Friday 10 October 2014

పాపం! సునంద పుష్కర్


"అయ్యో! సునంద పుష్కర్ని చంపేశారా! ఎంత ఘోరం! నేనప్పుడే అనుకున్నాను - ఆ శశి థరూరే ఈ పన్జేసుంటాడని! ఆ చిప్పమొహంగాడు అమాయకంగా కనిపిస్తూ తడిగుడ్డతో గొంతు కోసే రకం!" 

అయ్యుండొచ్చు!

"ఆ డాక్టరు వెధవలు అప్పుడేమో సునందకి ఏవో రోగాలున్నాయన్నారు, నిద్రమాత్రల ఓవర్ డోసన్నారు. ఇప్పుడేమో ప్లేటు మార్చి విషప్రయోగం అంటున్నారు!"

రోజులు మార్లేదూ? అప్పుడు శశి థరూరుడు మంత్రి, ఇప్పుడు కాదు.

"అయినా శశి థరూర్‌గాడికి పెళ్ళాం ప్రవర్తన నచ్చకపోతే విడిపోవాలి గానీ - నోట్లో విషం పొయ్యడం అన్యాయం కదూ?"

ఇందాకట్నుండి ఓ ఒకటే ఆయాసపడుతున్నావ్! ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ తాగి పడేసిన ఖాళీ స్కాచ్ బాటిళ్ళంత విలువ చెయ్యదు నీ జీవితం. పెద్దవాళ్ళ భాగోతం నీకవసరమా?

"అవసరమే! అందుకే మీడియా కోడై కూస్తుంది."

ఓరి వెర్రి నాగన్నా! మీడియా ఎప్పుడూ కోడే! ఆ కోడికి కుయ్యడానికి రోజూ ఏదోక సంచలనం కావాలి. అప్పుడే మీడియావారి కోళ్ళ వ్యాపారం వర్ధిల్లుతుంది.

"శశి థరూర్ కాంగ్రెస్ వాడవడం వల్లే బీజేపివాళ్ళు రాజకీయంగా కక్ష సాధిస్తున్నారేమో?"

నేనలా అనుకోడం లేదు. ఒకళ్ళ నేరాలు ఒకళ్ళు కప్పి పుచ్చుకోడంలో అన్ని రాజకీయ పార్టీలు చక్కని సహకారం అందించుకుంటాయి. అయినా - ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రాహుల్‌గాంధీకే దిక్కు లేదు. ఇంక శశి థరూర్ గూర్చి ఎవడు పట్టించుకుంటారు?

"సునంద పుష్కర్‌కి న్యాయం జరగాలి."

అవును. న్యాయం జరగాలి. అలాగే - ఈ దేశంలో సామాన్యులక్కూడా నేరపరిశోధన, విచారణ నిస్పక్షపాతంగా జరగాలి. నేరస్తులు శిక్షించబడాలి. ఇందులో రెండో ఆలోచనకి తావు లేదు. సునంద పుష్కర్ కేసు సరైన రీతిలో పరిష్కరించబడుతుందని ఆశిద్దాం.

"అమ్మయ్యా! కనీసం ఈ పాయింటైనా ఒప్పుకున్నావ్! థాంక్స్!"

ఈ విషయం నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు. ఇదొక హై ప్రొఫైల్ నేరం. మహా అయితే 'నేరాలు - ఘోరాలు'లో ఒక ఎపిసోడ్‌కి సరిపోనూ మసాలా వుంది. బహుశా రాంగోపాల్‌వర్మ ఒక సినిమా తియ్యడానికి పనికొస్తుందేమో. అంతకుమించి - ఈ విషయానికి రాజకీయంగా, సామాజికంగా అసలు ప్రాధాన్యతే లేదు!