Saturday, 1 October 2011

ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి!!


ఆ వూళ్ళో భార్యాబాధిత సంఘం మొదలెట్టి సరీగ్గా సంవత్సరం అయింది. ఇవ్వాళ మొదటి వార్షికోత్సవ సభ జరుపుకుంటున్నారు. సంఘంలో సభ్యులైతే చాలామందే వున్నారు. సుఖవ్యాధి రోగుల్లాగా (సుఖరోగం అంటే రోగం సుఖంగా ఉంటుందని కాదు, పరులతో సుఖించడం వల్ల వచ్చిన రోగమని అర్ధం), భార్యాబాధితులు బయటకి చెప్పుకోటానికి మొహమాటపడతారు. 

కాబట్టి - యోగాలంటూ గుండెల్నిండా గాలి పీల్చుకొమ్మని బొధించే స్వామిజీ సభలంతగా కాకపోయినా, కొద్దిమందైనా రాకపోతారా అనే ఆశతో నిర్వాహకులు ఎదురుచూశారు. సభ్యులు ఒక్కొక్కళ్ళుగా చేరుకుంటూ సభ ప్రారంభమయ్యే సమయానికి్ కొద్దిమంది కన్నా ఎక్కువమందే వచ్చారు. అంచనాలకి మించి హాజరైన భార్యాబాధిత భర్తల్ని చూసి నిర్వాహకులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. 
                  
కుర్రభర్తలు, ముసలిభర్తలు, పొట్టిభర్తలు, పొడుగుభర్తలు, వేదాంతభర్తలు, విప్లవభర్తలు - అదొక నానావిధ భర్తలోకం! 'విధి ఒక విషవిలయం' అనుకునే ఉసూరు భర్తలు, 'ఉందిలే మంచికాలం ముందూముందునా' అనుకునే ఆశావాహ భర్తలు - ఎటు చూసినా పీడిత తాడిత భర్తలే!           

అధ్యక్షులవారైన గుమ్మడి గుర్నాధం వేదికపైకొచ్చాడు. ఆయన పెళ్ళానికి తప్ప పులిక్కూడా భయపడని ధీరోధాత్తుడు! ఎర్రటి శరీరమంతా మానిన గాయాల తాలూకా గుర్తులు. పండిపోయిన కాకరకాయలా, వడలిపోయిన వంకాయలా ఉన్నాడు. వారీ సంఘాన్నేర్పరచటంలో జీవితాన్నే ధారబోసిన గొప్ప త్యాగమూర్తి! 
                 
కొంచెంసేపు దగ్గి, అధ్యక్షోపన్యాసం మొదలెట్టాడు. 

"మితృలారా! మీ ఉత్సాహం చూస్తుంటే మన భర్త జాతికి మంచికాలం వచ్చేసిందనే నమ్మకం నాకు కలుగుతుంది. మన పురుషజాతి గతవైభవాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. దేవుళ్ళందరికీ రెండు ఫ్యామిలీలు. శ్రీకృష్ణుడికి పదహారు వేలమంది గోపికలు. వీళ్ళు చాలరన్నట్లు అనేకమంది భార్యలు. కన్యాశుల్కంలో మధురవాణి కోసం గిరీశం, రామప్పపంతులు పోటీ పడ్డారు. వనితలను ఆదుకొనుట మన సంస్కృతి, సాంప్రదాయం, సంస్కారం. మన కవులు, కళాకారులు రెండోభార్య వల్లనే అద్భుత క్రియేటివిటీ సాధించారని చరిత్రలో లిఖితమై ఉంది." అంటూ ఖణేల్ ఖణేల్మంటూ దగ్గాడు. 
                 
కొంచెంసేపు రొప్పి, మరికొంతసేపు నిట్టూర్చి విషాదవదనంతో చెప్పసాగాడు.  

"కాలం కౄరమైనది. విధి విచిత్రమైనది. ఒకప్పుడు మన కాళ్ళ మీద పడి సావిత్రిలా విలపిస్తూ పాదాల దగ్గర చోటు అర్ధించిన స్త్రీజాతి ఇప్పుడు మనని శాసించే స్థాయికి ఎదుగుట కడు శోచనీయము. ఇంట్లో పాత ఫర్నీచర్లా ఒక మూల పడుండే భార్యజాతి - ఈరోజు మనపై వరకట్న కేసులు, గృహహింస కేసులు.. భగవాన్! ఏమిటీ విధివైపరీత్యం!" 

హాలంతా వేడి నిట్టూర్పులతో నిండిపోయింది.  

"ఎందుకిన్ని కఠిన చట్టాలు? మనమేమన్నా పక్కింటోడి భార్యని తంతున్నామా? ఏం! ఆమాత్రం సొంతభార్యని తన్నుకునే కనీసస్వేచ్ఛ కూడా మనకి లేదా? ముల్లు అరిటాకు సామెతలో ఇప్పుడు మనం అరిటాకులమైపొయ్యాం. ఎందుకిలా జరుగుతుంది? స్త్రీజాతి నుండి పురుషజాతికి రక్షణే లేదా?" జవాబుల్లేని ప్రశ్నలేసుకుని బాధ భరించలేక భోరుమన్నాడు అధ్యక్షులవారు.             
                 
తదుపరి కార్యక్రమంగా కార్యదర్శి రమాపతి తమ సంస్థ చేపట్టిన కార్యక్రమ వివరాలు సుదీర్ఘంగా చెప్పాడు. ఈరోజు నుండి భార్య చేత చావుదెబ్బలు తిన్న భర్తలకి అయ్యే ట్రీట్మెంట్ ఖర్చుల్ని 'ఆరోగ్యశ్రీ' లిస్టులో చేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేశాడు. ప్రతివారం భార్యబాధిత సంఘ అధ్యక్ష, కార్యదర్శులు 'భార్యల హెచ్చులు - భర్తల హక్కులు' అనే ప్రశ్నోత్తర లైవ్ కార్యక్రమాన్ని, మెరుగైన సమాజం కోసం తిప్పలు పడుతున్న టీవీ 420 వారి సౌజన్యంతో నిర్వహించబోతున్నామని చెప్పాడు. సభ్యులంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.  

చివరగా భార్యని ఎదిరించి భర్తజాతి పరువు నిలిపిన విప్లవజ్యోతి ఆర్.సత్యన్నారాయణమూర్తికి సన్మానం కార్యక్రమం. ఆర్.సత్యన్నారాయణమూర్తిది స్థూలకాయం. ఆయన్ని టైమడిగినా ఆవేశంతో ఊగిపోతాడు, హూంకరిస్తాడు. సన్మాన గ్రహీతగా మాట్లాడబోయే ముందు ఎర్రజెండాకి నమస్కరించాడు. 

అతనిలో ఒక అల్లూరి సీతారామరాజునీ, ఒక భగత్ సింగునీ గాంచి భర్తజనులందరూ ఉప్పొంగిపోయారు. ఆర్.సత్యనారాయణమూర్తి తన బొంగురు గొంతుకతో గద్దర్ స్టైల్లో దిక్కులు పిక్కటిల్లేట్లు ఒక పాటందుకున్నాడు. 

"గ్యాసు మనదిరా, గిన్నెమనదిరా, బట్ట మనదిరా, సబ్బు మనదిరా! నడుమ పెళ్ళమేందిరో, దాని పీకుడేందిరో!" భర్తాధములందరికీ ఆవేశంతో గుండెలుప్పొంగగా కోరస్ అందుకున్నారు. కొందరు ఆనందం తట్టుకోలేక కిందపడి గిలగిలా కొట్టుకోసాగారు.

పాట అయిపోయింది. ఒక్కక్షణం ఆగి ఆయాసం తీర్చుకుని ఆవేశంగా చెప్పసాగాడు ఆర్.సత్యన్నారాయణమూర్తి. "బ్రదర్స్! విప్లవం మొదలయ్యింది. మనం మీసమున్న మొగాళ్ళం, బానిసలం కాదు. భార్యకి భయపడేదేంటి బ్రదర్? నేనేనాడూ నా భార్యని లెక్కజేయలా. మగాళ్ళా, పులిబిడ్డలా బతుకుతున్నా! ఇవ్వాళ మీ సన్మానం నాలోని ఫైర్ పదింతలు పెంచింది."   
                 
ఇది కలా, నిజమా? ఇదెలా సాధ్యం? ఆర్.సత్యన్నారాయణమూర్తి తన రహస్యాన్ని బయటపెట్టి తీరాలంటూ సభికులంతా ముక్తకంఠంతో నినాదాలు చేశారు, ఆపై వేడుకున్నారు.
                 
ఆర్.సత్యన్నారాయణమూర్తి ఆవేశంగా ఊగిపోయాడు. పిడికిళ్ళు బిగించాడు. 

"బ్రదర్స్! నేనేరోజూ నా భార్య మాట విన్లేదు, వినను కూడా, వినను గాక వినను. నా భార్యా కుడికాలు పట్టమంటే ఎడంకాలు పడతా, ఎడంకాలు పట్టమంటే కుడికాలు పడతా. బట్టలుతకమంటే వంట చేస్తా. వంట చెయ్యమంటే అంట్లు తోముతా. వంకాయకూర చెయ్యమంటే దొండకాయ వేపుడు చేస్తా. కాఫీ ఇమ్మంటే టీ ఇస్తా. అంతేగానీ నా భార్య చెయ్యమన్న పని పొరబాటున కూడా చెయ్యను. మాట వినే ప్రసక్తే లేదు. భూమ్యాకాశాలు దద్దరిల్లనీ - వాగులూ, వంకలూ పొంగనీ! అవసరమైతే ప్రాణత్యాగానిక్కూడా సిద్ధమే! ప్రపంచ భర్తల్లారా! ఏకం కండి, పోరాడితే పొయ్యేదేం లేదు బానిస సంకెళ్ళు తప్ప. విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్." 

ఆర్.సత్యన్నారాయణమూర్తి గాండ్రింపుకి మైకు ఠప్పున పేలిపోయింది! 
                 
భర్తలందరూ పెద్దపెట్టున నినాదాలు చేసి, ఆనందం తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు.  
                 
"సభని జయప్రదం చేసిన మీ అందరికీ కృతజ్ఙతలు. మళ్ళీ ఇదే అలవరసలపై వచ్చే సంవత్సరం కలుద్దాం. జైహింద్!"

సభ ముగిసింది.

(picture courtesy : Google)