Monday, 13 October 2014

విజన్ 2099


"అయ్యా! మీ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ అదేంటో - ఇన్నాళ్ళైనా మా దరిద్రపుగొట్టు జీవితాల్లో కొంచెం కూడా మార్పు కనబడట్లేదు!"

"గత ప్రభుత్వంతో పోలిస్తే మేం ప్రజలకి ఎంతో మేలు చేశాం. వంద రోజుల్లోనే మా ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలు సాధించింది."

"అవునా?"

"అందుకు ఎన్నో ఉదాహరణలు ఇవ్వగలను. గత ప్రభుత్వంలో హత్యల సంఖ్య 567. అదే మా ప్రభుత్వంలో 566 మాత్రమే. గత ప్రభుత్వంలో మానభంగాలు 199. మా ప్రభుత్వంలో మానభంగాలు 198 మాత్రమే. చూశావా? శాంతిభద్రతలు ఎంతగా ఇంప్రూవ్ అయ్యాయో!"

"అవును కదా!"

'ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 102 కోట్లు. మా ప్రభుత్వం ఖర్చు 103 కోట్లు. ఆరోగ్యం కోసం గత ప్రభుత్వం బిచ్చమేసినట్లు 10 కోట్లు ఖర్చు చేస్తే, మా ప్రభుత్వం 10.5 కోట్లు ఖర్చు చేసింది! ఇప్పుడు చెప్పు - అభివృద్ధి పట్ల మాకు ఎంతటి నిబద్ధత వుందో!'

'అవునవును - మీరు కొంచెం నయమనే అనిపిస్తుంది. కానీ ఈ లెక్కన మా జీవితాలు బాగుపడేదెప్పుడు?'

'నీకు తెలీదా? మాది విజన్ 2099. నువ్వప్పటిదాకా ఆగాలి.'

'కానీ ఐదేళ్ళకోసారి ఎన్నికలొచ్చేస్తాయిగా?'

'అవును, వచ్చేస్తాయి. అందువల్ల మేం చెప్పేదేమనగా - 2099 దాకా మీరు మాకు అధికారం ఇస్తూనే వుండాలని! అర్ధమైందా?'

'అర్ధమైంది! కానీ - ఇట్లా అంటున్నానని ఏమీ అనుకోకండి. అప్పటిదాకా మీరుండాలిగా?'

'ఇందులో అనుకోడానికేముంది! అందుకేగా ఇవ్వాళ మా అబ్బాయిని రెడీ చేస్తున్నాను. మీ ఆదరణ వుండాలే గానీ - రేపు నా మనవడు, ఎల్లుండి నా మునిమనవడు కూడా ముఖ్యమంత్రులవుతారు. వాళ్ళ తరఫున కూడా నేనే హామీ! మాట తప్పని వంశం మాది!'

'అయ్యా! ఎంతైనా మీది గొప్ప ముందు చూపండి. అంటే - మీ మునిమనవడు సాధించే అభివృద్ధిని నా మునిమనవడు అనుభవిస్తాడన్నమాట!'

'అవును. చూడ్డానికి అమాయకుళ్ళా వున్నా విషయం మాత్రం చక్కగా అర్ధం చేసుకున్నావ్. అదే మా విజన్ 2099!'