Thursday, 27 October 2011

నమస్కారం అన్నయ్యగారు!


'వూరికే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది?' అన్నాడు ముళ్ళపూడి. నేను గొడ్డుని కాదు కాబట్టి - పుస్తకాలు చదివేవాణ్ని, స్నేహితుల్తో సరదాగా కబుర్లు చెప్పేవాణ్ని. నాకు చాలా తెలుసు, కానీ దేంట్లోనూ లోతు తెలీదు. 'జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్' అనే నానుడి నాకు సరీగ్గా సరిపోతుంది.

ఈ ధోరణి నాకు అనేకరంగాల స్నేహితుల్ని సంపాదించింది. ఆటో నడిపేవారి నించి యూనివర్సిటీ ప్రొఫెసర్ల దాకా మనకి స్నేహరత్నాలున్నారు. ఇది కొంతమందికి నచ్చదు, నాకు మాత్రం భలే ఇష్టం.

చదువైపోయింది, పీజీ సీటు కోసం పాట్లు పడే దశ మొదలైంది. ఈలోగా నా స్నేహితుల్లో కొందరు - ఉద్యోగం వచ్చిందనొకడూ, కట్నం నచ్చిందని మరొకడు నెమ్మదిగా ఒకింటివాళ్ళైపోవటం మొదలెట్టారు. మంచిది, ఎవరి జీవితం వారిది.

అయితే కొత్త పెళ్ళికొడుకులు నన్ను తప్పించుకు తిరగటం మొదలెట్టారు. నాకర్ధం కాలేదు, ఆశ్చర్యపొయ్యాను. సమాధానం దొరక్క - 'సర్లే! ఎంతవారైననూ కాంతాదాసులే గదా!' అని సర్ధిచెప్పుకున్నాను. అయితే అధికారపక్షం నుండి ప్రతిపక్షంలోకి దిగిపోయిన రాజకీయ నాయకుళ్ళా మనసులో బాధ ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది.
                          
మన కొత్త పెళ్ళికొడుకుల ఇబ్బందులు, తిప్పలు నిదానంగా అర్ధమవసాగాయి. ఒక దురదృష్ట దినాన ఒకానొక పెళ్ళిలో ఒకానొక స్నేహితుడి భార్యతో ఒక్క నిమిషంపాటు మాట్లాడాను. వున్నట్లుండి ఆ అమ్మాయి - 'గుంటూరు మెడికల్ కాలేజి చరిత్రలోనే మా ఆయన అత్యుత్తమ విద్యార్ధి.' అన్నది. ఆ అత్యుత్తమ విద్యార్ధి యం.బి.బి.యస్. తీరిగ్గా ఏడేళ్ళపాటు చదివాడు, పరీక్షల్లో కాపీలందించలేక చచ్చాను. ఆవిడ చెప్తున్నది అర్ధం కాక బుర్ర గోక్కుంటూ మావాడి కేసి చూశా, వాడు బ్రతిమాలుతున్నట్లుగా మొహం పెట్టాడు. అంతట నాకు జ్ఞానోదయం అయ్యింది. 

ఈ కొత్త భార్తాధములు, తమ కొత్తభార్యల దగ్గర హైప్ క్రియేట్ చేసుకున్నారు. నేను వారికి తమ గత జీవిత తాలూకా పీడకలని. ఈ కఠోరసత్యం బోధపడ్డాక బాధ కొద్దిగా తగ్గింది. పోన్లే పాపం, ఆ మాత్రం భార్యల దగ్గర మార్కులు కొట్టేయ్యకపోతే వారికి కాఫీ దక్కే పరిస్థితి కూడా ఉండదు. 'ఎక్కడ ఉన్నా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా" అంటూ పాడుకుని జీవితాన్నికొనసాగించసాగాను. 
                         
ఇప్పుడు కొద్దిగా ఫాస్ట్ ఫార్వార్డ్. 'స్నేహితుల గూర్చి ఇన్ని నగ్నసత్యాలు రాశావ్. మరి నీ సంగతేంటి?' అనే సందేహం మీకు కలగొచ్చు. దురదృష్టవశాత్తు కొంతకాలానికి నాక్కూడా పెళ్లైంది. అయితే నా భార్యకి గొప్పలు చెప్పుకునే లక్జరీ నాకు లేకుండా పోయింది. కారణం - నా భార్య నేను చదివిన కాలేజీలోనే నా జూనియర్!

కాలేజీలో క్లాసురూముల్లో కన్నా క్యాంటీన్లోనూ, లైబ్రరీలో కన్నా సినిమాహాళ్ళల్లోనూ నా జీవితచరిత్ర లిఖించబడియున్నదని ఆమెకి తెలుసునేమోనని నా అనుమానం. ఎగస్ట్రాలు మాట్లాడితే కొత్త విషయాలేమన్నా బయటకొస్తాయనే అనుమానంతో కిక్కురుమనకుండా నోర్మూసుకున్నాను. కాబట్టి భార్య దగ్గర వీరులం, ధీరులం అనే బిల్డప్పులిచ్చే శీలపరీక్షలో పాల్గొనే అవకాశం నాకు లేకుండా పోయింది. 
                       
ఇప్పుడు మళ్ళీ అసలు విషయంలోకొద్దాం. ఒకసారి మనసు బాగోక ఒక పెళ్ళయిన స్నేహితుడి ఇంటికెళ్ళాను. అతగాడు నాగోడు విండం కన్నా హాలుకీ, వంటింటికీ మధ్యనున్న కర్టెన్ని సర్దడంలో సతమతమౌతున్నాడు. వంటింట్లో వున్న అతని భార్య నా కంటిక్కనపడకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాడని అర్ధమైంది. కొంచెంసేపటికి వంటింట్లోకెళ్ళి ట్రేలో రెండు కప్పుల కాఫీ తెచ్చాడు. ఒళ్ళు మండిపోయింది, ఈ వెధవకేదో అనుమానం రోగం వున్నట్లుంది. ఇంకొంచెంసేపు నేనక్కడే వుంటే టెన్షన్తో చస్తాడేమోననే భయంవేసి, కాఫీ తాగి హడావుడిగా బయటపడ్డాను.
                      
ఈవిధంగా అనేక అవమానాల అనుభవాల వల్ల నా హృదయం బ్రద్దలైంది. ఈ పెళ్ళైన దుర్మార్గుల్నందర్నీ దూరంగా పెట్టెయ్యాలనే కఠోరనిర్ణయం తీసుకున్నాను, ప్రశాంతంగా జీవించసాగాను. కొన్నాళ్ళకి - 

'నా పెళ్ళికి నువ్వు రాలేదు. నా భార్యకి నీ జోకులు చెప్తే తెగ ఎంజాయ్ చేసింది. అర్జంటుగా నిన్ను పరిచయం చెయ్యాలి, నువ్వు రావాల్సిందే.' అంటూ ప్రాధేయపడ్డాడో మిత్రుడు. 
                        
సరే! మనుషులందరూ ఒకటి కాదు, అందర్నీ ఒకే గాట కట్టరాదు. అయినా వీడి పెళ్ళికి వెళ్ళకపోవటం చేత ఎలాగూ ఒకసారి కొత్త దంపతుల్ని కలవవటం ధర్మం కూడా. అనుకున్న టైముకి వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లంతా నీటుగా సర్ది ఉంది. మావాడు టూత్‌పేస్ట్ ఎడ్వర్టైజ్మెంట్ నవ్వుతో ఎదురొచ్చి మరీ ఆహ్వానించాడు.

మావాడి స్వాగతం నాకు సంతోషం కలిగించింది. అయ్యో! అజ్ఞానంతో నా స్నేహితులందరూ వెధవలనుకున్నానే. సందేహం లేదు. వీడు మాత్రం జాతిరత్నం! ఇంతలో ఇంట్లొంచి మావాడి భార్య మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది. నేను పలకరింపుగా చిన్నగా నవ్వాను. ఆవిడ మంచినీళ్ళ గ్లాసు టీపాయ్ మీద పెట్టి, రెండు చేతులూ జోడించి -

"నమస్కారం అన్నయ్యగారు!" అన్నది.

క్షణకాలం నాకా పిలుపు అర్ధం కాలేదు, ఆ తర్వాత బిత్తరపోయాను. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది. ప్రతిమాటకి ముందొక 'అన్నయ్యగారు' , వెనకొక 'అన్నయ్యగారు'. నాకైతే ఆమె చెప్పేదేమీ అర్ధం కావట్లేదు. కానీ నాకు కొత్తగా లభించిన ఈ అన్న పోస్టు మాత్రం మోయలేనంత భారంగా వుంది.

ఈ కొత్త చెల్లమ్మ ఇంకొద్దిసేపటికి - 'అన్నా! నీ అనురాగం' పాటేమన్నా ఎత్తుకోదు కదా! నాక్కడుపులో దేవినట్లుగా వికారం మొదలైంది. మావాడు నా ఇబ్బంది గమనించాడు గానీ, తన భార్య నాకిచ్చిన అన్న పోస్టు వల్ల ప్రశాంతంగా వున్నాడు. ఏమి నా దుస్థితి! వీడికన్నాఆ కర్టెన్ల వెధవే నయం.

"అన్నయ్యగారు! మీరే చెప్పండి. మీ ఫ్రెండ్.. " అంటూ ఆ అమ్మాయి ఏదో చెబుతుంది.  

నాకేడుపొచ్చింది. నేనే గనక సీతాదేవినట్లైన - నా తల్లి భూదేవిని ప్రార్ధించి భూమిలోకి కూరుకుపోదును. జేబులో పిస్తోలు ఉన్నట్లయితే కాల్చుకు చద్దును. టెర్రరిస్టునైతే బెల్టు బాంబు పేల్చుకుని ఆత్మాహుతి చేసుకుందును. కానీ నా ఖర్మ - నేనేదీ కాదు.

ఈ అఘాయిత్యాల అవసరం లేకుండానే, వంటింట్లో ఏదో శబ్దం వస్తే లోపలకెళ్ళింది చెల్లెమ్మగారు.

"ఇప్పుడే! ఇక్కడే! ఈ సందు చివరదాకే!" అంటూ గొణుగుతూ మావాడు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగు లాంటి నడకతో ఒక్క ఉదుటున బయటపడ్డాను. అమ్మయ్య! అన్నపాత్ర విముక్తి ఎంత హాయిగా వుంది!!

(picture courtesy : Google)