Thursday, 6 October 2011

సున్నిత సమస్యాపురం


"జోగినాధం! కళ్ళెట్టుకు సూడు. ఆకాశంలో ఏదో మర్డర్ జరినట్టుంది కదూ!" అన్నాడు ప్రెసిడెంటు.

రావు గోపాల్రావు లాంటి ప్రెసిడెంటు ఆఊరికి మహారాజే. ప్రెసిడెంటుది ఆరడగుల భారీవిగ్రహం. అతని దర్జా అంతా ఆ కోరమీసంలోనే ఉందంటారు. అతనికి జోగినాధం నమ్మిన బంటు. పొట్టిగా, బక్కగా, మాసిన గడ్డం, పాత కోటు, బూతద్దాల కళ్ళజోడూ.. చూట్టానికి అచ్చు అల్లు రామలింగయ్యలా ఉంటాడు.
                   
"మహాప్రభో! ఇవ్వాళేం జరుగుతుందోననీ.. మన కనెక్సన్ కట్టయిపోద్దేమొనని నాకు కాలూ చెయ్యీ ఆడట్లేదు. మీరేమో ఆకాశమంటూ, మర్డరంటూ ఏవేమో శెలవిస్తున్నారు." భయంగా అన్నాడు జోగినాధం.

సిగరెట్ దమ్ము లాగుతూ విలాసంగా చిర్నవ్వు నవ్వాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం చెప్తున్న ఆ సమస్య గతకొన్నాళ్ళుగా ఆఊరిని అగ్నిగుండంగా మార్చేసింది. ఏ ఇద్దరు కలిసినా ఆసమస్య గూర్చే చర్చ. ఇంతకీ ఏమా సమస్య? ఏంటా కథ?


రంగి, రంగడు గత పాతికేళ్ళుగా భార్యాభర్తలు. మొదట్లో వారి కాపురం సజావుగానే సాగింది. కానీ.. గతకొన్నేళ్లుగా రంగడు ఫుల్లుగా తాగి రంగిని బాదిపడేస్తున్నాడు. ఈ రోజువారీ దెబ్బలు భరించలేని రంగి విడిపోవాలని నిర్ణయించుకుంది. రంగి చుట్టాలు కూడా రంగడికి చెప్పీచెప్పి విసిగిపొయ్యి.. ఈ ఎదవ ఇంక మారడనీ, రంగి విడిపోవాల్సిందేననే అభిప్రాయానికి వచ్చేశారు.
                   
కానీ.. విడిపోటం అనేది పెద్దసమస్యగా మారింది. రంగి పుట్టింటి తరఫున కట్నంగా తెచ్చుకున్న అరెకరా మాగాణి సమస్యంతటికీ మూలకారణం.

'నా అరెకరా నాకెచ్చియ్. నా సావు నే సస్తా.' అంది రంగి.

'మీ పుట్టింటోళ్ళ బీడు బూమి నా రెక్కల కట్టంతో బాగు చేశాను. ఇన్నాళ్ళూ దున్నాను. కాబట్టి పొలం నాదే.' అన్నాడు రంగడు.  

'దున్నేవోడిదే బూమి.' అని రాజకీయాలు కూడా మాట్లాడాడు.

రంగికి నలుగురు అన్నదమ్ములు. ముగ్గురు అప్పచెల్లెళ్ళు. రంగడికి ముగ్గురు అన్నలు. ఇద్దరు తమ్ముళ్ళు.
                   
వ్యవహారం ప్రెసిడెంటు దాక పొయ్యింది. మొదట్లో రంగి పరివారం ఆ అరెకరా పొలం గూర్చి అడిగినప్పుడల్లా ప్రెసిడెంటుకి అందులో చాలా న్యాయం కనిపించేది.

"అయినా మీపొలంతో వాడికేంటి సమ్మందం? మీకెందుకు. నే మాట్లాడతా. మీరు పోండి." అని పంపించేసేవాడు.

అసలే ఎలక్షన్లు రాబోతున్నాయ్. ఈతీర్పుతో రాబోయే ఎలక్షన్లలో కలిగే లాభనష్టాల బేరీజులో ఉన్నాడు ప్రెసిడెంటు.
                   
జోగినాధం ద్వారా ఈ సంగతి గ్రహించిన రంగడి పటాలం.. ఆరెకరా కోసం తెలివైన వాదన ఎత్తుకుంది.

'మనది ఇందూ దేశం. ఇక్కడంతా ఇందూ దరమం. పెళ్ళంటే నూరేళ్ళపంట. మొగుడెంత ఎదవైనా.. ఎంత తాగుబోతు సన్నాసైనా.. మొగుడు మొగుడే. ఇడాకులు మహాపాపం. మాకు ఇందూ నాయం గావాల.' అంటూ మతం సెంటిమెంటుతో కొట్టారు.

'ఈఇదాన పెతి ఆడముండా పొలం పుట్రా తీసేస్కుని పుట్టింట జేర్తే పాపం మగోడి బెతుకేం గావాల్న?' అంటూ ఆర్ధికసామాజికాంశాలతో కొట్టారు.

'అయినా .. కలిసుంటే కలదు సుకం అని ఎన్టీవోడు సేప్పాడు గందా. ఆ బాబు సెప్పినంక ఇంక ఏరే నాయమేంది?' అని చరిత్రతోనూ కొట్టారు.
                   
ఈ దెబ్బలకి ఆలోచనలో పడ్డాడు ప్రెసిడెంటు. ఏదో నాలుగు కేకలేసి యవ్వారం సెటిల్ చేద్దామనుకున్నాడు. కానీ ఇందులో లోతెక్కువుందని గ్రహించాడు. ఆవిధంగా ఈ మొగుడూపెళ్ళాల గోల్లో ప్రెసిడెంటు కూడా అడ్డంగా ఇరుక్కుపొయ్యాడు. ఆఊళ్ళో వీళ్ళ కులపోళ్ళ వోట్లు లేకుండా ప్రెసిడెంటుగిరీ అసాధ్యం. అటూఇటూ కలిపి ఓ ఆరొందల ఓట్లు నికరంగా ఉన్నయ్. అదీగాక.. ఊరంతా రంగీ, రంగడి పార్టీలుగా విడిపోయుంది.
                   
ఆడంగులంతా కూడా రెండు పార్టీలుగా విడిపొయ్యారు.

'ఎంతన్నేయం! తాగుబోతు సచ్చినోడు పొలాన్ని కూడా ఇడిసిపెట్టడా!' అంది రంగి పార్టీ.

'ఈ రంగిముండకి పొయ్యేకాలమొచ్చింది. మొగుడన్నాక ఆమాత్రం తన్నడా? నా మొగుడు రోజూ తాగి మక్కెలిరగదంతన్నా, ఎంతమంది ముండలెనకాల బోయినా.. ఒక్కరోజయినా చూడకుండా ఉండలేనమ్మా.' అంది రంగడి పార్టీ.
                   
ప్రెసిడెంటు బుర్ర గోక్కున్నాడు. రాజకీయాల్లో కులం, మతంలాంటి ఈక్వేషన్లు ఆయనకి తెలుసు. ఈ కొత్తసమస్య ఎటుపొయ్యి ఎటొస్తుందో.. చివరాకరికి ఎగస్పార్టీవాడికి లాభిస్తుందేమోననే అనుమానం కలిగింది. చట్టం తన పని తను చేసుకుపోతుందని తప్పించుకోటానికి ఇది కోర్టుకేసు కాదాయె!

అంచేత.. "ఇదంత అర్రీబర్రీగా తేలే యవ్వారం గాదు." అంటూ వాయిదాల మీద వాయిదాలు వేయసాగాడు.

రంగడు తాగుడు ఎక్కువ చేశాడు. ఆపై పెళ్ళాన్ని బాదుడూ ఎక్కువ చేసాడు. అతనికి 'ఇందూ నాయం' బాగా కలిసొచ్చింది. రంగి అలిగి అన్నం తినడం మానేసింది.

ఒకరోజు రంగి అన్న పీకల్దాకా తాగి 'ఏందీ అన్నేయం?' అంటూ ప్రెసిడెంటుని నిలేసాడు.
                   
ప్రెసిడెంటు ఆలోచనలో పడ్డాడు. మూడ్రోజులు ఏకధాటిగా మందుకొట్టి ఆలోచించాడు.

'పొరబాటున ఈ రొచ్చులో కాలుపెట్టా. ఇప్పుడు కాలు జాగ్రత్తగా కడుక్కొకపొతే నా ప్రెసిడెంటుగిరీకే ఎసరొచ్చేట్లుంది. ఈ అరెకరా ఆరుచెరువుల నీళ్ళు తాగిస్తుందనుకోలేదు. అయినా.. ఈ ముష్టిపొలం ఆ తాగుబోతెదవకి పొతే నాకేంటి? పిచ్చిముండ రంగికి పొతే నాకేంటి? సత్తెం జెప్పడానికి నేనేమన్నా అరిచ్చంద్రుణ్ణా? కాదుగదా! మరెందుకు నాకీ ధర్మసంకటం?'

మందు బాగా పనిచేసింది. ప్రెసిడెంటుకి కత్తిలాంటి ఐడియా తట్టింది.
                   
మర్నాడు.. అప్పుడెప్పుడో కోర్టు డఫేదారుగా పనిచేసిన తాగుబోతు కిట్టయ్యని పోరుగూర్నించి పిలిపించాడు. విషయం వివరించాడు. అతనికి సహాయంగా పదోక్లాసు పదిసార్లు తప్పి.. రోడ్లెంట జులాయిలుగా తిరుగుతున్న ఓ నలుగురు కుఱ్ఱాళ్ళనీ అదే ఊర్నించి పిలిపించాడు.

'ఈళ్ళందరూ ఓ కమిటీ.' అన్నాడు ప్రెసిడెంటు.

'కమిటీ అంటే ఏంది?' అనడిగారు ఊరిజనం.

'ఈళ్ళు మీరు జెప్పేది రాసుకుంటారు. ఆ తరవాత నాకు సలహా ఇస్తారు. అప్పుడు మీకు నేన్నాయం జేస్తాను.' అన్నాడు ప్రెసిడెంటు.
                   
కిట్టయ్య తన నలుగురు అసిస్టెంట్లతో కలిసి రంగీ, రంగడి బంధువులందర్నీ కలిశాడు. వాళ్లందరూ చెప్పింది రాసుకున్నాడు. ఎవరేం చెప్పినా రాసుకున్నాడు. తాము చెప్పే సోదంతా కమిటీ రాసుకోవటం ఊళ్ళోవాళ్ళకి భలే నచ్చింది. ఒక్కోడు చేటభారతాలు చెప్పాడు. కమిటీ మెంబర్లు బస్తాల కొద్దీ కాయితాలు నింపేశారు. ఊళ్ళో ఉన్న జనంకన్నా అభిప్రాయాలు ఎక్కువున్నై!
                   
తనకి అనుకూలంగా తీర్పు రావాలని వేడుకుంటూ.. కమిటీకి ఆరంగారంగా విస్కీ, బ్రాందీలు పోయించాడు రంగడు. రకరకాల మాంసాలతో వేపుళ్ళు వడ్డించాడు. బొమ్మిడాయిల పులుసు ఇళ్ళకి పంపించాడు. 'టీ' ఖర్చులకంటూ కొంతపైకం జేబులో కుక్కాడు.

రంగి కూడ అప్పోసప్పో చేసి బాగానే ఖర్చు పెట్టింది. ఆవిధంగా ఇరువైపులా తినీ, తాగీ.. తాగీ, తినీ.. ఆయాసం, రొప్పు రాగా మత్తుగా నిద్రపొయ్యారు. ఆపై నిద్రలేచి.. బద్దకంగా ఒళ్ళిరుచుకుంటూ.. నివేదిక అంటూ జోగినాధానికి ఒక 'సీల్డ్ కవర్' ఇచ్చాడు తాగుబోతు కిట్టయ్య.


ఊరి జనమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ప్రెసిడెంట్ సమక్షంలో సీల్డ్ కవర్ విప్పాడు జోగినాధం. అక్షరాలు కూడబలుక్కుంటూ పెద్దగా చదవసాగాడు.
                   
"ఆప్షన్ 1.రంగీ, రంగడు కలిసుండాలి. ఇది హిందూధర్మం."

రంగడు వైపోళ్ళు ఈలలేస్తూ డ్యాన్సు చెయ్యనారంభించారు. కళ్ళజోడు సరిచేసుకుంటూ ఆపమన్నట్లు చెయ్యి పైకెత్తి సైగ చేసాడు జోగినాధం.
                   
"ఆప్షన్ 2.తప్పనిసరైతే.. రంగీ, రంగడూ విడిపోవచ్చు. రంగి తనపొలం పుట్టింటికి తీసుకుపోవచ్చు."

ఈసారి రంగివైపు హర్షధ్వనాలు. మళ్ళీ చెయ్యెత్తాడు జోగినాధం!
                     
"ఆప్షన్ 3.రంగీ, రంగడు కలిసి విడిపోవచ్చు. విడిపోయి కలిసుండొచ్చు. కొన్నాళ్ళు కలిసి ఇంకొన్నాళ్ళు విడిపోవచ్చు."
                     
జనాలకి విషయం అర్ధమైంది. కిట్టయ్య కోసం వెతికారు. ఇంకెక్కడి కిట్టయ్య? ఎప్పుడో జారుకున్నాడు. జనాలు కిట్టయ్యని బూతులు తిడుతుంటే.. మీసాలచాటున ముసిముసిగా నవ్వుకున్నాడు ప్రెసిడెంట్.

షరా మామూలే. మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు.

మళ్ళీ రంగి అన్న తాగి తూలుకుంటూ ప్రెసిడెంటు మీదకెళ్ళాడు.
                       
ప్రెసిడెంటు ఆలోచించాడు.

"ఇప్పుడు మన ఇస్కూలు పంతులుతో ఒక ఏకసభ్య కమిటీ వేస్తున్నా." అంటూ ఆ ఊరి ప్రాధమిక పాఠశాల ఏకైక టీచరుకి కమిటీ బాధ్యతలప్పచెప్పాడు.

అసలే కూతురి పెళ్లి ఇబ్బందుల్లో ఉన్న పంతులు వణికిపొయ్యాడు. ఆరాత్రి మందుకొట్టే సమయంలో పంతులు చక్కబెట్టాల్సిన రాచకార్యాన్ని గీతోపదేశం చేశాడు ప్రెసిడెంటు. 'హమ్మయ్య' అనుకున్నాడు పంతులు.                


కొన్నాళ్ళకి అందరూ ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఉదయం నుండి జోగినాధం టెన్షన్ తో చస్తుంటే.. ప్రెసిడెంటు ఆకాశమంటూ, మర్డరంటూ ఏదేదో మాట్లాడుతున్నాడు. అదీ కథ.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.
                   
పంచాయితీ మొదలయ్యింది. పంతులు ఏవో చాలా పుస్తకాలు ప్రెసిడెంటు ముందుంచాడు. అవ్వన్నీ స్కూలు పిల్లల పరీక్షల తాలూకా నోటు పుస్తకాలు. ఆ సంగతి ఊర్లోవాళ్ళకి తెలీదు.

ఆ పుస్తకాల్ని చూసి 'అబ్బో! ఏదో అనుకున్నాం. ఇస్కూలు పిల్లకాయల నోటు బొక్కుల్నిండా పంతులు కూడా శానా రాసాడే!' అని మెచ్చుకున్నారు.

ఒక సీల్డ్ కవర్ జోగినాధానికి ఇచ్చాడు పంతులు.
                   
జోగినాధం ఆత్రంగా కవరు చించి ఒక పెద్ద కాగితం బయటకి  తీసాడు.

"ఇది సున్నిత సమస్య"

అని కాగితం మధ్యలో తాటికాయంత అక్షరాలతో రాసుంది.

తెల్లమొహంతో వెర్రిచూపులు చూస్తున్న జోగినాధానికి కన్ను కొట్టాడు ప్రెసిడెంటు.
                   
అర్ధం చేసుకున్న జోగినాధం "అయ్యబాబోయ్! సున్నిత సమస్యే!" అంటూ గుడ్లు తేలేశాడు.
                   
జోగినాధం చేతిలోని కాగితాన్ని తీసుకుని ఊరందరికీ చూపిస్తూ గంభీరంగా అన్నాడు ప్రెసిడెంటు.

"విన్నారుగా. ఇది సున్నిత సమస్య. అయినా తీర్పు చెప్పమంటే చెబుతా. కానీ.. ఆపై జరిగే అరిష్టానికి నేను బాధ్యణ్ణి కాను."  
                   
ఊళ్ళోవాళ్ళు అరిష్టం అనంగాన్లే భయపడిపోయారు. ఈమధ్యనే ఊర్లో అమ్మోరు పోసి నలుగురు చచ్చారు. కంగారుగా 'వద్దు, వద్దు, మాకు ఏ నాయం అక్కర్లేదు.' అంటూ పారిపోయారు.
                   
రంగి అన్నకి ఇందులో కుట్ర కనిపించింది. సున్నిత సమస్యంటే ఏందో చెప్పాల్సిందేనని తాగి ప్రెసిడెంటుని నిలదీశాడు. చిత్రం! ఆ అర్ధరాత్రి అతని గుడిసె పూర్తిగా ఎవరో కావాలని తగలబెట్టినట్లు కాలిపోయింది. ఆవిధంగా రంగి తాగుబోతు అన్నకి కూడా సున్నిత సమస్యంటే ఏంటో అర్ధమైపోయింది.
                   
ఆరోజు నుండి ఎవరూ రంగికి న్యాయం కావాలని అడగలేదు.

'పాపం! పెసిడెంటుబాబు దరమపెబువు. రంగికి నాయం చేద్దామని మాలావు పెయత్నం జేశాడు. కానీ.. ఆ ఇస్కూలు పంతులు ముందర కాళ్ళకి బందం ఏసాడు. ఆ బాబు ఊరి మేలు కోరేవాడు కాబట్టి నోరిప్పలేకపోతున్నాడు.' అనుకుని రంగివైపువాళ్ళు ఉసూరుమన్నారు.

'పెసిడెంటు మన మడిసి కాబట్టే చక్రం అడ్డేసాడు.' అని రంగడిముఠా సంతోషించింది.

ఈతీర్పు దెబ్బతో ప్రెసిడెంటు బంపర్ మెజారిటీతో ఎలక్షన్లో మళ్ళీ గెలిచాడు.


ఇంతకీ రంగీరంగళ్ళు ఏమయ్యారు?

ఈ సున్నిత సమస్య డ్రామా తన సమస్య తీర్చటం కోసం కాదనీ, ప్రెసిడెంటు ఓట్ల డ్రామా అని అర్ధమైన రంగికి పిచ్చెక్కింది. ఆ తరవాత ఇల్లిడిచి ఎటో పోయింది.

ఈ అన్యాయం తట్టుకోలేక రంగి అన్న తాగి రంగణ్ణి పొడిచేశాడు. రంగి అన్నని రంగడి తమ్ముడు పొడిచేశాడు. ఈ కత్తిపోట్ల పరంపర నేటికీ సాగుతూనే ఉంది. ఆఊళ్ళో సగంమంది యువకులు జైళ్ళల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగిలిన సగంమంది మందుకొట్టి రోడ్లమీద పొర్లుతున్నారు.
                   
ఒకప్పుడు పచ్చని చేలతో కళకళ్ళాడిన ఆఊరు నేడు వల్లకాడయ్యింది. ఆ తరవాత ప్రెసిడెంటుని ఎదురొడ్డేవాడే లేకుండాపొయ్యాడు. చచ్చేదాకా ఆయనే ఆఊరిని ఏలాడు. ఒక రోడ్డుగానీ, ఒక ప్రభుత్వ పథకంగానీ.. ఆఊరు చేరదు. అడిగే దిక్కు లేదు. అడిగినా.. సున్నిత సమస్యంటూ ప్రెసిడెంటు తీర్పు చెప్తాడనే భయం!
                   
అప్పట్నించీ ఆఊరుకి 'సున్నిత సమస్యాపురం'గా పేరొచ్చింది.

ఇప్పుడు బస్సుల మీద కూడా పేరు కుదించి 'ఎస్.ఎస్.పురం' అని రాస్తున్నారు."  

(picture courtesy : Google)