Sunday, 23 October 2011

సినిమాలు మంచివే! కానీ మనం?'సినిమాల్లో చెడు ఉండరాదు, బలహీన మనస్తత్వం కలవారు చెడిపోతారు.'

ఇది నేను నా చిన్నప్పట్నించీ వింటున్న సుభాషితం. ఓకే! ఒప్పుకుంటున్నా. ఇప్పుడు అట్టు తిరగేద్దాం. మరి - సినిమాల్లో మంచిని చూసి బాగుపడినవాళ్ళు ఎందరున్నారు? ఫలానా సినిమాలో ఫలానా పాయింటు నాకళ్ళు తెరిపించింది. కావున - ఫలానా విధంగా నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను, ప్రవర్తిస్తున్నాను. అన్నవాళ్ళు  మీకెక్కడైనా కనిపించారా? నాకైతే కనిపించలేదు.

'దేవదాసు'లో ఎస్వీరంగారావు - అంతస్తు తక్కువ పిల్లని చేసుకుంటే తుపాకీతో కాల్చుకు చస్తానని బెదిరించి మరీ నాగేశ్వర్రావుని సావిత్రి నుండి వేరు చేస్తాడు. ఆ తరవాత దేవదాసు, పార్వతిలు తెలుగువాళ్ళని దారుణంగా ఏడిపించారు. అరవైయ్యేళ్ళ క్రితం ఈ ఫార్ములా సూపర్ హిట్టు. తమ పిల్లలు దేవదాసు, పార్వతిల్లా భ్రష్టుపట్టిపోతారనే భయంతో  పిల్లల ప్రేమని ఒప్పుకునే దయార్ధ్ర హృదయులు ఈరోజుక్కూడా నాక్కనిపించట్లేదు.
                             
నా చిన్నప్పుడు అమ్మ, పక్కింటి పిన్నిగారితో కలిసి ఎన్నో ఏడుపుగొట్టు సినిమాలు చూశాను. 'అన్నా! నీ అనురాగం' అంటూ గుండెలు పగిలే గుడ్డి చెల్లెలి ఆక్రందనల్ని - ఎర్రటికళ్ళతో, మొహం వాచిపోయేలా బిగ్గరగా రోదిస్తూ సినిమాని చూశారు పిన్నిగారు. ఇంటికెళ్ళంగాన్లే బండెడు ఇంటి చాకిరీ సరీగ్గా చెయ్యలేదని తన విధవాడపడుచుని ఇల్లెగిరిపొయ్యేలా కేకలేసింది!

శారద నటించిన 'మనుషులు మారాలి'  సినిమా తెలుగువాళ్ళ హృదయాన్ని పీల్చి పిప్పి చేసింది. శోభన్ బాబు హత్య, ఆపై శారద దుర్భర దరిద్రాన్ని తట్టుకోలేక తన పిల్లల్ని చంపేసుకోవటం.. నాకు తెలిసి తెలుగులో ఇంతకన్నా సీరియస్ సినిమా మరోటి లేదు. జనాలు విరగబడి చూసి యేడ్చేశారు. ఆ సినిమా విజయవంతమై నిర్మాతలకి కాసులు తెచ్చింది గానీ జనాల్లో మార్పు తేలేకపోయింది. 

'రోజులు మారాయి'లో దళిత వర్గానికి చెందిన షావుకారు జానకిని వ్యవసాయ వర్గానికి చెందిన నాగేశ్వర్రావ్  ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ఈ దళిత అగ్రవర్ణాల పెళ్ళి అలనాటి 'మాలపిల్ల' దగ్గర మొదలై - 'కాలం మారింది', 'బలిపీఠం' లాంటి సూపర్ హిట్ల మీదుగా చాలా పెద్దప్రయాణమే చేసింది. మనం కూడా సమాంతరంగా కారంచేడు, చుండూరు, నీరుకొండల మీదుగా ఇంకో పెద్దప్రయాణం చేస్తున్నాం!
                           
నేను ఈ ఉదాహరణల్ని సినిమా ప్రభావం సమాజం మీద ఉండదని చెప్పటానికి రాయట్లేదు. ఉంటుందని అన్డానికి తగినంత ఆధారాల్లేవని చెప్పటానికి మాత్రమే రాస్తున్నాను.
                             
సినిమా మన ఈగోని సంతృప్తి పరుస్తుంది. వాస్తవ ప్రపంచంలో మనకున్న తోర్రల్ని పూడ్చి ఆకాశంలో విహరించే ఆదర్శవంతమైన పాత్రల్ని భలే ఇష్టపడతాం. అసలా పాత్రల విలువల పట్ల దర్శక రచయితలకే నమ్మకం ఉండదు. ఆదర్శవంతమైన ఆలోచనలు, సాధ్యంకాని కోరికలు, లేని విలువలు ఆపాదించుకోవటానికి డబ్బుతో కొనుక్కునే సాధనం సినిమా.

ఇవ్వాళ్టికీ వాస్తవ జీవితంలో కులమతాలు, ఆస్తిఅంతస్తులు చాలా ముఖ్యం. కానీ సినిమాల్లో పడవ నడిపే వ్యక్తి ఆమాయక ప్రేమ (మూగమనసులు), నల్లటివాడి కవితాత్మక ప్రేమకథ (చెల్లెలి కాపురం), పనివాడి మొరటు ఆత్మీయత (ఆత్మబంధువు), రిక్షా కార్మికుని కుటుంబ మమకారాలు (శభాష్ రాముడు) ముచ్చట గొలుపుతయ్. అంటే - నిజ జీవితంలో మనకేది ఉండదో అదే సినిమాల్లో చూసుకుని తృప్తినొందుతాం!
                             
కాబట్టి నా పాయింటేంటంటే - జనం చెడిపోతున్నారని ఎవరూ గుండెలు బాదుకోనక్కర్లేదు. మీరూ నేనూ ఈ జనంలో భాగమే. ఎంత గొప్ప సినిమా చూసినా మీరూ నేనూ ఆవగింజంతైనా బాగుపడనట్లే, ఎవరూ కూడా చెడిపోరు. కాకపోతే తెలుగువాళ్ళల్లో కొందరు మేధావులున్నారు. వాళ్ళు సామాన్య ప్రజల కన్నా పైస్థాయివాళ్ళు కాబట్టి - సినిమాల్లో చెడు చూసి జనాలు చెడిపోతున్నారంటూ స్టేట్మెంట్లు పడేస్తారు! 

పోనీ - చిన్నపిల్లలయినా సినిమా ప్రభావానికి లోనవుతారా? ఇదీ అనుమానమే! గుండమ్మకథ పదిసార్లు చూసిన నా అన్న నన్ను ఎన్టీఆర్ నాగేశ్వర్రావుని చూసినట్లు ఆప్యాయంగా చూసుకోకపోగా, నామీద నాన్నకి పితూరీలు చెప్పి తన్నించేవాడు. 'రక్తసంబంధం'లో తీవ్రమైన అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ వుంది. సినిమా చూస్తూ హాల్లో కడవల కొద్దీ కన్నీరు కార్చిన అక్క - నేను తన పెన్సిలూ, ఎరేజరు వాడేస్తున్నాని రాక్షసిలా రక్తమొచ్చేట్లు గిచ్చింది. ఆరకంగా మాదీ రక్తసంబంధమైపోయింది! మరి పిల్లల మీద సినిమాల ప్రభావం ఏంటి?!

సినిమాల ప్రభావం ఉండదని నిరూపించడానికి అన్నీ నెగెటివ్ పాయింట్లు రాస్తున్నాను కదూ! కాబట్టి ట్రాక్ మారుస్తా. చిన్నప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు నాకు కొన్ని కోరికలు కలిగేవి. 'శభాష్ రాముడు' చూసి రామారావులా రిక్షా తొక్కుదామనే కోరికతో తహతహలాడాను, కాలేజీకి వచ్చాక నా రిక్షా తొక్కుడు కోరిక తీరింది. 

కొంచెం పెద్దయ్యాక ఏడుపుగొట్టు ఇల్లాళ్ళు నచ్చడం మొదలెట్టారు. మొగుడు 'ఇంకోదాన్తో పోతాను మొర్రో!' అంటున్నా పట్టించుకోకుండా మొగుడిగాడి కాళ్ళమీద పడి భీభత్సంగా కన్నీరుగార్చే పతివ్రతా శిరోమణులు నా మనసు దోచారు. ఆరోజుల్లో నాకు నచ్చిన డైలాగ్ - "ఏవఁండీ! మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి, కనీసం మీఇంట్లో పనిమనిషిగా ఉండనిస్తూ ఇంత ముద్ద పడెయ్యండి." ఇట్లాంటి సీన్లు చూసినప్పుడల్లా అర్జంటుగా పెళ్లి చేసుకుని ఏడిచే భార్యతో బ్రతిమాలించుకోవాలని తెగ ముచ్చటపడేవాణ్ని. కానీ - పదోక్లాసులో పెళ్లి చేసుకునే సౌలభ్యం, సౌకర్యం లేక ఆగిపొయ్యా! రిక్షా ముచ్చటైతే తీరింది గానీ, ఈ పాదాల దగ్గర చోటు ముచ్చట తీరలేదని ప్రత్యేకంగా రాయడం అనవసరం. 

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - సినిమా చూడ్డం అనేది కేవలం కాలక్షేపం మాత్రమే. అది తీసేవాడికీ తెలుసు, చూసేవాడికీ తెలుసు. మరి తెలీన్ది ఎవరికి? 'సినిమాల్లో చెడు ఉండరాదు. బలహీన మనస్తత్వం గలవారు చెడిపోతారు.' అనేవాళ్లకి. ఇంతకీ ఆ చెడిపొయ్యే బలహీన మనస్తత్వ దుర్భలులు ఎక్కడ వుంటారో, ఎలా వుంటారో వాళ్లెప్పటికీ చెప్పరు. అదే తంటా!

(posed in fb on 3/2/2018)