుకు కావలసింది దేశప్రజల సంక్షేమం పట్ల నిబద్దత కలిగున్న రాజకీయ నాయకత్వం. ఈ టెర్రరిస్టు దాడులు దేశ రాజకీయ వ్యవస్థ వైఫల్యానికి మూల్యం." అంటూ ఖాళీ కప్ టీపాయ్‌ మీద పెట్టాడు సుబ్బు.

"ఏమిటోయ్ నీ గోల? రాజకీయ నాయకుల్ని ఆడిపోసుకోడం ఒక ఫేషనైపోయింది." విసుక్కున్నాను.

"హోటల్లో చల్లారిన ఇడ్లీలిస్తేనే పోట్లాడతాం. కానీ కాజువ్ల్‌గా ఓట్లేసి రాజకీయ పార్టీలకి అధికారం కట్టబెడుతున్నాం. వీళ్ళు కాశ్మీర్ సమస్యని పట్టించుకోరు. పాకిస్తాన్‌తో ఎలా వ్యవహరించాలో స్పష్టత ఉండదు. ఈ రాజకీయ వ్యవస్థ తన పని నిజాయితీతో చేస్తే.. అప్పుడు వైఫల్యం ఎదురైనా ప్రజల మద్దతు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా?" అన్నాడు సుబ్బు.

"సర్లే! నీతో వాదించే ఓపిక లేదు. సాయంకాలం కొవ్వొత్తుల నిరసనకి వెళ్తున్నా. భాధ్యత గల భారతీయుడిగా, ఒక దేశభక్తుడిగా అది నా విధి!" నొక్కి పలుకుతూ అన్నాను.

"మీ 'కేండిలిజం' వాళ్ళకి నా తరఫున ఓ సలహా ఇవ్వు." నొసలు వెక్కిరిస్తున్నట్లు పెట్టాడు సుబ్బు.

"సలహానా!" ఆశ్చర్యపోయాను.

"అవును. అక్కడ డాక్టర్లుంటారు.. రోగుల్ని మోసం చెయ్యొద్దని చెప్పు. ప్లీడర్లుంటారు.. సాక్ష్యాలు తారుమారు చెయ్యొద్దని చెప్పు. వ్యాపారస్తులుంటారు.. ట్యాక్సులు సక్రమంగా కట్టమని చెప్పు. ప్రభుత్వోద్యోగులుంటారు.. లంచాలు మెయ్యొద్దని చెప్పు. జర్నలిస్టులుంటారు.. నిజాయితీగా రిపోర్ట్ చెయ్యమని చెప్పు. సినిమా యాక్టర్లుంటారు.. వెకిలి పాత్రలు వెయ్యొద్దని చెప్పు. వీళ్లంతా మన దేశానికి టెర్రరిజం కన్నా ఎక్కువ నష్టం కలిగిస్తున్నారు." అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మా సుబ్బు!

వర్షం వెలిసినట్లైంది!

(photo courtesy : Google)