Friday, 3 October 2014

యేసుదాసుని సూక్తులు


అందరికీ అన్నీ తెలియాలా? అవసరం లేదు. అలా తెలుకోవడం అనవసరం కూడా. నాకు పందుల పెంపకం గూర్చి తెలీదు, వీణ వాయించడం రాదు, టీవీ రిపైర్ చెయ్యడమూ రాదు. అందుకు నేనేమీ సిగ్గు పడట్లేదు. ఆయా రంగాల్లో ఆయా నైపుణ్యం కలవారు వున్నారు, వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు - నాకనవసరం. 

అందువల్ల నాలాంటి సాధారణ మానవుణ్ని - ఏదైనా తెలీని రంగం గూర్చి ప్రశ్నడిగితే టక్కున - 'తెలీదు'  అని చెప్పేస్తాడు. 

అదేవిధంగా -

'ఆడవాళ్ళ దుస్తుల పట్ల నీ అభిప్రాయం ఏంటి?' అనడిగితే -

'ఎవరికేది సౌకర్యంగా వుంటే అదే ధరిస్తారు. ఇందులో నాకెందుకు అభిప్రాయం వుండాలి!' అని ఆశ్చర్యపోతాను.

'ఆడవారి దుస్తుల బట్టి మగవాళ్ళు రెచ్చగొట్టబడి అత్యాచారాలకి పాల్పడుతున్నారా?' అనడిగితే -

కొద్దిసేపు - 'ఏం చెప్పాలా?' అని ఆలోచిస్తాను. ఎందుకంటే - ఆడవాళ్ళ దుస్తులకీ, నేరాలకి గల సంబంధం నాకు తెలీదు. అటువంటి పరిశోధన ఏదైనా దేశంలో జరిగిందేమో కూడా నాకు తెలీదు. తెలీనప్పుడు నోర్మూసుకుని వుండటం ఉత్తమం అని మాత్రం తెలుసు. అందువల్ల - 'తెలీదు' అనే సమాధానం చెబ్తాను. 

అయితే - మనుషులందు సెలబ్రిటీలు వేరు. ఈ సెలబ్రిటీలకి సన్మానాలు, భక్త పరమాణువులు ఎక్కువ. అంచేత వారు ఆవడల దగ్గర్నుండి ఆఫ్రికన్ చింపాంజీల దాకా అన్ని విషయాలు తమకి తెలుసుననే భావనలోనే వుంటారు. అదీగాక వారికి 'తెలీదు' అని సమాధానం చెప్పడం నామోషీగా వుంటుంది. కావున వారు అన్ని విషయాల్లో నోటికొచ్చిందేదో చెప్పేసి చప్పట్లు కొట్టించుకుంటారు.

మొన్నామధ్య ఒక టీవీ రియాలిటీ షోలో ఒక ప్రముఖ తెలుగు గాయకుడు రావిశాస్త్రి ఇంటి పేరు 'రావి' అనే భీభత్సమైన నిజాన్ని సెలవిచ్చార్ట! అందుకు మనం ఆయన్ని తప్పు పట్టాల్సిందేమీ లేదు - ఆయనకి తెలిసిందది! తెలీని విషయాల్ని 'తెలీదు' అని చెప్పుకోడానికి ఆయనేమీ మనలా సామాన్యుడు కాదుగా!

యేసుదాస్ మళయాళీ. చాలా భాషల్లో సినిమా పాటలు పాడాడు. శాస్త్రీయ సంగీతం కూడా పాడతాట్ట. శాస్త్రీయ సంగీతం పట్ల నాకు ఆసక్తి లేదు - కావున విన్లేదు. నేను ఏసుదాస్ సంగీతం వినకపోవడం వల్ల యేసుదాసు కొచ్చిన నష్టం లేదు. ఆయన ఎక్కడో అమెరికాలో వుంటాడు. అప్పుడప్పుడు మన దేశానికొచ్చి సంగీతాన్ని పాడి వెళ్తుంటాడు.

అయితే - నిన్న యేసుదాసుల వారికి ఆడవారు జీన్సు ధరించడం పట్ల చికాకు కలిగింది. శుభ్రంగా సంగీతం పాడుకునే ఆయన గారికి వున్నట్లుండి ఈ డ్రెస్సుల గోలెందుకో తెలీదు. పాపం! ఆయన వాలకం చూస్తుంటే అక్కడున్న సంగీతం పెద్దమనుషుల్తో నాలుగు మార్కులేయించుకోడానికి మాట్లాడినట్లుంది గానీ - వేరే ఉద్దేశం ఉన్నట్లు లేదు. ఉద్దేశం వుండేంత అవగాహన కూడా ఆయనకి వున్నట్లు లేదు. 

ఈమధ్య కొందరు ప్రముఖులు తామే రంగంలో నిష్టాతులమో - ఆ రంగం గూర్చి తప్ప మిగిలిన అన్ని విషయాల గూర్చి లెక్చర్లిస్తున్నారు, ముఖ్యంగా ఆడవారికి సలహాలివ్వడంలో చాలా ఉత్సాహం చూపుతున్నారు. ఇంతకుముందు ఉదయాన్నే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సూక్తి గీత ముక్తావళి అనే కార్యక్రమం వచ్చేది (ఇప్పుడు కూడా వస్తుందేమో తెలీదు). ఇప్పుడా బాధ్యత సెలబ్రిటీలు నెత్తినెత్తుకున్నట్లుగా వుంది. ఎబోలా లాగా ఇది కూడా ఒక కొత్త రోగం అనుకుంటా! 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.