Wednesday, 15 October 2014

నేరం - రాజ్యస్వభావం


'మనుషులంతా ఒక్కటే!' అనే నినాదం నా చిన్నప్పుడు వినపడేది. ఇప్పుడు వినపడ్డం మానేసింది. మనుషులంతా ఒక్కటయ్యారో లేదో తెలీదు కానీ - మతాల వారీగా, కులాల వారీగా, వృత్తుల వారీగా మాత్రం ఒక్కటయ్యారు.

న్యాయవాదులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు - వివిధ వర్గాలలో అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలున్నా - బయట నుండి ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం 'మనమంతా ఒక్కటే!' అనే నినాదంతో కలిసి పోరాడుతారు. ఆ పోరాటం న్యాయానికి వ్యతిరేకమా? అన్యాయానికి అనుకూలమా? అన్నది వారికి అనవసరం. ఇక - ప్రైవేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, ప్రైవేట్ విద్యా సంస్థలు, కాంట్రాక్టర్లు.. మొదలైన కార్పోరేట్ వ్యాపార వర్గాల వాళ్ళు 'కలసి వుంటే కలదు సుఖం!' అన్న నానుడిని గట్టిగా నమ్మారు. అందుకే వాళ్ళు మంత్రులు, ప్రజాప్రతినిథులుగా కూడా రూపాంతరం చెందారు!

ఈ దేశంలో ప్రభుత్వాలు మారుతుంటాయి. అధికారంలోకి పాతమొహాల స్థానంలో కొత్తమొహాలు వస్తుంటాయి. పాత ప్రభుత్వాల అసమర్ధత, అవినీతి మీద కోపంతో, కసితో - కొత్త ప్రభుత్వాల్ని ఆహ్వానిస్తారు ప్రజలు. కానీ - వాళ్ళు ఆశించినంతగా పాత ప్రభుత్వ అవినీతి బాధ్యులపై నేరారోపణ గానీ, విచారణ గానీ జరగదు (మీడియాలో మాత్రం రోజువారీగా తిట్టుకుంటారు). కారణం - సింపుల్! రాజకీయ పార్టీలు కూడా అంతర్గతంగా ఒక్కటే!

కొందరు అమాయకులు చౌతాలా, లాలూ యాదవ్, జయలలిత వంటి నాయకులకి శిక్ష పడింది కదా! మన రాజ్యంగ వ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందని అనుకుంటారు. ఇది కొంత నిజం, కొంత అబద్దం! ఎందుకంటే రాజ్యంగ వ్యవస్థ నేరాల్ని పూర్తిగా నిరోధించదు, రాజ్యంగ యంత్రానికి అవసరమైనంత మేరకు కంట్రోల్ చేస్తుందంతే!

ఈ రాజ్యంగ యంత్రం నేరాన్ని ఎంతమేరకు ఎందుకు అదుపు చేస్తుందో, ఎందుకు వదిలేస్తుందో - 'రావిశాస్త్రి రచనల్లో రాజ్యంగ యంత్రం' అనే వ్యాసంలో బాలగోపాల్ చక్కగా వివరించాడు. నాకీ వ్యాసం గొప్ప జ్ఞానాన్నిచ్చింది.

"ఈ పరస్పరత రెండురకాల అమాయకులకు అర్ధం కాదు. అమాయకులయిన అమాయకులు (వీళ్ళు మొదటిరకం) నేరాన్ని అరికట్టడం, నిరోధించడం రాజ్యంగయంత్రం పని అనుకుంటారు. ఈ కోవకు చెందినవాళ్ళు బడిపంతుళ్ళు, కుర్ర ఐ.ఎ.ఎస్. ఆఫీసర్లు. రండవ రకంది దుస్సాహిసక అమాయకత్వం. రాజ్యంగ యంత్రం నేరాన్నసలు అరికట్టనే అరికట్టదని, నేరం మీద బలవడమే ప్రభుత్వ 'కార్యనిర్వాహకుల' పని అనీ అనుకుంటుంది. ఈ కోవకి చెందినవాళ్ళు సాధారణంగా కవిత్వం రాస్తారు.

అసలు సంబంధం ఇదీ కాదు, అదీ కాదు. బూర్జువా రాజ్యంగ యంత్రం నేరాన్ని సంపూర్ణంగా అరికట్టదు (అది దానికి అవసరమూ కాదు, శ్రేయస్కరమూ కాదు), అలాగని నేరాన్ని పనికట్టుకుని పోషించనూ పోషించదు. అది నేరాన్ని రెగ్యులేట్ చేస్తుందంతే.

సూక్ష్మీకరించి చెప్పాలంటే, నేరం బూర్జువా సమాజపు సంక్షోభాలకి ఒక సేఫ్టీవాల్వు లాంటిది. అవసరమయినపుడు దాన్ని తెరవకపోతే ఒత్తిడికి తట్టుకోలేక ఇంజను పగిలిపోతుంది. అలాగని సేఫ్టీ వాల్వుని ఎప్పుడూ తెరిచే వుంచితే ఇంజను అసలు పనిచేయదు. అంటే దాన్ని రెగ్యులేట్ చేయాలి. అదుపులో వుంచుకోవాలి. సరీగ్గా అదే (నేరానికి సంబంధించి) రాజ్యంగ యంత్రం కర్తవ్యం.

దీనంతటి అర్ధం, రాజ్యంగ యంత్రం నేరాలలో ఏ 20 శాతాన్నో పరిష్కరిస్తుందనీ, నేరస్తులలో ఏ 20 శాతాన్నో శిక్షిస్తుందనీ ఎంతమాత్రం కాదు. నేరం కంట్రోల్‌లో వుంచుకున్నట్లు జనానికి కనిపించడం అసలు విషయాలు. అసలు నేరాలని పరిష్కరించాల్సిన అవసరంగాని, నిజమయిన నేరస్తులను నిజమయిన నేరాలకు శిక్షించాల్సిన అవసరం ఎంతమాత్రం లేవు."

బాలగోపాల్ తన విశ్లేషణ కోసం రావిశాస్త్రి రాసిన 'తలుపు గొళ్ళెం'  అనే కథని (ఋక్కులు సంపుటం), 'మాయ'  అనే కథని (ఆరుసారాకథలు సంపుటం) ఎక్కువగా ప్రస్తావించాడు. చర్చ రావిశాస్త్రి రచనల గూర్చి కాబట్టి బాలగోపాల్ లుంపెన్ వర్గాల నేరాల్ని, పోలీసుల సహకారాన్ని ప్రస్తావించాడు. ఇదే విశ్లేషణని రాజకీయ అవినీతికి కూడా అన్వయించుకోవచ్చు. అప్పుడు ఈ దేశంలోని అంతులేని రాజకీయ అవినీతిలో కొందరు మాత్రమే ఎందుకు శిక్షించబడతారో తెలుస్తుంది.

కావున ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు జైలు కెళ్ళంగాన్లే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని (నాకీ 'ధర్మం - నాలుగు పాదాలు' కాన్సెప్ట్ ఏంటో తెలీదు) మనం ఆనందపడనక్కర్లేదు. ఆ ధర్మం అప్పుడప్పుడూ కుంటుతూ ఒంటికాలుపై నడుస్తుంది - అది రాజ్యంగ యంత్రం అవసరం. ఆ మేరకైనా ఎంతోకొంత మేలు జరుగుతుందని కొందరు ఆశాజీవులు ఆనందించవచ్చు! వారిని అభినందిస్తున్నాను.