Tuesday, 11 October 2011

కల్లోల చిత్రాలు


మనసుని కలిచివేసే చిత్రాల్ని కల్లోల చిత్రాలు అంటారు. ఇవి అందరకీ ఒకటే రకంగా వుండకపోవచ్చు. ఎవరెవరి సామాజిక రాజకీయ అవగాహన బట్టి మారుతుంటయ్. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చనిపోయిన  చిన్నారి ముఖాన్ని చూశాక చాలామందికి అన్నం సయించలేదు, నిద్ర పట్టలేదు. అలాగే - జబ్బుతో తీసుకుంటున్నప్పటి సావిత్రి ఫోటో నన్ను తీవ్రంగా కలచివేసింది.  

మనమంతా చిన్నప్పుడు అమాయకంగా వుంటాం. సినిమాకి, నిజజీవితానికీ తేడా తెలీదు. అంచేత సావిత్రి నాకేనాడూ సినిమానటిగా తెలీదు. బాగా తెలిసిన మనిషిగా, నా కళ్ళల్లోకళ్ళు పెట్టి ముచ్చట్లు చెప్పిన ఆత్మీయురాలిగా అనిపించేది. చాలాసార్లు సూర్యాకాంతాన్ని చంపేసి సావిత్రిని రక్షిద్దామనుకున్నాను. 

దేవదాసు ఇంటికి పార్వతి అర్ధరాత్రి సమయంలో వెళ్లి 'నన్ను పెళ్లిచేసుకో దేవదా!' అని వేడుకున్నప్పుడు, దేవదాసు ఎంత బాధపడ్డాడో తెలీదు గానీ, నాకు మాత్రం కన్నీరు ఆగింది కాదు. ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న మిస్సమ్మ 'ఏమిటో నీమాయ' అంటూ ముద్దుముద్దుగా పాడుతుంటే చూడ్డానికి రెండుకళ్ళు చాల్లేదు. లక్ష్మణకుమారుణ్ణి దడిపించిన మాయాశశిరేఖ ఠీవి, దర్పం సూపర్బ్. 'నన్నువదలి నీవు పోలేవులే.. ' అంటూ నాగేశ్వరరావుని మురిపించింది. అందుకే ఆనాటి కుర్రాళ్ళు సావిత్రి లాంటి భార్య కోసం కలలు కన్నారు. 

కొన్నాళ్ళక్రితం యేదో పేపర్ తిరగేస్తుండగా ఒకఫోటో నా దృష్టినాకర్షించింది. అది మందపాటి కళ్ళద్దాలతో, బక్కచిక్కిన వొక వృద్ధుడి ఫోటో. ఆయన బాగా పేదవాట్ట, పూట గడవట్లేదుట. కర్ర సాయంతో ఒంటికాలుపై నిలబడి రెండుచేతులూ జోడించి సాయం చెయ్యమని దీనంగా వేడుకుంటున్నాడు. ఆ కళ్ళు చూశాను, ఎక్కడో చూశాను! ఎక్కడ? ఆ కళ్ళని మరింత పరిశీలనగా చూశాను. వొక్కసారిగా వొళ్ళు ఝల్లుమంది,  ఆపై గుండె బరువెక్కింది. 

ఆ వృద్ధుడు ఆషామాషా వ్యక్తికాదు, వందల సినిమాల్లో ఎన్టీవోణ్ణి ముప్పతిప్పలు పెట్టిన రాజనాల! కృష్ణకుమారి, దేవిక , సావిత్రి, జయలలిత.. హీరొయిన్ ఎవరనేది రాజనాలకి అనవసరం. అతనికసలు 'రొమాంటిక్' అంటే అర్ధం కూడా తెలీదు. కానీ హీరోయిన్లెవరూ రామారావుకి దక్కకుండా చెయ్యాలి! అదే రాజనాల ధ్యేయం, పోటీ, పట్టుదల! అందుకే వాళ్ళని ఎత్తుకెళ్ళిపొయ్యేవాడు, నిర్భందించేవాడు. 'నిన్ను రక్షించడం ఎవరి తరం కాదు' అని క్రూరంగా నవ్వేవాడు!

కత్తియుద్ధంలో రామారావుకి సమఉజ్జీ రాజనాల. చివరాకరికి ఓడిపోతానని తెలిసినా గంటలకొద్దీ ఫైటింగులు, యుద్ధాలు చేసేవాడు. ఎన్నికుట్రలు పన్నాడు! ఎంతమంది రాజుల్ని  చెరబట్టాడు! ఎన్నిఘోరాలు చేశాడు! అంతటి అరివీర భయంకరుడు రాజనాల ఇలా అయిపొయ్యాడేమిటి! 

'రాజనాలకి వృద్దాప్యం రాకూడాదా? ఆర్ధిక ఇబ్బందులు స్వయంకృతం. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే.' మనందరికీ సింహం అంటే అందమైన జూలు, ఠీవీగా నడచివచ్చే అందమైన జంతువు గుర్తొస్తుంది గానీ - పళ్ళూడిపోయిన జబ్బు సింహం గుర్తురాదు. అట్లాంటి సింహాన్ని చూస్తే - 'అయ్యో!' అనిపిస్తుంది. ఈ భావన ఏ ముసలికుక్కనో, జబ్బుపిల్లినో చూసినప్పుడు రాదు. నాకు రాజనాలని చూడంగాన్లే జబ్బు సింహం గుర్తొచ్చింది.  

ఒకసారి సినిమావాళ్ళ చివరి రోజుల గూర్చి చర్చ వచ్చినప్పుడు, ఒక పెద్దమనిషి "సినిమావారికి లేని అలవాటుండదు, వ్యసనపరులు. అందుకే చివర్రోజుల్లో కష్టాలు పడతారు." అని ఈసడించుకున్నాడు. ఆయనగారు క్రమం తప్పకుండా ఉదయాన్నే యోగా చేస్తూ, శనివారాలు ఉపవాసాలు చేస్తూ సిస్టమేటిగ్గా జీవిస్తున్న బుద్ధిజీవి. అటువంటి జీవితం మంచిదే కానీ అందరూ అలా జీవించలేరు గదా!

మనమంతా ఒక మూసలో కోట్టుకుపోతుంటాం. చదువులు, ఉద్యోగాలు, బాధ్యతలు మనలోని మనిషి లక్షణాలని హరిస్తాయేమో. అందుకే ఎంత ప్రతిభావంతులైనా సరే - వారి వ్యక్తిగత బలహీనతల్ని ఎక్కువచేసి చూస్తూ.. అసలావ్యక్తి ప్రతిభనే మర్చిపోతాం. ఈ ధోరణి చదువుకున్నవారిలోనే ఎక్కువనుకుంటాను!

సావిత్రి గొప్పనటి. పార్వతిగా, మిస్సమ్మగా, శశిరేఖగా తెలుగువాళ్ళని మైమరపించింది. ఒక తరం తెలుగు ప్రేక్షకులు సావిత్రి అందానికీ, అభినయానికీ ఫిదా అయిపోయ్యారు. అటువంటి సుందరమూర్తి - గుర్తు పట్టలేనంత సన్నగా, పుల్లల్లాంటి చేతుల్తో, ప్రపంచలోని బాధనంతా తానే అనుభవిస్తున్నట్లుగా - ఎంత ఘోరం! అందుకే ఫోటో చూడంగాన్లే మనసంతా దిగులుగా అయిపొయింది. 


(photos courtesy : Google)