Friday 28 October 2011

బాలగోపాల్.. కొన్ని జ్ఞాపకాలు


మన సమాజంలో కులం ప్రభావం బలమైనది. ఈ విషయంపై అనేక చర్చలు, విశ్లేషణలు చదువుతూనే ఉంటాం. మనం ఈ కుల ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటే, ముందుగా సమాజంలో కులంపాత్ర అంచనా వెయ్యగలగాలి. ఇది రాస్తున్నప్పుడు నాకు బాలగోపాల్, ఆయనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి. 

నాకు చంద్ర (బి.చంద్రశేఖర్, న్యాయవాది, పూర్వాశ్రమంలో పౌరహక్కుల నాయకుడు) మంచి మిత్రుడు. అతని ద్వారా నాకు కె.బాలగోపాల్ పరిచయం. బాలగోపాల్ తరచూ గుంటూరు వస్తుండేవాడు. అప్పుడప్పుడు నా స్కూటర్ తీసుకుని ఊళ్ళో పనులు చక్కబరుచుకునేవాడు. ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి కాఫీ తాగేవాళ్ళం. 

అప్పటికే పౌరహక్కుల ఉద్యమకారుడిగా బాలగోపాల్ సుప్రసిద్ధుడు. ఆయన సింప్లిసిటీ నన్ను ఆశ్చర్యపరిచేది. బాలగోపాల్ మొహమాటస్తుడు, పేషంట్లు వెయిట్ చేస్తుంటే తనుకూడా వాళ్ళతోపాటు కూర్చునేవాడు. మొదట్లో నా స్టాఫ్ ఆయన్ని పట్టించుకోలేదు. ఎవరో పేషంటుతోపాటు వచ్చినాయన అనుకుని అలాగే వెయిట్ చేయిస్తూ వుంచేవాళ్ళు. అటుతరవాత నేను బాలగోపాల్ పట్ల చూపించే మర్యాద, గౌరవం గమనించి ఆయన్ని హడావుడిగా కన్సల్టేషన్ రూంలోకి పంపేవాళ్ళు.  

బాలగోపాల్ మొహమాటస్తుడు గదాని మనం మోసపోకూడదు. విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా, నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఒకసారి కాజువల్‌గా అన్నాను - 'తెలుగు వ్యాసాలు సంక్లిష్టంగా రాయటంలో మీరు కె.వి.రమణారెడ్డిగారితో పోటీ పడుతున్నారు' అని. 

'మీరు తెలుగు ఇంకొంచెం నేర్చుకోండి.' అంటూ మొహం మీద గుద్దినట్లు సమాధానం చెప్పాడు బాలగోపాల్

బాలగోపాల్ నా దగ్గరకి వచ్చినప్పుడల్లా కాఫీ ఇవ్వకుండా పంపేవాణ్ని కాదు. అందుక్కారణం - ఆయన్తో కొద్దిసేపు మాట్లాడే ఆవకాశాన్ని వదులుకోకూడదనే నా స్వార్ధం!  

ఒక కాఫీ సమయంలో హఠాత్తుగా అడిగాడాయన.

"మీదే కులం?"

"మీరు.. ఈ ప్రశ్న.. " ఆశ్చర్యంగా చూశాను.

నా ఆశ్చర్యాన్ని పట్టించుకోకుండా స్థిరంగా, స్పష్టంగా అన్నాడు బాలగోపాల్. 

"ఇక్కడ నేను మీతో బంధుత్వం కలుపుకోటానికి కులం అడగట్లేదు. మనమంతా కులరహిత సమాజం కావాలనుకుంటున్నాం. ముందుగా కులం మనమీద చూపిస్తున్న ప్రభావాన్ని గుర్తించగలగాలి. అప్పుడే గదా దాంట్లోంచి బయటపడగలిగేది. నేను పుట్టుకతో బ్రాహ్మణ్ణి. నా అవగాహన, ఆలోచన కొన్నిసార్లు నా కులానికి గల పరిమితులకి లోబడే ఉంటాయి. అది నా తప్పు కాదు. మనమందరం ఈ చట్రంలోంచి బయటపడ్డానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. మనని మనం సంస్కరించుకోవటం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఉదాహరణకి మీరు దళితులనుకుందాం. నాకా విషయం తెలీనప్పుడు మిమ్మల్ని నేను సరీగ్గా అర్ధం చేసుకోలేను. కొంతమంది కులం పేరెత్తితేనే ఏదో తప్పుగా చికాకు పడతారు, కులాన్ని గుర్తించకపోవడం సరికాదు."

ఇంకో సందర్భం -

ఇంకో కాఫీ సమయం.

"సమాజంలో కులప్రభావాన్ని తక్కువగా అంచనా వెయ్యకూడదు. నేను కిడ్నాప్ అయ్యానన్న వార్తని పత్రికలు విపరీతంగా కవర్ చేశాయి. పత్రికలు అంతలా కవర్ చెయ్యటం వెనుక కూడా కులప్రభావం ఉండొచ్చు."

"ఎలా?"

"మన పత్రికల్లో ఎడిటర్లు, రిపోర్టర్లు ఎక్కువమంది బ్రాహ్మణులు. నా రాజకీయాలు వాళ్లకి నచ్చకపోయినా, మనవాడేనన్న కులాభిమానం వాళ్లకి ఉండి ఉండొచ్చు." అన్నాడు బాలగోపాల్.

మాటల్లో క్లుప్తత బాలగోపాల్ సొంతం. ఒక్కోసారి ఆయన్తో మాట్లాడుతూ వుండిపోవాలని అనిపిస్తుంది. కానీ ఆయన చాలా బిజీ - నలిగిన చొక్కాతో, చెదిరిన క్రాఫుతో హడావుడిగా వెళ్లిపోతాడు. బాలగోపాల్ సర్! ఐ సెల్యూట్ యు.  

(photo courtesy : Google)