Friday 31 October 2014

చెత్తమనిషి


"అయనెంత పెద్దనాయకుడు! ఏ మాత్రం భేషజం లేకుండా రోడ్లూడుస్తున్నాడే! ఇన్నాళ్ళూ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అసలైన సమస్య అపరిశుభ్రత. అది ఆయన చెబ్తేగానీ మనం తెల్సుకోలేపొయ్యాం! దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికిదే రాచమార్గం. రా! నువ్వూ ఓ చీపురు తీసుకుని ఊడువు!"

"ఈ రోడ్లూడవడానికి పారిశుధ్య కార్మికులున్నారు. పర్యవేక్షించడానికి మునిసిపాలిటీ వుంది. ఆ వ్యవస్థని మెరుగు పరిచే ఆలోచన తరవాత చేద్దాం. కానీ అంతకన్నా ముఖ్యమైనది - మనూరి చెరువు సమస్య. ఆ మందుల కంపెనీవాడు వదిలే కాలుష్యంతో చెరువు విషంగా మారిపోతుంది. ఈ సంగతి ఆ పెద్దనాయకుడుగారికి చెప్పి కాలుష్యాన్ని ఆపించరాదా?"

"అదెలా కుదురుతుంది? మందుల కంపెనీవాణ్ని ఇబ్బంది పెడితే ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పోవా? రేపు పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారు? అన్ని నిబంధనలు తూచా పాటించేట్లైతే ఆ కంపెనీవాడు వాళ్ళ దేశంలోనే మందులు తయారుచేసుకునేవాడు కదా! మన్దేశంలో మందుల ఫ్యాక్టరీ ఎందుకు పెడతాడు?"

"ఒకపక్క జనాలు చస్తున్నా పట్టించుకోనప్పుడు - రోడ్ల మీద చెత్తకాయితాలు ఊడవడం దేనికి?"

"పిచ్చివాడా! చెత్త అనునది అనారోగ్య హేతువు, దేశానికి దరిద్రం. నీ అధర్మ సందేహాలు వీడి - నువ్వూ ఓ చీపురు చేత బుచ్చుకో! నీక్కూడా ఓ ఫొటో తీయిస్తాలే!"

"ముందా కాలుష్యం సంగతి తేల్చు, అప్పుడూడుస్తా!"

"అన్నా! వీడితో మాట్లాడేదేంది? వీడెవడో చెత్తమనిషిలా వున్నాడు. అరేయ్! రోడ్డు మీద చెత్త సంగతి తరవాత - ఎట్లాగూ ఫోటోగ్రాఫర్ రావడానికి ఇంకా టైముంది. ఈలోపు ఈ చెత్తనాకొడుకుని ఎత్తి ఆ చెత్తకుండీలో నూకండిరా!"