Tuesday, 28 October 2014

ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది? పరపీడణ పరాయణత్వం!


పొద్దుట్నుండి టీవీ చూళ్ళేదు. ఇవ్వాళ రోజంతా పేషంట్లతోనే గడిచిపోయింది. అందువల్ల - దేశంలో ఎక్కడ ఏ రైలు పడిపోయిందో, ఎవరు ఎవర్ని తిట్టారో తెలుసుకోవడంలో చాలా వెనకబడిపొయ్యాననే అందోళనతో, ఆత్రుతతో టీవీ ఆన్ చేసి ఓ ఇంగ్లీషు చానెల్ నొక్కాను. ఆశ్చర్యం! దేశం ప్రశాంతంగానే వుంది.

టీవీ చానెళ్ళు నానా రకాలు. కొన్ని చానెళ్ళు అదే పనిగా ప్రకటనలు గుప్పిస్తూ, ఆ ప్రకటనల మధ్యన లేటెస్ట్ హిట్ సినిమా వేసుకుంటూ కళకళలాడుతుంటాయి. పాపం! కొన్ని చానెళ్ళు దివాళా తీసిన బట్టల కొట్టులా, ఐసీయూ పేషంటులా అలిసిపోయి, వెలిసిపోయి బ్రతుకీడుస్తుంటాయి.

నా ఖర్మ కాలి - అట్లాంటి ఒక దిక్కుమాలిన ఛానెల్నే నొక్కాను. ఆ చానెల్లో మైసూరుమహారాజ పేలెస్‌లో జరుగుతున్న దసరా ఉత్సవాల్ని చూపిస్తున్నారు! దీపావళి అయింతరవాత కూడా దసరా ఉత్సవాల్ని చూపిస్తున్నాడంటే ఈ చానెల్‌వాడు ఎంత దరిద్రంలో వున్నాడో అర్ధమవుతుంది! అది మైసూరు పేలెస్.. ఒక క్షణం అలానే చూస్తుండిపొయ్యాను.

పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను - సౌత్ ఇండియా సైకియాట్రీ కాన్ఫెరెన్సుకి మైసూరు వెళ్ళాను. సాధారణంగా కాన్ఫరెన్సులకి వెళ్ళినప్పుడు (విడి సమయంలో) హోటల్ రూం వదిలి బయటికి పోను. టీవీ చూసుకుంటూనో, ఏదో పుస్తకం చదువుకుంటూనో కాలం గడిపేస్తాను. వీలైనంత మేరకు కాన్ఫరెన్సు జరిగే హోటల్లోనే రూం బుక్ చేసుకుంటాను కాబట్టి ఇబ్బంది వుండదు.

మైసూరుకి కుటుంబ సమేతంగా వెళ్లాను. కావున - 'చచ్చినట్లు' సైట్ సీయింగ్‌కి వెళ్ళాల్సి వచ్చింది. కాన్ఫరెన్సు నిర్వాహకులే మైసూరు మహారాజా పేలెస్ అంటూ తోలుకెళ్ళారు. చూస్తున్నవాళ్ళల్లో కొందరు 'ఆహా! ఓహో!' అంటూ పేలెస్ అందాల్ని చూసి మురిసిపోతున్నారు. నాకు మాత్రం ఆ పేలెస్ డబ్బు, అధికార దర్పానికి వికృత నిదర్శనంగా కనిపించింది.

నాకప్పుడు జాన్ రీడ్ రాసిన 'టెన్ డేస్ దట్ షూక్ ద వరల్డ్' కూడా గుర్తొచ్చింది. నేనా పుస్తకం చదివాను, కొన్నాళ్ళకా సినిమా కూడా చూశాను. బోల్షివిక్కులు అధికార భవనాన్ని ఎంత చక్కగా ఆక్రమించుకున్నారు! మనం మాత్రం ఇక్కడ రాజుల సంపదని, వైభోగాన్ని దర్శిస్తూ ముచ్చట నొందుతున్నాం! పైగా - దసరా ఉత్సవాలు బాగా చేస్తాడని మెచ్చుకోళ్ళు!

నా ఈ గొప్ప ఆలోచనని నా భార్యతో పంచుకున్నాను. ఆవిడ నా అభిప్రాయాన్ని (ఎప్పటిలాగానే) పట్టించుకోలేదు.

అప్పుడు గుర్తొచ్చింది. హైస్కూల్లో వుండగా క్యూలో నించుని సాలార్‌జంగ్ మ్యూజియం చూశాను (ఆ తరవాత మళ్ళీ ఎప్పుడూ చూళ్ళేదు). అప్పుడు నాకో ధర్మసందేహం వచ్చింది.

'ఈ సాలార్‌జంగుకి ఇన్ని డబ్బులెక్కడివి?'

సమాధానం అప్పుడు నాకు తెలీలేదు గానీ - ఇప్పుడు తెలుసు.

రాజులు ప్రజల్ని పీడించి పన్నులు వసూలు చేస్తారు. నిజాం నవాబు పక్కనుండే సాలార్‌జంగుల్లాంటి అసిస్టెంట్లు - ద్రాక్షా సారాయము సేవిస్తూ, అంతఃపుర నర్తకిల నృత్యగానముల్ని తిలకిస్తూ.. మానసికోల్లాసానికి దేశవిదేశాల నుండి ఖరీదైన వస్తువులు సేకరించెదరు. అందువల్ల ప్రజలు శాశ్వతముగా గోచీపాతరగాళ్ళలా మిగిలిపోవుదురు, రాజులు మాత్రం హాయిగా నుందురు.

నాకీ సందేహం ముప్పైయ్యేళ్ళ క్రితం తాజ్ మహల్‌ని చూసినప్పుడు కూడా వచ్చింది.

'ఈనాడైనా, ఆనాడైనా, ఏనాడైనా - సగటు మనిషి జీతం జీవితం ఒక జీవన పోరాటం! ఇక కూలీజనులు కష్టాల జీవితం కడు దుర్భరం. ఈ రాజు ముండాకొడుకులు మాత్రం ప్రజల వద్ద పన్నులు పిండడం - చచ్చిన పెళ్ళాలకి, ప్రియురాళ్ళకి పాలరాతి మందిరాలు కట్టించడం! పైగా - అదేదో ప్రేమకి నిదర్శనమని మనలాంటి బుద్ధి లేని గాడ్డె కొడుకులు మురిసిపోవడం! అసలీ షాజహాను గాణ్ని ఈ తాజ్ మహల్ ఓపెనింగ్ రోజున పైకెక్కించి తోసేస్తే పొయ్యేది. చచ్చి - వెంటనే ముంతాజుని కలుసుకునేవాడు. అసలు నిజమైన ప్రేమంటే అదే!'

'నువ్వు రాసేది తప్పు. ఈ రాజులు చాలా మంచివాళ్ళు. అందునా ఒక మతం రాజులు మరీ మంచివారు. వాళ్ళు రహదారుల పక్కన వృక్షములని నాటించారు, బాటసారుల కోసం సత్రాలు కట్టించారు. ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో నువ్వు చదువుకోలేదా?'

కవులు నానావిధములు. ఒకరకం కవులు కడదాకా ప్రజల పక్షానే నిలబడతారు. వీళ్ళు 'ప్రజాకవులు'. ఇంకోరకం కవులు నిక్కముగా, నిక్కచ్చిగా ప్రభువుల పక్షానే నిలబడతారు. వీళ్ళు 'గిట్టుబాటు కవులు'. మరోరకం కవులు - ప్రజల పక్షాన వున్నట్లుగానే వుంటూ - ప్రభువులు విదిలించే అవార్డులకీ, రివార్డులకీ ఆనందంతో వొళ్ళు పులకించగా, కృతజ్ఞతతో శిరస్సు వొంగిపోతుండగా - ప్రభువుల పక్షాన చేరతారు. అది వారి బలహీనతట! ఈ మూడోరకం కవుల్ని 'ఉభయచర జీవులు' అనాలని రంగనాయకమ్మ రాయంగా చదివాను.

మనం చిన్నప్పుడు సోషల్ పుస్తకాల్లో చదువుకున్న చెత్తని టన్నుల కొద్దీ కుమ్మరించినవారు గిట్టుబాటు కవులు మరియూ ఉభయచర జీవులు అని నా అనుమానం! రాజుల కన్నా ఆ రాజుల్ని కీర్తించిన కవులే పెద్ద దొంగాముండాకొడుకులని నమ్ముతున్నాను.

ముగింపు -

అసలు మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర చరిత్రేనా? చరిత్ర రాసిన పండితులు రాజులకి ప్రాముఖ్యతనిస్తూ - వారి వంశపాలన ఆధారంగా కాలాన్ని అధ్యాయాలుగా విడగొట్టారు. రాజుల చరిత్ర ప్రజల చరిత్ర ఎలా అవుతుంది? కాంగ్రెస్ చరిత్ర దేశచరిత్ర అవుతుందా? కాదు కదా! ఇది చాలా అసంబద్ధం, అన్యాయం కూడా. ప్రజల వైపు నుండి, ప్రజల తరఫున, ప్రజల కోసం రికార్డ్ చేసిన వాస్తవాలే చరిత్ర అవుతుంది తప్ప - అసత్యాలు, అతిశయోక్తుల సమాహారం చరిత్ర కాజాలదు.

ముగింపుకి ముగింపు -

"ఈ విషయంతోనే మహాకవి శ్రీశ్రీ డెబ్భైయ్యైదేళ్ళ క్రితమే 'దేశచరిత్రలు' అంటూ ఒక మహప్రస్థాన కవిత రాశాడు. ఆ కవిత కాన్సెప్ట్ కాపీ కొట్టేశావేమిటి?"

స్వగతముగా -

'వీడి దుంప దెగ, విషయం పట్టేశాడే!'

ప్రకాశముగా -

"అయ్యో! అలాగా? నాకా శ్రీశ్రీ ఎవరో తెలీదు! ఆయన 'మహప్రస్థానం' అసలే తెలీదు. అయినా - నే పుట్టక ముందు రాసిన కవిత నాకెలా తెలుస్తుంది!? కావున ఇది అచ్చంగా నాకొచ్చిన సొంత ఆలోచనే! శ్రీశ్రీకీ, నాకూ ఒకే ఆలోచన రావడం కేవలం యాదృచ్ఛికం! ఇది మీరు నమ్మాలి."